Pages

Wednesday, June 12, 2013

మారిన సామాజిక పరిస్థితులవల్ల సనాతన ధర్మాన్ని తగు విధంగా మార్చకూడదా?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, పరిస్థితులు మారిపోయాయి, తదనుగుణంగా ఆచారకాండలో, ధర్మశాస్త్రాలలో ఎందుకు మార్చకూడదు? సామాజిక విప్లవాలు అంగీకరించబడుతున్నప్పుడు ఆధ్యాత్మికతలో విప్లవాలెందుకు తేరాదు ధర్మశాస్త్రాదులను ఎందుకు మార్చకూడదు. ఇతర మతాలలో ఉన్న వెసులుబాటు కొత్త తనాన్ని, మార్పుని ఆహ్వానించే గుణం వల్ల అవి ఎంతో విస్తరింపబడుతున్నాయి, మీ హిందూ ధర్మంలో (సనాతన ధర్మం) ఎందుకు అంత చాదస్తంగా ఉంటారు అని.

వచ్చిన చిక్కల్లా సనాతన ధర్మం అంటే ఏమిటో అది ఏమి చెప్తోందో తెలియని ప్రతి వ్యక్తికీ దాన్ని విమర్శించడం దానిపై సంచలన వ్యాఖ్యలు చేయడం గొప్ప పని చేసినట్టనిపిస్తుందనుక్కుంటా... ధర్మం సనాతనమైనది, భగవంతుడు ఎప్పటివాడని లెఖ్ఖకట్టగలిగితే అప్పటినుంచీ ఉన్నది, తప్ప మనిషి బుర్రకాయలోనుంచి వచ్చింది కాదు అన్న చిన్న విషయం తెలియని వారూ అరకొర తెలివితో వసపోసినట్లు వాగేవాళ్ళూ నోటికొచ్చినట్లు మాట్లాడడం గొప్పనుక్కుంటారనుక్కుంటా...

పైగా దీనికి కొసరేమంటే గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని పేర్లకింద కొత్త కొత్త హోదా తగిలించుకున్నవాళ్ళు, వ్యాకరణ జ్యోతిష్యాది వేదాంగాలలో కొన్నింటిని నేర్చుకొని ప్రవీణులని ప్రకటించుకునేవారే వక్ర బుద్ధివల్ల సనాతన ధర్మంకన్నా పాఖండ మతాలలో ఉన్నతమైనవెన్నో ఉన్నాయని సర్టిఫికేట్లివ్వడం చూస్తే అసలు వీళ్ళు హోదాలు తగిలించుకోవడం, ఆయా వేదాంగ పఠనాలు చేసిందీ కుక్షింభరత్వానికేనేమో ఆచరణకి జ్ఞాన సముపార్జనకి కాదేమోనని నా ప్రబలమైన అనుమానం, అనుమానం కన్నా నమ్మకం కూడా..

సరే అసలు విషయానికొస్తే ప్రశ్నని ఒకానొక విదేశియుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి  వారిని ఒక ప్రశ్న అడిగాడు

ప్రశ్న: మారిని సామాజిక పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయాలు. ఆచారాలు అవసరమా? ఆచరణ సాధ్యమని మీరనుక్కుంటున్నారా?
స్వామి వారి సమాధానం "సామాజిక విప్లవమ్ అనేది కాలంలో కొత్తగారాలేదు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అతి ప్రాచీన కాలం నుంచీ వస్తూనే ఉన్నాయి. ఐతే అప్పటి మార్పులు ఇంత దారుణంగా ఉండేవి కావు. సంఘంలో వచ్చే మార్పులు గాలి వాన లాంటివి, గాలి వాన వచ్చి వెలిసిన తరవాత కొంత భౌతిక మార్పు తటస్థిస్తుంది. అన్నీ తేలికవి మాసిపోతాయి తప్ప అన్నీ మారిపోవు కొన్నే మారుతాయి. అలాగే మౌలికమైన విలువలనేవి ఎప్పటికీ మారవు వాటిని నిలబెట్టుకుని ఎప్పుడూ చెప్తూ ఉండడం దానియందు చరిస్తూ ఉండడం అవసరం. నైతిక విలువలు ఉండడానికి మౌలికమైన సనాతన ధర్మంలోని విలువలు ఎప్పటికీ అవసరం. నాటి నైతిక విలువలు ఎలా పడిపోతున్నాయో వాటి స్థాయి ఎంత దిగజారి పోతున్నాయో అన్న సంగతి తెలియందెవరికి. చరిత్ర పుటల్లోనే ఉంది అలెగ్జాండర్ వచ్చినప్పుడు భారత దేశంలో దొంగల బెడద లేదని. అంతటి నైతిక విలువలున్న సమాజం ఇప్పుడుందా? అలా లేదని ఇప్పటికి దొంగతనాన్నీ, దొంగలనీ, అవినీతుల్నీ కూడా సామాజిక మార్పు అని చెప్పి దాని పేర దానికీ నైతిక హక్కు అంటూ చట్టంలో చేర్చగలమా? ఇప్పటి పరిస్థితులు ఇలాగున్నాయి కాబట్టి ఇలా ఉండడమే సబబు అని చెప్పగలమా? అదేవిధంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ ప్రమాణాలు (సనాతన ధర్మ సాంప్రదాయాలు, ఆచార కాండాదులు) దిగజార్చటానికి కుదరదు"

{అకార్యమెప్పుడూ అకార్యమే, మనం మారామని ధర్మాన్ని మారుస్తామా? ధర్మం చెప్పేది మనం చేయాలి కానీ, మనం చేసినదానికి ధర్మం అనే ముద్ర వేసుకోవడం కోసం చేసే ప్రయత్నమే సనాతన ధర్మంలో మార్పులు తీసుకురావడం వంటివి, చాలా మంది కొత్తగా reforms to hindu dharma అంటున్నారు వారు కొత్తగా రిఫార్మ్స్ తీసుకురానక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ముమ్దు తెలుసుకొని ఆచరిస్తే చాలు }

మరో ప్రశ్న: ఆధ్యాత్మికమైన విలువలకూ, మతపరమైన ఆచారాలకూ సంబంధం లేదంటారా? ఫ్యాక్టరీలోనో, ఆఫీసులోనో ఉద్యోగిగా ఉన్నవారు పొద్దున్న 9 కల్లా పనికి వెళ్ళాలి. లోగా అతని ఆచారకాండ పూర్తవ్వాలి అంటే 4కో నిద్రలేవాలి, మీ సనాతన హిందువుల ధర్మంలో నిత్యానుష్ఠాన విధానం ఆచార కాండ కొన్ని గంటలు పడుతుంది. ఇలాంటి విషయాల్లో అతని అనుష్ఠాన విధానాన్ని కుదించే దిశగా మార్పు చేయటం అవసరం కాదంటారా?

స్వామివారి సమాధానం "ప్రతినిత్యం తాను చేయవలసిన తీరులో పూజాధికాలు, అనుష్ఠానాలు, జపాలూ చేయలేకపోతున్నానే అని మథన పడాలి, ప్రాయశ్చిత్తం చేసుకొని సెలవు దినాల్లోనో అనుమతింపబడ్డ తీరిక వేళల్లోనో యధావిధిగా ఆచారకాండంతా జరుపుకోవాలి.  అనుష్ఠానం విషయంలో రాజీపడ్డామా ఇక అంతే సంగతులు ఒకటికొకటి  శాస్త్ర నియమాలు క్రమంగా సడలి ఒక్కొక్కటిగా అంతరించి పోతాయి."


కొనసాగింపు ప్రశ్న: ఆధునిక సమాజంలో విహిత కర్మాచరణము చేయలేని పరిస్థితులలో పశ్చాత్తాప్పడుతూ క్రుంగి పొవటం, తపించిపోవటంతో లాభమేముంది?

స్వామివారి సమాధానం: నిజంగా పశ్చాత్తాపపడితే దాని ఫలితం దానికుంటుంది.

మరో ప్రశ్న : మరి ఇన్ని ఉపాసనలలో ఉపాసన ఒకటీ రెండూ కాదు కదా ఎన్నో ఉంటాయి కదా? ఎన్నో దేవుళ్ళు ఎన్నో పూజలు మరి సాధ్యమేనా?

స్వామి వారి సమాధానం: "ధ్యానమేవ ఉపాసనా, ధ్యానమే ఉపాసన అంటే మనస్సును ఏకాగ్రం చేయడమే. అది కేంద్రీకృతమవ్వాలంటే ఒక వస్తువుని అంటే ఒక మూర్తిని పట్టుకోవాలి. ఉదాహరణకు నీ మనస్సుని రెండు చేతులున్న భగవంతుని మీద కేంద్రీకరించవచ్చు ఎనిమిది చేతులున్న భగవంతుని మీదా కేంద్రీకరించవచ్చు.
కానీ సత్యం ఒక్కటే, దానికి మార్పుండదు.  భగవంతుడే పరమ సత్యం. అవ్యయుడు మార్పూ లేని వాడు.  ఉపాసన అనేది ఒక ప్రయోజనం కోసం జరిగేది, రెండు చేతుల దేవుడి మీద మనసు లగ్నం చేసినదాని ప్రయోజనం ఎనిమి చేతుల దేవుడి మీద మనసు లగ్నం చేసిన దాని ప్రయోజనం వేరు వేరు. మూర్తిని ఎందుకు పద్ధతిలో ఉపాసించాలో శాస్త్రాలు నిర్దేశించాయి.  ఉపాసనకి శాస్త్రాలనాశ్రయించక తప్పదు. సత్యాన్ని గ్రహించటానికే, అన్ని రకాల ఉపాసనలూ,  ఉపాసనలన్నీ గమ్యం చేరుకోవటానికి సోపానాలు, సాధనములూనూ, మనస్సును ఒక శిక్షణలో పెట్టి ఏకాగ్రం చెయ్యటం కోసం శాస్త్రాలు మార్గనిర్దేశం చేస్తాయి.


ఐతే శాస్త్రాలు అనేక విధాలైన ఉపాసనా మార్గాలు చెప్పాయి, వాటినన్నింటినీ ఆచరించాల్సిన పనిలేదు, అన్నీ అందరూ చేయలేరు సాధ్యం కూడా కాదు. సాధారణంగా ఒకటి రెండు ఉపాసనాపద్ధతులు మాత్రం అందరూ అనుసరిస్తారు. పూజాకలాపం నిర్దిష్ట సయమంలో జరగాలి, ఉపాసన మాత్రం కేవలం వైయక్తికం, అది సామూహికం కానేకాదు. ఉపాసనా పద్ధతి అనేది కుటుంబ సాంప్రదాయం మీదనో, వ్యక్తి అభిరుచిమీదనో, గురువు చేసిన ఉపదేశం మీదనో ఆధారపడి ఉంటుంది."
  
{ఇలా ఎన్నో అత్యున్నత ప్రమాణాలు, వెసులుబాట్లు మనస్సంస్కార మార్గాలు, ఉపాసనా మార్గాలు, అన్ని భూమికలో ఉన్నవారినీ ఉద్ధరించే సార్వభౌమ ధర్మమైన ధర్మం విలువలకన్నా మనిషి మతిలోంచి పుట్టిన మతాలలెలా ఉన్నతములో ధర్మంలో ఉంటూ బౌద్ధాది పాఖండ మతాలని (పా=వేదం అంటే వేదాల్నిఖండించేవి) ఉన్నతములని కీర్తించే వారు తరచి చూసుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి, తెలియక పోవడం తప్పు కాదుగా, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పుకానీ.}


2 comments:

  1. Now a days there are many ways are followed to convert Hindu's in to foreign religions especially to christianity by using male and female celestial bodies in the name of love how can we educate to those persons who are not realizing they are targeted only for religion conversion ...

    ReplyDelete
  2. నమస్తే
    అధిక శాతం పెద్దల ప్రవర్తనే కారణం, పిల్లల ముందు సినిమాలలో, సీరియళ్ళలో జరిగిన వాటిని మెచ్చుకొని వారిని అటువేపు ప్రోత్సహించడం కాకుండా ముందు మన ధర్మం గొప్పదనం తెలుసుకొని మన పిల్లలకి అది నేర్పటమొక్కటే పరిష్కారం. దీనికి ఎన్నో గ్రంథాలు చదవాల్సిన అవసరంలేదు . శ్రీ రామాయణమొక్కటి చాలు, ఒక్కొక్కరి వ్యక్తిత్వము వారికి చిన్న చిన్న కథలలాగా చర్చిస్తూ వివరిస్తే కొంత ఆసక్తి వారికీ కలుగుతుంది.

    ReplyDelete