Pages

Sunday, February 27, 2011

శివ సంకల్పమస్తు

 (అసురుడైనా మయుడు శివుని అడిగిన వరములు బహుశా
మానవమాత్రులు కూడా అడగలేరేమో)
నీ పాద కమల సేవయు....
శివమహాపురాణము - 12 వ అధ్యాయము - మయ స్తుతి
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ భక్తవత్సల శంకర!
కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జితః!!
జ్యోతి రూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే!
నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః!!
చిత్ర రూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః!
దివ్యరూపాయం దివ్యాయ సుదివ్యా కృతయే నమః!!
నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మనే!
కర్త్రే భర్త్రే చ సంహర్ర్తే త్రిలోకానాం నమో నమః!!
భక్తి గమ్యాయా భక్తానాం నమస్తుభ్యం కృపాలవే!
తపస్సత్ఫలదాత్రే తే శివాకాంత శివేశ్వర!!
న జానామి స్తుతిం కర్తుం స్తుతిప్రియవరేశ్వర!
ప్రసన్నోభవ సర్వేశ పాహి మాం శరణాగతమ్!!
దేవ దేవా! మహాదేవా!భక్త ప్రియా!, శుభములనే చేయు వాడా! కల్ప వృక్ష
స్వరూపుడవగు నీకు స్వ, పర భేధములు లేవు. జ్యొతి స్వరూపుడవు (జ్ఙాన
స్వరూపుడవు) అగు నీకు నమస్కారము. ఈ సమస్త విశ్వరూపములో ఉన్న నీకు
నమస్కారము. పవిత్రమగు ఆత్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. అత్యంత పావనుడవు, పాపులను కూడా పావనము చేయు నీకు నమస్కారము. చిత్రమైన రూపము కలవాడవు, నిత్యుడవు, ఏ రూపమూ లేని రూపాతీతుడవు ఐన నీకు నమస్కారము. దివ్య మైన స్వరూపము కలవాడవు, ప్రకాశ స్వరూపుడవు, గొప్పనైన దివ్య ఆకృతి కలవాడవు ఐన నీకు నమస్కారము. నమస్కరించినవారి కష్టములనన్నీ తొలగించువాడా, సర్వ మంగళ స్వరూపుడా నీకు నమస్కారము.  ముల్లోకములను సృష్టించి, భరించి, లయం కావించు నీకు అనేక నమస్కారములు.  భక్తిచే పొందవలసిన వాడు, భక్తులందరి గమ్యమూ, భక్తుల యెడ అపారమైన కరుణ కలవాడూ  ఐన నీకు నమస్కారము. తపస్సులకు ఘనమైన
ఫలములొసగు వాడు పార్వతీ మాత కు పతి, అన్ని మంగళములకు ఈశ్వరుడవు ఐన నీకు నమస్కారము. ఓ ప్రభూ! సర్వమునకూ ఈశ్వరుడవైన వాడా! నీవు స్తోత్ర ప్రియుడవు, కాని నాకు స్తోత్రము చేయుట కూడా రాదు. హే సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై నా యందు అపార కృపతో నన్ను రక్షింపుము.
{శివ ఉవాచ:-
వరం బ్రూహి ప్రసన్నోహం మయ దానవసత్తమ! మనోభిలషితం యత్తే తద్దాస్యామి న
సంశయః!!
ఓ రాక్షస శ్రేష్ఠా ! మయా! నీ యందు ప్రసన్నుడనైతిని, నీ మనస్సుకు నచ్చిన
వరము కోరుకొనుము, సంశయము లేకుండ ఇచ్చెదను}
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ ప్రసన్నోయది మే భవాన్!
వరయోగ్యోస్మ్యహం చేద్ధి స్వభక్తిం దేహి శాశ్వతీమ్!!
స్వభక్తేషు సదా సఖ్యం దీనేషు చ దయాం సదా!
ఉపేక్షా మన్యజీవేషు ఖలేషు పరమేశ్వర!!
కదాపి నాసురో భావో భవేన్మమ మహేశ్వర!
నిర్భయస్స్యాం సదా నాథ మగ్నస్త్వద్భజనే శుభే!!
దేవ దేవా! మహాదేవా! నీవు నాయందు ప్రసన్నుడవతివేని, నేను వరమునకు
అర్హుడైనచో, నాకు నీయంది శాశ్వత భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. నీ
భక్తులతో మైత్రిని సత్సంగమును, దీనుల యందు దయను, ఇతర ప్రాణులయందును
దుష్టులయందును ఉపేక్షాభావమును కలిగించుము. హే పరమేశ్వరా! నాకు ఎన్నటికీ
ఆసురీ భావములు కలుగకుండుగాక. హే మహేశా! నేను సర్వదా మంగళకరమగు నీ నామ భజనము యందే నిమగ్నుడనై భయము లేక ఉండు వరమిమ్ము.
శివ ఉవాచ:-
దానవర్షభ ధన్యస్త్వం మద్భక్తో నిర్వికారవాన్!
ప్రదత్తాస్తే వరాస్సర్వేభీప్సితాయే తవాధునా!!
రాక్షస శ్రేష్ఠా! నీవు కోరిన వరములచే నా భక్తుడవగు నీవు ధన్యుడ వైనావు.
నీవు కోరిన వరములనిచ్చితిని.

No comments:

Post a Comment