Pages

Thursday, January 3, 2013

అరుణాచల యాత్ర

అరుణాచలేశ్వరుని ఆనుజ్ఞ మేరకు శ్రీ ప్రసాద్ గారి కుటుంబం మాకుటుంబంతో సహా మొన్న వైకుంఠ ఏకాదశీ సమయంలో మా అందరి అరుణాచల యాత్ర సాగింది. ప్రతీ క్షణం, ప్రతీ సన్నివేశం భౌతికంగా ఒకలా కనపడినా.. ఆంతరంలో అరుణాచలేశ్వరుని వాత్సల్యం, రమణుల బోధ అన్వయమౌతూనే ఉన్నాయి. కూర్చుని చేస్తే పట్టుమని కొన్ని క్షణాలు కుదరని ధ్యానం, రమణులు చెప్పినట్లు గిరి ప్రదక్షిణలో కుదరడం... మీకు తెలియనిదేముంది.. నాబోటిగాడెంతని చెప్పగలడు అరుణగిరి మహత్తు.. బయలు దేరేముందు యాత్రలో అన్నీ నోట్ చేసుకుని యాత్ర అయ్యాక అది రాద్దాం ఇది రాద్దాం అలా ఐతే యాత్రా విశేషాలు చక్కగా ఎప్పటికీ గుర్తుంటాయి అనుక్కున్నాను.
 

రమణాశ్రమం, మాతృభూతేశ్వరాలయం, రమణసన్నిధి, బావి, నిర్యాణ మందిరం, నెమళ్ళు, కోతులు, కుక్కలు, పెద్ద పేద్ద నాగమల్లి చెట్లు, గోశాల అంతా రమణమయం..... వెనకనుంచి స్కందాశ్రమానికి దారి ఆ పైనుంచి కొండకిందకి దృశ్యాలు... చటుక్కున చుఱుకు పెట్టినట్లు ఒరే నువ్వున్నది ఈశ్వరుని మీదరా నీ మనసు ఇక్కడ ఉంచకుండా కొండ మీదనుంచి బస ఎక్కడుంది గుడెక్కడుంది అని వెతుకుతావేం అన్నట్లు తుమ్మిపూల చిన్న మొక్క నేలపై కనిపించింది దానికి మూడే మూడు పువ్వులున్నాయి. చుట్టుపక్కలెక్కడా ఆ పూల మొక్కలు లేవు ఆశ్చర్యం... అనిపించింది ఓహో ఇంకా ఇక్కడ కూడా ఎందుకురా అదీ ఇదీ అని ఆలోచిస్తావు అనుక్కుంటూ అ పువ్వులు మూడూ కోసుకుని అప్రయత్నంగా రుద్రం నా నోట్లోంచి వస్తుంటే ఆ అరుణ గిరిని చూస్తూ లోపలా బయటా అనుభవిస్తూ ఒక పెద్ద శిల దగ్గరికెళ్ళి అరుణాచలేశ్వరా స్థాణువై ఉన్న నువ్వు మమ్మల్నందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ కొండరూపంలో, శిలారూపంలో ,చెట్ల రూపంలో మొత్తం నువ్వే ఉన్నావు అనుక్కుంటూ ఆ మూడు తుమ్మి పూలూ శివునకు సమర్పించినట్లుగా భావించుకొని అక్కడ ఉంచి నమస్కరించి ముందుకు సాగాను.. ఇంకా అక్కడే ఉన్నట్లుంది...

మేము తిరిగి వచ్చిన తరవాత కొందరు మిత్రులు ఎలా జరిగింది యాత్ర అని అడిగినప్పుడు వారితో చెప్పాను ఇది ఓ మూడు రోజులో నాలుగురోజులో చేసే యాత్ర కాదు, ఒక జీవితం సరిపోతుందో లేదో అని... ఏమి వర్ణన చేయగలను... బహుశా అక్కడ కూడా ఈ నేనుపైకి ఎగురుతూ ఉందేమో... యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సః..... అన్న ప్రమాణం ప్రకారం మనస్సు వాక్కు ఎక్కడ ఆగిపోతుందో, "ఆ దివ్యమైన మౌనం, ఆ శరణాగతి సూచించేదేదుందో అదే అరుణాచలం" అని మాత్రం అవగతమైంది.

1 comment:

  1. నమస్తే నాగేంద్ర గారూ,

    "నాబోటిగాడెంతని చెప్పగలడు అరుణగిరి మహత్తు.." అని అంటూనే, చక్కగా వర్ణించారు మా యత్రా అనుభవాలను. అందునా స్కందాశ్రమం వైపు వెళ్ళేటప్పుడు ఆ అరుణగిరి మీద ఉండే ప్రతీ చెట్టూ, రాళ్ళు, జలపాతం అన్నీ చాలా ప్రశాంతతను కలుగజేస్తాయి. అటువంటి చోట మీరు చేసిన ఒక్క రుద్రమంత్రమైన ఊహించలేని ఫలితాన్నిస్తుంది. గిరిరాజకన్యకను వివాహమాడడానికి, గిరిరూపములో వచ్చిన కొండాల్లుడు కదా మన స్వామి శంకరుడు.
    అరుణాచలం అరుణాచలమే. మీరన్నట్లు అది ఒక జీవితకాల యాత్ర. ఏడు రోజులు, ఏడు రాత్రులు అరుణాచల స్మరణ చేయవలసినదే, భాగవతం లాగా.
    ఇంకా మీ అనుభవాలు వ్రాయగలరు.

    ReplyDelete