శ్రీ గురుభ్యోనమః
శ్రీ గణేశాయనమః
శ్రీ మాతా చండికా దుర్గాపరమేశ్వర్యై నమః
ముందు మనం చేస్తున క్రతువు ఏమిటో తెలిస్తే తదనుష్ఠాన దైవ
మహిమ తెలిస్తే మనం చేసే కార్యక్రమంలో మరింత శ్రద్ధ కుదురుకునే అవకాశం ఎక్కువ. మనకి
భగవంతునితోటి సంబంధం ఎప్పుడూ ఉన్నదే దాన్ని ఎప్పుడూ ఎరుకలో ఉంచుకొని ఆభగవంతునితో
ఒక బంధం ఏర్పరచుకుని తదనుగుణంగా ప్రవర్తించడం వల్ల మనలో భక్తి ప్రకాశనం
మెరుగవుతుంది. ఇప్పుడు ఈ సప్తశతి లేదా దేవీ మహాత్మ్యం అధిష్టాన దైవాన్ని అందులోని
కథారూపంలో ఉన్న ఆఖ్యాన ఉపాఖ్యానాలను పరిశీలించి వాటిని అన్వయించుకోవడం వల్ల
భక్తిశ్రద్ధాసక్తులేకాక మానవ జన్మ పరమ ప్రయోజనమైన జ్ఞాన సముపార్జన తద్వారా ముక్తికి
దారి దొరకగలదు.
దేవీ మహాత్మ్యము మార్కండేయ పురాణాంతర్గతమని విదితమే.. విద్యలెన్నో ఉన్నా.మోక్షవిద్యలు కొన్ని ఉంటాయి. అవి తెలుసుకున్నంతమాత్రాన ఏది తెలుసుకోవాలో అది తెలియబడి మానవ జీవిత పరమార్థాన్ని పొందుతాడు. నిజానికి పురాణేతిహాసాల సారం పరమార్థాన్ని అందించడమే. ఐతే అందులోని అన్ని ఆఖ్యానాలూ ఆ స్థాయిని పొంది.ఉంటాయా అంటే చెప్పడం కష్టం. ఎన్నో పురాణాలున్నా దేవీ మహాత్మ్యానికి ప్రత్యేక ప్రతిపత్తి. ఇది ప్రయోగంలో యజుస్సుల రూపాన్ని పొందుతుంది. అంటే, యజ్ఙంలో ప్రయోగించే మంత్రాలుగా రూపాంతరం చెందుతాయ. సప్తశతి అన్న పదం మార్కండేయుడు చెప్పలేదు. నిగమాగమాలకి పురాణాలకి మధ్య తంత్ర గ్రంథములు ఉండి వివిధ ప్రయోగములను మానవాళికందించాయి. ఈ తంత్ర గ్రంథాలలో శాక్తేయ విద్యను గూర్చి చెప్పిన విధంగా మరే విద్యనుగూర్చి చెప్పలేదనచ్చు... అంటే విస్తారంగా శాక్తేయం చెప్పబడింది.
పురాణోక్తంగా చెప్తే దేవీ మహాత్మ్యం, తంత్రోక్తమైతే
సప్తశతి... 7వందల బీజమంత్రాలు ఇందులోని శ్లోకాలలో నిబిడీకృతమై ఉంటాయి
అందుకే వీటిని యజ్ఞంలో ప్రయోగించే విధానం ఋషులందించారు... ఉదాహరణకు ఒకటి చెప్తాను.
చివర్లో సావర్ణి లేదా సావర్ణ అనే పేరు మనం ఇందులో వింటాం.. ఒక్కో సందర్భాన్ని
అన్వయాన్ని బట్టి ఒకచోట సూర్యశక్తికి సంబంధించిన బీజాక్షరంగా చెప్పబడుతుంది. అలాగే
సా అంటే ఆమె అని అర్థం, తత్ అని పరబ్రహ్మాన్ని ఎలా అంటామో సా అని ఆ పరబ్రహ్మ
మహిషిని సంబోధిస్తారు.. సాయేషా గాయత్రీ... వంటివి మనకు తెలిసినవే కదా..., వర్ణము
అంటే రంగు, అక్షరములు అని కూడా అర్థము.. వర్ణమాల అంటాం కదా అలా..
సావర్ణి అంటే ఆమె వర్ణము లేదా అక్షరము అని అదే ఈం బీజాక్షరము గుప్తప్రణవం.. అలా
మొదటి మంత్రం సావర్ణి : సూర్య తనయో యోమను: కద్యతే ష్టమః.. అనేశ్లోకంలో ఉన్నది
హ్రీం బీజాక్షరం. సప్తశతీ బీజాక్షర పారాయణ హోమ విధానం తెలిసి చేసే సారస్వతులు చండీ
ఉపాసకులు ఎందరో ఉన్నారని కర్ణప్రమాణం. విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే ఒక ఉదాహరణ
చెప్పాను నేను మంత్ర శాస్త్ర పరిథి మర్యాద దాటలేదని మనవి...
శాక్తేయం రెండు పార్శ్వాలు అనొచ్చు. శ్రీవిద్యాదులు అధిసష్ఠాన దైవతంగా లలితోపాసన జరుగుతుంది. రెండవది చండీ ఉపాసన.
పరమ కోమలమైన లలితమైన లాలనతో కూడిన అమ్మప్రేమ ప్రకటనం లలితా పర్వం ఐతే కోపముతో ఉన్న అమ్మ ఉపాసన చండీ పర్వం. ఐతే చండీ తత్త్వం కలుపుకుంటేనే అమ్మ ప్రేమకి సంపూర్ణత్వం అని పెద్దల వ్యాఖ్యానం..
చండీ తత్త్వంతో కలుపుకుంటేనే అమ్మ తత్త్వం సంపూర్ణం అనే మాట ఎలాగో ఉదాహరణ చూద్దాం. అమ్మ పిల్లవాణ్ణి పొదివి పట్టుకుని వాడిని ఆలించి లాలించి
కావలసినవి తినిపించి ప్రేమగా ఉంది. అది అతిలలితలలితమైన ప్రేమ.. ఇప్పుడు
అనుకోక్కుండా ఆ పిల్లవాడు ఆడుతూ ఆడుతూ కుర్చీ కాలికి తగిలి క్రింద పడ్డాడు
అప్పుడమ్మేంచేస్తుంది? పరిగెత్తుకొచ్చి వాణ్ణి లేవదీసి ఊరుకోనాన్నా ఊరుకోనాన్నా
అని సముదాయిస్తూం తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆకుర్చీని రెండు దెబ్బలు కొట్టి నేను
కుర్చీని కొట్టేసానులే నిన్ను పడేసిందా అదీ అని కోపంతో కుర్చీని తిట్టి రెండు
దెబ్బలేసి పిల్లాణ్ణి సముదాయించింది.. పిల్లాడు ఫక్కున నవ్వి మళ్ళీ ఆటలాడుకుంటాడు.
అలాగే వేరే పిల్లలతో ఆటలలో అల్లరి పిల్లవాడు కొడుకుని ఓ దెబ్బేసాడనుక్కోండి
కొడుకుని గట్టిగా పొదివిపట్టుకుని కోపంతో అవతల వాణ్ణి తిట్టి వీలైతే రెండు దెబ్బలు
వేసి చూపుడు వేలు చూపి జాగ్రత్త అని కోపంగా బెదిరిస్తుంది, అమ్మకి
తెలీదా పిల్లల గొడవలు పిల్లలు తేల్చుకుంటారని? ఐనా
సరే నా పిల్లలు బాధపడ్డారు అని అమ్మ ప్రేమ అప్పుడు మరింత ప్రకటితమై రక్షిస్తుంది.
ఇప్పుడు చెప్పండి అమ్మలోని ఈ కోణం అనుభవించని వాళ్ళమెవరమైనా ఉన్నామా మొదటి
స్వరూపంలో కన్నా రెండవ తత్త్వంలో అమ్మ ప్రేమ మరింత ప్రకటనమైంది కొడుకుమీద. ఆ అమ్మ
ప్రేమ తత్త్వమే చండీ తత్త్వం. చడీ కోపయతీతి చండీ.. కోపము ఆవేశించి ఉన్న తల్లి
చండి. ఎందుకు తన పిల్లలని దుష్ట శక్తులనుండి కాపాడుకోవడానికి..... ఇప్పుడు
చెప్పండి ఏ తల్లిలో ఏ తండ్రిలో ఏ తోబుట్టువులలో ఏ భార్యాభర్తలలో ఏ స్నేహంలో మనకి
చండీ తత్త్వం కనిపించదు.. సహస్రాక్షీ సహస్రపాత్... ఇంతమందీ అమ్మ రూపమే అమ్మయే
ఇన్ని రూపాలతో నన్ను గమనించి నన్ను సరియైన దారిలో పెట్టి కాపాడుకుంటున్నదన్న భావన
పెంపొందలేదూ.. ఈ ఒక్క పేరుమీద ఉన్న వ్యాఖ్యానంతోటి...
ఇది తెలుసుకుని చండీ హవనానికి వస్తే మనలో శ్రద్ధ ఎంత
పెరుగుతుంది ఎంత ప్రేమ పూర్వకంగా ఎంత భక్తి ప్రపత్తులతో మనం ఈ కార్యక్రమంలో
పాల్గొంటాం...
సశేషం...
Mee bhashyam, examples naaku baga hathukunnayi....await for remaing posts...
ReplyDeleteమీకు స్వాగతం, ఏవో మదిలో మెదిలే భావాలు వ్రాసుకుంటాను.. అమ్మవారికి నైవేద్యం... అంతే
Deleteచాలా బాగుంది....
Delete