Pages

Sunday, February 27, 2011

ఆచార్యుడు - గురువు - ఉపాధ్యాయుడు

నమస్తే
శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
మన సనాతన ధర్మంలో గురువు అన్న పదానికి కాని గురువు కి కాని భగవంతునితో
సమాన స్థానం.
ఈ సారి మన చర్చా విషయం "ఆచార్యుడు - గురువు - ఉపాధ్యాయుడు".
ఆచార్యుడు ఎవరు?
గురువు ఎవరు?
ఉపాధ్యాయుడు ఎవరు?
వీళ్ళంతా ఎన్ని రకాలు?
ఉపదేశం అంటే ఏమిటి?
దీక్ష ఎన్ని రకాలు?
.........మొదలైన వాటి గురించిన చర్చ జరగాలని సంకల్పించాం.
ఒక చిన్న విషయం
మా గురువుగారు ఒకసారి ఒక కథ చెప్పారు.  సమస్త సృష్ఠిలోని వారంతా కలిసి
గురువుని పూజించి సత్కరించాలని సంకల్పించి గురుపూజా మహోత్సవాలు
నిర్వహించారట. గురువు మటుక్కు తనలో తాను రమిస్తూ ఉండిపోయారట. ఆ పిమ్మట
అందరూ కలిసి "గురువు"కి ఒక బిరుదు ప్రధానంగా లేదా గురువు స్థాయిని పెంచే
విధంగా మరొక పేరు గురువుకి ఇవ్వ దలిచి ఆ గురువుని కొందరు బ్రహ్మతో సముడని
"బ్రహ్మా" అని పిలిచారట గురువు మటుక్కు తనలో తాను అలాగే రమిస్తూ
ఉండిపోయారట.మళ్ళీ వాళ్ళలో వాళ్ళకే ఈ పిలుపు గురువుకి సరిపోలేదని తలచి ఇంత
తక్కువ పేరు గురువుకా అని వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకుని బ్రహ్మకన్నా
గొప్పవాడు గురువు అందుకు ఆయనని "విష్ణువు" అని పిలుద్దాం అని
నిర్ణయించారట. గురువు మటుక్కు తనలో తాను అలాగే రమిస్తూ ఉండిపోయారట. ఇంతలో
మళ్ళీ అందరిలో అలజడి విష్ణువు నామం మటుక్కే ఆయనకి సరిపోదు సర్వజ్ఙుడైన ఆ
మహేశ్వరుడే ఈయనకు సాటి అని "మహేశ్వరా" అని అన్నారట. ఐనా గురువులో మార్పు
లేదు.
ఇంత జరిగినా సృష్ఠి మొత్తానికీ సంతృప్తిగాలేదు. గురువుకి తగిన మర్యాద
చేయలేకపోయామనే బాధ తప్ప. ఇంతలో వారికి త్రిమూర్తుల వారి శక్తుల
అనుగ్రహంతో ఒక ప్రచోదనం జరిగింది అందరికీ ఒకేసారి. అందరూ కలిసి గట్టిగా
గురువుని "పరబ్రహ్మా" అని గట్టి గట్టిగా ఆనందంతో అన్నిలోకాలూ
దద్దరిల్లేటట్టు కీర్తించారట.
గురువు మాత్రం ప్రబ్రహ్మకన్నా వేరు కానివాడై తనలో తాను అలానే రమిస్తూ
అప్పటికీ ఇప్పటికీ గురువులానే ఉన్నారట. మీకూ నాకూ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక
రూపంలో గురువుగా అనుగ్రహిస్తూనేఉన్నారు. అందుకే అప్పట్నుంచి ఇప్పటికీ
"గురుబ్రహ్మ....గురుర్విష్ణుః........గురుర్దేవో
మహేశ్వరః......గురుస్సాక్షాత్ పరబ్రహ్మ......తస్మై శ్రీ గురవే నమః"

(పై కథలో చెప్పిన గురువు అన్న మాట విస్తారమైన అర్థంతో గురువు అన్న పదవి
గురించి చెప్పినది కేవలం నవగ్రహాలలో గురువు లేదా బృహస్పతి గురించి
మాత్రమే కాదు)
!నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం!
మాగురువుగారి పాదాలకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ

(సుచన:కేవల సనాతన ధర్మంలోని విషయాలు వేద విహితమైనవి మాత్రమే పొందు
పరచగలరు, అన్య సాంప్రదాయాలు మనకి అప్రస్తుతం)

1 comment:

  1. నమస్తే

    అధ్యయనం చేయించేవారు లేదా అధ్యాయాలను చెప్పేవారు అధ్యాపకులు పూర్వం
    వేదాలను బోధించడాన్ని అధ్యాపనం అనేవారు. అధ్యాపకునికి సహాయకుడు లేదా అతని క్రింది స్థాయిలో బోధించేవారిని ఉప అధ్యాయి అని ఉపాధ్యాయుడు అని
    పిలిచేవారు. అంటే వేదాలు శాస్త్రాలు నేర్చుకునేముందు చిన్న తరగతులు
    నిర్వహించేవారు అన్నమాట.


    ప్రస్తుత భాషా సంకరం వల్ల ఏ పదం దేనికో ఎందుకో తెలీక పోవడం మన గొప్ప
    అదృష్టం. ఏ గొడవాలేదు. ( చిన్నప్పుడు నా స్నేహితుడొకడనేవాడు రాదన్న పని, తెలీదన్నపని రాజా పని అనిఅనేవాడు అలా...)


    ఇక గురువు , ఆచార్యుడు అన్న పదాలు పర్యాయపదాలుగా వాడబడుతూనే ఉన్నాయి అనాదిగా. రెంటిలో కించిత్ భేధం అంతే.
    ఆచార్య పదం ఆచరణ ఆచార అన్న పదాలకి సంబంధించినది. చర అంటే నడక / నడత. ఒక సాంప్రదాయంలోని నడవడికను తన నడత ద్వారా విచారించి చరించి అనుష్టించి ఇతరులతో కూడా అలా ఆచరింపచేసినవాడు ఆచార్యుడు.


    ఆచినోతిహి శాస్త్రార్థాన్ ఆచారేస్థాపయత్యపి!స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్యం
    ప్రచక్షతే!!
    ఎవరైతే శాస్త్రార్థాలను చక్కగా విచారించి, ఇతరులను అనుష్ఠింపచేయుచున్నాడో, తాను కూడా ఆ శాస్త్రార్థములను అనుష్ఠిస్తున్నాడో
    అతడే ఆచార్యుడు (Percepting & Practicing).క్లుప్తంగా బోధించేవాడు, తాను కూడా ఆచరించేవాడు ఆచార్యుడు.


    [మన ఇంకో (దుర్) అదృష్టమేమంటే ఇప్పుడూ ఆచార్య అన్న బిరుదులతో
    విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులున్నారు వారికి వారు బోధించే శాస్త్రంలో
    పుస్తక జ్ఙానం తప్ప అనుష్టానం ఆచరణ ఉండవు కానీ వారు ఆచార్యులుగా చలామణీ అవుతున్నారు. ఐనా మన ప్రస్తుత విషయం ఆ ఆచార్యుల గురించి కాదుగా.....]


    ఆచార్యుల వద్దే ఉంటూ అధ్యయనం చేయడాన్ని గురుకుల వాసం అంటారు దీనివల్ల ఒక స్థాయి వరకూ అధ్యాపకుడు, గురువూ, ఆచార్యుడు ఒక్కటే. పై పైకి వెళ్ళినకొద్దీ స్థాయిలు మారతాయి.


    ఇక గురువు విషయానికొస్తే ఏ శాస్త్ర విషయాలకీ కట్టు బడకుండా శాస్త్రజ్ఙాన
    అవసరంలేకుండా జ్ఙానిగా తనలో తాను ఆత్మానందంతో రమిస్తూ ఉంటాడు. ఆయన ఒకరిని ఉద్దరించాలన్న నియమం ఒకరిని ఒక మార్గంలో ఉంచాలి అని నిర్దేశం అనుష్ఠింపవలసిన అవసరం లేనివాడు. ఒక సాంప్రదాయానికి కట్టుబడనివాడు. ఆయనకు నచ్చితే, చెప్పాలనుక్కుంటే శిష్యునికి ఏదైనా ఉపదేశం చేయవచ్చు లేదా మౌనంగానే ఉండవచ్చు. శాస్త్రం నిషేధించిన పనులను కూడా లోకం కళ్ళు తెరవడానికి వారు చేస్తారు (ఉదా: ఒక రమణ మహర్షి, ఒక సాయిబాబాగారు).
    పరమాచార్య మాటల్లో.. గురువుకి ప్రపంచంలో బహిరంగంగా దేనినీ చేయవలసిన అవసరం లేదు. అతనికి శాస్త్ర పరిజ్ఙానమో విద్వత్తో ఉండనక్కరలేదు. ఆచార్యుని వలె అతడు సంప్రదాయ ఆచార అనుష్ఠానములకు మార్గదర్శిగా ఉండనవసరమూలేదు. అతడు నోరుతెరచి మాట్లాడవలసిన అవసరంలేదు. ఉపదేశాలు ఇవ్వనవసరంలేదు. ఎంతోమంది గురువులు మౌన గురువులు, ధ్యాన నిష్ఠులు ఉంటారు. దత్తాత్రేయులని గురు దత్త అన్నారు కాని ఆచార్య దత్త అనలేదు. ఆ సంప్రదాయంలో వారు గురువులే.


    గురువంటే ఘనమైనవాడు లేదా బరువైనవాడు, శిష్యుడంటే లఘువు , తేలికైనవాడు. ( శరీర బరువు రీత్యా కాదు) ఆ పరబ్రహ్మను హృదయంనిండా నింపుకుని అతని కారుణ్యాన్ని సౌలభ్యాన్ని తన గుండెనిండా నింపుకుని అనుభవించడంవల్ల బరువైనవాడు గురువు. దానికోసం ప్రాకులాడి అదిఎలాగో నేర్చుకోవడానికి గురువుదగ్గర కూర్చునేవాడు శిష్యుడు లఘువు.

    అజ్ఙానాన్ని ఛేదించేవాడు గురువు.. గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్
    (టైపాటులుండచ్చు). గురువుగా ఉన్నవారు గురుత్వాన్ని ఒప్పుకోకపోయినా
    శిష్యరికంతో ఆ వ్యక్తిని గురువుగా వరించి సేవించిన వారికి మధ్య ఒక సంబంధం
    ఏర్పడుతుంది. అదికూడా ఆ గురువు అనుగ్రహం వల్లే.


    ఐతే ఈ గురువు ఆచార్యులుగాకూడా ఉంటారు. బహిరంగంగా ఆచారము, అనుష్ఠానము, శిష్ఠాచారము, మార్గదర్శకముగా ఉంటూ ఆంతరంగికముగా దేనితోనూ మమేకముగాకుండా ఆత్మానందముతో రమిస్తూ ఉంటాడు. సాధకునికి ఆచార్యుడైన గురువు దొరికితే , దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతకన్నా అదృష్టవంతుడుండడు. అటువంటి ఆచార్యుడు గురువు ఒకరే ఐన వారు జగద్గురు ఆది శంకరాచార్యులు ఆయన పరంపరలోని వారు. వారు బహిరంగంగా దేనినీ కోరని గురువులు, జగద్గురువులు అలాగే అవసరం లేకపోయినా లోకానికి ఆచారం నేర్పే ఉద్దేశంతో అనుష్ఠానపరులు కుడా. వారి పరంపరలో పరమాచార్య జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని కూడా తెలిసినవారు ఎందరో.


    విషయాన్ని అంతా స్పృశించలేదు, గురువు / ఆచార్యుని కీర్తించే అంత గొప్ప
    వాణ్ణీ కాదు, అనంతమైన ఆ గురు మహాత్మ్యాన్ని ఎవరూ తెలుసుకోలేరని స్వయంగా పరమశివుడే పూనుకొని పార్వతిదేవికి గురుగీతగా ఉపదేశించాడు. ఇంక నేనెంత.

    ఏదేమైనా నగురోరధికం నగురోరధికం నగురోరధికం............

    మిగిలిన విషయాలు మరో పొందికలో... తప్పులుంటే మన్నించండి

    ReplyDelete