Pages

Saturday, May 11, 2013

జ్ఞానిని అనుకరించరాదు - అజ్ఞానిని అనుగమించరాదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఇతః పూర్వం వాచ్యార్థము - లక్ష్యార్థము అన్న పేర ఈ బ్లాగులో కొంత వ్రాసుకున్నాను, దానికి పొడిగింపుగా నాకు నేను పరాకు చెప్పుకోవటం కోసం ఈ విషయం వ్రాసుకుంటున్నాను.

ఎందరో మహానుభావులు, గురువులు, ఆచార్యులు, పరమహంసలు ఎందరో మన జాతిలో నడయాడి ప్రతి ఒక్కరు ఆత్మోన్నతిని పొందడానికి కావలసిన విషయ పరిజ్ఞానాన్ని అందించారు. అందుకున్న వారు అదృష్టవంతులైయ్యారు, అందుకోలేని వారు ప్రయత్నిస్తున్నారు. ఈ రెంటికీ మధ్య ఉన్నవారు సందిగ్ధావస్తకి గురయ్యారు ఇంకా గురౌతూ ఇతరులనీ గురి చేస్తూనే ఉన్నారు. ఒక మహా పురుషుడు ఒక పని చేసాడు
అంటే అది బాహ్యంలో ఒకలా కనపడినా ఆంతరంలో ఒకలా ఉంటుంది, ఒక్కోసారి ఒక పది మందికి పది రకాలుగా చెప్పవలసిన దాన్ని ఒకే పనిలో చేసి చూపిస్తారు అది ఆ పదిమందికీ వారి వారికున్న స్థాయీ బేధాల్ని బట్టి లేదా ఆ సందర్భాన్ని బట్టి ఆ మహాత్ముడు చేసిన పని వారికి పరిష్కారంగా ఉంటుంది. అది కేవలం శిష్యుల మానసిక దౌర్భల్యాన్నో, లేక శంకనో, లేక మరోటో దూరం చేసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే మహాత్ములు చేసే లీల యొక్క పరమ ప్రయోజనం అంతే కానీ అదే ఇక ప్రతిదానికీ పరిష్కారం కాదు (it is not to be set as precedence for every situation across all times and to all beings).

చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ మొన్న ఒక సంభాషణలో గుర్తొచ్చింది, ఎవరితోనో మాట్లాడుతూ మీరు అన్నీ నియమాలు అదీ ఇదీ అంటారు ఏది ఆ మహానుభావుడు అలా చేయలేదా, ఈ మహానుభావుడు ఇలా చేయలేదా వాళ్ళే చెప్పగా లేనిది మీరంతా ఎందుకు కాదంటారు అదీ ఇదీ అని... అప్పటికీ చెప్పబోయాను వాళ్ల స్థాయి వేరు జ్ఞానికి విధినిషేధాలుండవు కదా, లోకోద్ధరణకై అపోహలు పోగొట్టటానికి ఆ సమయంలో వారిని చేరిన వారి బుద్ధిమాంద్యం పోగొట్టటానికో మరోదానికో ఒక ప్రత్యేక పరిస్థితులలో కొన్ని కొన్ని సార్లు మహాత్ములలా చేస్తారు. దాన్నే ప్రామాణికంగా తీసుకొని, ఆయన చెప్పాడు, మేమూ చేసేస్తాం అంటే ఎలా ? అది ఎందుకు చెప్పారో! ఎందుకు చేసారో! కూడా బేరీజు వేసుకోవద్దా అని... కానీ గుల్లగా ఉన్నగోడమీదే కదా మేకు దిగుతుంది, కాంక్రీటు పిల్లర్ లో మేకు మామూలుగా దిగదు కదా అని మిన్నకున్నాను.. చెప్పే స్థాయిలో మనం లేకున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో కొంత మంచి చెప్పగలరు వారిలోంచి మంచితీసుకుందాం అనే వ్యవసాయాత్మక బుద్ధి ఎంత అవసరమో మరోసారి అర్థం అయ్యింది నాకు.

ఉదాహరణకి, కిరాతుడైన కన్నప్ప అడవిలో తిరుగుతూ శివలింగం కనపడితే శివయ్య అని తెలుసుకుని అడవిలో ఒక్కడే ఉండిపోయాడనీ స్నాన పానాదులు లేవనీ వేదన పడి ఏదో పూజ చేస్తున్నాననుక్కొని చేయకుండా సేవ చేస్తున్నానని చేసిన పూజ స్వామి స్వీకరించాడు, ఏదో పుక్కిట్లో పట్టిన నీరు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే అభిషేకంగా స్వీకరించాడు స్వామి, అడవిలో తిరిగి జంతువుల మలమూత్రాలతో సహా అడవంతా తొక్కిన చెప్పులతో నిర్మాల్యం తీస్తే అదే కూర్చతో చేసిన నిర్మాల్య విసర్జనగా తీసుకున్నాడు స్వామి. నా స్వామి అడవిలో ఎన్నాళ్ళనుంచో ఆకలితో ఉండిపోయాడని అడవి పందిని వేటాడి దాన్ని కాల్చి అందులో మంచి రుచిగా కాలిన మాంసపు ముక్కేదో నోటితో కొరికి బాగున్నదాన్ని తీసుకొచ్చి స్వామికిస్తే విషాన్నే ద్రాక్షపండులా చేసి గొంతులో పెట్టుకున్న స్వాంఇ అమృతం కన్నా ఇష్టంగా స్వీకరించాడు.. భక్తికి పరీక్షగా కళ్ళు పాడైనట్లు చూపిస్తే తన కళ్ళనే సమర్పించాడు స్వామికి.. కదిలిపోయాడు స్వామి అప్పట్నుంచి ఆ కిరాతుడు కన్నప్ప అయ్యాడు. ఆయన సంస్కారబలం ఏకాగ్ర చిత్తంతో చూపిన ఆయన భక్తి తీవ్రత స్థాయి వేరు. ఆయన భక్తికి మెచ్చిన ఆశుతోషుడైన శివుని లీలా వినోదమది.

కన్నప్ప అలాచేసాడు కాబట్టి మనమూ అలానే చేద్దామంటే అంతకన్నా అపచారం లేదు, తెలుసుకోవడానికి తెలుసుకున్నదాచరించటానికి మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు దానితో సంస్కారం పెంచుకొని అంతే మర్యాదతో నడచుకోవాలి. ఎవరిదాకానో ఎందుకు ఉదాహరణకి కన్నప్ప వారసులే ఉన్నారనుకుందాం ఇప్పుడు వారు ఇప్పటికీ కన్నప్పగారిలానే చేస్తారా? ఒక వేళ వాళ్ళు చక్కగా అర్చనాదులు వైదికంగా ఎలా చేయాలో పద్ధతులు తెలుసుకుని మేము ఇలా కార్యక్రమం జరిపిద్ధాం అనుక్కుంటున్నాం అంటే, మనం వాళ్ళని అబ్బే వీల్లేదు మీ పూర్వీకుడైన కన్నప్పగారు ఇలా చేసారు మీరూ అలానే చేయాలి మీకదే ఆనందం అంటామా? తెలియకపోతే వాళ్ళకి పద్ధతి చెప్పి చక్కగా అందంగా భక్తిగా నిష్ఠతో వైదికంగా కార్యక్రమం చేయమని చెప్తామా?

ఈ ఆలోచనా పరంపరలోనే చిన్నప్పటి ఒక చిన్న కథ గుర్తొచ్చింది
ఒక మహానుభావుడు పరమ జ్ఞాని ఐన గురువు ఆయనని అనుగమిస్తూ ఎంతో మంది శిష్యులు ఉండేవారు. ఒక సారి ఆ గురువుగారు తమ శిష్యులకి పాఠం చెప్పాలనుక్కున్నారు నడచి వెళ్తూంటే ఒక కల్లు దుకాణం కనపడింది వెంటనే వెళ్ళి గడగడా ఒక కుండ కల్లు తాగేసి పక్కన కూర్చున్నారు ముందందరూ నోళ్ళు వెళ్ళబెట్టి అరే గురువుగారు తాగేసారు మననీ తాగమన్నట్లే అని అందరూ కడవలకి కడవలు తాగి తూలి పడి గోల గోల చేసారు గురువుగారు అందరినీ గమనిస్తున్నారు ఒకరిద్దరు తప్ప అందరూ తాగి పడిన వాళ్ళే కొంత సమయం గడిచింది అందరికీ మత్తు దిగడం మొదలైంది. తరవాత వాళ్ళలో వాళ్ళు సమర్థించుకోవడం మొదలెట్టారు, ఒరేయ్ కళ్ళు టాగడం టప్పు కాడురా.. అండరూ కళ్ళు టాగత్సు, మాంషం టినొట్శు గురూవ్ గారే టాగి శూపింఛారు అని సిద్ధాంతం చేసారు. ఆ సదరు గురువుగారు తాగని ఒకరిద్దరు ఇతర శిష్యులు వీరందరికీ మత్తు దిగేదాకా వేచి ఉండి మత్తు దిగాక మర్నాడు విహిత కర్మానుష్ఠానానంతరం తిరిగి ప్రయాణం మొదలెట్టారు ఈ సారి ఇంకో ఊరిలో ఒక కమ్మరి కర్మాగారం ముందునుంచి వెళ్తూండగా ఆ గురువుగారు ఆగి ఒక్క ఉదుటున అక్కడ ఒక పాత్రలో లోహాలను శుద్ధి చేయడానికై ఉన్న అత్యంత భయంకరమైన ద్రావకాన్ని (Acid) కమండలంలో తీసుకొని తాగేశారు. తాగేసి శిష్యుల వంక చూశారు... ఒక్క శిష్యుడూ కిక్కురుమనలేదు. తాగడానికి ముందుకు రాలేదు.

ఇతః పూర్వం కల్లు తాగని ఒకరిద్దరు శిష్యులు గురువుగారి లీలకు ఇతరులకు చెప్పిన పాఠానికి గురువుగారికి ఏమన్నా జరిగిందేమోనని ఒకింత కంగారుకు గురై ఏమీ కాలేదని నిశ్చయంతో ఉండి గురువుగారిని సేవించి ఉత్తమ శిష్యులైనారు, పరంపరలో వారూ గురుస్థానాన్ని అలంకరించారు. మరి ఆ గురువుగారి సంగతి. ఆయన జ్జాని అన్నిటినీ ఒకేలా చూసేవాడు, ద్రావకమైనా, కల్లైనా, నీరైనా, విషమైనా ఆయనకి సమం, ఆ పదార్థం దోష భూయిష్టమైనా ఆయన చేయి తాకగానే దోషాలు ఎగిరిపోయేంత పరమ విరాగి, జ్ఞాన సంపన్నుడు. గురువులు ఆచార్యుల లీలలు కేవలం శిష్యోద్ధరణకే. గురువుగారు చేసింది నేను చేస్తాను అంటే ముందు ఆ నిష్ఠ అనుష్ఠానం పెంచుకోవాలి కదా.. అప్పుడు ఆస్థాయి దానంత అదే వస్తుంది.

ఏదైనా ఒక గురువు లేదా మహాత్ముడు ఒక కర్మయందు ఎవరికైనా మినహాయింపు ఇచ్చాడు అన్నా లేక అందరూ చేయకూడని పనిని చేసి చూపించినా అది సార్వజనీకం కాదు. సాయిబాబా గారి విషయంలోనూ అంతే ఆయనకి మాంసం ఇష్టం అని తీర్మానించారు కొందరు, ఆయన మాంసమూ తినగలడు అవసరమైతే సంవత్సరాల ఉపవాసమూ చేయగలడు ఆయనది అద్వైత స్థితి ఆయనకి అందులో రెండు కనబడవు. అది అర్థం చేసుకోకుండా బిర్యానీలు, పులావులు, మాంసాహారం సాయి ప్రసాదం సాయికిష్టం, సాయిబాబా చుట్ట, బీడీ కాలుస్తాడు అంటూ సిద్ధాంతం చేసినవారెందరో. సాయి బాబా గారు చేసినవి సార్వజనీకం ఐతే ఎవరూ ఏ ఒక్కరూ ఏదీ నీళ్ళతో దీపాలు వెలిగిం చరేం, చేతినే గరిటలా వాడి వందమందికి వండి వడ్డిం చరేం. ఇలాంటివి మాత్రం కుదరవు అబ్బే అవి బాబాగారు కదండీ చేసిందీ అని ఒక దీర్ఘం....

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతో స్వామి వారు ఒక పూర్వ సుహాసినికి శ్రీచక్రం ఇచ్చారు, అది ఎందుకిచ్చారో, ఎవరికిచ్చారో, ఆ తల్లి పూనికేమో వారికి తెలుసు, ఇప్పటికీ ఆ శ్రీ చక్రం తీసుకున్న వారి వంశం వారిచే గొప్ప పూజలందుకుంటోంది. అది తెలిసి అందరూ చేస్తామంటే అపహాస్యం పాలౌతారు.

రమణులు సంధ్యావందనం నిత్య కర్మానుష్ఠానం చేయరు అరుణాచలంలో ఏ దీక్షానియమాలు లేవుట అని నిత్య కర్మ మానేసిన వారున్నారు, అప్పట్లోనే రమణులు చెప్పారు మీరూ జ్ఞానిస్థాయికి చేరితే కర్మ పరిత్యాగం చేయొచ్చని. దీక్షానియమాలు లేవని నిత్యకర్మానుష్ఠానం మానేస్తే మరి రమణులలా బ్రతకగలమా శరీర భ్రాంతి లేక, తిండిలేకున్నా, తేళ్ళు, జెర్రులు కుట్టినా అలా ధ్యానంలో ఉండగలమా? అన్నది ప్రశ్నించుకోవాల్సి ఉంది

గురువుల, ఆచార్యుల పేర్లు వాడుకొని వారు చేసిన లీలలు ఎందుకో దేనికో తెలీకుండా తత్త్వం తెలుసుకోకుండా అవసరం మేర మన సౌకర్యార్థం సగం సగం అన్వయించుకొని మిగిలింది వదిలేయ డమంత గురుద్రోహం మరోటి లేదు (నా భావన మాత్రమే) . మహానుభావులు చేసిన లీలలను మనం స్వంత తెలివితో మనకి అన్వయించేసుకొని దాన్ని దృష్టాంతంలా చూపి దాన్ని అనుకరించటం కన్నా అథమం మరోటి లేదు.

అందుకే పూజ్య గురువులు ఈ మాట పదే పదే చెప్తూంటారు

"జ్ఞానిని అనుకరించరాదు - అజ్ఞానిని అనుగమించరాదు"

ఏమైనా! ఎక్కడైనా దోష భూయిష్టంగా వ్రాసి ఉంటే గురుమండల స్వరూపిణి ఐన పరాదేవతను క్షమించమని కోరుకుంటూ

సర్వం శ్రీ పరబ్రహ్మర్పణమస్తు

No comments:

Post a Comment