శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఉపాసన అనే పదం మనం చాలా చోట్ల ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించి వింటూంటాం. సాధనలో పై స్థాయి వారిని చూసి అదిగో వారు ఫలానా ఉపాసకులు అని చెప్పుకోవడం కద్దు, అలాగే కొందరు పెద్దలు పిన్నలు, శిష్యులకు మీరు ఈ ఉపాసన చేయండి అని చెప్పడమూ బహు సామాన్యం.
ఈ ఉపాసన అంటే ఏమిటి? అని విచారిస్తే!
ఆర్షప్రోక్తములైన శాస్త్రగ్రంథములలో చెప్పబడిన ఉపాస్య వస్తువు (ఏది ఉపాసింపదగిన వస్తువు/రూపము/నామము)గా నిర్ణయింపబడిన వస్తువును, ఆ ఉపాస్య వస్తువును ఏ విధముగా యే యే పద్ధతులలో ఉపాసించాలో తెలుసుకొని శాస్త్రముననుసరించి దానిని తన బుద్ధికి విషయంగా అందించి, ఆతత్వమును తెలుసుకొని బుద్ధిచేత ఆ ఉపాస్య వస్తువుయొక్క తత్త్వమును పట్టుకొని సంతత తైల ధారలాగా సమానమైన చిత్తవృత్తుల ప్రవాహముతో అత్యధిక సమయము/చాలాకాలము వరకు ఆ ఉపాస్య వస్తువు యందు అదే స్థితిలో నిలిపి ఉండగలరో ఆ నిలిచి ఉండే స్థితిని ఉపాసన అంటారు.
దీనిలో ఉండేవి మూడు
ఉపాస్య వస్తువు - ఆర్షప్రోక్తములైన శాస్త్రగ్రంథములలో చెప్పబడినవి
ఉపాసకుడు - శాస్త్రము మీద నమ్మకముతో, శాస్త్రములో చెప్పబడిన విధముగా, ఆయా పద్ధతులను గురువుద్వారా తెలుసుకొని అనుసరించేవాడు
ఉపాసన - ఆర్షప్రోక్తమైన శాస్త్రగ్రంథములలోని ఉపాస్యవస్తువును గురువు యొక్క అనుగ్రహముతో శాస్త్రవిహితమైన పద్ధతులద్వారా చిరకాలము బుద్ధికి చేర్చి సమాన వృత్తులద్వారా నిలిపి ఉంచే ప్రక్రియ లేదా స్థితి.
దీని వలన తెలిసేదేమి, ఆర్ష ప్రోక్తముకాని ఉపాస్య వస్తువు వర్జింపవలసినది, అది లోక హితము కానేరదు. అలాగే, చిరకాలము సంతత తైలధారలాగా ఉపాసన కొనసాగలవసి ఉంది తప్ప స్వల్ప కాలికము కాదు. వర్జింపవలసిన వస్తువును గానీ ఉపాసిస్తే, ఉపాసకునికి, ఆ ఉపాసకునితోపాటు లోకమునకు ఖేదం కలగగలదు. కారణం శాస్త్రవ్యతిరిక్తమేదైనా అది ధర్మవ్యతిరిక్తమే, అంటే అధర్మమే. అధర్మం ప్రబలినపుడు, ధర్మానికి గ్లాని కలిగినపుడు లోక క్షేమము దెబ్బతింటుంది. అందువల్ల శాస్త్రమును మీరక మనకు ఋషులేమి చెప్పారో వారు మనకేమి అందించారో దానిని వారిచ్చిన పద్ధతులలో ఉపాసించడం సర్వదా శ్రేయస్కరం.
సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు
http://sri-kamakshi.blogspot.in
http://shankarakinkara.blogspot.in
విలువైన విషయాలను వివరించారు.
ReplyDeleteధన్యవాదాలండి.
మీకు స్వాగతం! ధన్యవాదములు!
Delete