Pages

Tuesday, October 10, 2017

తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు

శ్రీ గురుభ్యోనమః

ఓ ఊళ్ళోకెళ్ళి ఒక తెలిసిన వ్యక్తి ఇంటి గురించి విచారణ చేస్తే అక్కడ "పెద్దమనిషి" తిన్నగా వెళ్లండి రైటు తీస్కోండి లెఫ్టుతీస్కోండి మూడో మలుపు, నాలుగో సందు, ఐదో ఇంట్లో ఉంటారన్నారనుకోండీ. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదీ ఋజువు చూపించు అంటామా? లేదు కదా ! మహా ఐతే మళ్లీ ఆ పేరు రూపు రేఖలు చెప్పి అతనిల్లేనా అండీ? అని అడిగి ఇల్లు వెతుకుతూ బయలుదేరతాం.. అలా కాకుండా ఋజువు చూపించు అప్పుడే వెళతా అని అడిగితే.. కిందాపైనా చూసి నీక్కావాలంటే వెళ్ళి చూస్కో అంటారు లేకపోతే నీకేమైనా పిచ్చా అంటారు, కదా! ఆ యింట్లో మనక్కావలసిన వ్యక్తి ఉన్నాడోలేడో వెతికి చూస్కోవాలసిన అవసరం మనది తప్ప ఆ దారి చెప్పినతనిది కాదు. ఒకవేళ అతను తప్పైనా వెళ్ళి చూసుకుని వెతుక్కోవలసింది మనమే. అప్పటివరకూ పక్కవాణ్ణి, ఆ ఊరి "పెద్దమనిషిని" ఆనూపానూ తెలిసినవాణ్ణి నమ్మాలి, దొరక్క పోతే తిరిగి ఆచోటికి వచ్చి మళ్లీ కావలసిన వ్యక్తి గురించి మరింత వివరంగా అడిగి సరియైన చిరునామా అడిగి వెతికి పట్టుకుని ఆ యింటికి చేరాలి. అది మన పని అతని పని కాదు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఆ "పెద్దమనిషి" ఉదారుడై మన వెంట వచ్చి కావలసిన వ్యక్తి ఇంటి వరకూ వచ్చి చూపగలడు అది అన్ని వేళలా సాధ్యం కాదు. అది అతని ఔదార్యం మాత్రమే.
 
అలాగే, నువ్వొక్క అడుగూ వేయకుండా ఋషుల మాట గురువుల బాట పట్టకుండా ధర్మం మీద శ్రద్ధలేకుండా భగవంతుడు లేడంటే? దేవుడుంటే చూపించు? అని అంటే ఏమనాలి నిన్నప్పుడు? ఆ అవసరం, అగత్యం ఎవరిది? నీది! అంతే తప్ప ఋషులదీ, గురువులదీ ఆ మార్గంలో కుదురుకున్నవాళ్లదీ, భక్తి మార్గంలో వేదాంతారణ్యంలో హేలగా సంచరించేవారిదీ కాదు. ఏమో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఔదార్యంతో అలా చూపవచ్చేమో కోట్లల్లో ఒకరికి. ఆ కోట్లల్లో ఒక్కడివి నువ్వే అనుకోవడం అత్యాశ. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు. అది శంకరుల దుస్తర్కాత్ సువిరమ్యతామ్...

-శంకరకింకర

1 comment:

  1. Devil's disciples like kancha ilaiah cannot see god

    ReplyDelete