Pages

Monday, December 31, 2012

ఈశ్వరా!.......

ఈశ్వరా!.......
ధ్వజ వజ్రాంకుశ శంఖచక్ర హల మత్స్యచ్ఛత్ర కోదండ పం
కజ కల్పద్రుమ కుండలాది శుభరేఖాలంకృతంబై లస
ద్వ్రజకాంతా కుచ కుంకుమాంకిత భవత్పాదద్వయం బాత్మలో
విజయస్ఫూర్తి చెలంగఁ గొల్తు హరి
, గోవిందా! రమాధీశ్వరా!
కంబుగ్రీవము కౌస్తుభా భరణముల్ కర్ణాంత విశ్రాంత నే
త్రంబుల్ చారులలాటమున్ వదనపద్మంబున్ సునాసాపుటీ
బింబోష్ఠోరుకిరీటకుండలములున్ బీతాంబరంబుం గడున్
వెంబైయుండఁగ నిల్వు నామదిని
, గోవిందా! రమాధీశ్వరా!

నీ విఖ్యాత చరిత్రముల్విను చెవుల్ నీపూజకౌహస్తముల్
నీవాసంబుల కేగు పాదయుగము న్నిన్గాంచుమెల్చూపునిన్
గైవారంబొనరించు జిహ్వయును నీకై మ్రొక్కుమూర్ధంబు ని
న్భావింపంగల బుద్ధినాకొసఁగు సాంబా
! భక్తచింతామణి!

నీకీర్తిశ్రుతి నీకథాశ్రవణము న్నీపాదసంసేవయు
న్నీకళ్యాణగుణానువర్ణనము నీ నిత్యాను సంధానము
న్నాకుం బాయకయుండునట్లొసఁగుమన్నా జన్మజన్మంబుల
న్బాకారిస్తుతపాదపద్మ శివసాంబా
! భక్తచింతామణి! 

Friday, December 21, 2012

పెద్దలతో మాట్లాడేప్పుడు

నమస్తే
మీకు పెద్దలు భాగవతులైన వారు సమయమిచ్చి సావకాశంగా మాట్లాడమంటే అభివాదం చేసి, కుశల ప్రశ్నానంతరం మీరేమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. ఏమి మాట్లాడాలో ముందుగా నిర్ణయించుకోండి. తప్పుగా అనుక్కోకండి, విషయాన్ని సాగదీయకుండా, మధ్య మధ్యలో ఆప కుండా, (without continuos long pauses) క్లుప్తంగా పూర్తి భావం ప్రకటించగలిగేలా మాట్లాడండి. నేను నాది లాంటి అహం పొడచూపే మాటలు వద్దు. మీ తల్లి దండ్రులు, గురువులు, మీ వంశంలోని పెద్దల గూర్చి అడిగినప్పుడు ఉన్నతంగా కీర్తించండి కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ పెద్దలతో కలిసి వెళ్తున్నప్పుడు మీరు మీ పెద్దల్ని డామినేట్ చేస్తునట్లు భావన ఇవ్వకండి. మీరు మాట్లాడినా, మీ కన్నా ముందుగానీ, మీ పక్కన గానీ ఉంచుకుని మాట్లాడండి. అతి ముఖ్యంగా వారు మీకు సమయమిచ్చారు కాబట్టి మీకొరకు వారెదురుచూసే విధంగా చూసుకోండి. సమయపాలనం ముఖ్యం. అలా అని వారు 10గం అని చెప్పారని సమయానికి వేరెవరో ఉన్నా లోపలకి దూరి పోకుండా, అక్కడి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి మీరు వచ్చిన సమాచారం ఇచ్చి వారి పిలుపుకై ఎదురు చూడండి. వారు చెప్పిందానికన్నా ఐదు నిమిషాలు ముందే వారున్నచోటికి వెళ్ళి సమయానికి వారిని కలవడానికి వెళ్ళడం మీ కర్తవ్యం పావుగంట సమయం అంటే అందులోనే మీ పరిచయాదులు మీరు చెప్పాల్సిన విషయం అంతా జరగాలి, వారు ఆనందంతో మీకేదైనా చెప్తే వినడమే మీరు చేయవలసినది, అలా ఆలస్యమైతే.. తిరిగి వారు పంపడం వారి ఇష్టం. అలా అని వారు వెళ్ళమనలేదని అక్కడే ఉండకండి. పనైపోతే బయలుదేరతామని మీరే చెప్పండి, ఆగి ఏమైనా సేవించి వెళ్లమంటే వద్దనకుండా తీసుకోండి అది భాగవతోచ్చిష్టం. మధ్య మధ్యలో వారికి ఇబ్బందిలేకుండానే మీరున్నారని చెక్ చేసుకోండి.
సాంప్రదాయ ఆహార్యం ముఖ్యం శూన్య లలాటంతో వెళ్ళకండి. వారి దేవతార్చనకై (భోజనానికని కాదు) కొన్ని పండ్లు, పువ్వులు వీలైతే తీసుకెళ్ళండి. వారు ఎటువంటి త్వరలోనూ లేకుండా సావకాశంగా ఉంటే, నాలుగు మంచి మాటలు భగవంతుని గూర్చో, వారి గురువుల గూర్చో అనుష్టానం గూర్చో చెప్పమని అడగండి. వారి పూజామందిరాన్ని దర్శించే అవకాశం అడగండి. సందేహాలుంటే అడగమంటే అడగండి, కానీ నిజంగా సందేహం తీరడం వల్ల మీకు అనుష్టానంలో సందిగ్ధత తొలగుతుందనుక్కుంటే అడగండి. అడగమన్నారని ఏదో ఒకటి అడగకండి. ఏమి అడగాలో తెలియకపోతే, ఏమడగాలో కూడా తెలియని వాణ్ణండీ మీరే దారి చూపండి అన్న అర్థం వచ్చేలా అడగండి.
మొత్తానికి మీరు వారికిబ్బంది కలిగించేలా కాక, విసుగు కలిగించేలాగ కాక, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తే పలకరించి మాట్లాడేలా వ్యవహరిస్తే బాగుంటుంది. You have to be very attentive, భాగవతుడు చిరాకు పడితే, ఎంత చదువు, ఆస్థి, పెద్ద కుటుంబం అన్నీ ఉండీ వ్యర్థమైపోతుంది. అటువంటి భాగవతులతో గడిపిన సమయం వృధా కాకుండా సంపూర్ణంగా మిమ్మల్ని ఉద్ధరణవేపుకి నడిపేటట్టు చూసుకోండి.

ఇక ఫోన్ గురించైతే, నమస్కారం నేను (పేరు)శర్మ, (స్థలం)చోటు, రిఫరెన్సు ఏదైనా అవసరమైతే అదీ చెప్పి, అయ్యా ఇప్పుడు మీతో మాట్లాడవచ్చా ఒక్క నిముషం లేదా మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడాలనుక్కుంటున్నారో అన్ని నిముషాలు అని అడిగి వారి అంగీకారం పిమ్మట, కుశలమడిగి, చెప్పవలసిందో, అడగవలసిందో అడిగి వారి సమాధానం పొంది చివర్లో తిరిగి నమస్కారం చెప్పి వారూ ఇక ఫోన్ పెట్టెసారు అని నిర్ధారించుకుని పెట్టెయండి, వారు మాట్లాడుతుంటే మీరు పెట్టేయకండి. ఫోనే కదా అని టీవీలు పాటలు ప్లే అవుతున్న చోట, ఇతర శబ్దాలున్నచోట కాకుండా, రణగొణ ధ్వనులు లేని చోట కాక లోపలికెళ్ళి మాట్లాడండి. ప్రత్యక్షంగా ఉంటే ఎలా ఉంటారో, పరోక్షంలోకూడా అలానే ఉండండి.

ఏదో తెలిసింది, తెలుసుకున్నది చెప్పాను, సరి అనిపిస్తే సూచనలు తీసుకోగలరు, అన్యంగా అనిపిస్తే వదిలివేయగలరు.
మీ..

వాచ్యార్థము-లక్ష్యార్థము

వాచ్యార్థము-లక్ష్యార్థము

శ్రీ గురుభ్యోనమః
నమస్కారము

మనకు అపార మైన ఆర్ష వాజ్ఞ్మయమెంతో ఉంది. వాటిని బాగా చదివి అర్థతాత్పర్యాదులతో మొత్తం చదివినా అసలు బోధ పడవలసిన ఆత్మ జ్ఞానము బోధపడదు, అది అంతః పరిశీలనము లక్ష్యార్థమును పట్టుకొని అన్వయించుట చేతనే సాధ్యము.

నేను ఎప్పుడో చదివిన వేదాంత వ్యాసావళిలోంచి ఒక చిన్న కథ!
పూర్వం ఒక వ్యాపారవేత్త అతి నైపుణ్యం కలిగి చక్కని వ్యాపారము చేసి బాగా ధనమార్జించాడు. ఇతోధికంగా ధార్మిక, పుణ్యకార్యాచరణాలు చేస్తూ జనులందరితోనూ సఖ్యంగా ఉంటూ జీవనం సాగించేవాడు. తానార్జించిన దానిలో కొంత ధనము తన బిడ్డలకు అందవలెనని సమాలోచన చేసి 15లక్షల వరహాలు వారికొరకై దాచి ఉంచ నిశ్చయించి లెక్కల పుస్తకములోచైత్ర శుద్ధ దశమి నాలుగు ఘడియల పొద్దెక్కిన తరవాత నాచే నిర్మింపబడిన శివాలయ శిఖరములో పదిహేను లక్షల వరహాలు దాచితిని, అవసరార్థం నా తదనంతరం నా పుత్రులు వాటిని తీసుకొనవచ్చుఅని వ్రాసి ఉంచాడు. తరవాత కొంత కాలానికి కాశ్యాది తీర్థయాత్రలు చేస్తూ అక్కడే శరీరాన్ని వదిలాడు. విషయమును అతని వెంట వెళ్ళిన మిత్రులు అతని పుత్రులకి చెప్పారు. ఇక బ్రతుకు దెరువుకొరకు వారి తండ్రి వ్యాపారము నిర్వహించాడో దానినే వీరూ కొనసాగించిరి. అనుభవ లేమి వల్ల నో మరి దైవ వశముననో అంతా నష్టపోయి అప్పులపాలైయ్యారు ఆవ్యాపారి పుత్రులు. కానీ అనుభవము మాత్రం వచ్చినది, అనుభవముతో వ్యాపారము చేయడానికి తగిన ద్రవ్యము మాత్రం లేదు. ఏం చేయాలో పాలుపోక అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, నాన్నగారు బహు దొడ్డ వ్యాపార వేత్త ఆయన ఎంతో ధనము సంపాదించారని కదా మనకు తెలుసు. ఆయన మనకొరకు ఏదైనా ఉపాయము చేసి ఉండవచ్చు కానీ అది మనకెఱుకలో లేదు. వారు వ్రాసిన లెక్కల పుస్తకాలు చూసి ఎంత సంపాదించారు? ఎంత ఖర్చు జరిగింది? ఎంత మిగిలింది? దాన్ని ఎక్కడ ఉంచారు? వంటివి చూద్దామని నిశ్చయించుకున్నారు. తండ్రిగారి లెక్కల పుస్తకములన్నీ వెతుకుతూంటే, ఒకానొక పుస్తకములో బాకీ దార్లనుండి 15 లక్షల వరహాలు వసూలైనట్లూ.., వాటిని తానుచైత్ర శుద్ధ దశమి నాలుగు ఘడియల పొద్దెక్కిన తరవాత నాచే నిర్మింపబడిన శివాలయ శిఖరములో పదిహేను లక్షల వరహాలు దాచితిని గాన, అవసరార్థం నా తదనంతరం నా పుత్రులు వాటిని తీసుకొనవచ్చుఅని వ్రాసిన వ్రాత కన్పడింది.
అంత వ్యాపారి పుత్రులు ఆనందంతో పొంగి పోయి కూలీలను తీసుకొని తమ తండ్రి నిర్మించిన శివాలయ శిఖరమును కూల్చి చూసిరి. అక్కడ ఏమీ దొరకలేదు. పైగా ఆలయానికి వచ్చే భక్తులు, పుర జనులు వారిని తిట్టి దరిద్రంతో పాటు ఆలయాన్ని కూల్చిన పాపమూ మీకు తగిలిందని నానా మాటలన్నారు. అందులోనే ఉన్న అప్పులిచ్చినవారు తిరిగి ఇవ్వమని బలవంతం చేయనారంభించారు. ఇక ఏమీ పాలుపోక పెద్దాయన వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకున్నారు, వారి నాన్నగారి వ్యాపారము, సంపాదన, మరణము, వీరి వ్యాపారము, వచ్చిన నష్టము, అప్పులు, తండ్రిగారి లెక్కల పుస్తకంలో డబ్బు దాచడం గురించి రాసిన లెక్కలు అన్నీ చెప్పుకుని మార్గం చెప్పమన్నారు. అంత పెద్దాయన తన వద్ద నున్న కొంత ధనమిచ్చి మీరు వ్యాపారం చేయండి, చైత్ర శుద్ధ దశమి వరకు మీ కుటుంబానికయ్యే ఖర్చు ఇస్తున్నాను తీసుకోండి, తిరిగి వచ్చి నన్ను చైత్ర శుద్ధ దశమి నాడు కలవమని చెప్పి పంపించారు పెద్దాయన.
కాలం గిర్రున తిరిగె, చైత్ర శుద్ధ దశమి నాడు వ్యాపారి పుత్రులందరూ పెద్దాయనదగ్గరికి వెళ్ళగా, పెద్దాయన వీరిని శివాలయము వద్దకు తీసుకెళ్ళి సమయంకోసం వేచి చూడసాగారు. సరిగ్గా నాలుగు ఘడియల పొద్దెక్కగానే శివాలయ శిఖరం నీడ ఎక్కడ పడుతుందో చూసి ఇదిగో మీ నాయన పదిహేను లక్షల వరహాలు దాచిన శివాలయ శిఖరమని కూలీలతో అక్కడ తవ్వించగా అక్కడ వారికి వారి నాయన వ్రాసి ఉంచినట్లు 15 లక్షల వరహాలు దొరికినవి. అంత వారు పెద్దాయనకు కృతజ్ఞతలు చెప్పి, చేసిన అప్పులు తీర్చి తిరిగి వ్యాపారము చేయుచూ ఆనందముగా ఉండి తండ్రి వలనే పుణ్యకార్యాచరణము, ధార్మిక కార్యక్రమములు చేసి జీవితమును పండించుకున్నారు.

వ్యాపార వేత్త కొడుకులకీ, చిక్కు విప్పిన పెద్దాయనకీ ఏమిటి తేడా? పెద్దాయనకెలా తెలిసింది?

లెక్కల పుస్తకంలో లెక్కలలో అబద్దంలేదు, బాకీలు వసూలైనవి అవి పలానా చోట దాచాను అని రాసి ఉంది. రాసిన భాష అందరికీ చక్కగా అర్థం అయ్యేలా ఉంది. కానీ ధనం మాత్రం కన్పించలేదు. పెద్దాయన పదిహేను లక్షల రూపాయలు వరహాలు అంత చిన్నగా ఉండే ఆలయ శిఖరం చివర పట్టవని గ్రహించాడు, మరి యెక్కడ అని ఆలోచించి అన్వయం చేసి లెక్కలలో రాసిన విధంగా చైత్ర శుద్ధ దశమినాడు చెప్పిన సమయానికి శిఖరంయొక్క ఛాయ పడిన దగ్గర ఉందని గ్రహించగలిగాడు.

కాబట్టి దీనర్థమేమిటి? వాచ్యార్థము కన్నా లక్ష్యార్థమును ముందు తెలుసుకోవాల్సి ఉంది. అదే మన శాస్త్రాదులలో పురాణేతిహాసాదులలో పైకి కేవల వాచ్యార్థములా కన్పడే ఎన్నో విషయాలకి లక్ష్యార్థములను విచారిస్తే అసలు ఘని దొరుకుతుంది. వాచ్యార్థమును కాక లక్ష్యార్థమును తమ స్వానుభవముచే, అనుష్టానముచే పొంది ఇతరులకు మార్గదర్శకులౌ పెద్దలే గురువులు, ఆచార్యులు. వారి సంగమునే, వారి ఔదార్యముననే మనకు లక్ష్యార్థము సుబోధకమవగలదు. అది లౌకిక విషయమైననూ, పారలౌకిక విషయమైననూ వాచ్యార్థ, లక్ష్యార్థములను గ్రహించి సమన్వయము చేసుకోవడం ద్వారా జీవనం పండించుకోవచ్చు.

సకల వాజ్ఞ్మయము యొక్క లక్ష్యము ఆత్మజ్ఞానమును ఎఱుకలోకి తెచ్చుకోవడమే. కేవల వాచ్యార్థ పరిశీలనము పాండిత్యమునకు పనికిరావచ్చుగాక తద్విషయమున ఉత్తరోత్తర జన్మములందు పుట్టుకతో పాండిత్య వాసన కలిగి ఆత్మజ్ఞానర్జనమునకు ఉపయుక్తము కాగలదేమో.

కథను అందించిన మహానుభావులకు వందనాలతో
ఇతి శం
-శంకరకింకర
21/Dec/2012