శ్రీ గురుభ్యోనమః
నంద నందనుఁడ! గోవింద! నృసింహావ
తార! ఆనంద! సత్యస్వరూప!
దామోదరా! ముకుందా! వాసుదేవ! ప
ద్మాక్ష! సీతాపతీ! అవ్యయుండ!
పాపసంహారకా! పతితపావనరూప!
సంసార విస్తార జలధిదాట
గాఁజేయు, గంభీర కర్ణధారుండ! శ్రీ
కృష్ణావతారుఁడౌ! విష్ణుదేవ
కాంతిచే, మనోహరుఁడవై గ్రాలువాఁడ!
అచ్యుతానంత! శ్రీ రామ! ఆదిదేవ!
నిత్యతాపత్రయంబు ఖండించి, నాకు
సంతస మొసంగుమా - రామచంద్ర సతము.
(శ్రీ రామ కర్ణామృత ఆంధ్రానువాదం నుండి)
శ్రీ రామ చంద్రా! నీ ప్రతీ నామము, చేష్టితము, అవతారము, లీల, ఇంచుకైనను సరే అవి పాప సంహారకములు, దీనుల యెడ ఉద్ధరణ కారకములు.
ఓ పతిత పావనా! ఎడతెఱిపిలేని తాపత్రయముల వలన కలిగిన దుఃఖముచే అగాధము వంటి చీకటియైన అజ్ఞానమునందు తిరుగువాడను. గంభీరమైన చెవులు కల (ఎంత మంది ఒకేసారి కోరికలు కోరినా అందరి కోరికలూ ప్రత్యేకంగా వినగలిగినంత విశిష్ఠమైన చెవులు కలవాడా) ఓ కృష్ణా! నా ఈ తాపత్రయములను త్రుంచి, అతి పెద్దదై దాట సాధ్యముకాని ఈ సంసార మనే సముద్రాన్ని దాటింపచేసి,నిత్యము, శాశ్వతము, అనంతము ఐన ఆనందమును నా స్వస్థితిగా చేయుమో తండ్రీ! దాశరథీ!
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
No comments:
Post a Comment