శ్రీ గురుభ్యోనమః
ధనుర్మాసమ్ తిరుప్పావైతో మాత్రమే మొదలవ్వలేదు.. అంతకన్నా ప్రాచీన వ్రతం ఇది..
ధనుర్మాసం కాల విభాగం చేసినప్పటినుండీ ఉన్నది. తిరుప్పావైతో మొదలవ్వలేదు. తిరుప్పావై పాశురాలు గోదామాత యొక్క మధుర భక్తి ప్రకటనంగా మనకి తదనంతర కాలంలో అందించబడ్డవి. అవి తమిళ భాషలో రచింపబడినవి. ధనుర్మాసంలో (సూర్యుడు ధనస్సు రాశిలోకి చేరిన మరునాటినుండి మకర సంక్రాంతి వరకు) తెల్లవారుఝామున విష్ణు ఆరాధన, శివాభిషేకం తులసి పూజ, గోపూజ విధించబడ్డాయి. చలిని తట్టుకోలేని ఆర్తులకు అగ్నిదానం, వస్త్ర కంబళి దానం విధింపబడ్డాయి.
ఈ మాసంలో ద్రవిడ దేశంలో తిరుప్పావై (విష్ణు సంబంధం) - తిరువెంబావై (శివ సంబంధం) తమిళ స్తోత్రాలు పఠిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో పూర్వాచార్యులవల్ల ముఖ్యంగా దక్షిణ భారతంలో ఎక్కువగా దేవభాషకన్నా తమిళ ప్రభావం తీవ్రంగా ఉన్నకారణాన ఈ ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రాభవం ఎక్కువ. ఐతే తిరుప్పావై రచించిన కాలానికి మునుపే ఈ ధనుర్మాస వ్రతం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నది. ఈ కాలంలో విష్ణు పురాణం, భాగవతం, ఇతర పురాణాలు పారాయణ చేయాలని బ్రహ్మగారు నారదునిద్వారా బోధించారు.
ఈ ధనుర్మాసంలో ఐదు నాణేల ఎత్తు విష్ణుమూర్తిని స్థాపించి ఈ నెలంతా అభిషేకార్చనాదులు పంచామృతాలు తులసీ జాతి పుష్పాలతో నిర్వహించి మిరియాలు, పెసరపప్పు, లవణం బియ్యం కలిపి వండిన పొంగలి, ఆవుపాలతోచేసిన పాయసం, దధ్యోదనం నివేదన చేయాలి. ఈ వ్రతం ఆచరించేవారు విష్ణుపూజతోపాటు తులసి పూజ, గోపూజ నిర్వహించాలి. చివరి రోజున ఆ మూర్తిని భోజన దక్షిణ తాంబూలాదుల సహితంగా పురోహితునికి గానీ సద్బ్రాహ్మణుకిగాని ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి.
ఈ మాసంలోనే తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో శివాభిషేకం అద్భుతంగా చేస్తారు అతి ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం ఉన్నరోజు మరింత శోభాయమానంగా నిర్వహిస్తారు శివాలయాల్లో.
వ్యాసపూజ చేయకపోతే ఈ వ్రతం నిష్ఫలం
----------------------------------------------------
ఈ ధనుర్మాసంలో ఒకసారైనా వ్యాసపూజ చేయాలి, వ్యాసపూజ చేయకపోతే ఈ ధనుర్మాస వ్రతం నిష్ఫలమని చతుర్ముఖబ్రహ్మ నారదునికి ధనుర్మాస వైశిష్ఠ్యంలో చెప్పారు.
సర్వం శ్రీ రంగరాజ - శ్రీ నటరాజ పాదారవిందార్పణమస్తు
- శంకరకింకర
No comments:
Post a Comment