Pages

Monday, August 5, 2013

ఒక గురువునుంచి ఏమి పొందాలి

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

          గురువునుంచి ఏమి ఆశించాలో తెలుసుకునే ముందుగా గురువు లేదా గురుత్వము గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, అసలు గురువెవ్వరు? గురువు యొక్క అవసరమేమి? అని ముందుగా విచారణ చేయాలి.

ఎవరు గురువు? గురువు లక్షణములేమి అని చూస్తే మన ఆర్ష వాజ్ఞ్మయంలో బహు విస్తారంగా గురువైభవము గురు లక్షణములు ప్రకటింపబడ్డాయి. ఐనప్పటికీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే గురువు యొక్క లక్షణములు ఈ క్రిందవని తెలుస్తుంది....

శ్రోత్రియో బ్రహ్మనిష్ఠోయః ప్రశాన్తస్సమదర్శనః
నిర్మమో నిరహంకారః నిద్వన్ద్వో నిష్ఫరిగ్రహః
అనపేక్షశ్శుచిర్దక్షః కరుణామృత సాగరః
ఏవం లక్షణ సంపన్నః సగురుర్బ్రహ్మవిత్తమః
ఉపసాద్యః ప్రయత్నేన జిజ్ఞాసో స్సాధ్యసిద్ధయే

          వేదశాస్త్రములు తెలిసినవాడు, నిరంతరము స్వస్వరూపానుసంధానపరుడు, జితేంద్రియుడు, దేహేన్ద్రియాదులందు నేను అను భావము అన్యమునందు నాది అనుభావము లేనివాడు, శీతొష్ణసుఖదుఃఖాదులను సహించువాడు, సర్వ కామవర్జితుడు, శిష్యులను తరింప జేయ సమర్థుడు, దయా సముద్రుడు అగు బ్రహ్మవిదుడు సద్గురువనబడును, ఇట్టి గురువును ఆశ్రయింపవలెను అని సర్వవేదాంత సిద్ధాంతసార సంగ్రహము లో చెప్పబడింది.


          సరే బాగుంది, ఐతే గురువు యొక్క అవసరమేమి? గురువునెందుకు ఆశ్రయించాలి? గురువునాశ్రయిస్తే నాకిమిటి లాభం? ఏం కలిసొస్తుంది? అని విచారణ చేస్తే..

బన్ధముక్తం బ్రహ్మనిష్ఠం కృతకృత్యం భజేద్గురుమ్
యస్య ప్రసాదా త్సంసార సాగరో గోష్పదాయతే!

          సంసారమునుండి ముక్తుడై, నిరంతరం బ్రహ్మమునందే రమిస్తూ కూడా జన్మలో చేయవలసిన సత్కార్యములనొనరిస్తూండడంచేత కృతకృత్యుడైన సద్గురువులను ఆశ్రయించిన వారికి ఆ గురువుయొక్క అనుగ్రహము వలన సంసార మహాసముద్రమును, ఆవు డెక్కతో పడిన మట్టి గుంతను దాటిన సులభంగా దాటగలరు. అంటే గురువును ఆశ్రయించవలసినది సంసారముక్తి కొరకు కానీ సంసారంలో ఇంకా కుదురుకునే కోరికలగూర్చి కాదు, శరీరంలో ఉంటూ చేయవలసిన సత్కర్మలను చేస్తూ సంసారముక్తుడుగా ఎలా ఉండి తరించాలో తెలుసుకునేందుకు గురువు యొక్క అవసరం ఉన్నది తప్ప, సంసారంలో కోరికలు కోరడానికి కాదన్నది సుస్పష్టం.

          సరే బాగుందీ, గురువంటే సంసారముక్తుడు, నిరంతర బ్రహ్మానుసంధానం చేస్తూండేవాడు, శరీరం తీసుకున్నందుకు శాస్త్రం తన అవస్థలకుగానూ విధించిన ధర్మానుష్ఠానం కావిస్తూ కృతకృత్యుడైన సద్గురువును సేవిస్తే ఆయన సంపాదించింది తన శిష్యులకిస్తాడు. అంటే నిరంతర బ్రహ్మానుసంధానం చేస్తూ ఆత్మస్థితిలో జీవన్ముక్తుడైన సద్గురువు తన శిష్యునికీ అదే ఇస్తాడు ఎందుకంటే అదే గురువునాశ్రయించే పరమ ప్రయోజనం కనుక, మరి గురువు అదొక్కటే ఇస్తాడా? సంసారం నడపడానికి కావలసినవేవీ ఇవ్వడా? స్థాయి చేరుకునేవరకూ మరి సంసార లంపటం తప్పదా? అనే అనుమానమూ కలుగుతుంది కొందరికి, ముందుగా అవే కావాలని కోరుకునేవారూ కొందరుండవచ్చు. జీవన్ముక్తుడిని చేయగలిగిన గురువుకి ఇతర సంసార లంపటాలకి సంబంధించిన కోర్కెలు తీర్చడం ఒక లెఖ్ఖ కాదు. ప్రత్యేకంగా సాంసారిక కోరికలు కోరనవసరంలేదు ఎందుకంటే గురుపాద స్పర్శయే త్రివేణి సంగమ స్నాన సమానం. మనకు లౌకికంగా ఏ ధర్మ బద్ధమైన కోరిక ఐతే తీరటలేదో దానికి అడ్డుగా వచ్చే పాపరాశి, గురుపాద దర్శనము చేతనూ, గురు శుశ్రూష చేతనూ, గురు భజన చేతనూ తొలగదోయబడతాయి. దాని ఫలితంగా భగవంతుని అనుగ్రహంచేత మనకి కావలసిన లౌకిక ఇచ్చలు తీర్చబడతాయి. ఇది అనుషంగిక ప్రయోజనమేతప్ప గురువునాశ్రయించడానికి ప్రథమ, పరమ ప్రయోజనం కానేరదు. గురువు గూర్చి చెప్పిన పైశ్లోకాల ప్రకారం, ఆయన శ్రౌతి, వేదవేదాంగములను తెలిసినవాడు కాబట్టి తన ధర్మంలో భాగంగా తననాశ్రయించినవాడు ముముక్షువై వచ్చినా మరి దేనికొచ్చినా కోరిక తీర్చవచ్చు, కోరిక తీరడం అనేది ఆ సద్గురువు యొక్క ధర్మాచరణ యొక్క అనుషంగిక ఫలితంగా ఆశ్రయించిన వ్యక్తికొచ్చేది మాత్రమే అవుతుంది. తప్ప గురువు యొక్క లేదా గురువునాశ్రయించడయొక్క పరమ ప్రయోజనం కానేకాదు.

గురువునేమడగాలి? ఎలా అడగాలి?

శుశ్రూషయా సదా భక్త్యా ప్రణామై ర్వినయోక్తిభిః
ప్రసన్నం గురు మాసాద్య ప్రష్టవ్యం జ్ఞేయ మాత్మనః

          శుశ్రూష చేత, భక్తిచే నమస్కరించి, వినయ విధేయతల చేత గురువుని ప్రసన్నం చేసుకొని, తరవాత తన అభీప్సితము జీవన్ముక్తిని పొందుటకు కావలసిన ఆత్మ తత్త్వమును (జ్ఞేయ మాత్మానః) తెలుపమని కోరవలెను, జీవన్ముక్తిని పొందడమే జన్మ సాఫల్యము’.

భగవన్! కరుణాసింధో! భవసింధోర్భవాన్తరిః
యమాశ్రిత్యాశ్రమేణైవ పరం పారం గతాబుధాః

          షడ్గుణైశ్వర్యసంపన్నుడవు, దయాసముద్రుడవు ఐన ఓ గురూత్తమా! తమ అనుగ్రహముచే అనేకమంది సంసార సాగరము సునాయాసముగా దాటుచున్నారు, కావున నన్ను గూడ అలానే కృతార్థుని చేయుము (సంసార సాగరము దాటించుము) అని వేడుకుంటున్నాను

          ఇంతకు ముందు పైన చెప్పినట్లు, గురువు సంపాదన శిష్యులు పొందుతారు, ఎలాగైతే జన్మ వంశ పారంపర్యంగా ఉన్న ఆస్తులు సంక్రమిస్తాయో, అలానే విద్యాపరంపర లేదా గురుపరంపరగా పూర్వ గురువులు సంపాదించినది పొందగలరు. విషయమై గురుమండలరూపిణి ఐన కామాక్షిని గూర్చి ఒక శ్లోకంలో ఇలా అడిగారు మూక శంకరులు ఇలా అడిగారు

ఖణ్డం చాన్ద్రమసం వతంసమనిశం కాఞ్చీపురే ఖేలనం
కాలాయశ్ఛవితస్కరీం తనురుచిం కర్ణేజపే లోచనే!
తారుణ్యోష్మనఖమ్పచం స్తనభరం జఙ్ఘాస్పృశం కున్తలం
భాగ్యం దేశిక సఞ్చితమ్మమ కదా సమ్పాదయేదమ్బికే?

          తలమీద చంద్రవంక, నల్లని ఇనుముతో పోటీనా అన్నట్లు ఉండే నీ శరీర కాంతి, నిత్య యవ్వనముతోఉండి లోకాలను పోషించేటానికి సిద్ధంగా ఉండేటటువంటి సాంద్రస్తనములు కలిగి, పిక్కలను దాటిన పొడవైనా నల్లని కేశ పాశములతో కాంచీ పురములో ఆడుకుంటూఉండే తల్లి కామాక్షి మా గురువుల భాగ్యము నాకెప్పుడుకలుగునో కదా!

          వంశము లేదా పరంపర రెండు రకాలు జన్మ వశాత్ ఒక కుటుంబంలో పుట్టగా ఏర్పడిన ఆ వంశ /కుటుంబ పరంపర దాని వల్ల పూర్వులైన తాత తండ్రుల భాగ్యములైన పుణ్య సంపద, ఆస్థి ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్ఠలు పొందే భాగ్యము ఒక రకము. అలానే విద్యా పరంపర లేదా గురు పరంపర అను విధంలో ఒక గురువును ఆశ్రయించగా ఆ గురు వాక్య మననముచే మునుపు ఉన్న గురువులు పొందిన భాగ్యవిశేషాన్ని సాధన ద్వారా తానూ పొందడం. శ్లోకంలో మూక శంకరులు కాంచీ పురములో ఉన్నటువంటి తల్లి పైన చెప్పినవిధంగా కలియ తిరిగుతూ ఆడుకుంటూ ఆడిస్తూ ఉండగా సాకార దర్శనం చేసి జీవన్ముక్తిని పొందిన తన గురువులను స్మరిస్తూ అమ్మా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలిగిస్తావు తల్లీ అని అడుగుతున్న సన్నివేశం ఇది.

          అమ్మవారే గురుమండల రూపిణిఐన కారణం చేత అందరు గురువులూ ఆమె యొక్క రూపమే ఐన చేత,పూర్వ గురువులందరూ అమ్మ అనుగ్రహం వల్ల ఆమెను ఉపాసించి ఆమెగా మారిపోయారు అంటే సాయుజ్య స్థితిని పొందారు కాబట్టి ఆమెకీ, గురువులకీ అభేధం అందున ఆమెయే మూక శంకరుల ఎదురుగా వచ్చి నిల్చున్న మూక శంకరుల గురువుగారు. శ్లోకం స్మరించినప్పుడు అమ్మవారి పైరూపాన్ని స్మరించగానే శాబ్దికంగా భావయుతంగా మన మనస్సులో మెదిలే అమ్మ స్వరూపమే గురుమండల రూపిణి, ఆమెయే అస్మద్ గురుస్వరూప. గురు రూపం మెదిలితే ఆ రూపమే ఆ పరాదేవత. కామాక్షికి గురువుగారికీ ఉన్న అభేధం ఇంతందంగా వివరించబడింది ఈ శ్లోకంలో.

            తండ్రి తాత ముత్తాతలు సంపాదించిన భాగ్యం అందరూ ఆశిస్తారు, కానీ ఇక్కడ శిష్యుడు తన గురు పరంపర పొందిన భాగ్యాన్ని కోరుతున్నారు. అన్ని కోర్కెలూ తీర్చే అమ్మవారే స్వయంగా వచ్చినా ఆమెను గురుమండల రూపిణిగా చూసి సాయుజ్యాన్నే కోరుతున్నారు తప్ప అన్యమైన కోరికలు కాదు.

సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు
జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర
ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు
అద్వైతం సత్యం - వేదం ప్రమాణం

4 comments:

  1. చాలా బాగుంది నాగేంద్ర గారూ!

    గురు మహిమను, గురు కరుణ-ప్రాప్తి మార్గాన్ని, గురుమండలరూపిణియైన పరదేవతయే అస్మద్గురురూప అని సాక్షాత్ మూకశంకరుల శ్లోకాన్ని, వివరించారు. చాలా సంతోషం.

    శుశ్రూషయా సదా భక్త్యా ప్రణామై ర్వినయోభక్తిభిః
    ప్రసన్నం గురు మాసాద్య ప్రష్టవ్యం జ్ఞేయ మాత్మనః

    ఈ శ్లోకం ఎక్కడిది? ఒకసారి సరిచూడగలరా? రెండవపాదంలో ఒక అక్షరం ఎక్కువ పడింది.

    ReplyDelete
    Replies
    1. నమస్కారమండీ! ఈ శ్లోకం శంకరభగవత్పాదుల విరచిత సర్వవేదాంతసిద్ధాంతసార సంగ్రహము నుండి గ్రహించినది. మీరు చెప్పడం వల్ల జరిగిన పొరపాటును తెలుసుకోగలిగాను.
      వినయోభక్తిభిః అన్న దగ్గర ’భ’ అనే అక్షరం ఎక్కువ పడింది, పైన కూడా సరిదిద్దాను. ధన్యవాదములు. మరుటపాలలో మరింత జాగురూకత వహించగలను.

      Delete