Pages

Tuesday, January 22, 2019

యశశ్శరీర హననం


దేశికచరణస్మరణం!

ప్రతి వ్యక్తికీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలుంటాయని సనాతన ధర్మంలో ఉండే ఆస్తికులకు సంబంధించినవారికందరకూ తెలుసు. ఇది కాక స్థూల శరీరంలో ఉన్నప్పుడే మనిషి మరొక శరీరాన్ని తయారు చేసుకుంటాడు. అది తన శీలం వల్ల ఏర్పడుతుంది. శీలం అంటే చారిత్రము, నడవడి అని అర్థం తప్ప సినిమా రచయితల చెత్త అర్థం తీసుకోకండి. ఆ నడవడితోడుగా తనకు ఈశ్వరుడిచ్చిన విభూతిని సమాజ పరం చేసినపుడు యశస్సు కలుగుతుంది. ఆ పరాదేవత ఆ వ్యక్తికిచ్చే మరో శరీరమే యశశ్శరీరం అంటే కీర్తి శరీరం. ఒక వ్యక్తినెలా ఐతే భౌతికంగా ఇబ్బంది పెట్టాలనీ, గాయపరచాలనీ, సంహరించాలనీ ప్రయత్నాలు సాగుతాయో దాని పర్యవసానాలేమిటో, తత్సమానంగా ఈ కీర్తి శరీరాన్ని కూడా ఇబ్బంది పెట్టాలనీ, యశో హననం చేయాలనీ ప్రయత్నాలు సాగుతాయి.

భౌతిక దాడికి హింసకి ఏదో ఒక కారణం, ఒక పగ, ఒక కక్ష వంటివి ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ సుకీర్తి వల్ల ఏర్పడిన యశశ్శరీరాన్ని హింసించడానికీ, హననం చేయడానికీ పెద్దగా ఏకారణమూ ఉండదు. అకారణంగానే యశశ్శరీర హననం చేయాలని చూస్తారు. విచారిస్తే అకారణ అసూయా ద్వేషాలే దీనికి ముఖ్యమైన ప్రాతిపదిక. ఫలానా వ్యక్తిని గౌరవించడమేమిటి? ఎందుకు గౌరవించాలి? నాకిష్టంలేదు. అంతే పెద్దగా ఏ వ్యక్తిగత కారణాలూ ఉండవు. "నాకు" నచ్చలేదు "నేను" గౌరవించను. ఈ "నేను నాకు" అన్న అహం, అందువల్ల పుట్టిన అసూయ, ద్వేషం క్రోధంగా మారి వ్యక్తిత్వ హననానికీ యశోశరీర హననానికీ కారణమౌతుంది. దీనికి లోనైనవాడు ఎంత దిగజారిపోతాడంటే తాను పాడవడమే కాదు, తాను బురదలో కూరుకున్నా సరే, ఆ బురద మరక ఎదుటివాడిమీద చిన్నపిసరైనా అంటించాలని ప్రయత్నిస్తాడు. అలా ఆ ప్రయత్నంలో గోరంత సఫలీకృతమైనా కొండంత వికృతానందాన్ని పొందుతాడు.
నిజమేనా ఇలా యశశ్శరీరం ఉంటుందా? రావణుడికి పట్టినదోషాలలో కేవలం సీతమ్మని ఎత్తుకెళ్లడమే కాదు, రాముడి యశస్సుని తగ్గించి తగ్గించి సీతమ్మ దగ్గర ప్రేలడం కూడా... కర్ణుడు దుష్టుడైనా యశశ్శరీరం ఉంది, రామాయణ, భారత వ్యాఖ్యానాలు చదివితే తెలుస్తుంది. యశశ్శరీరహననం చేయడం చేయాలనుకోవడం మహా మహా పాతకమైన క్రూర చర్య.

మరి ఇలా యశశ్శరీర హననాలు చేయ ప్రయత్నించేవాళ్ళు నిఝంగానే ఉంటారా అని అనుమానమా!?... ఓ కోకొల్లలు.. పరికించి చూడండి... పుట్టలు పుట్టలు బారులు బారులు....

-శంకరకింకర

2 comments:

  1. శంకరకింక‌రార్యా యశోశరీరం కాదండీ యశశ్శరీరం అనటం సరైన పదప్రయోగం.

    ReplyDelete
    Replies
    1. నమోనమః, ఔను, సంధి దోషం కలిగిందండీ.సరిచేసినందుకు ధన్యవాదాలు విసర్గకు శ పరమైనపుడు విసర్గ లుప్తమై శకారమే వస్తుంది. యశశ్శరీరం గా మారుస్తాను.

      Delete