Pages

Tuesday, September 22, 2015

దేవీ మహాత్మ్యము 3

శ్రీ గురుభ్యోనమః

ప్రథమ చరిత్ర మొదట్లోనే ఒక సూచన దొరికింది మనకు. రెండు రకాల వ్యక్తులు అమ్మవారిని గురించి తెలుసుకోవడం తపించడం ఉపాసించడం మొదలు పెట్టబోతున్నారని. ఒకరు లౌకిక ప్రయోజనాలు కోరేవారైతే మరొకరు ముముక్షువు. మనకి చివరి అధ్యాయాలలో అమ్మవారు సురథ సమాధులకి వరాలిచ్చే ఘట్టాలొస్తాయి అప్పుడు సురథుడడిగిన రాజ్యం, భార్య, పిల్లలు సమస్త భోగాలు ఇచ్చి భవిష్యత్ మనువుగా కూడా అవుతావని వరమిచ్చింది. సమాధి మోక్షం కోరాడు మోక్షమూ ఇచ్చింది. దీనర్థం అమ్మ కోరికనైనా తీర్చగలదు మోక్షాన్నిచ్చే అమ్మ కోరికలను తీర్చలేదుగనక? ధర్మబద్ధమైతే చాలు. అందుకే ఇది మహావిద్య ఈమె కామకోటి.

ఇక ముందుకు సాగుతే, వీరిద్దరూ వెళ్ళి సుమేధుని ఆశ్రయించారు ఇతఃపూర్వం చెప్పినట్లే మాకర్థమౌతోంది మేము మా భార్యాపిల్లలకు దూరంగా ఉన్నామని కానీ వారిమీద మాకు మనసు పోవట్లేదు వారు మాదగ్గరలేరనీ, తిరిగిరారనీ తెలుసు అని చెప్తూ ఏదో మాకు జ్ఞానం ఉంది కానీ ఎందుకు ఇలా బాధపడుతున్నాం అని అడిగారు.

సుమేధ ఆశ్రమంలోనే ఉన్నా సురథుడు, సమాధి వచ్చేవరకూ సుమేధను ఏమీ అడగలేదు. మనస్సు ఇంద్రియాలు బుద్ధి ప్రచోదనం లేకపోతే అవీ విచక్షణ వివేచన చేయవు కదా... అప్పటి వరకూ సుమేధ మహర్షి కూడా ఏం చెప్పలేదు. గురువుని సేవించే మార్గం చెప్పేసారు ఇక్కడ... పరిప్రశ్నేన సేవయా... మంచి ప్రశ్నలను అడగడం ద్వారా గురువుని సేవించగలం. అప్పుడు గురువు తన బోధ ద్వారా వర్షిస్తాడు అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తారు. సరే వారికి మీకున్నది జ్ఞానం కాదు అని అసలువిషయాలు చెప్తూ అమ్మవారికి (ఆత్మ చైతన్యానికి) సంబంధించిన విషయాలు కొన్ని చెప్పారు. ఆతృత పెరిగింది శిష్యులలో, మరింత పరి పరి విధముల అడిగారు ఎవరామె ఎక్కడుంది ఎలా పుట్టింది ఇలా..... వైనంలో కథ చెప్పారు మేధాముని.

అందరికీ తెలిసిన కథయే సృష్ట్యాదిలో సమస్తం నీరుగా ఉన్నప్పుడు బ్రహ్మగారు తపస్సులో ఉండడం విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయన చెవి మలం లోంచి మధు కైటభులనే రాక్షసులు పుట్టడం. వారు అంతా తిరిగి వారిద్దరే ఉన్నారనుక్కుని అంతా తిరిగితే చతుర్ముఖ బ్రహ్మగారు కనబడడం ఆయన్ని బెదిరించడం ఆయన నాతో యిద్దమెందుకని విష్ణువుని లేప ప్రయత్నించడం యోగ మాయ వలన లేవకపోతే అమ్మవార్ని ప్రార్థించడం యోగమాయ నుండి విష్ణువు బహిర్ముఖుడవడం. మధు కైటభులు ఇద్దరూ కలిసి విష్ణువుతో యుద్ధానికెళ్ళడం. ముగ్గురూ తలపడడం కొన్ని వత్సరాలు యుద్ధం తరవాత అమ్మవారి ప్రచోదనంతో విష్ణువు వారిని ఏం వరం కావాలో కోరుకోమని అడగడం, వారు మదోన్మత్తులు మాయావశులై నీకే ఏం కావాలో అడుగు అని విష్ణువుని తిరిగి వరం కోరుకోమనడం జరిగింది. అపుడు విష్ణువు మీరు నాచేతిలో చనిపోండని వరం కోరారు. వాళ్ళు రాక్షసులు ఊరుకుంటారా నీళ్ళు లేని ప్రదేశంలో చంపమన్నారు అపుడు విష్ణువు తన ఆకారాన్ని పెంచి రెండు తొడలమీద వాళ్ళ తలలుంచి చక్రంతో వారి కుత్తుకలు కత్తిరించి సంహరించారు.. { తరవాత భూమి ఏర్పడడం అన్నీ ప్రస్తుతం అప్రస్తుతం :) }.

భక్తి తో అమ్మ లీలను విష్ణుమూర్తి చేసిన రాక్షస సంహారాన్నీ తెలుసుకుని నమస్కారం పెట్టుకున్నా. కథ తెలుసుకుని మనం పొందవలసినది ఏమిటి తెలుసుకోవలసినది ఏమిటి అన్న, మనని మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి వంటి విషయాలు తరచి చూడాలి.
శబ్దం ఆకాశగుణకం, శబ్దాన్ని గ్రహించేది కర్ణం (చెవి). దహరాకాశమలాన్ని సూచించడానికి విష్ణువు యొక్క చెవి గులిమినుండి ఉద్భవించిన రాక్షసులుగా వీరిని చూపారు. మొదటినుండి చూద్దాం.. సర్వత్రా వ్యాప్తి చెందిన విష్ణువనే జీవాత్మ స్తబ్దుగా లోన మనలోనే ఉన్నది. దానినుండి పుట్టిన మనస్సుఅహంకారము, చిత్తము, బుద్ధి అనే నాలుగు బ్రహ్మగారి నాలుగు ముఖాలు. దహరాకాశంలోనుండే పుట్టిన మధు కైటభులు అనగా మధు అంటేనేనుఅనే భావన, కైటభము అంటే నేనుకి సంబంధించిన నాది అనేభావన. అహంకారము మమకారముల దుర్భావనలవల్ల ఉచ్ఛ నీచాలు మరచి మనస్సుని మర్ధించ ప్రయత్నించి వీలు కాక ఆత్మనే లేదంటూ దానిని నిర్మూలింప ప్రయత్నించే నాస్తికభావనలు. అవి తొలగడానికి అమ్మవారిని మనస్సు(బ్రహ్మ) ఇంద్రియాలతో సహా ఆశ్రయించగా మాయా విచ్చేదం చేసి ఆత్మ ఎరుకనిచ్చి అహంకార మమకారాలను వదిలేలా చేస్తుంది. అది వదిలే వరకూ మధు కైటభులతో వందల సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటే అహంకార-మమకారాలలోపడి తిరుగుతూనే ఉంటాడు జీవుడు. ఒక్కసారి జ్ఞానం వచ్చిందా అహంకార మమకార మోహవిచ్చేదం జరుగుతుంది. భావనలను తొలగడానికి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తములను పణంగా పెట్టి ప్రార్థిస్తే అమ్మవారు మాయ తొలగించి ఆత్మ జ్ఞానం తెలుసుకునేలా చేస్తుంది. ఒకసారి నాది నేననేభావనలు పోయాయా అంతా సమానం అందరూ సమానం ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. అప్పటి వరకూ సృష్టిలో సమస్తమూ బేధమే... ఏదీ సమానం కాదు ఎవరూ సమం కాదు... ఇలా అందరూ సమానం అంతా సమానం అని చెప్పేవాళ్ళు ఇద్దరే ఒకరు జ్ఞాని ఇంకొకరు పరమ అజ్ఞాని. జీవజాలంలో బేధాలు, ఆశ్రమ బేధాలు, వర్ణ బేధాలు, అధికారబేధాలు, అన్నీ అప్పటివరకూ వ్యావహారికంలో ఉంటాయి... ఎవరు కాదన్నా సత్యం అవగతమయ్యేంత వరకు అవితప్పవు. నోటిమాటకు చెప్పవచ్చేమో ఆచరణకు భావనలకు సరిపోవు....

అమ్మ  పంచకృత్య పరాయణా, పంచబ్రహ్మాసనాసీన కదా.... శాక్తేయంలో అమ్మవారు నిర్వహించే సమస్తాన్నీ ఇక్కడే వర్ణించారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ (మోక్షం) తత్త్వం అంతా కథలో చూడవచ్చు.

అఖ్యానం చెప్పాక శిష్యులిద్దరూ గురువుని ఇంకా అడిగారు పరాదేవత ఎలా ఆవిర్భవించింది ఎక్కడుంటుంది ఇలా.. పరిప్రశ్నలతో గురువుని సేవించారు దానికి గురువైన మేధాముని తగు సమాధానాలు రాబోవు అధ్యాయాల్లో చెప్పారు....

ఈ ప్రథమ చరిత్రలో 90 బీజమంత్రాలు ఇందులోని శ్లోకములలో నిబిడీకృతమై ఉన్నాయి..

సర్వం మహాకాళీ స్వరూప శ్రీ మాతా చండీ పరమేశ్వరీ పాదారవిందార్పణమస్తు

సశేషం..

3 comments:

  1. శ్రీ నాగేంద్ర గారికి,
    నమస్కారములు.

    ఈ మధ్య స్మరణ లో చక్రాలు గురించి టపాలు పెట్టాను. అందులో అనాహతచక్రం గురించి ఓ సందేహం వచ్చి, సరైనది నిర్ధారించుకోలేక ఆవేదనకు లోనౌతున్నాను. నా సందేహమును వివరంగా ఈ రోజు టపాలో పెట్టాను. తప్పుగా భావించక, ఆ టపాను చూసి, దయచేసి ఆ నా సందేహమును తీర్చి, నా ఆవేదనను తగ్గించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. నవరాత్రుల హడావుడిలో దీన్ని చూడలేదు, స్మరణ అంటే మీ బ్లాగ్ పేరనుకుంటున్నాను... మీ సందేహ నివృత్తికి వీలైనంత ప్రయత్నిస్తాను

      Delete
  2. బాగుంది మీ వివరణ....అమ్మ ఉపాసనకు దగ్గరగా వస్తున్నారు....శక్తిని సరిగా అర్ధం చేసుకొంటున్నారు...
    పెద్దలు మహర్షులు చెప్పిన దాంట్లో కళ్లు మూసుకొని నడవడమే మన విధి...శ్రీకామాక్షీ కటాక్ష సిద్ధిరస్తు.

    ReplyDelete