శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ప్రస్తుత కాల మాన పరిస్థితులలో మీకు ప్రమాణమేది అంటే చటుక్కున చెప్పేది అంతరాత్మ, తరవాత గీత, భారతం, రామాయణం ఆ తరవాత శాస్త్రం వగైరా వగైరా.. కానీ అసలు మనం పుట్టిన గడ్డ ఏది? ఈ గడ్డలో సనాతనంగా ఉన్న ధర్మంలో ఏది ప్రమాణం? దేన్ని ప్రమాణం చేసుకొని జీవించాలి అన్నది చాలా చోట్ల ప్రస్తుతం సందిగ్ధంగా ఉన్నది. దానికి కారణమేమైనా కావచ్చుగాక.
మొట్టమొదట మన మనస్సులలో, బుద్ధిలో నిగూఢంగా నాటబడిన ’మతం’ అన్నమాటను తుడిచి మనది ఏదో ఒక మనిషి మతిలోనుంచి పుట్టిన మతం కాదు ఇది ధర్మం అని చెరగకుండా ముద్ర వేసుకోవలసి ఉన్నది. మనం చరించే వైదిక ధర్మం, లేదా హైందవ ధర్మంగా పిలువబడేది సనాతనమైనది భగవంతుడెంత సనాతనుడో మన ధర్మం అప్పట్నుంచీ ఉన్నది భగవంతుడెప్పటివరకూ ఉంటాడో అప్పటివరకూ ఉంటుంది. అంటే భగవంతునికెలా ఆద్యంతాలు లేవో మన ధర్మమూ అంతే.
ఈ ధర్మం ఏరూపంలో వ్యక్త పరచబడింది దీన్ని తెలుసుకోవడం ఎలా? అంటే ఆభగవంతుని ఊపిరులుగా తెలియబడే వేదములు మొట్ట మొదట మనకి ధర్మాన్ని ( లౌకిక + పార లౌకిక) రెండు రకాల జ్ఞానాన్ని కలిపి బోధించాయి. వేదాన్ని అర్థం చేసుకోవడానికిగానూ దానికి ముఖ్యమైన కొన్ని అంగాలను కూడా తెలుసుకోవలసిఉంటుంది. అవి కూడా శాసనములే, శాస్త్రములే. అవి భగవత్శాసనములు కాబట్టే వాటికి ’శాస్త్రములు’ అని పేరు. భగవత్శాసనమును ఔదలదాల్చడం వినా తర్కించడానికి కుదరదు. అందుకే ఆయన జగన్నియంత. ఈ శాస్త్రాదులు అందరికీ ఎలా అందుతాయి అంటే, మహానుభావులైన ఋషులు తమ జీవితాలను త్యాగం చేసి తపించి శృతులను దర్శించి స్మృతులుగా కూర్చి మనకందించారు మరికొందరు భగవంతుని లీలలను దర్శించి పురాణేతిహాసములుగా అందించారు. అందుకే ఈ భరత ఖండం ఆర్షభూమి. ఎందరో ఋషుల పాద స్పర్శచేతనూ, వారి అమూల్యమైన వాగమృతధారలచేతనూ తడిసి తడిసి ఉన్నదీ భూమి.
ఋషులు దర్శించిన ఈ వేద వాఙ్మయాన్ని కలియుగంలో మానవులు సంపూర్ణంగా అధ్యయనం చేయలేరని, వ్యాస మహర్షి నాలుగు భాగాలుగా విభజించి నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకిచ్చి వాటిని బోధించమన్నారు. అట్లాగే ఈ అపారమైన వేద వాఙ్మయాన్ని ఇంకా సులభతరమైన పద్ధతిలో తెలుసుకొని ఆచరణలోకి తెచ్చి జీవితాలని బాగుచేసుకోవడానికి వేద విషయ ప్రతిపాదితములైన పురాణేతిహాసములను రచన చేసి, పంచమవేదంగా కీర్తించబడే మహాభారతాన్నీ రచన చేసారు. సమస్త వేదవిహితమైన ధర్మసూక్ష్మములతో కలిపి భగవంతుని లీలలు కలిపి ఉన్నందునా ఎందరో ఋషుల గాథలు బోధలచేతనూ, మహానుభావులైన వారి ధర్మాచరణ వైశిష్ఠ్యము గలదైనందుననూ అది పంచమ వేదమని కొనియాడబడింది. మొత్తంగా చూస్తే వేద బద్ధమైన వాఙ్మయములే వేదానికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మంగా సులభగ్రాహ్యములుగా ధర్మ ప్రచారానికి వ్యాసాది మహర్షులు దర్శించి ఇచ్చినవి తప్ప అన్యములు సనాతన ధర్మమునకు ప్రమాణము కావు అన్నది పరమ సత్యం.
కలియుగంలో జనులు మంద బుద్ధులు, పరధర్మాసక్తతాపరులు, రోగపీడితులు, పాఖండులు (ఇది తిట్టుకాదు పా అంటే వేదం దాన్ని ఖండించేవారు పాఖండులు అని అర్థం) వగైరా వగైరా కలి ప్రభావ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారని వ్యాసోక్తి. వ్యాస మహర్షి ఎంతో త్యాగ బుద్ధితో, జనులను ధర్మమార్గంలో ఉంచడానికి ఇచ్చిన వేదవిహితమైన వాఙ్మయం మనకి ప్రమాణం. గీతలో శ్రీ కృష్ణుడే చెప్తారు "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ! జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!" తస్మాత్= కావున, కార్య+అకార్య వ్యవస్థితౌ = కార్యము చేయవలెనా చేయవద్దా అని నిర్ణయించవలసినప్పుడు, శాస్త్రం=శాస్త్రము తే ప్రమాణం=నీకు ప్రమాణం (అనుమాన నివృత్తి చేయదగలిగినది, ఆధారపడవలసినది) ఇహ శాస్త్రవిధానోక్తం=ఈ విధంగా చేయొచ్చా లేదా అన్న శాస్త్రవిధిని బట్టి కర్మకర్తుఁ=స్వకర్మను చేయడానికి అర్హసి = అర్హుడవౌదువు అని స్వయం విష్ణుమూర్తి సంపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణపరమాత్మ బోధ. అంటే శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు. శ్రీ కృష్ణుడికి దణ్ణం పెడతాం కానీ ఆయన చెప్పింది ప్రమాణం కాదంటే?
ఈ శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది. ఈ పధ్నాలుగింటినీ ధర్మస్థానములు అంటారు
వేదములు - 4
1)ఋగ్వేదము 2) యజుర్వేదము 3)సామవేదము 4)అథర్వవేదము
వేదాంగములు 6
1)శిక్ష 2)కల్పము 3)జ్యోతిషము 4)వ్యాకరణము 5)నిరుక్తము 6)ఛందస్సు
ఇతరశాస్త్రములు
1)పురాణాములు 2) న్యాయము 3) మీమాంస 4) ధర్మ శాస్త్రములు
మొత్తం 14
సనాతన ధర్మంలో చరించే వారెవరైనా వీనిని తెలుసుకొని వాటికణుగుణంగా చరించవలసి ఉంటుంది. ఇవే ప్రమాణములు. తరవాతి పరంపరలో వచ్చినవారెవరైనా ఇవే తిరిగి తిరిగి తిప్పి తిప్పి చెప్పగలరు కానీ అవైదికాన్ని చెప్పరు కదా! అలా చెప్తే వైదిక ధర్మమెలా అవుతుంది!
ఇతః పూర్వం వేదరాశిని దర్శించిన ఋషులు గానీ, వ్యాస మహర్షి గానీ లేనినాడు, ఈ శాస్త్రములు మనకందేవి కావు పూర్వ ఋషులు త్యాగ బుద్ధితో కొండలలో కానలలో తమ జీవితకాలాలను వెచ్చించి తపస్సు చేసి దర్శించిన అనంతమైన వేదరాశిని వ్యాస మహర్షి కలియుగ మానవులకోసం నాలుగు భాగములనొనర్చి, తేలికగా ఉండడానికి ఇతిహాసములను పురాణములుగా కూర్చి సర్మ ధర్మ శాస్త్రములను మనకందించారు. అంతటి మహోన్నత గురు పరంపరకు, వ్యాసాదులకు తగు విధంగా కృతజ్ఞతలావిష్కరించకపోవడం పైగా వ్యాసపౌర్ణమి నాడు అవైదిక పద్ధతులలో పర్వదినం జరుపుకోవడం ఆ విధంగా ప్రోత్సహించడం ఖచ్చితంగా కృతఘ్నతయే....... ఐనప్పటికీ సనాతన ధర్మ ఆచార్యుల విశాల హృదయం ఏమంటే ఏ గురువులోనైనా సరే, నీ గురువుని గానీ లేదా నువ్వే వ్యక్తిని గురువనుక్కుంటావో ఆయనను దర్శించి సేవిస్తే వ్యాసపౌర్ణమినాడు సమస్త గురుమండలము యొక్క అనుగ్రహమూ, వ్యాసుణ్ణి సేవించిన ఫలితమూ వస్తుంది తద్వారా బుద్ధి ప్రచోదనం జరిగి జ్ఞాన సముపార్జన వేపుకు జీవితం సాగుతుంది అని నిర్ణయించి మనకందించారు. అసలు గురుపౌర్ణమి అన్న పేర గురువులను సేవించడం వచ్చిందే వ్యాస జన్మతిథియైన వ్యాస పౌర్ణమి నాడు అటువంటిది ఆయనను గురుమండలాన్ని పూజించకపోవడం ఎంత అసమంజసం? వ్యాస పౌర్ణిమ అని తెలిసీ వ్యాసులవార్కి కనీసం ఒక్క నమస్కారం చేయకపోవడం ఎంత కృతఘ్నత?
తెలియని వారు, తెలిసినవారు అని ఎప్పుడూ రెండు తరగతులు లోకంలో ఉంటూనే ఉంటాయి. మధ్యలో తెలియని వారిని మభ్యపెట్టి, తెలుసుకుని చెప్పేవారిని భయపెట్టేవారూ కొందరుంటారు. తెలియనివారు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, తెలిసినవారు తెలిపే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తెలియని వారికి ఇవన్నీ అర్థం కావు కాబట్టి వాళ్ళకు తెలిసిందే వాళ్లకు నచ్చేట్లే చెప్పాలి అంటే అలా చెప్పడం కన్నా వ్యర్థమైన పని ఇంకోటిలేదు. ఒక తరగతిలో చదివేది పైతరగతికెళ్ళడానికి తప్ప ఆ తరగతిలోనే జీవితాంతం ఉండడానికి కాదు. అలాఉండే విద్యార్థి ఎవరైనా ఉంటే నీకు అబ్బదు బాబూ అని ఆ స్కూలు వాళ్ళే ఇంటికి పంపేస్తారు. క్రింది తరగతులలో ఉన్నవాణ్ణి నీ శక్తి ఇంతే నువ్వింతే అనేవాళ్ళు కొందరుంటే వాళ్ళని పై తరగతులలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించేవారు కొందరు... అందులో ఎవరు ఉత్తములోఎవరు ఉత్తుత్తిలో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అసలంటూ ఏదో ఒకటి చేస్తున్నారు కదా అసలు మానకుండా.. అంటారా? అవైదిక మతాల వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం అంత మాత్రాన వారు వైదిక ధర్మ (హైందవ ధర్మ) ప్రవర్తకులు కారుగా...
ఈ ధర్మంలో ఉంటూ, ఉన్నామంటూ,ఉన్నామనుక్కుంటూ.. మీకు మీ శాస్త్రాలు గొప్పైతే మాకు నచ్చినవి మాకు గొప్ప అనుక్కుంటే అనుక్కోవచ్చుగాక, అకార్యమెప్పుడూ అకార్యమే! అశాస్త్రమైనదెప్పుడూ అశాస్త్రమే! అవైదిక మతాలలో కూడా వాళ్ళ మత పెద్దలు వ్రాసిన గ్రంథాలుంటాయి అవే వారికి ప్రమాణం, వేదశాస్త్రేతి ప్రమాణాలు వారు నమ్మకపోయినా మాకూ ఓ గ్రంథముంది మాకదే ప్రమాణం అన్నంత మాత్రాన ఏదో ఒక ప్రమాణం ఉందికదా అని వారు వైదిక ధర్మ ప్రవర్తకులవగలరా? లేదా హైందవ ధర్మంలోని వారు అవ్వగలరా? ఏలెక్కన వారు ఈ ధర్మంలోనివారు కాదో, ఈ ధర్మంలో ఉన్నామని చెప్పుకుంటూ అవైదిక భావనలు ప్రచారం చేస్తూ, వేదశాస్త్రపురాణేతిహాసాల ప్రమాణాన్ని అంగీకరించక అన్యమైనవాటిని మాత్రమే ప్రమాణంగా భావించే వారూ అంతే!
ఇతః పూర్వం నేనొకసారి వ్రాసుకున్నాను తెలియకపోవడం తప్పుకాదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం నేరం అని. ఇప్పుడు దానికి పొడిగింపు ఇంకోటేంటంటే "తెలియకపోవడం తప్పుకాదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం నేరం , దానికడ్డుపడడం మహా పాపం" పాపం ఎందుకన్నానంటే ఒక వ్యక్తియొక్క జన్మ సాఫల్యాన్ని పొందడానికి కావల్సిన జ్ఞాన సముపార్జనకి అడ్డువచ్చేవాడు సహజంగానే పాపం మూటకట్టుకున్నవాడౌతాడుకదా.. అసలు మాకెందుకు మేమెందుకు తెలుసుకోవాలి మా ఇష్టం మాది అన్నవారితో గొడవేలేదు.
చక్కగా చెప్పారు.
ReplyDeleteధనవాదాలండీ
Deleteఅద్భుతః
ReplyDeleteచాలా బాగా చెప్పారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యా వ్యవస్థితౌ!!
ఈ రోజుల్లో, సనాతన ధర్మంలో ఉన్నాము అనుకుంటూ, అవైదిక/పాఖండ వాదనలను ప్రచారం చేస్తూ ఉన్నవారు చాలా మంది కనబడుతున్నారు. నిజంగా ఎంత దురదృష్టకరమో ఇది... వ్యాస పూర్ణిమ నాడు, సాక్షాత్ విష్ణు స్వరూపమైన వ్యాస మహర్షి యొక్క పూజ, వ్యాసుడి గురించి స్మరించడం, వ్యాస మహర్షి ఇచ్చిన వాఙ్మయం కనీసం ఆ రోజైనా చదవకుండా.... కొత్త కొత్త సాంప్రదాయాలను, కొత్త వ్యక్తులను (గురువుగా) తీసుకువచ్చి, వ్యాసపూర్ణిమ అనే అత్యంత పవిత్రమైన నైమిత్తిక తిథి యొక్క అర్ధం మార్చేస్తున్నారు. అదీ చాలదన్నట్లు, సనాతన ధర్మంలో ఉన్న మహాపురుషులైన పెద్దలు చెప్పిన వాక్కులను సరిగ్గ అర్ధం చేసుకోకుండా, పెద్దల వాక్కులను విమర్శించడం ఎంతటి ధూర్త సాహసం? ఈ విధంగా చేయడం, కోరి కోరి పాపం మూటకట్టుకోవడం.
మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
ReplyDeletehttp://blogvedika.blogspot.in/