Pages

Tuesday, December 11, 2018

భవాని త్వం... భవానిత్వం



దేశిక పాద స్మరణం!

ఆ జగజ్జనని అనుగ్రహంలేనివారు ఎంతటి నీచ కార్యములను చేయడానికైనా వెనుకాడరు. గురు స్త్రీ బాల వృద్ధులనే బేధం లేకుండా అష్టాదశ వ్యసనాలయందూ మునిగి తేలుతుంటారు. అష్టాదశ వ్యసనాలేవి అంటే మహానుభావుడైన మహర్షి మనువు ధర్మ సూత్రాలలో వీటి గురించి చెప్పి ప్రతి మనిషి ప్రయత్న పూర్వకంగా విసర్జించి దూరంగా ఉండాలని జాగ్రత్త చెప్పారు.

మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః
తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకోగణః
పైశున్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్ధ దూషణేః
వాగ్దండనంచ పారుష్యమ్ క్రోధజోఽపి గణోఽష్టకః (మనుస్మృతి)


వేటాడడం, జూదం, పగలు నిద్రించడం, నిందాలాపనలు చేయడం, స్త్రీలౌల్యం, గర్వం, దుష్టమైన ఆలోచనలను రేకిత్తించు నృత్య , గీత, వాద్యములందు విపరీతమైన ఆసక్తి, పని పాట లేక తిరుగుచుండుట-ఈ పది కామజనక వ్యసనములు.

చాడీలు చెప్పుట, దుస్సాహసము, సాధుజనులపై ద్రోహచింత, పరుల కీర్తిని చూసి అసహనము ఓర్వలేని తనము కలిగియుండుట, ఇతరుల గుణములందుదోషములు ఆరోపించి చులకన చేయుట తద్వారా కీర్తి హననము , నీచముగా కఠినముగా మాట్లాడుట అను ఈ ఎనిమిది క్రోధజములైన వ్యసనములు.

పై వ్యసనాలు ఎవరియందైనా స్పష్టంగా ప్రకటంగా కనిపిస్తున్నాయంటే దానర్థం ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి అటువంటి వ్యక్తులు పాత్రులు కారు అని మనకు సప్తశతీత్యాదిగా అమ్మవారి స్తుతులలో తెలుస్తున్నది.

ధర్మ్యాణి దేవి సకలాని సదైవ కర్మా- ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీ కరోతి !
స్వర్గం ప్రయాతి చ తతో భవతీప్రసాదా- ల్లోకత్రయేఽపి ఫలదా నను దేవి తేన!!

అమ్మా ధర్మ కార్యాలను ఎవరు చేయగలరో తెలుసా, నీ దయ ఉన్నవాడు, నువ్వు ఎవరిని అనుగ్రహిస్తావో ఆ వ్యక్తి మాత్రమే దైవీ గుణ సంపత్తిని పెంచుకొని, ధర్మ కార్యములను నిర్వర్తించగలడు. నీ అనుగ్రహం ఉన్నవారే సుకృతములను చేయగలరు. అనగా, అనుగ్రహం లేనివారు దుష్కృత్యములను నిర్వహిస్తూ, పర ధనయశోకాంతలనాశిస్తూ వివేక హీనుడై, ధర్మ హీనుడై ప్రవర్తిస్తాడు. ఏ వ్యక్తి యైనా , అధార్మికమైన కార్యం చేస్తున్నాడు, స్త్రీబాలవృద్ధసాధుభక్తజనులలో ఏ ఒక్కరి గురించి చెడు ఆలోచన చేస్తున్నా దానికి తాత్పర్యం ఆ వ్యక్తికి జగజ్జనని అనుగ్రహం లోపించింది అని గుర్తు. ఎవరైతే నీ అనుగ్రహాన్ని పొందడం వల్ల దైవీ గుణసంపన్నులై మంచిని పెంచి పంచుతారో, అందరినీ ఆదరిస్తారో అటువంటివారు స్వర్గాది త్రిలోకములే కాదు నీ చరణ సీమనే పొందెదరు.


దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి!
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా!!

అమ్మా, నీ భక్తుల సంకటములెల్లను పోగొట్టి నిన్ను సదా తలిచి నిలిచేవారికి భయాన్ని, బాదను తొలగించి స్వస్థతను చేకూర్చెదవు. అలాంటి వారికి మరింత మంచి బుద్ధిని కటాక్షించి నీ మార్గమునుండి మరలని స్థిరబుద్ధిని ప్రసాదించెదవు.  నీవు ఎలాంటి వారికైనా మంచి చేయాలనే తలపు గలదానవు, కానన్జేశి నీ భక్తులకు గూడా భవాని త్వం... భవానిత్వం గామారి అటువంటి లక్షణములే అలవడి అపకారులను కూడ ఉపేక్షించి ఉపకారమే చేయుదురు. నీ అనుగ్రహ వృష్టిచే దారిద్ర్య దుఃఖాలను తాపార్తిని హరించడంలో నీకన్నా పణ్డితులెవరున్నారు లోకంలో అని నీదరి చేరిన వారిని అక్కున చేర్చుకుందువు. సత్యము సత్యము సత్యము.

- శంకరకింకర






No comments:

Post a Comment