Pages

Tuesday, May 7, 2013

పరిప్రశ్న - ప్రశ్నవేయడంలో జాగ్రత్త

శ్రీ గురుభ్యోనమః

నమస్తే ! 
   ఒక వ్యక్తినుండి మనకు కావలసిన విషయ సమాచారాన్ని రాబట్టుకోడానికి మనం ఒక ప్రశ్నవేస్తాం. మనం అడిగే ప్రశ్న యొక్క సొంపును బట్టి మనకొచ్చే సమాధానం కూడా అంత అందంగా ఉంటుంది. పైగా ఈ ప్రశ్న అడిగే విధం ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ముఖ్యం. అసలు ప్రశ్న వేసేముందు నిజాయితీ చాలా అవసరం. మనం నిజాయితీగా అడుగుతున్నామా లేక ఏదుటివాడి పాండిత్యాన్ని తెలుసుకోవడానికి అడుగుతున్నామో ముందు మనమే నిర్ధారించుకోవాలి. రెండవరకమైతే అవతలి వ్యక్తినుంచి సమాధానం కాదుకదా ఈసడింపు కూడా కొన్ని సందర్భాలలో దొరకవచ్చు.

   అసలు ప్రశ్న ఏమిటి? దాని పూర్వాపరాలు ఏవి? ఎక్కడనుంచి ఆ అనుమానం లేదా ప్రశ్న వచ్చింది అన్నది ముందు మనం జాగ్రత్తగా గమనించి గుర్తు పెట్టుకోవాలి. అవతలి వ్యక్తిని ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన అసలెందుకొచ్చింది నీకీ సందేహం? ఆ సందేహం గురించిన వివరమో, కథో.. ఏది ఒక్కసారి చెప్పు? అని అడిగితే ఆ అనుమానం / ప్రశ్న ఎందుకొచ్చిందో తత్కారణం చెప్పి వివరించగలిగేలా ఉండాలి. అలా కాక, ఏదో అక్కడ విన్నానండి, ఇక్కడ వీరన్నారు అందులో ఏముందో తెలుసుకోడానికి అని మనకే అర్థంకాని రీతిలో ప్రశ్న చేయకూడదు.

ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు 
1) స్వతహాగా నా జీవన విధానంలో నా అనుష్ఠానంలో కలిగిన సందేహాలు:- ఇవి అడిగి తెలుసుకుని అనుమాన నివృత్తి చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. 
2) స్వజీవితంలోవే కాక, ధర్మ సూక్ష్మాలు ఇత్యాదులు:- స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ అనుమానం వచ్చినచోట సందర్భానుసారం సమయానుకూలానుసారం తెలిసినవారినడిగి తెలుసుకోవడం లేదా ఇతర ప్రామాణిక వ్యాఖ్యానాలు పుస్తకాలు చదివి విని తెలుసుకోవడం. తద్వారా పురాణేతిహాసాలు మనలో జీర్ణమై తదనుగుణంగా మన జీవన మార్పు ఆధ్యాత్మికోన్నతికి సోపానమవుతుంది 
  
(ఇదికాక మరోరకం ఏదోఒకటి అడగాలిగదా అని అడిగేయడం... ఏదో ఒకటి పోస్ట్ చేయాలిగదా అని స్పామ్మింగ్ చేసినట్లు... దీని గురించి విజ్ఞులకనవసరం... కదా!)
    
   ముఖ్యంగా గురువుల వద్ద, ఆయన దొరికారు కాబట్టి ఏదో అడగాలిఅని అడిగేయడం కాక మన ఆధ్యాత్మికోన్నతికి పనికి వచ్చే ప్రశ్నలు అదీ ఆయన అనుకూల సమయం చూసి అడగాలి. అంతేకాని అప్పున్న వాణ్ణి ఎక్కడ కనపడితే అక్కడ చొక్కాపట్టుకుని అప్పడిగినట్టు కాదు.
  
   అసలు ప్రశ్న అడిగేముందు ఆ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పరిశ్రమ ముందు చేయాలి. అసలు ఏ పరిశ్రమా లేక ఏదో అడిగేసి వారు తిరిగివేసిన ప్రశ్నకి మన దగ్గర బదులు లేక తత్తర పడకుండా జాగ్రత్త పడాలి.
      
   గతంలో ఎంతోమందిని మన పూజ్యగురువుగారిని ఎక్కడపడితే అక్కడ ఏవో ప్రశ్నలు వేయడం చూసాను అలాంటి ప్రశ్నలు ఎలావేస్తారో అని నాకో గొప్ప అనుమానం. అవి వారి ఆధ్యాత్మిక జీవనానికి ఎలా ఉపయోగపడతాయో అర్థంకాని ప్రశ్నలు. చాలా ప్రశ్నలు పుస్తక పరిశీలనం పురాణ పరిశీలనం ద్వారా తేలిపోతాయి. అసలు ఆ ప్రశ్నవెనుక వారి పరిశీలనం కాని పరిశ్రమ కానీ ఏమీ ఉండవు.
      
       భారతంలో ఇలాట కదండీ? అలా ఎలా అండీ? రాముడు ఇలా చేసాడు కదండీ? సినిమాలో చేప్పారు కదండీ! నిజమాండీ? ఎలా అండీ? వంటి ప్రశ్నలు కొన్ని, ఆ అడిగిన ప్రశ్న ఏ సినిమా చూసో నాటకం చూసో అడిగుతున్నామని అడిగే వాళ్ళకీ తెలుసు. భారత రామాయణాలు వాటి వ్యాఖ్యానాలు చదివితే అందులో ప్రశ్నలకి సమాధానం కూడా దొరుకుతాయి అలాగే ఏవి కల్పిత రాజ మార్తాండ కథలో తెలుస్తాయి. కానీ, ఆ పరిశ్రమ చాలామందిం చేయం, చదివి చెప్పేవారు తేరగా దొరికారని ఇచ్చవచ్చిన ప్రశ్నలు అడుగుతుంటాం.

    కొన్ని ప్రశ్నలు పెద్దలైన వారినీ, పూజ్య గురువులనూ అడగడం చూసాను అదీ ప్రత్యేకంగా సమయం తీసుకుని కుటుంబ సమేతంగా వచ్చి సంధ్యావందనం పుస్తకం ఇస్తారా... (అంటే అప్పటివరకూ సంధ్యావందనమే చేయడం రాదన్నమాట) రామాయణం తెలుగు పుస్తకాలు, భాగవతం తెలుగు పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి టీకా తాత్పర్యాలు ఉన్నవి కావాలి, ఎవరు వ్రాసినవి సరియైనవి, మీకేమైనా పుస్తకాల దుకాణం తెలుసా? అడ్రెస్సు చెప్తారా? అని. అటువంటి వారిని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలీదు ఎన్నో పుస్తకాల దుకాణాలున్నాయి ఏ పెద్ద దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఉండే పుస్తకాల దుకాణదారులని అడిగినా చెబుతారు, అంతర్జాలంలో ఎన్నో పుస్తకాలు విక్రయించే వెబ్ సైట్లున్నాయి, ఉచితంగా చదువుకునే వెబ్ సైట్లున్నాయి, అరెరె వీరికి అంతపెద్దాయన సమయం కేటాయిస్తే ఎలా సమయం వృధా చేసుకుంటున్నారురా అనిపిస్తుంది.
   
         రామాయణం బాలకాండ జాగ్రత్తగా చదివితే అసలు ప్రశ్న ఎలావేయాలో తెలుస్తుంది.    వాల్మీకి విరచిత శ్రీ రామాయణమే ప్రశ్నతో మొదలు. అందులో చక్కగా చెప్తారు వాల్మీకి నారదులవారిని అర్ఘ్యపాద్యాదులతో పూజించి "పరిప్రశ్న" చేసారు అని. “పరిప్రశ్న అంటే బాగుగా ప్రశ్న అడుగుట”. “పరి పరి విధముల ఆలోచించి సరియైన ప్రశ్ననుకూర్చి అడగవలసిన వారిని అడిగే విధంగా ప్రశ్న అడగడం”. అలానే విశ్వామిత్రమహర్షిని శ్రీరాముడు అలానే సందర్భోచితంగా ప్రశ్నలువేసి విషయాలు తెలుసుకుంటారు.

   మనకి ఇప్పుడు ఎన్నోరకాల మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయి, ఎక్కడ ప్రవచనాలు, వ్యాఖ్యానాలు దొరుకుతాయి ఇలా అన్నివిషయాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఐనా కొందరు పరిశీలన చేయరు, పరిశ్రమ చేయరు, ఏ ప్రశ్న అడగాలో ఎలాఅడగాలో, ఎక్కడ అడగాలో అన్న స్మృతి కూడా ఉండదు.
   ఐతే ప్రశ్న అడగడంతప్పని నేను ఎంత మాత్రమూ చెప్పట్లేదు. ముందు మనని మనం ప్రశ్నించుకోవాలి, పుస్తకాలను ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవాలి, పరిశీలనాత్మక దృష్టి, వ్యవసాయాత్మక బుద్ధినేర్పరచుకోవాలి. ఐనా దొరకకపోతే ఆ సమాధానం దొరకకపోవడంవల్ల మన ఆధ్యాత్మిక జీవనానికి ఏమైనా లోటు ఉందా అని తర్కించుకోవాలి. లోటనిపిస్తే ప్రశ్నని చక్కగా కూర్చి పెద్దలనడగాలి. 

   ముఖ్యంగా గమనించవలసినదేమంటే ఈ టపా చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంత మందిని చూసి చూసి ఈవిషయం గూర్చి వ్రాయాలని కొన్నాళ్ళక్రితం ఒక గ్రూపులో వ్రాసాను, ఎందుకంటే అటువంటి వారు మనగుంపులో ఉండకూడదని (లేరనే నేను నమ్ముతున్నా) ప్రస్తావించాను మన పరిచయస్తులు కనీసం ఈ విషయంలో (పెద్దలని పరిప్రశ్న వేయడంలో) జాగురూకులై ఉండాలనీ...

   తెలియకపోవడం తప్పుకాదు, తెలుసుకోవడానికి పరిశ్రమించకపోవడం బద్ధకమనే నేరం.

   మీరు విజ్ఙులు నేను చెప్పింది ఏమాత్రం ఇబ్బంది కలిగించినా, తప్పనుక్కున్నా మన్నించగలరు. ఒప్పనుక్కుంటే ఆశీర్వదించగలరు.

మీ...

2 comments:

  1. చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. రామభక్తులైన మీకు సాదర స్వాగతం, మీ మెచ్చుకోలు రామాశీర్వాదంగా భావిస్తున్నాను.

    ReplyDelete