Pages

Saturday, August 15, 2026

పరమగురువులు శ్రీమదీశ్వరానన్దనాథులు


బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ (1924–2022)


ఆధునిక భారతదేశంలో అద్వైత వేదాంత పరంపరను, సనాతన ధర్మ వైభవాన్ని, శ్రీవిద్యా ఉపాసనా సంప్రదాయాన్ని తన తపస్సు, జ్ఞానం, ఆచరణలతో పరిపుష్టం చేసిన సిద్ధులలో జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ వారు విశిష్ట స్థానాన్ని పొందారు. పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠం మరియు ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠం—ఈ రెండు పీఠాలకు జగద్గురువుగా మార్గదర్శనం చేసిన అరుదైన తపోమూర్తి.



శ్రీవిద్యాపరమానంద-సారథిం వేదసారవిద్ !

ద్వారకాజ్యోతిషాం నాథం స్వరూపానందమాశ్రయే !!


శ్రీవిద్యా పరమానంద స్వరూపులైన, వేదవేదాంత సారాన్ని అవగతం చేసుకున్న తత్వజ్ఞులైన, ద్వారకా శారదా పీఠం మరియు జ్యోతిర్మఠానికి అధిపతులైన పూజ్య జగద్గురు స్వామి స్వరూపానంద సరస్వతీ మహారాజ్ వారి చరణారవిందాలను నేను ఆశ్రయిస్తున్నాను.


జీవిత విశేషాలు – గురు పరంపర

1924లో మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లాకు చెందిన దిఘోరీ గ్రామంలో పోతీరామ్ ఉపాధ్యాయ్ గా జన్మించిన స్వామి స్వరూపానంద సరస్వతీ వారు బాల్యంలోనే  సుమారు తొమ్మిదేళ్ల ప్రాయంలో కాశీకి చేరి వేద, వేదాంత, న్యాయ తదితర శాస్త్రాలను అభ్యసించారు.


1942లో జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, స్వాతంత్ర్య సమరంలో తన వంతు పాత్రను నిర్వర్తించారు. ఈ కారణంగా జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆధ్యాత్మిక సాధనతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అరుదైన సన్యాసిగా ఆయన జీవితం నిలిచింది. క్రాంతికారీ సాధువుగా ప్రసిద్ధి చెందారు.


జ్యోతిర్మఠ పీఠోద్ధారకులైన స్వామి బ్రహ్మానంద సరస్వతీ మహారాజ్ వారి శిష్యరికంలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి, దండసన్యాసాన్ని స్వీకరించారు. అనంతరం ధర్మరక్షణ, వేద పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం వంటి కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ధర్మసమ్రాట్ కరపాత్రి స్వామి వారి దగ్గర శ్రీవిద్యాదీక్ష, వేదాంతం నేర్చుకున్నారు. కరపాత్రి స్వామివారితో ఆయనకు అత్యంత సన్నిహితమైన ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధం ఉండేది, 


స్వామి స్వరూపానంద సరస్వతీ వారు శంకరాచార్య పరంపరలోని శ్రీవిద్యా ఉపాసనా సంప్రదాయానికి విశిష్ట సాధకులుగా ప్రసిద్ధి చెందారు. శ్రీచక్ర నవావరణార్చన, మంత్రోపాసన, అంతర్యాగ భావన వంటి శ్రీవిద్యా సాధనా మార్గాలకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.


గంగాతీర ప్రాంతాల్లోను, నర్మదా పరివాహక ప్రాంతాల్లోని ఏకాంత ప్రదేశాల్లోను దీర్ఘకాలం తపస్సు, మౌనవ్రతం, జపానుష్ఠానాలను ఆచరించిన ఆయన జీవితం కఠోర సాధనకు ప్రతీకగా నిలిచింది. ఆయన భాగవత సప్తాహాన్ని విరివిగా నిర్వహించేవారు. వారు బాహ్య ఆరాధనతో పాటు అంతర్యాగం, ఆత్మసాధన, ధ్యానం శ్రీవిద్యా మార్గంలో అత్యంత ప్రధానమైనవని ఆయన బోధించారు.


పరమహంసీ గంగా ఆశ్రమం – ఝోటేశ్వర్, నరసింహపూర్


మధ్యప్రదేశ్‌లోని నరసింహపూర్ జిల్లా, గొటేగావ్ సమీపంలోని ఝోటేశ్వర్ అరణ్య ప్రాంతం స్వామి స్వరూపానంద సరస్వతీ వారి ప్రధాన తపోభూమిగా చేసుకున్నారు. అది ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆయన పరమహంసీ గంగా ఆశ్రమమాన్ని  ఆధ్యాత్మిక సాధనకు విశిష్ట కేంద్రంగా తీర్చిదిద్దారు.


శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ ఆలయం


శ్రీవిద్యా ఉపాసనకు ప్రధాన క్షేత్రంగా నిలిచే విధంగా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ దేవి ఆలయం నిర్మించబడింది. ఉత్తర, దక్షిణ భారతీయ శిల్పకళా సంప్రదాయాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం శ్రీవిద్యా భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. గర్భగృహంలోని శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ దేవి సన్నిధి, శ్రీచక్రాధిష్ఠాత్రి పరాశక్తి ఆరాధనకు కేంద్రబిందువుగా ఉంది.


రాజరాజేశ్వరీ ఆలయ ప్రాంగణంలో అనేక ఆలయాలుణ్ణయి. ప్రముఖంగా చతుష్షష్టి యోగినిలను ఇక్కడ చూడవచ్చున్


మణిద్వీపం – గురు సరోవరం

శ్రీవిద్యా సంప్రదాయంలో పరాశక్తి యొక్క దివ్య నివాసంగా భావించబడే మణిద్వీప తత్త్వాన్ని స్ఫురింపజేసే విధంగా ఆశ్రమ ప్రాంగణంలో అనేక ఆధ్యాత్మిక నిర్మాణాలు, సాధనా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గురు సరోవరం, శివాలయాలు, దివ్య లింగ ప్రతిష్ఠలు తదితర పవిత్ర ఆలయాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చాయి.


2022 సెప్టెంబర్ 11న పరమహంసీ గంగా ఆశ్రమంలోనే జగద్గురు స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ వారు బ్రహ్మీభావం పొందారు.


వేదవేదాంత పరంపర, అద్వైత తత్త్వజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణ, శ్రీవిద్యా ఉపాసనా వైభవం—ఈ నాలుగు ధారలను తన జీవితంలో సమన్వయపరిచిన మహనీయ తపోధనుడిగా ఆయన స్మరణీయులు.


ఆయన జీవితం కేవలం ఒక సన్యాసి జీవితచరిత్ర మాత్రమే కాదు; గురుభక్తి, తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, దేశభక్తి, శక్తి ఉపాసన సమన్వయమైన ఒక మహత్తర ఆధ్యాత్మిక ప్రస్థానం.


పరమగురువుల పాదపద్మాలకు అనంతకోటి నమస్సులు

No comments:

Post a Comment