Pages

Sunday, February 27, 2011

ధర్మం

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
సత్సంగము కుటుంబీకులందరికీ నమస్కారం
 
"యతో అభ్యుదాయ నిశ్రేయ ససిద్ధిః స ధర్మః " ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమో లేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం.
ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది. మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలాను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం.
ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం
.
నేను నాగురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా
తలి దండ్రుల దగ్గర పుత్ర ధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృ
ధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశి నాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్ని మాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు అదేబ్రహ్మచారి వివాహం
చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ...
ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పు
చెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటే
ఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానీ
సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం.
అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్శ్మాలు
తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.


నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు.

ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులే తత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాజ్ఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న
రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం
ఎక్కిమ్చుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది.
ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేధించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతా
చార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది.
బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానే
గృహస్థు గృహస్థు ధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని
సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని
అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో)

No comments:

Post a Comment