Pages

Monday, October 9, 2017

రావణుడి మరణ రహస్యం

శ్రీ గురుభ్యోనమః

విభీషణుడు రావణుడి మరణ రహస్యం రాముడికి చెప్పాడనేది శుద్ధ అబద్ధం. సినిమా రామాయణాలు, నాటక రామాయణాలు పక్కకి పెట్టి మూలమైన వాల్మీకంలో కానీ వ్యాసప్రోక్తంలోకానీ చూస్తే ఆ విషయం లేనే లేదు.. ఒక మానవుడికి బోధించినట్లుగానే గురువైన అగస్త్యుడు వచ్చి ఆదిత్యహృదయ మంత్రాన్ని అస్త్రంగా ప్రయోగించడం నేర్పి దీన్ని ప్రయోగించు రావణుడు హతుడౌతాడు అని దీవించి వెళ్ళారు, రాముడు ఆ మంత్ర ప్రయోగం చేసి రావణుణ్ణి ఒక్కపెట్టులో కూల్చాడు. రాముడి అవతార కారణమైన రెంటిలో ఒకటి రావణ వధ. అది రాముడి వల్ల అవుతుందా అన్న ప్రశ్నే ఉత్పన్నం అవదు. రామావతారం వచ్చిందే అందుకు. రావణుణ్ణి చంపడం ఒక్క రాముడివల్లనే అవుతుంది లేక హనుమవల్లనే అని శ్రీరామాయణం స్పష్టం. ఎవరు ఏమిటో ఏ ఘట్టం ఎలా జరిగిందో రామాయణంలో స్పష్టంగా ఉంటుంది.

అన్నకి సహాయం చేస్తూ తోడుగా ఉంటూ అధర్మాత్ముడైనా ప్రోత్సహిస్తూ అతనిపక్కనుండడమా.. లేక అన్నను విడిచి ధర్మంపక్కనుండడమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ధర్మాత్ములు ధర్మం యెంచుకున్నారు, కుంభకర్ణుడిలాంటివాళ్ళు ధర్మం తెలిసీ ధర్మం కన్నా అధర్మాత్ముడైన అన్న పంచనే ఉండి, ధర్మం కన్నా అన్నే గొప్ప అనుకున్నారు మడిసిపోయారు. 
 
అన్నదమ్ములా - ధర్మమా?
కుటుంబమా - ధర్మమా?
వ్యక్తి ప్రయోజనమా? - ధార్మికమైన నడతయా?

అన్న మీమాంస ఉదయించినప్పుడు సుగ్రీవుడైనా, విభీషణుడైనా యెంచుకున్నది ధార్మికమైన నడవడి తప్ప వ్యక్తిగత అనుబంధాలు కావు. అదే.. ఇప్పటి పాలకుల అధికారులలా అవినీతి అక్రమాలలో కూరుకున్న తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని సమర్థించుకున్నట్లు కాదు..

అనుమాన నివృత్తికి ముందుగా మూల గ్రంథం చదవాలి. అప్పుడింకా అనుమానాలుంటే తెలిసినవారిని వివరణ కోరవచ్చు. స్వస్తి

- శంకరకింకర

No comments:

Post a Comment