శ్రీ గురుభ్యోనమః
గుడి లేదా ఆలయాలు మనలోని ఆధ్యాత్మికతను ఉత్తేజితపరచే
ముఖ్య స్థానాలు. అంతటానిండి ఉన్న
భగవంతుణ్ణి సాకారంగా ఒక రూపంలో చూడాలనిపిస్తే ఆ రూపం ఉండే స్థలమే గుడి ఆలయం.
ఒక గుడికి మనం వెళ్ళాము అంటే అది మన ఉన్నతికి కారణం కావాలి మన సంస్కారం
సంస్కృతి అక్కడ ప్రతిబింబించాలి. అందుకే ఆలయాలు మన
సంస్కృతికి పట్టుకొమ్మలు అని పెద్దలంటారు. ఆలయంలో
ప్రవేశించేది మొదలు మనసు ప్రశాంతంగా హడావుడిలేకుండా ఉంచుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఆలయాలను మనం నిర్వహించుకోవాలి. ఒక
ఆలయం చూస్తే ఏదో మాల్ లాగానో మరేదో ప్రదేశంలో లాగానో గడబిడగా కాక దైవత్వం
ఉట్టిపడుతూ, ప్రశాంతతని, క్రమశిక్షణని, సంస్కారాన్ని, వినయాన్ని పెంపొందించేదిగా ఉండేలా
చూసుకోవాలి. దేవాలయం అందుకు తగ్గట్టుగా ఉండేలా తీర్చిదిద్దడం
ఆలయ ధర్మాధికారులు అర్చకుల కర్తవ్యమే ఐనా.. దాన్ని నిలబెట్టి
ఆ పూనిక ప్రకటించవలసింది గుడికి వచ్చే భక్తులు కూడా...
పూర్వం చాలా ఆలయాలు వాటి పోషణ నిమిత్తమై స్వయం
సమృద్ధిగా ఉండేవి. కనీసం ఇప్పుడు పూజా పుష్పాదులవరకైనా సరే సమృద్ధిగా ఉండేటట్టు
పూల మొక్కలు పెంచడం బృందావనం మారేడు వనం పెంచడం వంటివి చాలా అవసరం. ఒక ఆఖ్యానం
చెప్తారు ప్రాణ భయంతో ఉన్న పిచుక ఒకటి ఆలయంలోకి ఎగురుకుంటూ వచ్చి అంతరాలయంలో
ప్రవేశించిందట తరవాత అది మళ్ళీ ఎగిరి వెళ్ళినపుడు రెక్కలు అల్లార్పుకి అక్కడ ధూళి
తొలగి శుభ్రమై అంతరాలయం శుభ్రం చేసిన ఫలితం వల్ల మరుజన్మలో ఉత్తమ మానవ జన్మ
లభించింది అని. అంటే పురాణాలు ఆలయ శుభ్రత ఆవశ్యకత గురించి ఎంత స్పష్టంగా మనకి
చెప్పాయో చూడండి.
ఏదో ఒక ఆలయంతో భక్తునికి ఒక అనుబంధం ఎల్లప్పుడూ
ఉండాలి. అందుకు గానూ విధిగా ఆ ఆలయాన్ని దర్శించడం,
ఆ ఆలయంలో చేసే కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్సవాల్లో పాల్గొనడంతో
వంటివి చేయాలి. ఆ అనుబంధం కొన్నాళ్ళకి ఆ ఆలయంలో ఎక్కడైనా జిల్లేడు రావి వంటి
మొక్కలు ఏ గోడమీదో మొలుస్తున్నాయనుక్కోండి వాటిని తీయడం. బూజు పట్టినచోట దులపడం
క్రింద పడిన పూలు, ప్రసాదపు కాగితాలు వంటివి తీయడం. వృధాగా
పోతున్న నీటికుళాయిని కట్టేయడం ఇలా అనుకోకుండా ఒక ఆలయ సేవరూపంలోకి ఆ అనుబంధం
మారిపోతుంది. అలా అసంకల్పిత సేవగా జీవనం మారాలంటే ముందు బలమైన సంకల్పంతో ఓ
నాలుగైదుసార్లు ఆపని చేయాలి. ఉదాహరణకి పువ్వులు తొక్కకూడదు అందునా ఎర్రపూలు అసలు
తొక్కకూడదు అని తెలుసనుక్కోండి. గుడిలో ప్రదక్షిణమో మరేదో పనిలో ఉన్నప్పుడు ఆ
నడిచే దారిలో ఒ ఎర్ర పువ్వు కనిపించిందనుక్కోండి తీసి పక్కన పెట్టే అలవాటు
చేసుకుంటే ఎక్కడైనాసరే పక్కవాళ్ళతో మాట్లాడుతున్నా అసంకల్పితంగా వంగి చేత్తో ఆ
పువ్వు తీసి ఎవరూ తొక్కని వేపుకి వేసేయగలగాలి.
ఇలా ప్రతి ఒక్కరూ నిత్యం చేస్తున్నా శరీరగత శక్తి
పరిథిననుసరించి అన్నీ ఒకేసారి ఒక్కరే చేయలేరు కాబట్టి గుడికొచ్చే భక్తులందరూ కలిసి
ఒక సత్సంగం గా మారి గుడి ధర్మకర్తలు అర్చకుల సహాయంతో గుడిలో చేయవలసిన
శుభ్రపరచవలసిన పనులు మూడు నెలలకో ఆరునెలలకో ఓసారి నిర్వహించుకోవాలి. పాత్రల శుభ్ర
పరచడం దగ్గరనుంచి ఆలయం శుభ్రంగా కడగడం తుడవడం దగ్గరనుంచి ఆలయం బయట ఆవు పేడతో అలికి
ముగ్గులు పెట్టుకోవాలి.. ఇలా ఎన్నో విధాల గుడిని శుభ్ర పరచి అలంకరించుకొని
శోభాయమానంగా అలంకరించుకోవాలి. ఏ ఉత్సవాలో లేదా కార్తీకం వచ్చిందనుక్కోండి. అందరూ
కలిసి గుడి చుట్టూ ప్రమిదలు చక్కగా అందంగా అమర్చి సాయం వేళ వెలిగించారనుక్కోండి
గొప్ప శోభాయమానంగా ఉంటుంది... ఇదే "మనగుడి", ప్రతి పనికీ మనం డబ్బులిచ్చి కూలికి
పిలుచుకొని చేయనవసరం లేకుండా మనం కరసేవ చేసి ఆలయాన్ని బాగుచేసుకుంటే మనకి ఆ
ఆలయానికి కలిగే అనుబంధం ఉద్ధరణ హేతువు...
కనీస కర్తవ్యంగా భక్తులు ఆలయ మర్యాదనీ, ఆలయ శోభనీ కాపాడే విధంగా ప్రవర్తించవలసి
ఉంటుంది.
-పదుగురూ కలిసి గుడి శుభ్రం చేయడం
- ఆకులు, ఎండిన పూలూ,
చెత్త కనబడితే తీసి చెత్తబుట్టలో వేయడం
-ముఖ్యంగా కుంకుమ లేదా బొట్టు పెట్టుకునే చోట
వాటిని ధరించి లేదా తీర్థ ప్రసాదాలు తిని ఆ చేతిని గోడలకి, స్థంభాలకి
పూసేయడం.... వంటివి చేసి ఆలయ ప్రాంగణాన్ని పాడుచేయకూడదు.
- ఆలయంలోకి ప్రవేశించిన తరవాత మనసులో కానీ
పక్కవాళ్ళకి ఇబ్బంది లేని స్థాయిలో కానీ భగవన్నామ స్మరణ చేసుకోవాలి.
-వస్త్ర ధారణ సాంప్రదాయబద్ధంగా ఉండాలి... ఇలా
ఎన్నో ఇవి ఒకరు చెప్పేవి కావు ఎవరికి వారు తరచి చూసుకొని " పరవాలేదులే"
అన్న మాట వదిలి ఖచ్చితంగా ఆచరించాల్సినవి....
No comments:
Post a Comment