Pages

Tuesday, May 7, 2013

చంద్రమౌళీ! నీవే రక్షకుడవు

చంద్రమౌళీ! నీవే రక్షకుడవు

శ్రీ గురుభ్యోనమః

   బిల్హణకృత శివ స్తుతి చదువుతుంటే ఆయన ఎంత భక్తితో, తనకున్న పాండిత్యంతో శివుణ్ణి ఎలా స్తుతించాడో తెలుసుకుంటూంటే ఔరా! మహానుభావుడు ఏమి స్తుతి చేసాడు అనిపిస్తోంది. ఒక్కో మహానుభావుడు ఒక్కో విధంగా శివస్తుతి చేసారు... వారి భావనతో పాటు అంతర్లీనంగా కథా వస్తువుగా ఉండే ఏదో ఒక శివ లీల అద్భుతంగా సందర్భానుసారంగా దాచడం... మహానుభావులకే చెల్లింది


ఏనాంసి మానసిక వాచిక కాయికాని
కుర్మ స్తథా పి చరణం శరణం దధీథాః
యో దోషవంత మపి రక్షతి రక్షితాసౌ
కో వా రక్షతి నిరాగస మిందుమౌళే!

   ఇందుమౌళీ! మేము మానసుతో, వాచికంగా (మాటలతో), శరీరంతో చేయబడే మూడురకాల పాపాలు చేస్తూంటాం. అయినా నువ్వు మమ్మల్ని క్షమించి నీ పాదాలని రక్షగా ఉంచాలి అని వేడుకుంటున్నాము.

   ఇన్ని అపరాధాలు, పాపాలు చేస్తున్నారుగదా? మరి ఎందుకు ఎలా మిమ్మల్ని రక్షించాలి, మీ పాపాల్ని అపరాధాల్ని ఎలా క్షమించాలి? అని అడుగుతావని తెలుసు, ఎవరైతే తప్పులు చేసినవాణ్ణి రక్షిస్తాడో, ఉద్ధరిస్తాడో అతడే రక్షకుడు కదా (రక్షితా అనదగినవాడు). ఎందుకంటే చంద్రుణ్ణి నెత్తిమీదపెట్టుకుని చంద్రమౌళి, చంద్ర శేఖరుడు అని పేర్లు పొందిన శివా! అపరాధము, పాపము ఏమీ చేయనివాణ్ణి లోకంలో ఎవరు రక్షించరు? ఎవరైనా రక్షిస్తారు గదా! నువ్వుద్ధరించవలసినది, రక్షించవలసినది పాపాలు, అపరాధాలు చేసే మమ్మల్నే!

  (చంద్రమౌళి అన్న సంబోధనతో చంద్రునికి దక్షునిశాపం, కళల క్షయం వృద్ధి ఘట్టాలని గుర్తుచేస్తుంది, అలాగే చంద్రుడు గురువాసంలో చేసిన పాపం గుర్తొస్తాయి. దీంట్లో కవి చమత్కారం, చంద్రుణ్ణే నెత్తిమీదపెట్టుకున్న శివా అంటూ శివునికి ముందరికాళ్ళ బంధ వేయడం ఒకటి, శ్లోకం ఎవరు చదువుకున్నా వారికి వారు చదువుకుని ప్రార్థన చేసినట్లే అన్వయం అయ్యేలా ఉండడం మరోటి)

No comments:

Post a Comment