Pages

Sunday, February 27, 2011

మాయ

శ్రీ గురుభ్యోన్నమః శ్రీ గణేశాయ నమః అందరికీ నమస్సులు మాయ, మాటా గురించి ఇక్కడ చర్చ జరిగితే బాగుంటుంది. మాయా స్వరూపమేంటి? ఎలా కలుగుతుంది? ఎలా పోతుందు? ఉండడం వల్ల నష్టమేంటి? పోవడం వల్ల కలిగేదేమిటి? వగైరా వగైరాలు.. -సూర్య నాగేంద్ర కుమార్

6 comments:

  1. ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారము.
    మాయ ఉండడం వల్ల నష్టమేమిటీ అంటే సత్యమును తెలుసుకోలేము. ఈమాయ బహు విధముల మనల్ని
    భ్రమింపచేస్తుంది. నేడు సన్యాసులమనుకునే అనేకులను కూడా మాయ ఆవరించి నటింపచేయడం
    మనమెరుగుదము. కనుక ఈ మాయా ప్రభావం కేవలం భగవత్ భక్తులపై మాత్రమే చాలా తక్కువగా
    ఉంటుంది. భక్తి మాత్రమే నేడు మనకు తరుణోపాయం. భక్తుడికి నేను భగవత్ సేవకుడను,
    నేను ఆయని ఆదేశముమేరకు కర్మను చేయు ఆటగాడిని అనే భావము నిరంతరము స్ఫురణలో ఉండుట
    చేత అతడు మాత్రమే మాయ బారిన పడకుండా ఉండగలుగుతున్నారు. నేడు ఎందరో సాధకులు ఈ
    మాయచేతచిక్కి నశింపబడుతున్నారు. కనుక దేనికైనా ఈశ్వరానుగ్రహమే కారణము. అది
    ఉన్ననాడు మనము కోరకనే అది తొలగి పోతుంది.
    ధన్యవాదములు
    -రా.వి.శర్మ
    ----------------------
    మాయ అంటే ప్రతిభందకం. భగవంతుని చేరటానికి ప్రతిబందకాలుగా నిలిచేవి అన్నీ
    మాయలే...అరిషడ్ వర్గం.. అహంకారం..శరీరమందు అభిమానం , ద్వంద్వాలు, కలి పురుషుడు
    నివాసముండే స్థానాలు (మద్యం మగువ జూదం బంగారం) ఇవన్నీ భగవంతున్ని
    చేరుకోవటానికి అడ్డు గోడలే.. . కామినీ కాంచనాలే మాయ అని రామకృష్ణుల వారు అంటూ
    ఉంటారు

    మాయా స్వరూపమేంటి?

    మనిషిని దిగజార్చటం..పతనం చేయటం..
    > ఎలా కలుగుతుంది?

    నన్ను (భగవంతున్ని) మరచినచో మాయ శిక్షించును అని సచ్చరిత్ర మూడవ అధ్యాయం
    చెబుతుంది.
    ప్రపంచములోని వానినన్నిటిని మరచి నన్నే భక్తి విశ్వాసములతో పూజించుచూ, నన్నే
    స్మరించుచూ , నా యాకారమును మనస్సున నిలుపుచూ, నా నామమునే జపించుచు, నా పూజనే
    సల్పుచు, నా కథలను జీవితమున మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను
    జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు? అని సత్చరిత్ర
    మూడవ అధ్యాయం ప్రశ్నిస్తుంది. (నన్ను అంటే భగవంతుడు)
    > ఎలా పోతుందు?

    విషయాసక్తి ఉన్నవారు భగవంతుని నీడ కూడా తాకలేరని అని కథామృతం పలుసార్లు
    హెచ్చరిస్తుంది.
    సత్సంగం, సద్గురు సమాశ్రయం తో పాటు సాధన ఉంటే ఆద్యాత్మికేతర (ప్రపంచ)
    విషయాలయందు ఆసక్తి తగ్గుతుంది.ధ్యాస ఎప్పుడూ భాగంతుని మీద ఉంటే, కామిని
    కాంచనాలు (మాయ) ఎలా ప్రేవేసిస్తాయి? కలి పురుషుడు ఎలా ప్రేవేసిస్తాడు? భగవద్
    భక్తుల జోలికి, గురు భక్తుల జోలికి వెల్ల కూడదని కలికి శాసనం..
    > ఉండడం వల్ల నష్టమేంటి?

    పునరపి జననం పునరపి మరణం ఇహ సంసారే ఖాలు దుస్తారే.. జీవన్మరణ చక్రాలలో
    కొట్టుకొని పోవటం

    > పోవడం వల్ల కలిగేదేమిటి? వగైరా వగైరాలు..
    జ్ఞానం .. తద్వారా ముక్తి.

    &
    మాయ స్వరూపం తోటే, భగవద్గీత మొదలయినట్లుగా అనిపించుచున్నది.. భగవద్గీత మొదటి
    అధ్యాయం, దృతరాష్ట్ర ఉవాచ... అని మొదలవుతుంది..
    రాష్ట్రుడు అనగా, రాష్ట్రమును ధరించినవాడు..దృత రాష్ట్రుడు అనగా,
    తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము,
    దేహము,ఇంద్రియములు, మనస్సు బుద్ధి మున్నగున్నవి దృశ్యములు. అవి తానూ కాదు.
    దృక్కగు ఆత్మ ఒకటియే తానూ గాని, దేహాది దృశ్య పదార్దములు కాదు. కానీ అజ్ఞాని,
    తనది కానట్టి, అనగా ఆత్మేతమైనట్టి దేహాది దృశ్యరూప రాష్ట్రమును తనదిగా దలంచి
    దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే అతడు దృతరాష్ట్రుడు.
    అజ్ఞాన భావంతో గూడి యుండు వారందరున్నూ దృత రాష్ట్రులే అని
    గీతా మకరందం వివరిస్తుంది.
    తనది కాని దానిని తనదిగా భావించి, భ్రమించే అజ్ఞాన అంధకారంలో ఉన్న
    జీవుడు ఇలా పలికెను..అని మాయా స్వరూపాన్ని గురించి గీత
    మొదట్లోనే వివరించుచున్నది..


    -ప్రవీణ్ కుమార్ విట్టా

    ReplyDelete
  2. పట్టియల్లబోటి పట్టియీతనదని
    గట్టితలపుతోడ గట్టెగాక
    పట్టికడుపు పెక్కుబ్రహ్మండములుపట్టు
    టెరిగెనేని తల్లియేలకట్టు

    వింటిరా యశోద ఎంత వేర్రిదో కృష్ణుడు తన కుమారుడనియే భావిన్చుచున్నది.
    పాలుత్రాగే వయసులోనే పూతనను, శకటాసురుని చంపెను. తృనావర్తుని త్రుంచెను
    అయిదేడులకు లోపలనే చిలిపి చేష్టలు తుందుడుకులూ దూర్తకార్యములు ఎన్నో
    చేసెనని గోపికలు చెప్పగా విన్నది. నోటిలో బ్రహ్మాండము తానేచూచినది
    మానవాతీత కార్క్యకలాపములు చేయుచుండ ఎన్నో ప్రత్యక్షముగా చూచినది. తన
    కుమారుడేయని పట్టి రోకలికి కట్టినది యెంత అమాయకురాలు అనవలేనో చుడండి.
    ఇదే భగవత్ చిద్విలాసము తానైమాయను నశింపుచేసి మానవుని చెంతకు దారి
    తీయవయునే గాని తన మాయను జాయించువారు దేవ దానవ మానవులలో ఎవ్వరూ కనపడరు.
    ఇంకా మాయ గూర్చి చెప్పాలంటే అది ఆత్మ, మనసులకు సంబందించినది భావము.
    భావంతుడా నాకీ కష్టమునుంచి గట్టెక్కించు అని మనస్పూర్తిగా కోరి
    ధ్యానిస్తే తానే ఏదో ఒక రూపములో వచ్చి రక్షిస్తాడు దానిని గుర్తించలేము
    అదే మాయ.
    --
    రామానుజం సుధీర్ కుమార్
    మాయను అర్ధం చేసుకోగలము కాని జయించటం అసాధ్యం. అది ఆ పరంధాముని వల్లే
    అవుతుంది తప్ప వేరే వారు లేరు కానరారు, వినరారు.
    అసలు ఈ మాయ అంటే ఏంటి ఇది మిధ్యా, వాస్తవమా లేక రూపము ఆకారము రంగు వంటి
    గుణాలు ఎవన్న ఉన్నాయా. అర్ధం అవుతుంది అంటారు అర్ధం కాదు అంటారు
    అసలేంటిది. కామ, క్రోధ, లోభ,....... మొదలగు వాటిలో ఇదియు ఒకటా లేక పంచ
    భూతాల కలయికా... అష్ట దిక్పతుల మేళవింపా......ఇది ఎక్కడ ఉంది ఎలా
    ఉంటుంది....
    ఒక చిన్న కథ చెపుతాను వినండి ............................
    నారదుడు అడిగాడంట ఆ పరమ శివున్ని

    స్వామీ మానవుడు వాని సంసారము వానికి భారమై అల్లాడుచున్నాడు. నీవో ఎందరి
    సంసారముల భాద్యత వహింపవలయునో , వారికన్నను తమకే భాద అధికముగా
    ఉన్నదనుకొనేదను. తామేమందురో తెలియక అడుగుచుంటిని.
    ఏమంటాను - అవునంటాను. మనోవాక్కాయకర్మల నన్నే నమ్మి, నన్నే తలంచి
    సర్వకర్మల నాపైననే వదలినవారికి చేయూత నివ్వక తప్పదు. ఇది నా విధి.
    తమకు విదియా. తమకు విధించిన వారెవరు తండ్రి.
    ఎవరో ఎందుకు నారదా. ఎవరు చేసిన పూజాఫలం ఎంతో అంతే. అ ఫలమే విధి
    విదానమగును. కారణ మాత్రుడు ఆ విధాత.
    స్వామీ - మహేశ్వరా! అంతటి పవిత్రుదంటిరి . అటువంటి వాడు జన్మించిన
    వెంటనే తల్లి తండ్రి కరువగుటేట్లు సంభవించెను.
    తల్లి దండ్రి గురువను మూడు మెట్లను విడచి, నాలుగవ మెట్టు అగు నన్నే నమ్మి
    జీవితము నడిపినాడు. మానవ ధర్మము అవలంబింపక రాక్షసధర్మము అవలంబించాడు
    అందుకు శాస్తి జననము తోడనే తలి దండ్రులు కరువగును.
    ఏమి స్వామీ ఈ మాయ మిమ్ములనే నమ్మి కొలచిన వానికి కూడా ఏమీ కష్ట సుఖాలు.
    నారద ఈ మాయ నాది కాదు, ఈ బ్రహ్మాండ సృష్టి స్థితి కారకుడు అయిన ఆ హరి,
    తనే ఈ మాయ. ఈ మాయే సృష్టిని నడిపించు చున్నది. ఈ మాయే ధర్మము.
    ధర్మముననుసరించి విధి ఉన్నది, ఆ విదిననుసరించి కర్మ ఉన్నది, ఈ
    కర్మననుసరించే మానవుని కష్ట సుఖములు కలుగు చున్నవి.
    అర్ధమయినది తండ్రి అర్ధమయినది, మానవుడు మానవ ధర్మములను అవలంబించిన కర్మ
    బంధమునుండి విముక్తి చేయుటకు ఆ హరి, తానై కర్మ విముక్తి చేయుటయే మాయ,
    విష్ణు మాయ నారాయణ నారాయణ! ధన్యుడను తండ్రి .
    అవును నారద తను సృష్టించినది లయమై తనలో కలియునంతవరకు తానాడే నాటకమే ఈ
    మాయ.
    *************************************************************
    ఈ కథలో ఉన్న 'మాయ' ను గ్రహించగలరని అనుకుంటున్నాను.
    --
    రామానుజం సుధీర్ కుమార్

    ReplyDelete
  3. మాయ యొక్క గొప్ప విశేషం ఏమిటంటే అది వచ్చినది అని గూడ మనకి తెలియదు. మన ఎంతో
    జాగ్రత్తగా వుండాలి.
    మాయ గురించి అలోచించినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకి వస్తుంది. ఒక భట్రాజు
    ఎవరైతే ఇతరులను పొగుడుతూ ఉంటాడో అతను ఒక రాజు వద్దకు రావడానికి ప్రయత్నము
    చేస్తూ వుంటాడు. రాజు మంత్రులు భట్రాజుని రానివ్వదని సలహా ఇస్తారు. కానీ రాజు
    అతనిని రానిస్తాడు. వాడు వచ్చి రాజుని పొగడడం మొదలు పెడతాడు. అది చూసి వాళ్ళు
    రాజుని హెచ్చరిస్తారు. అప్పుడు రాజు అంటాడు, " వీడు ఇంకా నిజమే చెప్పుతున్నాడు
    కదా. వీడు పొగడడం మొదలు పెట్టాక చూద్దాము. వీడు పోగుడుతున్నాడు అని గూడ రాజు
    గుర్తించ లేక పోయాడు." మాయ అటువంటిది. అది మనలను కప్పుతోంది అని తెలుసుకోవడం
    మొదటి మెట్టు. అను క్షణం జాగరూకతతో వుండాలి. అది తెలిస్తే సగం సమస్య
    అయిపోయినట్టే.
    2) మాయ కప్పినది అని తెలుసుకున్నాక ప్రవర్తించే జ్ఞానం తెలుసుకొనడం లేదా
    కలిగి ఉండడము.
    3) ఆ జ్ఞానాని ఆచరించడం.
    ఇవన్నీ గూడ చెప్పినంత సులభం కాదు.
    -మోహన రావు

    ----------------------------
    మాయ గురించి ఆలోచన కలగడమే మాయ. మాయ నీడ లాంటిది. విడదీయడం చాల కష్టం. మాయ ఒక
    బ్రమ లాంటిది. మన పూర్వ జన్మ వాసనల వల్ల ఇది రక రకాల రూపాలలో వస్తుంది. వాసనల
    వల్ల వ్యసనాలు ఏర్పడుతాయి మరియు మంచి బుద్ధి కూడా కలుగుతుంది. సుధీర్గ విచారణ
    వల్ల మాయను తొలగించుకోవచ్చు. ధర్మము నుంచి అధర్మము వైపునకు లాగేది మాయ. కాబట్టి
    ధర్మమును గట్టిగ పట్టుకొంటే మాయనుంచి బయట పడతాము. బుద్ధి చెప్పేది ధర్మము. మనసు
    చెప్పేది మాయ. ఇంతే తేడా.
    మీ
    కామరాజుగడ్డ రామచంద్రరావు
    ----------------------------
    పెద్దలందరికీ నమ:స్సులు,
    మాయ తిరిగి వ్రాస్తే "యమ" అవుతుంది. అంటే మాయ యముని పట్టణానికి చాల దగ్గరి
    త్రోవ. ఈ ప్రసన వెయ్యడమే మాయ స్వరూపం. ఎందుకంటె మాయ వున్నదని తెలిసికూడా మనం
    ప్రశ్నలే వేస్తున్నాము గాని, అది ఎలా మనని వదిలు వెళుతుందో తెలిసి కూడా
    తెలుసుకోలేక పోతున్నాము. అందుకనే మనం సత్యం నుంచి దూరమవుతున్నాము.
    స్వస్వరూపాన్ని విస్మరించడమే మాయ మరియు దానిని తెలిసికొని మసలుకోవడమే
    దానినించి విముక్తి. వుండడంవలన "పునరపి జననం, పునరపి మరణం", పోవడం వలన "అహం
    బ్రహ్మస్మి" ప్రాప్తి. ఈ క్రింద పొందుపరిచిన శ్లోకాలు ఈ విషయాని చాల చక్కగా
    విడమరిచి చెబుతాయి.
    ఆశయ బద్ద్యతే లోకో, కర్మనే బహు చిన్తయ
    ఆయుక్షీనం నాజానాతి, తస్మాత్ జాగ్రత జాగ్రత

    కామక్రోధశ్చ లోభాశ్చ, దేహే తిష్తంటి తస్కరాహ
    జ్ఞాన రత్నపహారాయ, తస్మాత్ జాగ్రత జాగ్రత

    సంపదః స్వప్నసందేశః, యౌవనం కుసుమోపమం
    విద్యుత్ చంచలం ఆయుష్యం, తస్మాత్ జాగ్రత జాగ్రత

    మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరహ
    ఆర్తో నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత

    జన్మ దుఖం జరా దుఖం, జాయాదు:ఖం పునః పునః
    సంసార సాగరం దు:ఖం, తస్మాత్ జాగ్రత జాగ్రత

    ప్రేమయే దైవత్వము, అదియే శాశ్వతము
    మీ
    గోపికృష్ణ

    ReplyDelete
  4. మన గురువు (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి) గారి భాషలో చెప్పాలంటే మాయ అనగా నామము మరియు రూపము,మన మనస్సు ఎప్పుడూ
    వీటి రెండిటి తోనే తాదాత్మ్యత చెంది వుంటుంది.
    మన సాధనలో ఈ రెండిటి నుండి మనస్సుని దాటించాలి. దీనికి వివేకం,విచారణ అవసరము.
    భక్తీ పరంగా కనిపించే జగత్తు అంతా దైవము అని విస్వచించాలి లేదా మానసికంగా విచారణ
    చేసి నామము రూపం ఎక్కడినుండి మన మనస్సులో మేదులుతున్నాయో చూడాలి, మనస్సు యొక్క
    బలహీనత ఏమిటంటే, మన మనస్సుని మనమే అసలు ఇది ఏమిటి, నా ఆలోచనలు ఎక్కడి నుండి
    వస్తున్నాయి అని చూస్తే (ఇది చాల సూక్ష్మ విషయము) వెంటనే మనస్సు శూన్యము
    అయుపోతుంది అనగా నామ,రూపమూలకి అతీతంగా (ద్వంద్వాతీతంగా) వెళుతుంది . దీనినే ఇంకో
    విదంగా చెప్పాలంటే మనస్సు వర్తమానం లో ఉండలేదు కాబట్టి దానిని ప్రయత్న పూర్వకంగా
    వర్తమానం లో ఉంచాలి .
    అందుకనే గీతాచార్యుడు తను భూత ,భవిష్యత్,వర్తమానం లో , వర్తమానమే అని నొక్కి
    చెప్పాడు.
    ఇంకొక విధంగా చెప్పాలంటే ,నామ,రూపమూలకి అతీతంగా (ద్వంద్వాతీతంగా) మనస్సు దృష్టిని
    మరలించాలంటే , మనస్స దృష్టిని కాలము (టైం) వైపుకి తిప్పాలి, రెండు ఆలోచనల మద్య
    వుండే వ్యవదిని కాలము అని శాస్త్రం చెపుతుంది . సుషుప్తిలో మనకి కాలము తెలియదు
    కారణం, మన మనస్సులో అప్పుడు ఒకే ఆలోచన వుంటుంది, అది ఏమిటంటే నాకు ఏమి తెలియదు
    అని, అందుకే మనస్సు ఆలోచనలని ఒక్క ఆలోచన వైపుకి మరలిస్తే అప్పుడు మనకి కాలము
    తెలియదు .ఇదే మనస్సుని అహం వృత్తిలో ,అనగా ఒకే ఆలోచన అంతా నేనే అన్న ఒక్క ఆలోచనలో
    నిలబడితే (ఇది భగవత్ కృప లేదా గురు కృపతోనే అవుతుంది) అదే సమాధి అంటారు .
    పెద్దలు పైన చెప్పిన విషయములల లో తప్పులని మన్నించి విషయముని గ్రహించావలసినధిగా
    కోరుతున్నాను.
    గురుభ్యోన్నమహ !!!
    Thanks
    Subra

    ReplyDelete
  5. నమస్కారములు,
    1 ) మయాకల్పిత దేశ కాలకలనా వైచిత్ర్యచితీక్రుతం -- Source: శ్రీ దక్షిణామూర్తి
    స్తోత్రం
    మాయ సహాయంతో ఈశ్వర సృష్టి జరుగుతుంది - దేశం , కాలం వైచిత్ర్య సృష్టి అంతాను.
    2 ) మాయ అమ్మవారి స్వరూపం భగవతి స్వరూపం
    జ్ఞానినామపి చేతాంసి దేవి భాగవతిహి సా
    బాలాదా క్రుష్య మోహాయ మహా మయా ప్రయచ్ఛతి -- Source: దేవి సప్తశతి
    ౩) ఇన్ని తెలిసిన శ్రీ రామ కృష్ణ పరమహంస స్త్రీ మహా ప్రమాదకారి - మాయ అని -
    కొన్ని విషయాలు బాధ కలిగించేలా అన్నరెందో? -- source: శ్రీ రామకృష్ణ కధమృతం --
    చాల మంచి జీవితం మహా పురుషుడు. ఈ రోజులలో చదివిన మంచి inspiration ఇచ్చే మాటలు
    సంఘటనలు ఉన్నాయ్ అందులో.
    మన పుస్తకాలలో చాల చోట్ల కనిపిస్తుంది ఇలాగ స్త్రీ మాయ అని . అవి చదివినప్పుడు
    - ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి స్వరూపిణి అని తలచుకుని ఊరుకుంటాను.
    4) మాయ లో ఉండే మాయని జయించాలి అని ఎక్కడో చదివేను maybe Ramana maharshi.
    Just a few thoughts sirs. All the posts so far are really thought-provoking.
    We need to do mananam for all that has been said so far.
    Thank you for starting this.
    Thanks,
    padma janaswamy

    ReplyDelete
  6. నమస్తే
    అందరూ బాగా చెప్పారు!
    ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గోచరించడమే "మాయ". దేవీ భాగవతంలోని దేవీ
    గీతలొ స్వయంగా అమ్మవారు చెప్పిందేమంటే ఈ మాయ అసత్తు (అంటే నిజంగాలేనిది)
    అలాగే అది సత్తు కూడా( అది లేక పోతే సృష్టి ఇత్యాది ప్రపంచ వ్యవహారాలు
    నడవవు)
    మాయా స్వరూపం అంబికా తత్త్వంలో భాగమే (పరమాచార్య వ్యాఖ్యానంలోంచి
    తీసుకున్నది) భగవంతునికి మనకి మధ్యనున్న అవనిక లేదా తెర యే ఈ మాయ.
    భగవంతుని శక్తియే మాయగా భగవంతుణ్ణి ఆవరించి ఉండి మనని ఆ భగవంతుని
    చేరకుండా ఆపుతుంది.
    అసలు భగవంతుడు సృష్టించడమెందుకు ఈ మాయ అడ్డు పడడమెందుకు మనని
    పట్టుకోవడమెందుకు? అంటే అది ఆయన కేళీ విలాసం ఒకనాడు ఒక్కనిగా తనలో తాను
    రమిస్తున్నఆయనకి ఒకని కన్నా ఎక్కువగా విస్తరించాలని కోరిక పుట్టింది. ఆ
    కోరిక పుట్టిన అహం స్ఫురణయే శక్తి, అంబిక, ఆవిడే మాయ. అదే ఆయన మాయ. ఆ
    కేళీ విలాస స్థానమే కైలాసం.
    ఈ మాయ వల్ల జరిగే గొప్ప ఉపకారం ప్రయత్న పూర్వకంగా మనం భగవంతుని పాదాలు
    పట్టుకుని అందు కలిగే ప్రతిబంధకాలను ఎదిరించి భగవంతుని కృపకు అర్హత
    సాధించడం. అందుకు మనకి ఒక గురువు దొరకడం.
    మాయ అసలు భగవంతుణ్ణి, ఆయన అంశలైన జీవులను ఎలా విడదీసి వేరు వేరుగా
    చూపుతుంది. అసలు భగవంతుని శక్తే భగవంతుణ్ణి కనపడకుండా లేదా తెలియకుండా
    ఎలా అడ్డుకుంటుంది? మళ్ళీ ఆ భగవంతుడే ఆ మాయ అన్న తెరను ఎలా తీస్తాడు?
    ఎలా అంటే సూర్యుని శక్తి సముద్రంలోని నీరు నీటి ఆవిరిగా మారి అవి
    మేఘములుగా పరిణామం చెంది సూర్యునికి అడ్డంగా వచ్చిసూర్యుని కనపడకుండా
    కప్పినట్టు. తిరిగి ఆ సూర్య తాపం వల్లనే నేల మీద వర్షం యొక్క అవసరం కలిగి
    ఆ మేఘాలు వర్షించి మాయమైనట్టు.
    ఈ మాయ వల్ల మనలో ఉన్న దివ్యత్వాన్ని మరచి మనని మనం ఒక పరిధిలో ఒక చట్రంలో
    ఇరికించుకుంటాం. దీని ప్రభావంతో మనం రాగ ద్వేషాలకి లోనవుతాం. అజ్ఙానానికి
    లోనవుతాం. ఈ అజ్ఙానంతో చేయరాని పనులెన్నో చేస్తాం.
    ఈ మాయలోపడి నువ్వు నేను అన్న తేడాలను చూస్తాం. నేను అన్నప్పుడల్లా ఈ
    దేహాన్ని నాది అన్నప్పుడల్లా ఈ దేహంతో సంబంధం ఉన్న ప్రతి జీవి,
    వస్తువుమీద రాగాన్ని పెంచుకుంటాడు. ఎప్పుడైతే ఆ వస్తువు తనకి విరుద్దంగా
    ప్రవర్తించిందో ద్వేషానికి లోనవుతాడు.
    ప్రతి రోజూ ప్రతి క్షణం ఎన్ని సార్లు నాది నాది నేను నేను అని ఈ దేహము
    తత్సంబంధమైనవాటిని చూపిస్తూ ఉంటాడో అన్ని సార్లు ఈ మాయలో
    మునకలేస్తుంటాడు.
    శ్రీ కృష్ణుడు గీతలో
    దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా = మాయను దాటడం ఎవరి తరమూ కాదు అని
    చెప్పారు. అది దాటాలంటే ఆయన అనుగ్రహమే కావాలి (ఇక్కడ శ్రీ కృష్ణుడు
    పరబ్రహ్మమూ జగద్గురువూ రెండూ)
    ఈ మాయ తొలగటానికి మనం ఏమి చేయాలి? గురువు వద్ద భగవంతుని వద్ద దండం
    పెట్టాలి. దండం అంటే కర్ర. ఒక కర్రని నిట్టనిలువుగా నిలబెడితే ఆకర్ర ఎలా
    అడ్డంగా పడుతుందో అలా గురువు వద్ద భగవంతుని వద్ద అత్యంత భక్తి వినయాలతో
    దండం పడినట్టు నమస్కరించి వారి పాదాలు పట్టుకోవాలి. గురువాక్య శ్రవణము
    భగవంతుని కారుణ్యము ఈ రెంటినీ మనస్సులో తిప్పి తిప్పి సాధనచేయగా చేయగా
    మాయ తొలగుతుంది... మాయను అమ్మవారే తొలగిస్తుంది. అరెరే వీడు నాకొరకు
    రక్షింపవలయువాడు వీడు కూడా అందరిలాగా నామాయలో కొట్టుమిట్టాడడమేమిటి అని ఆ
    మాయ అన్న తెరనే అమ్మవారు తీసేసి అనుగ్రహమనే కృత్యముతో అయ్యవారిలో
    కలుపుతుంది.
    ఇంత మాయ గురించి రాసేసి, క్రింద పేరు రాసి మళ్ళీ ఇంకోసారి మాయలో పడనా!
    అందునా ఇందులో నా ఈ బుర్రకి తోచిన స్వంతం ఏమీ లేదు అందరూ పెద్దలు
    చెప్పినదే. ఇందులో ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా అంతా ఆ మాయ వల్లే. :)
    అందరికీ నమస్సులు..

    ReplyDelete