Pages

Friday, September 28, 2018

శంబుక వధ (శంబూక వధ) ప్రామాణికత విచారణ


శ్రీ గురుభ్యోనమః

శ్రీరాముడు శంబుకుణ్ణి వధించాడా? అది ప్రక్షిప్తమా లేక నిజమా ? అసలు త్రేతాయుగంలో శ్రీరామాయణ కాలంలో శూద్రులు తపస్సు చేయుట నింద్యమా లేక శ్రీరాముని ప్రాభవాన్ని తగ్గించడానికి జరిగిన సాహిత్య సంకరంలో భాగమా? ఎవరికి వారు ఈ విశేషాలను చదువుకొని శ్రీ రామాయణం సాంతం చదివి వాల్మీకి హృదయాన్ని, శ్రీరాముని నడతను పరిశీలించి తెలుసుకోదగును.


శ్రీ రామాయణం అయోధ్య కాండ 63-64 సర్గలు

దశరథుని వలన పొరపాటున మరణించిన మునికుమారుడు (శ్రవణ కుమారుడు)

కడవలో నీటిని నింపుతున్నది ముని బాలకుడని తెలియక ఏనుగు నీరు తాగుతున్నదనుకొని చూడకుండా శబ్దబేధి ద్వారా బాణాన్ని దశరథుడు సంధిస్తాడు. దశరథుడు వేసిన బాణము ఆ ముని బాలకుని శరీరంలో దిగి ప్రాణములను పోనీయక అడ్డుపడి భయంకరమైన వ్యథకు గురిచేయుచుండగా, ఆ ముని బాలకుడు దశరథుని ఈ బాణం ములుకు మర్మావయవములు బాధించుచు ప్రాణము పోకుండా అడ్డు పడుతున్నది కాబట్టి బాణం తీసి వేయమని కోరతాడు. బాణం తీస్తే మునిబాలకుడు చనిపోతాడు తీయకపోతే బాధతో విలవిలలాడతున్నాడు పైగా తాపసి, ముని బాలకుడు అని సంశయిస్తూ దుఃఖిస్తుండగా, అతి కష్టంమీద మరణమంచున నున్న ఆ ముని బాలకుడు బలాన్ని ప్రొది చేసుకొని ఇలా చెప్తాడు.

సంస్తభ్య శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహమ్,
బ్రహ్మ హత్యాకృతం పాపం హృదయాదపనీయతామ్

నద్విజాతిరహం రాజన్ మా భూత్తే మనసో వ్యథా,
శూద్రాయామాస్మి వైశ్యేన జాతో జనపదాధిప!

నేను ధైర్యముతో మృత్యు శోకాన్ని  దిగమింగి అణగద్రొక్కి స్థిరచిత్తుడనౌతున్నాను. నీవు బ్రహ్మహత్యాపాతకము చేసానేమో అని భయపడకుము.  ఓ రాజా! నేను ద్విజుడను కాను, నీవు మనస్సులో బాధపడకు. నేను శూద్రస్త్రీయందు జన్మించిన వాడను. కాబట్టి ఈ బాణముని తొలగించి నాబాధను తీర్చు అని చెప్తాడు. అప్పుడు దశరథుడు ఆ బాణం ములుకు తీయగా ఆ తపోధనుడైన మునిబాలకుడు దశరథుని వైపు చూస్తూ ప్రాణాలు విడుస్తాడు.

ఆ విషయం దశరథుడు వెళ్ళి ఆ ముని బాలకుల తల్లిదండ్రులకి విన్నవించి మన్నింపు కోరి ఏం చేయాలో ఆజ్ఞాపించమని అడుగుతాడు. అప్పుడు ఆమునీశ్వరుడి మాటలు..

సప్తధా తు ఫలేన్మూర్థా మునౌ తపసి తిష్ఠతి,
జ్ఞానాద్విసృజతః శస్త్రం తాదృశే బ్రహ్మచారిణే!

తపస్సులోనున్న మునిపైగాని, అట్టి బ్రహ్మచారిపైగాని తెలిసి ఆయుధాన్ని ప్రయోగించినవాని శిరస్సు ఏడుముక్కలౌతుంది.  నువ్వు తెలియక చేసావు కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నావు. లేకపోతే నువ్వేమిటి నీ ఇక్ష్వాకు వంశమే నశించేది. ఆ తరవాత ఆ మునిబాలకుడు (నద్విజుడు) బ్రతికుండగా తల్లిదండ్రులకు అగ్నికార్యములో సహకరించుట, వేదవాఙ్మయము పారాయణ చేసి వినిపించుట, తపస్సుకు సహకరించుట ఇట్లా అన్ని విషయాలు ఆ తాపసి జంట  వివరించి, దశరథునిపై కోపగించి పుత్రశోకంతోనే మరణిస్తావని శాపమిస్తారు. ఇక్కడ ఆ తాపసి జంట అంటే వైశ్య పురుషుడు, శూద్ర స్త్రీ ఇద్దరూ తపస్సు చేస్తున్నవారే.

---------------
దీన్నిబట్టి ఆకాలంలో శూద్రులే కాదు, స్త్రీలూ, శూద్ర స్త్రీలు, వర్ణసంకరమున జనించినవారు కూడా ముని వృత్తినవలింబించారనీ, తాపసులైనారనీ తెలుస్తున్నది. ఆ కాలంలో శూద్రులకు తపస్సు లేదన్న విషయము ప్రక్షిప్తము, పైగా తాపసిని తెలిసి తెలిసి సంహరిస్తే లేదా ఆయుధమెత్తితే తల ఏడు ముక్కలౌతుందని స్పష్టంగా చెప్పబడింది. అంతే కాదు తెలిసి తెలిసి అలాంటి పని చేస్తే తానేకాదు వంశం మొత్తం నాశనమౌతుందని తాపసి వాక్కు.

తన తండ్రికాలంలోనే అలా జరిగిన సందర్భమున్న సమయంలో అటువంటి ముని శ్రేష్టులు నివసిస్తున్న రాజ్యంలో రాముడు ఇలాంటి అకృత్యానికి ఒడిగడతాడా? బ్రాహ్మణులు,  రాజ గురువులకు ఆ కాలంలో ఇలా అందరూ తపస్సు చేసుకుంటూండేవారన్న ఈ విషయం తెలియదనుకోగలమా. అప్పుడు సమాజం కలిసే ఉంది అందరూ చక్కగా ధర్మవర్తనంతో నాలుగు వర్ణాల ధర్మాలనూ, నాలుగు ఆశ్రమ ధర్మాలనూ పాటించేవారు. తాపసులజోలికెవరూ వెళ్ళేవారు కారు. వారికుచితమైన గౌరవమున్నది.

స్వయం రాముడే అరణ్యకాండలో తాపసులకి రక్షణగా ఉండి వారినిబ్బందిపెట్టేవారిని దునుమాడుతానని ప్రతిజ్ఞచేసాడు. అలాంటి వాడు ఒక తాపసిని హతమార్చడం అసంభవం. నిజంగా హతమార్చి ఉంటే, ఆ ఘట్టంలోనే, దశరథుని చేతిలో హతమైన ముని కుమారుని తల్లిదండ్రులగు తాపసుల మాటల ప్రమాణంగా శ్రీరాముని తల ముక్కలయ్యేది ఇక్ష్వాకు వంశం నశించేది (శ్రీ రామా భద్రం తే!)

ఇక అరణ్యకాండ చూద్దాం... ‍6, 9 &10 సర్గలు

దణ్డకారణ్యంలో మునులు తమను రాక్షసుల బారినుండి రక్షించమని కోరితే, తాపసులు ఆజ్ఞాపించవలెను కానీ కోరకూడదు, తాపసులను ఇబ్బంది పెట్టే రాక్షసులను నేనూ నా తమ్ముడూ సంహరించి వారిని కాపాడెదము అని ప్రమాణం చేస్తాడు (6)

సీతమ్మ రామునితో నీ ఇంద్రియాలు నీ అధీనంలోనే ఉన్నవి అని తెలుసు, కానీ ఏ వైరమూ లేకుండానే దణ్డకారణ్యంలో ఉన్న ఋషుల రక్షణ కొరకై వారినిబ్బందిపెట్టురాక్షసులను మనకు ప్రత్యక్షంగా ఏ అపకారమూ చేయకున్నా దునుముతానని ప్రతిజ్ఞ చేసావు అని తన బెంగను వ్యక్త పరుస్తుంది. (9) 

అప్పుడు శ్రీరాముడు తాను దండకారణ్యములోని ఋషులకి ఇచ్చిన మాటను చెప్పి, నేను ఇక్కడి తాపసులను నాపాలనలో రక్షించి తీరుతాను దీనికి వ్యతిరేకంగా చేయలేను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ ఇచ్చిన మాటకే కట్టుబడి తాపసులను రక్షిస్తాను తప్ప దానికి వ్యతిరేకంగా ప్రవర్తించను.

సీతా! విను, 
తదవశ్యం మయా కార్యమృషీణాం పరిపాలనమ్, 
అనుక్తేనాపి వైదేహి ప్రతిజ్ఞాయ తు కిం పునః. 
ఋషులు, తాపసులు అడగకపోయినా వారిని రక్షించి పరిపాలనము చేయవలెను, ఇక ప్రతిజ్ఞ చేసిన నేను అందుకు వ్యతిరిక్తముగా చేయగలనా అని పలుకుతాడు. (10)
(శంకరకింకర)

సరే, మరో దృష్టాంతం చూద్దాం, అరణ్యకాండలోనే 73, 74 సర్గలు

కబంధుడు మతంగముని ఆశ్రమము గురించి చెప్పుచూ అందరూ ఊర్ధ్వలోకాలకేగారు వాళ్ళ పరిచారిణి, శ్రమణి (సన్యాసిని, తపస్విని) ఐన శబరి నీకు ఆతిథ్యమివ్వగలదు అని చెప్తాడు. శాబర జాతికి చెందిన స్త్రీ మతంగ మునిని,  సేవించి ఆయన పరివారంతో కలిసి తపస్సు చేసి సిద్ధిపొందుటకు శ్రీ రాముని దర్శనానికై ఎదురుచూస్తుంటుంది. శ్రీరాముడు,  శబరిని కలిసినప్పుడు, ఆతిథ్యం స్వీకరించిన సమయంలో వారి సంభాషణ చూద్దాం!

పాద్యమాచమనీయం చ సర్వం ప్రాదాద్యథావిధి,
తామువాచ తతో రామః శ్రమణీం సంశితవ్రతామ్!
కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః,
కచ్చిత్తే నియతః క్రోధ ఆహారశ్చ తపోధనే!
కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖమ్,
కచ్చిత్తే గురుశుశ్రూషా సఫలా చారుభాషిణి!!

శబరి ఇచ్చిన పాద్యాచమనాదులు యథాశాస్త్రంగా స్వీకరించిన తరవాత, రాముడు తీవ్రమైన వ్రతనియములు పాటించుచూ, "తపస్సు చేయుచున్న ఆ తపస్విని", సన్యాసిని ఐన  శబరి (శాబర స్త్రీ) తో మాట్లాడుతూ " ఓ తాపసురాలా!  నీ తపస్సునకు విఘ్నములేవీ కలుగుటలేవు కదా? నీ తపస్సు వృద్ధి పొందుతున్నదా? నీవు క్రోధమును నిగ్రహించుకొన్నావు కదా? ఆహార నియమాదులందు కూడా నిగ్రహము పొందినావు కదా? చక్కగా మాట్లాడే ఓ శబరీ! నీవు కృచ్చచాంద్రాయణాది నియమములన్నీ పూర్తి చేసుకొన్నావా? నీ మనస్సుకు సుఖము కలిగినదా? నీవు చేసిన గురు శుశ్రూష సఫలమైందా?" అని అడగగా ప్రత్యుత్తరము ఇస్తూన శబరి మాటలు శబరి గురించి మూలంలో ఇలా ఉన్నవి...

రామేణ తాపసీ పృష్టా సా సిద్ధా సిద్ధసంమతా
శశంస శబరీ వృద్ధా రామాయ ప్రత్యవస్థితా!
అద్య ప్రాప్తా తపఃసిద్ధిస్తవ సందర్శనాన్మయా
అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితాః!

తపస్సంపన్నురాలు, తపస్సిద్ధి పొందినది , తపస్సిద్ధిసంపన్నుల గౌరవము పొందినది, వృద్ధురాలు ఐన ఆ శాబర స్త్రీ రాముని మాటలు విని అతని ముందు నిల్చొని,  ఈనాడు నేను చేసిన తపస్సు సిద్ధిపొందినది, నేను చేసిన గురు శుశ్రూష కూడా సఫలములైనవి అని బదులిస్తుంది.

------------

సత్యవాక్పాలకుడైన శ్రీరాముడు, దణ్డకారణ్యంలో ఉండే అందరు ఋషులు తాపసులను రక్షిస్తానని, వారడగకుండానే వారిని రక్షించవలెనని కానీ ప్రతిజ్ఞాబద్ధుడైనందున తాపసులను రక్షించుట అను విషయమునుండి వెనుకకు మరలననీ రాముడు ఒకటీకి రెండూమాట్లు చెప్తాడు అది రాముని స్వభావం.

అలానే, అరణ్య కాండ చివర్లో మతంగముని ఆశ్రమంలో ఉండే సేవకురాలు, శాబరజాతి స్త్రీ ఐన శబరి సన్యాసియై తాపసియై గురుశుశ్రూష చేసి, తోటి తపస్వులచేత కలిసి ఎన్నియో వ్రతములు, తపస్సులు చేసి సిద్ధిపొందినది, ఆమె క్షేమమును, ఆమె తపస్సిద్ధిని విచారించి ఆతిథ్యం స్వీకరించిన శ్రీ రాముడు తపస్సు కొన్ని వర్ణాలవారికే పరిమితము కొన్ని వర్ణాలవారు తపస్సు చేయరాదు అను నిర్ణయమును అంగీకరించి అమలు పరచునా? లేక మతంగ ముని మరియు ఆయన ఆశ్రమములో ఉండు ఇతర మహర్షులందరూ దణ్డకారణ్యములో ఇతర ఋషులు కొన్ని వర్ణాలవారే తపస్సు చేయవలెనని నిర్ణయించగలరా. నిర్ణయించిన శబరి ఆసమయములో తపస్వినియై శ్రమణియై ఎట్లు జీవనము కొనసాగించగలదు?


ఈ విషయములు విచారణ చేస్తే, శ్రీ రాముడు తరువాతి కాలంలో దణ్డకారణ్యంలో చెట్టుకు వేలాడి తపస్సు చేస్తున్న తాపసిని ఖడ్గ ప్రహారం చేసి చంపెను అని అనడం కానీ, తమను రాక్షసులనుండి రక్షించమని కోరుకున్న బ్రహ్మర్షియైన వశిష్ఠుడు, ఇతర ఋషులు, బ్రాహ్మణులు మరొక తాపసిని చంపమని చెప్పడం కానీ కుదిరే పనేనా?  దాన్ని రాముడంగీకరించునా.  రామాయణాన్ని చిన్నబుచ్చితే, రాముణ్ణి చిన్నబుచ్చితే బ్రాహ్మణులను, బ్రాహ్మణ్యాన్ని చిన్నబుచ్చడమనే సంకుచిత భావంతో రామాయణ ద్వేషంతో , వైదిక ధర్మ ద్వేషంతో చేర్చిన ప్రక్షిప్త గాథ అని తెలియడంలేదూ! అదేదో బ్రాహ్మణులు రాముణ్ణి నిలదీసినట్లూ, అదీ తాపసి, బ్రహ్మర్షివశిష్ఠుడు ,  ఒక శూద్రుడు తపస్సు చేస్తుంటే చంపమంటాడా? ఇది బ్రాహ్మణులకు, ఋషులకు అంటగట్టి, ఆపై శ్రీరాముడిచేత చంపించారు అని ప్రక్షిప్తం చేసి రామాయణం మీద, రాముడిమీద, బ్రాహ్మణవర్ణం మీద సనాతన ధర్మం మీద విషం కక్కడం ఎంత అమానుషం, ఎంత అవివేకం.

శ్రీ రామ జయం
బలం విష్ణోః ప్రవర్థతామ్ (౩)

(శంకరకింకర)


Tuesday, July 17, 2018

భర్తకన్నా తనకు నచ్చినదేదో కావాలనుకుని

(రామాయణం సనాతనం జీవన కావ్యం, సదా అధునాతనం..... ఇప్పటికీ ఎప్పటికీ మన జీవితాలకెప్పుడూ అన్వయం.)
భర్త కన్నా మనసుకి నచ్చినదాన్నే కావాలనుకున్నాను. ఆకోరికయే మొదట మానసికంగా ఆతరవాత శారీరకంగా భర్తనుండి విడదీసింది...........


సీతమ్మంటుంది నాకు కాలమే మృగం రూపంలో వచ్చి నన్ను లోభ పెట్టింది లేకపోతే నన్ను ఇన్నాళ్ళు నా భర్త చాలు. నాకు ఇంకేమీ అక్కరలేదనుకుని ఐశ్వర్యమే వదిలేసినదాన్ని, అంతఃపురమే వదిలేసినదాన్ని, పరిజనాన్ని వదిలేసినదాన్ని బంధుజనాన్ని వదిలేసినదాన్ని, అత్తమామలను వదిలేసినదాన్ని, లక్ష్మణ స్వామి వద్దువదినా... నా మాట వినూ అని అది మారీచుడూ అని స్పష్టంగా చెప్తున్నా.. ఇప్పుడు కాకపోతే రేప్పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తరువాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందని చెప్పి బంగారు మృగం మీరు ప్రాణాలతోనైనా తీసుకురండి చంపైనా తీసుకురండి అని ఎందుకు పంపించినట్లు? అంటే కాలము నన్ను లోభ పెట్టింది.

 
భర్త తప్ప అన్యం కోరని నన్ను భర్త మరిది వద్దంటున్నా వినకపోవడం వల్ల, భర్త తప్ప దేన్నీ కోరని నామనసు భర్తకన్నా వేరొకదానిని కోరింది. భర్త మరిది వద్దన్నా వాళ్లకన్నా ఆ మృగమే ఆకర్షించింది. భర్త ముఖ్యమా నన్ను ఆకర్షించిన మృగం ముఖ్యమా అని విచారణ చేసి ఉంటే నేను రాముని దగ్గరే ఉండేదానిని. భర్తయే కావాలనుకున్న నాళ్ళు సుఖంగా రాముడివద్దనే ఉన్నాను, లక్ష్మణుడు చెప్తున్నప్పటికీ భర్త క్షేమంకన్నా, భర్త కన్నా మనసుకి నచ్చినదాన్నే కావాలనుకున్నాను. ఆకోరికయే మొదట మానసికంగా ఆతరవాత శారీరకంగా భర్తనుండి విడదీసింది. ఈ కష్టాన్ని అనుభవింపజేయడానికే నా భర్తకన్నా మృగంమీద ఆసక్తి కలిగింది కాలం బలవత్తరమైనది. - సుందరకాండ

-శంకరకింకర

Wednesday, July 11, 2018

రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు

దుస్తర్కాత్ సువిరమ్యతాం...

నలుగురి మధ్యలో చర్చ.. కుతర్కం ఎగేసుకుంటూ వెళ్ళడం. వద్దయ్యా అంటే మన వాయిస్ ఉండద్దా అని తిరిగి సుద్ధులు, సాధించిందేమిరా అంటే... వ్యక్తిగత దూషణలు ఆపై దైవ దూషణలు, నలుగురి మధ్య వైరం సమాజ పరం చేయడం అంటే ఇదే.  ఇప్పటికైనా పండితులు, విజ్ఞులు కుతర్కాలకెందుకెళ్ళరంటే ఇందుకే అని అవగతమవాలి. అవతలవాడోటంటాడు ఇవతలి వాడు తన ప్రశాంతతని కోల్పోయి ఇంకో రెండంటాడు అక్కణ్ణుంచి ఇలాంటి గొడవలు. లేకపోతే వీళ్ళకన్నా పండితులు లేరనా, వీళ్ళేమైనా శాస్త్రార్థాలలో ప్రతివాదభయంకరులనా. కుతర్కం కూడదు అని శంకరులు ఘాట్టిగా వక్కాణించినదిందుకే.


రాముడు రాముడని గోలకాదు వ్యక్తిగత వైరం వస్తే ముందు లోకాలన్నింటినీ తన బాణాలతో కప్పి లయం చేస్తానన్న రాముడే లక్ష్మణుడిమాటతో ఊరడిల్లి, నా వైరాన్ని లోకానికి కీడుగా మార్చను అని చెప్తాడు. అలా కాదనుకుంటే తన వ్యక్తిగత వైరంకోసం క్షణంలో సీతమ్మనెత్తుకెళ్ళిన వాడితో సహా లోకాలను లయం చేసి ఉండేవాడు. పండితుడు ధార్మికుడు లోకాన్ని స్థంభింపజేయటానికో, అతలాకుతలం చేయటానికి తన శక్తినుపయోగించడు. శాంతిని పంచడానికుపయోగిస్తాడు. అందుకే రాముణ్ణి పండితుడంటారు, సాధుపుంగవుడంటారు.


రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు, రాముడి నడతను అంటే రాముణ్ణి చదవడం.  రాముణ్ణి జీర్ణించుకోవడం.

-శంకరకింకర.

Thursday, April 19, 2018

చందన వృక్షం - సర్పభయం

అడవిలో చందన, చంపక వృక్షాలు గొప్పనైనవి. కానీ సాధు జీవులు దాని దరికి చేరలేరు. కారణం చందన వృక్షాల మొదళ్లలో చిత్తడికి చల్లదనం కోసం బ్రహ్మాండమైన జాతి సర్పాలు చుట్టుకొని ఉంటాయి. జీవితంలో దేన్ని చేరదీసావు, దేన్ని దూరం చేస్కున్నావు అన్నది చాలా ముఖ్యమైన విషయం.

- శంకరకింకర

Monday, December 18, 2017

తెలుగు సభల నిర్వహణ


ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా.....
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

...

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

....


తెలుగు సభల నిర్వహణ అమోఘం. ఐతే ఇంతకుముందు ప్రభుత సాయంతో నడిచేవి ఇప్పుడు ప్రభుతే నడుపుతోంది. నా వూళ్ళో వేడుక చేస్తే నా వూరి ప్రత్యేకతలని ప్రత్యేకంగా చూపించడం ఏ మాత్రం తప్పు కాదు. అలా అని పూర్వ పెద్దలను విస్మరించకూడదు కదా! ఆ చిన్న మచ్చ ఈ చంద్రునిమీద తప్పలేదు. తెలుగులో అనువదింపబడ్డ అతిపెద్ద ఇతిహాసం కవిత్రయ భారతం
, భారతం అనే గారెలు లేని తెలుగు భోజనం రుచించదు కదా, తిరుపతి లడ్డూ ఐన అన్నమయ పదాల స్మరణ విస్మరణ.. త్యాగయ్య వారి పాయస తియ్యందనాలు లేవు. విశ్వనాథవారి బొబ్బట్లు కనపడట్లేదు.. అష్ట దిగ్గజాల ఆధరువులేవీ? ఇలాంటివే అక్కడక్కడా కించిత్ విస్మరింపబడిన దోషాలు. ఇవి ఖచ్చితంగా తెలుగు సభలే ఏ అనుమానమూ లేదు.... కానీ ఇవి మా ప్రాంత తెలుగు సభలు, ప్రపంచ సభల అనిపించుకునే స్థాయిని కలుపుకోలుతనం లోపించడం వల్లనూ.. చిన్న చిన్న పొరపాట్ల వల్ల నా దృష్టిలో కోల్పోయాయి.. 


ఎవరైనా గతంలో ఈప్రాంత కవులు కవయిత్రులు సాహిత్యం వివక్షకి గురైంది కాబట్టి ఇలా ఇప్పుడు చేసుకుంటున్నాం అంటే ఆ సమర్థన సరికాదు. ఆ వివక్షకి సమాధానమే విభజన. విభజన ఐపోయిన చరిత్ర. ఇప్పుడు కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్తగా భాషకి సాహిత్యానికి, కవులు కళాకారులకు మళ్ళీ కొత్తగా విభజన అంటించద్దు అని నా బోటి కొత్తతరపు వారి ఆవేదన. రాజకీయాలకతీతంగా జరగాల్సిన ప్రపంచ సభలు, ఇంత గొప్ప నిర్వహణ ప్రాంతీయ సభలైయ్యాయన్నదే ఆవేదన.

అధికారికంగా సభల నిర్వహణనెత్తుకున్న ప్రభుతను శ్లాఘిస్తున్నాను. కానీ ప్రభుత్వం రాజకీయం సమ్మిళితమై రాజ్యంచేస్తున్నవన్నది సత్యం. ప్రభుత్వంగా చేయాల్సిన ఆలోచనలను రాజకీయపు ఆలోచనలు అధిగమించాయి అన్నదీ తేటతెల్లమైంది "అది ఇరువేపులా.."


అందుకే, ఇకపై ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణకి రాజకీయాలకతీతంగా ఒక ప్రత్యేక నిర్వహణ సంస్థ ఏర్పడాలి. రాజకీయాలకతీతంగానే సభానిర్వహణలుండాలి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, సభానిర్వహణ ఏర్పాట్లలో తోడ్పాటువరకే ప్రభుత నియంత్రింపబడాలి. తెలుగువారు కేవలం ఆంధ్ర తెలంగాణయే కాదు.. ఒరిస్సా, తమిళ, కన్నడ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, అండమాన్ ఇత్యాది రాష్ట్రాల్లోనూ ఉన్నారు... ఇవి సాహిత్య కారులు, కవులు, కళాకారులు నిర్వహించుకునే , నిర్వహించుకోవాల్సిన సభలు.


నా వ్యాసం వ్యక్తిగత, రాజకీయాతీతం. ఇంతకుముందు వరకూ జరిగిన రీతిలోనే ఇప్పుడూ జరిగాయి. ఎప్పుడూ ఒక ప్రాంతానికే పెద్ద పీట వేయబడ్డది.. నేటితో కలిపి. రేపైనా మారాలి! తెలుగు భాషకి, తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు పట్టాభిషేకం జరగాలి. ప్రాంతాలకికాదు.


తెలుగు వేర్లు ఐతే, తెలుగు జాతి కాండం, ఈ రెండూ కాపాడబడితేనే.. యాస- సాహిత్యం - కళలు - ప్రాంతాలు అనే కొమ్మలు - రెమ్మలు - ఆకులు + పువ్వులు - కాయలు - పళ్ళు బాగుంటాయి...


వీటిలో రాజకీయం, సినిమా కలరింగు రెండూ దూరకుండా భవిష్యత్తు సభలు "ప్రపంచ" సభలుగా నిర్వహించబడాలని కోరుకుంటూ... 

సినారె వారి గీతం పాడుకుంటూ..

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ నాది
రాయలసీమ నాది
సర్కారు నాది
నెల్లూరు నాది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా
మన అంతరంగ మొకటేనన్న
యాసలు వేరుగవున్న
మన భాష తెలుగు భాషన్న

వచ్చిండన్న వచ్చారన్న
వరాల తెలుగు ఒకటేనన్న

మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో
భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో
ఈ రెంటిలోన ఏదికాదన్న
ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది
నాగార్జునసాగరమేవరిది
మూడు కొండ్రలూ కలిసి దున్నిన
ముక్కరు పంటలు బండ్లకెత్తిన
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది.
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్‌కి జై
గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము

దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము
ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా
కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా
పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు

తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

తెలంగాణ మనది
రాయలసీమ మనది
సర్కారు మనది
నెల్లూరు మనది

అన్నీ కలసిన తెలుగునాడు
మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది

~~~~~~~~~~

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. 

అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!

-
శంకరకింకర

Thursday, October 26, 2017

నైతికత బాధ్యత చట్టానిది కాదు న్యాయానిది కాదు

రాజ్యాంగ కర్తలు రాజ్యాంగ నిర్మాణంలో చేసిన పెద్దలోపం, వారు విస్మరించిన విషయం ఏమిటో మొన్న హానరబుల్ జస్టిస్ మిశ్రా తీర్పులో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. భౌతికమూ లౌకికమూ ఐన న్యాయాన్యాయాల విషయంలో ఈ రాజ్యాంగాన్ననుసరించే చట్టాలు పనిచేస్తాయికాని, మనిషిని మనిషిగా నిలిపే నైతికత విషయంలో ఇదేమీ చేయజాలదు. అవి చిన్నప్పుడే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించాలి. తెలిసో తెలీకో హానరబుల్ జడ్జి గారు ఈ అనవసర కామెంట్ (సిక్యులర్ల సెల్ఫ్ గోల్) ఓ విధంగా మంచిపనే చేశారు.


ఉన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి, పిల్లలకి చిన్నపటినుండే శ్రీ రామాయణ భారత భాగవతాది కావ్యాలు, వాటిలోని సారమైన సత్య- ధర్మాదులు, నిబద్ధత, నీతి - నియమాలు, మానవీయత - సామాజిక కర్తవ్యం - ధార్మిక జీవనం, భర్తృహరి నీతి శాస్త్రం, పంచతంత్ర కథలు అందులోని నీతి, నైతికత ఇవి పిల్లలకి ఇంట్లో నేర్పించండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు కనీసం ప్రతివారం వారానికి రెండురోజులు తమ పీరియడ్లలో ఒక్క ఐదేసి నిమిషాలలో ఒక నీతి విషయం బోధించండి. ఈ చట్టాలు, రాజ్యాంగం త్రీస్టేట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నీతి నైతికత బోధించలేవని హాన్రబుల్ జస్టిస్ మిశ్రా జాతీయ గీతం గురించిన తమ తీర్పులో స్పష్టం చేశారు.


సనాతన ఆర్ష వాజ్ఞమయమా వర్థిల్లు ! జయ జయ!!
-శంకరకింకర

Monday, October 23, 2017

ఆష్టవిధం బ్రాహ్మణ్యం


శ్రీ గురుభ్యోనమః


"మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్
అనూచానః తథాభౄణః ఋషికల్పః ఋషిర్మునిః"
బ్రాహ్మణ్యం ఎనిమిది రకాలు దీనినే ఆష్టవిధం బ్రాహ్మణ్యం అంటారు,

1)బ్రాహ్మణోదరేజాతః అనుపనీతః క్రియాశున్యతం, జాతి మాత్రేణ మాత్రః
’మాత్ర’కుడు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, ఉపనయనం జరగనివాడు, సరియైన సమయంలో ఉపనయనం జరగని కారణం చేత సంధ్యావందనాది నిత్య కర్మలను చేయని కారణాన క్రియా శూన్యుడు, కేవలం జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడుగా తెలియబడేవాడు / లేదా పుట్టుకవలన మాత్రమే బ్రాహ్మణుడుగా తెలియబడుతున్నవాడు.

2) సంస్కారేణ సంస్కృతః ద్విజముచ్యతే - పైన తెలిపిన బ్రాహ్మణుడు ఉపనయన సంస్కారముతో సహా అప్పటి వరకు అన్ని సంస్కారములను శాస్త్రోక్తంగా నిర్వహించి సంస్కరింబడినందున, ఉపనయనానంతరము రెండవజన్మగా సంస్కరింపబడినవాడగుట వలన ద్విజుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు.

3)జన్మ సంస్కార విద్యాభి త్రిభః శ్రోత్రియః - పైన తెలిపిన రెండు విధములైన బ్రాహ్మణత్వమును పొంది వేదవిద్యను (శ్రుతిని చదువుకున్నవాడు) పొందిన తరవాత శ్రోత్రియుడుగా బ్రాహ్మణుడు తెలియబడుతున్నాడు, ఆతరవాతనే

4)వేదవేదాంగ తత్వజ్ఞః శుద్ధాత్మా, పాపవర్జితః, శ్రేష్ఠః ప్రాజ్ఞ అనూచానః - శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు వేదాలను ఉపాంగాలతో సహా నేర్చుకొని, అందులోని తత్త్వాన్ని తెలుసుకొని, నిర్మలమైన ఆత్మ కలవాడైనందువల్ల పాపములు లేనివాడై, అందరికీ శ్రేష్ఠుడై, ప్రాజ్ఞతను పొందినబ్రాహ్మణుడు అనూచానుడని తెలియబడుతున్నాడు.

5)అనూచానః, యజ్ఞస్వాధ్యాయ యంత్రతః భౄణః - అనూచానుడై, యజ్ఞములను స్వాధ్యాయములను దాటనివాడు భౄణుడని తెలియబడుతున్నాడు

6)మంత్ర మంత్రార్థ విద్, ప్రాజ్ఞః, వానప్రస్థః, తపస్వీ ఋషిః - మంత్రమును తెలుసుకొని, దాని అర్థాన్ని అది ప్రతిపాదించే తత్త్వాన్ని తెలుసుకొన్నవాడు, ప్రాజ్ఞ్యుడైనవాడు, వాన ప్రస్థాశ్రమమునందుండు వాడు, తపస్సు యందు మక్కువ కలవాడు ఋషి అని తెలియబడుతున్నాడు, వాళ్ళు మంత్ర ద్రష్టలుగా, మంత్రార్థముల ద్రష్టలుగా తెలియబడుతారు.

7.తపసా మానుష్యం అధిక్రాంతం: ఋషులను మామూలు మనుష్యులకన్నా పై స్థాయిలో చూస్తారు, అందుకే దేవతలతో పాటు ఋషులకూ తర్పణలుంటాయి. తపస్సు చేత మనుష్యత్వాన్ని దాటి ఋషిత్వాన్ని పొందుతారు.) ఈ ఋషిలలో మళ్ళీ స్థాయీ బేధాలిలా ఉంటాయి... ఋషి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి.

8)ఆత్మత్వమననాత్ మునిః - ఇవన్నీ దాటి ఆత్మ తత్వమునే మననం చేసే స్థితి కలిగినవాడు ముని అని తెలియబడుతున్నాడు.

ఈవిధంగా "వంశము - జన్మ", "వృత్తము - నడవడిక, చేయవలసిన కర్మలు (కర్మ-గౌణము రెండూ)", "విద్య" ఈ మూడూ ఉన్నవాడు త్రిశుక్లుడను బ్రాహ్మణుడనబడి అ పేర లోకములో గౌరవ మన్ననలను పొందును.
- శంకరకింకర

(మూలం స్కాంద పురాణం)
अथ ब्राह्मणभेदांस्त्वमष्टौ विप्रावधारय ॥
मात्रश्च ब्राह्मणश्चैव श्रोत्रियश्च ततः परम् ।
अनूचानस्तथा भ्रूणो ऋषिकल्प ऋषिर्मुनिः॥
इत्येतेऽष्टौ समुद्दिष्टा ब्राह्मणाः प्रथमं श्रुतौ ।
तेषां परः परः श्रेष्ठो विद्यावृत्तविशेषतः ॥
ब्राह्मणानां कुले जातो जातिमात्रो यदा भवेत् ।
अनुपेतक्रियाहीनो मात्र इत्यभिधीयते ॥
एकोद्देश्यमतिक्राम्य वेदस्याचारवानृजुः ।
स ब्राह्मण इति प्रोक्तो निभृतः सत्यवाग्घृणी ॥
एकां शाखां संकल्पां च षड्भिरङ्गैरधीत्य च ।
षट्कर्मनिरतो विप्रः श्रोत्रियो नाम धर्मवित् ॥
वेदवेदाङ्गतत्वज्ञः शुद्धात्मापापवर्जितः ।
श्रेष्ठः श्रोत्रियवान् प्राज्ञः सोऽनूचान इति स्मृतः ॥
अनूचानगुणोपेतो यज्ञस्वाध्याययन्त्रितः ।
भ्रूण इत्युच्यते शिष्टैः शेषभोजी जितेन्द्रियः ॥
वैदिकं लौकिकं चैव सर्वज्ञानमवाप्य यः ।
आश्रमस्थो वशी नित्यमृषिकल्प इति स्मृतः ॥
ऊर्ध्वरेता भवत्यग्रे नियताशी न संशयी ।
शापानुग्रहयोः शक्तः सत्यसन्धो भवेदृषिः ॥
निवृइत्तः सर्वतत्वज्ञः कामक्रोधविवर्जितः ।
ध्यानस्थो निष्क्रियो दान्तस्तुल्यमृत्काञ्चनो मुनिः ॥
एवमन्वयविद्याभ्यां वृत्तेन च समुच्छ्रिताः ।
त्रिशुक्ला नाम विप्रेन्द्राः पूज्यन्ते सवनादिषुः ॥
(स्कन्दपुराण, माहेश्वर-कुमारिकाखण्ड, 3- 287....298)

అథ బ్రాహ్మణభేదాంస్త్వమష్టౌ విప్రావధారయ !!
మాత్రశ్చ బ్రాహ్మణశ్చైవ శ్రోత్రియశ్చ తతః పరమ్ !
అనూచానస్తథా భ్రూణో ఋషికల్ప ఋషిర్మునిః!!
ఇత్యేతేఽష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణాః ప్రథమం శ్రుతౌ !
తేషాం పరః పరః శ్రేష్ఠో విద్యావృత్తవిశేషతః !!
బ్రాహ్మణానాం కులే జాతో జాతిమాత్రో యదా భవేత్ !
అనుపేతక్రియాహీనో మాత్ర ఇత్యభిధీయతే !!
ఏకోద్దేశ్యమతిక్రామ్య వేదస్యాచారవానృజుః !
స బ్రాహ్మణ ఇతి ప్రోక్తో నిభృతః సత్యవాగ్ఘృణీ !!
ఏకాం శాఖాం సంకల్పాం చ షడ్భిరఙ్గైరధీత్య చ !
షట్కర్మనిరతో విప్రః శ్రోత్రియో నామ ధర్మవిత్ !!
వేదవేదాఙ్గతత్వజ్ఞః శుద్ధాత్మాపాపవర్జితః !
శ్రేష్ఠః శ్రోత్రియవాన్ ప్రాజ్ఞః సోఽనూచాన ఇతి స్మృతః !!
అనూచానగుణోపేతో యజ్ఞస్వాధ్యాయయన్త్రితః !
భ్రూణ ఇత్యుచ్యతే శిష్టైః శేషభోజీ జితేన్ద్రియః !!
వైదికం లౌకికం చైవ సర్వజ్ఞానమవాప్య యః !
ఆశ్రమస్థో వశీ నిత్యమృషికల్ప ఇతి స్మృతః !!
ఊర్ధ్వరేతా భవత్యగ్రే నియతాశీ న సంశయీ !
శాపానుగ్రహయోః శక్తః సత్యసన్ధో భవేదృషిః !!
నివృఇత్తః సర్వతత్వజ్ఞః కామక్రోధవివర్జితః !
ధ్యానస్థో నిష్క్రియో దాన్తస్తుల్యమృత్కాఞ్చనో మునిః !!
ఏవమన్వయవిద్యాభ్యాం వృత్తేన చ సముచ్ఛ్రితాః !
త్రిశుక్లా నామ విప్రేన్ద్రాః పూజ్యన్తే సవనాదిషుః !!
(స్కన్దపురాణం, మాహేశ్వర-కుమారికాఖణ్డం - 03-287-298)
- శంకరకింకర