Pages

Saturday, April 8, 2017

ధర్మం విషయంలో మూడు రకాల ప్రవర్తనలు

శ్రీ గురుభ్యోనమః
 
ధర్మం గురించి మూడు రకాల వ్యక్తుల గురించి వారి పరిస్థితి గురించి రామాయణం నుండి.
 
దశకంఠుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు, తపస్సంపన్నులు, సాక్షాత్ బ్రహ్మ వంశస్థులు. ధర్మం విషయంలో ముగ్గురూ మూడు రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. దాని వలన ఎవరేం ఫలితం  పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా...!
 
ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ఆచరించడు :-
1] దశకంఠుడు (రావణుడు) - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు. ఎవరైనా తనకు ధర్మబోధ చేసినా వినడు, సహించడు తనకు నచ్చినట్లుగా ఉండడమే ధర్మం అని బుకాయిస్తాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, కానీ ఆచరించడు :-
2] కుంభకర్ణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు, అధర్మం ఐనా సరే అన్నకోసం చేసేస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని కోపంతో ధర్మబోధ చేసాడు, కానీ అన్నకోసం అధర్మం వైపే ఉన్నాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు:-
3] విభీషణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరిస్తాడు, భూతదయఉన్నవాడు, అధర్మం ఐతే అన్నైనా సరే విభేధిస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని ధర్మబోధ చేసాడు. మహాశక్తివంతుడు మహైశ్వర్యవంతుడైన రావణుణ్ణి ఎదిరించి, వానరాలతో వచ్చిన సాధారణ మానవుడు శ్రీరాముని శరణు జొచ్చాడు. ఐశ్వర్యమూ, బలమూ ఎక్కడ ఉన్నదో అని కాదు ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. రామునికి ప్రాణ మిత్రుడైయ్యాడు.
 
-శంకరకింకర


Friday, April 7, 2017

తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

శ్రీ గురుభ్యోనమః


...నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

ఫేస్ బుక్లోనూ, వాట్సప్లోనూ ఒక రావణుడికి సంబంధించి ఒక కథ చక్కర్లు కొడుతోంది. యుద్ధరంగంలో పడిఉన్న రావణుడు రాముణ్ణి పిలిచి నేను నీకన్నా అన్నింట్లోనూ గొప్ప కానీ నీ చేతిలో ఎందుకు ఓడి చనిపోయాడని అడుగుతాడట (ఇలా రామాయణంలో లేదు, రాముడు కొట్టిన బ్రహ్మాస్త్రానికి రక్తం కక్కుకుని మాట్లాడకుండా కుక్కిన పేనులా చచ్చాడు మరి.) అప్పుడు రాముడంటాట్ట నా తమ్ముళ్ళు నాదగ్గరే ఉన్నారు నీ తమ్ముడు నీదగ్గరలేడు అని. అందుకే నువ్వు చచ్చిపోయావ్ నాచేతిలో అని. అంటే సీతమ్మని అపహరించినందుకూ, దేవ మనుష్యాదులను అందరినీ హింసించి అధర్మ కార్యాలు చేసి పాపం మూటగట్టుకున్నందుకూ కాదుట. తమ్ముడు పక్కనలేడు కాబట్టి చచ్చిపోయాట్ట.



నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు అన్న సూక్ష్మమైన విషయాన్ని పైన పోస్ట్ చేయబడ్డ కథనం రచించిన రచయిత మరిచాడు. అన్నదమ్ములతో కలిసుండండం శ్రేయోదాయకమే, కానీ అలా కలిసి ఉండీ కూడా ధార్మికమైన జీవితంలో లేకుండా ఉంటే 100 మంది అన్నదమ్ములైనా (కౌరవులు) మడిసిపోయారు. అర్థాత్, దీనిలో ఉన్న కీలకం ఏంటంటే! కేవలం అన్నదమ్ములు కలిసి ఉండడమే కాదు, అ అన్నదమ్ములు ధర్మంతో కలిసి ఉండడం ముఖ్యం. అదీ ఇతిహాసం కానీ, పురాణం కానీ 14 ధర్మ స్థానాలు కానీ చెప్పేవి.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం!
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!

అందంగా ఉందని అబద్ధాలు కలిపించి చెప్పకూడదు. సత్యమే సనాతనమైన ధర్మము. ఆ సత్యమే భగవత్స్వరూపము. ఆ భగవంతుని విషయంలోనే అసత్య ప్రచారం చేయకూడదు.

పురాణేతిహాసాలను ప్రక్షిప్తం చేసి వాని పవిత్రతను పాడుచేసే అధికారం మనకు లేదు. మనకు ఎంత స్వచ్చంగా పురాణేతి హాసాలివ్వబడ్డాయో అంతే స్వచ్చంగా రాబోవు తరాలకు మనం అందించాలి. పురాణేతిహాసాలపై, పౌరాణిక పాత్రలపై తప్పుడు రచనలు చేయకూడదు.
స్వస్తి"

-శంకరకింకర

Tuesday, January 31, 2017

కొండముచ్చుల చలికాపడం

అనగనగా ఒక అడవి, శీతాకాలం వచ్చింది. ఆ అడవిలో కొండముచ్చులు ఎక్కువ. ఓ సారి ఎప్పుడో దారిన పోయే మనుషులు నిప్పురాజేసి చలి కాచుకోవడం చూసాయి. వాటికి నిప్పు అని తెలీదు. కానీ అవీ చలికాచుకోవాలనుక్కున్నాయి. అన్నీ గుంపుగా బయలు దేరి చలి కాచుకోవడానికి వెళ్ళాయి, దూరంనుంచి వెలుగు కనిపించింది.. వెళ్ళి చలికాచుకోవడం మొదలెట్టాయి. కొంతసేపటికి అటుగా ఒక కుందేలు వెళ్తూ చూసింది. వాటి దగ్గరకెళ్ళి ఏం చేస్తున్నారనడిగింది. అవి చలికాచుకుంటున్నాము అని చెప్పాయి.. అది పక్కున నవ్వి ఇవి మిణుగురుపురుగుల వెలుగులు వేడికాచుకునే నెగడు కాదు అని చెప్పింది. వాటికి కోపం వచ్చి మూర్ఖత్వంతో ఆ కుందేటి మెడవిరిచి చంపేసాయి.....

అందుకే పెద్దలు ఎవరైనా కొందరు ఫలితంలేని పనీ, ఏదోచేయాలికదా అని చేసే పనినీ చూసి... కొండముచ్చులు మిణుగురులతో చలికాచుకున్నట్లుంది అంటూంటారు.. అలాగే మూఢులని సమాధాన పరచి బాగుపరచడంకూడా అంత తేలికవిషయమూ, క్షేమకరమైన విషయమూ కాదని దీన్ని ఉదహరించి చెప్తారన్నమాట.

పక్కవారేదైనా చేప్తే విని ఒకక్షణమైనా ఆలోచించి సరియైన దాన్ని నిర్ణయించి స్థిరపరుచుకుని అప్పుడు మన పూర్వ నిర్ణయం తప్పైతే దిద్దుకోవాలి తప్ప మూఢత్వంతో ఎదురు దాడి చేయకూడదు. అలానే మన పూర్వ నిర్ణయం సరియైనదైతే నిర్భీతిగా నొప్పించకుండా చెప్పి మన కార్యాన్ని మనం సాధించుకోవాలన్నమాట.
----------------------
విద్యఐనా, ఉద్యోగమైనా, ఆధ్యాత్మికత ఐనా ఏ రంగమైనా అంతే ఏదో ఒకటి వ్రాస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని కాదు.. ఏం చేస్తున్నామో. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుని ఆలోచించి చేయాలి బుర్రకి పదునుపెట్టి వ్యవసాయాత్మక బుద్ధిని పెంపొందించుకోవాలి.
-
శంకరకింకర

Monday, January 30, 2017

అవగాహన జ్ఞానము కాదు

నమస్తే
అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది. సాధారణంగా చాలామంది చేసేది చేస్తున్నది ఆగిపోతున్నది శ్రవణమననాదుల వద్దనే అంటే ఆ అవగాహన వద్దనే అదియే జ్ఞానమని పొరబడి ఆగిపోతారు. ఈ విషయమై ఎన్నో గ్రంథాలు రచించినవారు రచిస్తున్నవారు, వేదాంత పాఠాలు బోధిస్తున్నలేదా బోధించినవారుకూడా ఈ శ్రవణమననాదుల వల్ల కలిగిన అవగాహనే జ్ఞానమని పొరబడ్డవారున్నారు (అటువంటి కొందరు పండితులే స్వయంగా తెలుసుకుని చెప్పారు) వానిని దాటి నిధి ధ్యాసము చేసి అందులో కుదురుకుని అనుభవములోకి వచ్చినదే జ్ఞానము. ఈ ధ్యానము ఉపాసకులు చేసేదో లేక మరే మెడిటేషనో కాదు సర్వత్ర సర్వకాలాలయందు సమస్తమునందు దేహంలో మాత్రమే ఉన్నదనుకున్న ’నేను’ను సర్వత్రావ్యాప్తమైన ఏకాత్మనుగా చూడడమే ఈ ధ్యానము. దాని వల్ల అనుభవమునకు వచ్చేదే జ్ఞానము. అది నిరంతర అనుభవైకవేద్యము.

(పైది ముఖ పుస్తకంలో ఒక మిత్రుని పోస్ట్ కు సవరణగా పంపిన విషయం, )

అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది.... అంటే శ్రుతి స్మృతులతో సహా పురాణేతిహాసాదులు శాస్త్ర భాష్యాలు పఠించడం వల్లనూ, వినడం వల్లనూ తద్విషయము మీద కలిగేది అవగాహన అది జ్ఞానము కాదు. గురువాక్యమననముతో పాటు కలిగిన ఆ అవగాహనను ఆచరణలో ఉంచి,  నిధి ధ్యాసము చేయడం ద్వారా స్థిరీకృతమై అనుభవైకవేద్యమయ్యేదే జ్ఞానము.
- శంకరకింకర
(01/Jan/2015......)


Thursday, December 29, 2016

కోపాయుధం


గురుభ్యోనమః

"క్రుద్ధో హన్యాద్ గురూనపి"

కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ  అవసరం.

----

ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్ !
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా !!
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" !
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ !!
వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్ !
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి !!
య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి !
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!
(సుందరకాండ)

తా!! మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు.

క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" ! హనుమ ముఖ్యంగా ఈ మాటని పైశ్లోకంలో గట్టిగా చెప్తారు. కోపమో, క్రోధమో, క్షణికావేశమో ఏదైనా సరే కోపమునకు వశమైనవాడు ఏ పాపానికైనా ఒడిగడతాడు. అసలు చేయకూడని పాపం గురువుని నిగ్రహించడం. ఎదిరించడం, అధిక్షేపించడం వంటివి. ఏదో కారణానికి కోపించి గురువుమీద కూడా కినుక వహించేలా చేస్తుంది ఆ పరిస్థితి, అందుకే కోపం రాగానే పరిశీలించుకునేలా మనకి మనం తర్ఫీదిచ్చుకోవాలి. అసలు కోపం దేనికీ అని. గురువు మాట్లాడితే అదృష్టం. మాట్లాడకపోతే అదో అదృష్టం, తిడితే ఇంకా అదృష్టం. దగ్గరకు తీసుకుంటే అదో అదృష్టం. అసలు గురి ఉన్నవారు గురువు దగ్గరలో ఉన్నా లేకున్నా గురువు నాకన్నా దూరంగా ఎప్పుడున్నారు అన్న తృప్తితో ఉంటాడు. లేకపోతే నన్నలా మర్యాదించలేదు ఇలా పొగడలేదు గురువుగారి పక్కవాళ్ళు చూడలేదు వంటి భావనలు చుట్టుముడతాయి. లేదా నేను చెప్పిందెవరూ వినట్లేదు, నేను చెప్పిందెప్పుడూ తప్పంటున్నారు, లేదా నేను చెప్పినవాటికన్నా ఇంకోరు చెప్పినవి సరి అంటున్నారు ఇలా... ఏవేవో నిప్పు కణాలు అగ్నిలోంచి పుట్టినట్లు అసహన రూపంగా బయటికొస్తాయి. ఇవన్నీ కోపంలోంచి పుట్టేవే... కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ అవసరం.

-శంకరకింకర


Monday, December 19, 2016

గుర్తింపు!


వాళ్లకి గుర్తింపు రాలేదు వీళ్ళకి గుర్తింపు రాలేదు, వాళ్ళెవరో అర్హతలేకున్నా గొప్పోళ్ళైయ్యారు వీళ్ళకు అర్హతున్నా ఇలా ఉండిపోయారు. వాళ్ళకి డబ్బులు రాలేవు వీళ్ళకి డబ్బులొచ్చాయి, వాళ్ళూ వీళ్లూ సరే... నీ సంగతేంది.. నిజానికెవరైనా, ఎందుకైనా బాధపడాల్సి వచ్చినా, జాగ్రత్తపడాల్సి వచ్చినా, వారికోసం వాళ్ళు. నీ గురించి నీ బాధ గురించి చెప్పుకో భయ్యా.. వీలైతే పక్కోడికి సాయంచెయ్ వాడెవడో నీ పక్కోడికి సాయం చేయలేదని లాభం కూర్చలేదని వాడి మీద పడిపోకు...  రేపొద్దున్న ఒన్ ఫైన్ డే మార్నింగ్ నీ లెక్కలు చెప్పేటయానికి... నీ సంగతేందో అది కూడా చూసుకో...

దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః!
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః!!

- శంకరకింకర



Monday, November 21, 2016

ఆశ్రమ ధర్మసంకరం


          వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము అనేవి సనాతన ధర్మానికి పునాదులు. ఏ ధర్మాచరణం చెప్పినా ఏ వర్ణాశ్రమానికి సంబంధించి ఏది ధర్మం అని చెప్పబడుతుంది. వర్ణ ధర్మాచరణను చాలా మటుక్కు వక్రీకరించి చెప్పి వర్ణధర్మాలను పాటించనివ్వకుండా చేసారు స్వాతంత్ర్యం పూర్వ పాలకులు స్వాతంత్ర్యానంతరం వారి అనుయాయులైన పాలకులు.
ఇక ఆశ్రమ ధర్మాలకొస్తే మొదటి రెండు ఆశ్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మచారి గృహస్థులా జీవించడం అతి సాధారణమైన జీవన విధానంలా ఐపోయింది.. దాన్ని ప్రజలపై రుద్దడంలో మీడియా, సినిమా, సిక్కులర్ కమ్మీ ప్రొఫెసర్లున్న యూనివర్సిటీలు పెద్ద పాత్ర పోషించాయి. పోషిస్తున్నాయు...

          ఇక ఎవరిని ఎవరికి నిరూపించాలో తెలియని అపరమేధావులుగా కీర్తించబడ్ద ఆధునిక ధర్మ ప్రచారకులని తెలియబడ్డ ఆధునిక సన్యాసులూ ఆశ్రమ సంకరం చేసేశారు. చేస్తూనే ఉన్నారు.. మాది విశాల దృక్పథం అని చెప్పడానికి ధర్మం కట్టుబాట్లు వదలక్కరలేదు.. ధర్మ ప్రచారానికి ధర్మం వదలడం ఏరకంగా ధర్మమో అర్థంకాని పెద్ద ప్రశ్న. వీరివల్ల తాత్కాలికంగా సిక్యులర్స్ నుంచి వారికి ఆక్సెప్టెన్స్ వచ్చిందేమో కానీ... శాస్త్రరీత్యా ధర్మగ్లాని చేసారు, ఏం డౌట్ లేదు.
          మన ధర్మంలో కాషాయాంబరధారులకు అత్యున్నత గౌరవం ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఇక్కడా కొందరు సంకరం చేసేశారు మరి కొందరు అది కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయపీఠ పరంపరలను కాక స్వంత పీఠాలు పెట్టుకుని సనాతన సంప్రదాయము ఆచారమునకి వ్యతిరేకంగా నూతన ఒరవడి సృష్టించాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. సనాతన ధర్మం నుండి విడివడి లేదా దానికి అనుబంధంగా కొన్ని విభాగాలుగా ఏర్పడిన సమాజాలున్నాయి, వాటిలో స్పష్టత ఉంది, కానీ ఇందులోనే ఉండి ఇక్కడ సంకరం చేసేవాళ్లతో తస్మాత్ జాగ్రత చెప్పుకుంటున్నాను.
         
          ఈ విపరీతాలు ఎప్పుడో ఎందరో చూసి ఉండచ్చు నాకు కొత్త కావచ్చు... గృహస్థు, పత్నీ సహితులు కాషాయం కడుతున్నారు. వ్యవహారం అంతా కుటుంబీకుడిది వస్త్రం మాత్రం కాషాయం... కషాయం తాగినంత చిరాకు కలిగేలా..

          ఇక రెండు , తీసుకున్నది సన్యాసం చేసేది గృహస్థు పనులు. పోనీ వారేమైనా ఆమ్నాయ, సర్వజ్ఞాది పీఠాధిపతులా పీఠనిర్వహణలో భాగం ఉంటుంది అనుక్కోడానికి అంటే.. మా ఇంట్లోనూ పీట ఉంది దాని మీద కూర్చున్నప్పుడు నేనూ పీటాధిపతినే టైపు.. కట్టేది కాషాయం నెత్తికి క్రాపు, సోఫా సిట్టింగ్, వాటర్ బాటిల్ డ్రింకింగ్, కాషాయ ప్యాంటూ షర్టు... పైగా చేసేది ఫక్తు వ్యాపారం... ఇవి నార్త్ లోనే కాదు తెలుగు నేలలో మరింత ఊపు పొందుతోంది... సంప్రదాయ పీఠాలెప్పుడు కలుగజేసుకుంటాయో ధర్మ దండంతో నాలుగు చీవాట్లెప్పుడుపెడతాయో...

జయ జయ శంకర హర హర శంకర


Wednesday, October 26, 2016

దీపావళి - దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు

శ్రీ గురుభ్యోనమః

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.



       దీపావళి పర్వదినం మూడు రోజులు పాటు ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి. ఈ మూడు రోజులూ తెల్లవారు ఝాముననే తైలాభ్యంగన స్నానం చేసి కులదేవతారాధనం చేసి, యమధర్మరాజుని పితృదేవతలను, ఇష్టదేవతల స్మరించి పూజించడం భగవదనుగ్రహానికి మార్గం. దరిద్రనివారణకు ఈ దీపావళి త్రిరాత్ర ఉత్సవం చక్కని మార్గం.

        దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్ర్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్నిఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.

      అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కుల దేవతను, స్వధర్మాన్ని, వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రవర్తింపచేసిన రావణాది రాక్షసులు, కంసకౌరవాదుల వలె పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు.

      భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మపాలనం, ఆచారసంప్రదాయాలను పాటించడం గురుపాద సేవనం ఇవే ఐశ్వర్యం, తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.

        అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళిగూర్చి ఈ చిన్న వివరాన్ని ఆ రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పెద్దలు గురువులు చెప్పినది సంకలనం చేసి పొందుపరిచాను.

        "ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి" - విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్కపవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధినికలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

      నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దానిఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే ఈ రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


      దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు ఈ సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈసమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడుపైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వంరమారమి 4-4:30 మధ్యలో) ఈ ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

      ఈ స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అనిశాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో ఆ మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ ఈ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

       తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు ఓ అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్నిహరించు అని చెప్తూ చేయాలి.

        ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాతయమధర్మరాజుగారికి నమస్కరిస్తూఈ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

      యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారుమాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

      ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినేకొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీకమాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.

      దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధురపదార్థం తినాలి. ఈ దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

      ముఖ్యంగా ఈ దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, ఈ రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి ఈ మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.

        దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం,ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు. ముఖ్యంగా అర్థరాత్రి స్త్రీలు ఈ కార్యం నిర్వహించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.