Pages

Wednesday, August 12, 2026

బృందావన కథలు – 50 (స్వామి హరిదాస్)

జయ శ్రీరాధేకృష్ణ!

లోకంలో గాయకులనేకులు
ధనాన్ని కోరేవారుంటారు...
కీర్తిని కోరేవారుంటారు...
సుఖసంతోషాలను కోరేవారుంటారు.
రాజుల మెప్పును కోరేవారుంటారు...
కానీ...
తన గానంతో దేవుడినే తన వద్దకు రప్పించిన భక్తుడు ఒకరున్నారు!
ఆయనకు సంగీతం కేవలం ఒక కళ కాదు - అది ఒక ఆరాధన.
ఆయనకు రాగం ఒక స్వర సమ్మేళనం కాదు.
అది రాధాశ్యాముల పాదపద్మాలకు సమర్పించిన పుష్పం.
ఆయనకు తంబురా మీటే ఒక వాద్యపరికరం కాదు.
అది ఆయన హృదయంతో పలికించే ప్రార్థన.
ఆ మహాభక్తుడు బృందావన నికుంజాలలో తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని కోసం పాడిన సిద్ధపురుషుడు సంగీత సమ్రాట్ "స్వామి హరిదాస్!"
---
బృందావనం...
యమున ఒడ్డున వెన్నెల పరుచుకుంది.
కదంబ వృక్షాలు మౌనంగా నిలబడి ఉన్నాయి.
నిధివనంలోని తీగలు గాలికి ఊగుతూ, ఏదో రహస్యాన్ని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి.
ఎక్కడో ఒక కోయిల కుహూ రాగాలు, నెమళ్ల ఖ్రేంకణాలు...
“రాధే... రాధే...” అంటున్నట్లు వినిపిస్తున్నాయి.
అ ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరం.
ఆ కుటీరం అతి సాధారణం, వైభోగాలు ఏం లేవు.
బంగారు సింహాసనాలు లేవు.
వెండి పాత్రలు లేవు.
సేవకులు లేరు.
ప్రముఖంగా ఉన్నది ఒక్కటే ఒక పాత తంబురా...
వినపడుతున్నది ఒక్కటే రాధానామం...
కనిపిస్తున్నది ఒక్కటే శ్యామసుందరునిపై అంతులేని ప్రేమ.
స్వామి హరిదాస్ తన గానాన్ని ఎవరికో వినిపించడానికి పాడేవారు కాదు.
ఆయన పాడేది తనకు కనిపిస్తున్న రాధేశ్యామసుందరుని కోసం!
అందుకే ఆయన గానం విని మనుషులే కాదు ప్రకృతే పరవశించేది.
---
ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన గాయకుడు తాన్సేన్ గానం విని ముగ్ధుడయ్యాడు. “తానసేన్! నీ గానంలో ఇంత మాధుర్యం ఉంటే, నీకు ఈ సంగీతం నేర్పిన గురువు గానం ఇంకెంత అద్భుతంగా ఉండాలి! ఆయనను నా ఆస్థానానికి తీసుకురా. నేను ఆయన గానం వినాలి.” అని అన్నాడు.
తాన్సేన్ సన్నగా నవ్వి “రాజా! నా గురువుగారు బృందావనంలో ఉంటారు. ఆయన రాజుల కోసం పాడరు. బంగారం కోసం పాడరు. కీర్తి కోసం పాడరు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్రముఖ శ్రోతఉన్నాడు ఆయనకోసమే పాడతారు మా గురువుగారు, ఆ ప్రముఖ శ్రోత నికుంజ బిహారి శ్రీకృష్ణుడు. మీరు నిజంగా ఆయన గానం వినాలనుకుంటే... రాజుగా వెళ్లకండి. ఒక భక్తుడిగా వెళ్లండి.” అని చెప్పాడు
అక్బర్ ఆ మాటను ఆశ్చర్యపోయి సరే చూద్దాం అని బయలుదేరాడు.
రాజవస్త్రాలను విడిచాడు.
రాజభటులను దూరంగా ఉంచాడు.
సామాన్య భక్తుని వేషంలో తాన్సేన్వెంట బృందావనానికి బయలుదేరాడు.
నిధివన సమీపంలో స్వామి హరిదాస్ తన సాధనలో ఉన్నారు.
తాన్సేన్ తన గురువు నమస్కరించి పక్కన కూర్చున్నాడు. అదిగమనించిన స్వామి హరిదాస్ తాన్సేన్ ను పాడమన్నారు. తాన్సేన్ అద్భుతంగా పాడసాగాడు. మధ్యలో ఒక స్వరాన్ని తప్పుగా ఆలపించాడు...
ఆ క్షణం స్వామిహరిదాస్ తలెత్తి చూసి ఆపమన్నట్లు సైగ చేసారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
ఒక్కసారి శ్రుతిని సరిచేసి.
గానం మొదలు పెట్టారు.
ఆ రాగ తాళ స్వరాల లయ విన్యాసం...
చుట్టూ ఉన్న భక్తులందరి హృదయాలను కరిగించింది.
మరో స్వరం, మరో రాగం, మరో గానం...
అది యమునా అలలపై సున్నితంగా తేలుతున్న ఆకులా అందరి మనసులలో ఊగుతోంది.
మరో రాగం విరిసింది.
అది కదంబ పుష్పాల పరిమళంలా నిధివనమంతా వ్యాపించింది.
కోయిల తన గానాన్ని ఆపింది.
నెమలి తన నాట్యాన్ని ఆపింది.
యమునా ప్రవాహం సైతం నెమ్మదించినట్లు అనిపించింది.
తాన్సేన్ తలవంచాడు.
అక్బర్ కళ్లను మూసుకున్నాడు.
ఆయన చెంపలపై కన్నీటి బిందువులు జారాయి.
"అది సంగీతం కాదు - అది భక్తి స్వస్వరూపం."
గానం ముగిసిన తరువాత అక్బర్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
కొంతసేపటికి తాన్సేన్ వైపు తిరిగి “ఇంతటి గానం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఇంత అద్భుతంగా పాడగలిగితే, నీ గురువు గానం నీకంటే ఎందుకు ఇంత గొప్పగా ఉంది? అంత గొప్పగా నువ్వెందుకు పాడలేకపోతున్నావు” అని అన్నాడు
తాన్సేన్ చిరునవ్వు నవ్వి
“షెహన్ షాహ్! నేను మీ కోసం పాడుతాను.
నా గురువుగారు సమస్తలోకాలకీ షెహన్ షాహ్ ఐన శ్రీకృష్ణుని కోసం పాడుతారు.
మీరు నా గానానికి బహుమతి ఇస్తారు.
కానీ నా గురువు గానానికి స్వయంగా శ్రీకృష్ణుడు తనను తానే అర్పించుకుంటాడు.” అన్నాడు.
ఔను ఆమాట సత్యం, గతంలో కొంత కాలం క్రితం జరిగిందదే!
స్వామి హరిదాస్ గానం చేసేటప్పుడు కొన్నిసార్లు ఎవరో ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా చిరునవ్వేవారు.
ఎవరో అదృశ్య అతిథితో మాట్లాడుతున్నట్లుగా కనిపించేవారు.
భక్తులకు, శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది, ఆయనలో ఆయనే ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేక నిజంగానే దివ్య స్వరూపాలేమైనా ఆయనకు కనపడుతున్నాయా అని సందేహించేవారు.
ఒకరోజు ధైర్యం చేసి “గురుదేవా! అక్కడ ఎవరూ లేరు కదా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగారు
స్వామి హరిదాస్ నవ్వి...
“ఎవరితోనా?
నా శ్యాముడితో!
పక్కనున్న రాధమ్మతో!
మీకు కనిపించడంలేదా?” అని అడిగారు.
శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు.
వారికి ఏమీ కనిపించలేదు.
స్వామి హరిదాస్ మాత్రం మళ్లీ తన గానంలో మునిగిపోయారు.
ఆయనకు కనిపించేది ఏదో అదృశ్య స్వరూపం కాదు "మన కళ్లకు కనిపించని సత్యం" .
“గురుదేవా! మీరు దర్శిస్తున్న ఆ దివ్యరూపాన్ని మాకూ చూపించండి.” అని శిష్యులు రోజూ ప్రార్థించసాగారు.
ఒకరోజు అదే అదే విషయం అడిగారు శిష్యులు. ఆ కోరిక విని స్వామి హరిదాస్ కొంతసేపు మౌనంగా ఉన్నారు.
తరువాత శిష్యులను వెంటబెట్టుకుని నిధివనంలోని ఒక పవిత్ర ప్రదేశంలో ఆసీనులయ్యారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
కళ్లను మూసి
“రాధే...”
మరోసారి...
“శ్యామా...”
ఈసారి...
“రాధే... శ్యామా...”
అంటూ నామాన్ని రాగయుక్తంగా పాడసాగారు...
ఆ స్వరం నిధివనాన్ని తాకింది.
కదంబ వృక్షాలను తాకింది.
యమునను తాకింది.
ఆకాశాన్ని తాకింది.
అప్పుడు..
ఒక అపూర్వమైన పరిమళం వ్యాపించింది.
వెన్నెల మరింత తెల్లగా మారింది.
గాలి ఒక్కసారిగా నిశ్చలమైంది.
శిష్యులు కళ్లెత్తి చూశారు.
అక్కడ...
రాధారాణి!
ఆమె పక్కన...
శ్యామసుందరుడు!
వర్ణించలేని సౌందర్యం.
చూడలేనంత మాధుర్యం.
శిష్యుల నోటి నుంచి మాట రాలేదు.
కళ్ల నుంచి మాత్రం కన్నీళ్లు ఆగలేదు.
స్వామి హరిదాస్ మాత్రం వారిని చూసి ఆశ్చర్యపడలేదు.
ఎందుకంటే ఆయనకు వారు కొత్తవారు కాదు.
ప్రతిరోజూ తన గానంలో ఆయన వారినే పిలిచేవారు. వారిముందే, వారికోసమే పాడేవారు.
ఆ రోజు మాత్రం
బృందావనం మొత్తం స్వామి హరిదాస్ కి శ్రీ యుగళం ఇచ్చే దర్శనానికి సాక్షిగా నిలిచింది.
స్వామి హరిదాస్ తన గానం ఆపి చేతులు జోడించి
“ప్రభూ!
మీరు నా కోసం వచ్చారు.
కానీ నా కోరిక నా కోసం కాదు.
ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దివ్యదర్శనం సాధ్యం కాదు.
నా బృందావనానికి వచ్చే ప్రతి దీనుడికీ...
ప్రతి కన్నీటి భక్తుడికీ...
ప్రతి నామస్మరణ చేసే హృదయానికీ...
మీ కరుణ లభించాలి.
మీరు ఇక్కడే ఉండండి.
మమ్మల్ని విడిచి వెళ్లవద్దు.” అని కోరాడు
రాధారాణి చిరునవ్వు నవ్వింది.
శ్యామసుందరుడు తన భక్తుని వైపు చూశాడు.
ఆ దివ్యరూపాలు క్రమంగా ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి.
రాధా...
శ్యామ...
రెండు రూపాలు...
ఒకే మాధురమైన రూపంగా మారాయి.
ఆ రూపమే "శ్రీ బాంకే బిహారీ!"
అది కేవలం ఒక మూర్తి ప్రకటింపబడడం కాదు.
భక్తి పిలిస్తే భగవంతుడు వస్తాడనే సత్యానికి బృందావనం ఇచ్చిన సజీవ సాక్ష్యం.
కాలం గడిచింది స్వామి హరిదాస్ బాంకే బిహారీలో లీనమైయ్యారు.
ఆయన సంగీతం ముగిసింది...
కానీ గానం ఇంకా వినిపిస్తూనే ఉంది
ఈరోజు కూడా నిధివనం వైపు గాలి వీచినప్పుడు...
చాలా జాగ్రత్తగా చెవులు రిక్కించి భక్తితో వింటే ఎవరికైనా వినిపించవచ్చు..
ఆ తంబురా నాదం...
ఆ మృదువైన ఆలాపన...
ఆ హృదయాన్ని కట్టేసే కృష్ణ నామ గానం...
“రాధే... శ్యామా...”
అది స్వామి హరిదాస్ గానమో...
యమునా అలల గుసగుసో...
బృందావనపు గాలి పలికే నామమో...
విడిగా చెప్పడం కష్టం?
కానీ ఒక విషయం మాత్రం నిజం...
భగవంతుణ్ణి స్వార్థం లేకుండా ప్రేమించిన హృదయానికి,
భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉండడు.
ఆయనను వెతకడానికి అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఆయనను చూడటానికి కళ్లను మూసుకోవలసిన అవసరం లేదు.
ఒక్కసారి హృదయం నిజంగా “రాధే... శ్యామా...” అని పిలిస్తే చాలు.
ఎందుకంటే...
భక్తుడు దేవుణ్ణి పిలిచినప్పుడు,
దేవుడు రావాలా వద్దా అని ఆలోచించడు.
భక్తుని ప్రేమే ఆయనకు ఆహ్వానం.
భక్తుని హృదయమే ఆయనకు బృందావనం.
---
బృందావన కథలకు మంగళం
ఇలా యభై వ కథతో మన “బృందావన కథలు” యాత్ర ప్రస్తుతానికి ముగుస్తోంది.
కళ్ళతోచూసిన పదాలు మనసులోకి చేరి నిశ్శబ్దమవుతాయి.
పుస్తకాల్లో దూరి పుటలు మూసుకుపోతాయి.
కథలన్నీ ముగుస్తాయి, ఎవరి గాథలైనా కంచికే చేరతాయి.
ఐతే...
బృందావనం ఎప్పుడూ భక్తులకై తెరిచే ఉంటుంది.
రాధానామం మాత్రం ఆగదు.
యమున ప్రవహిస్తూనే ఉంటుంది.
కదంబాలు ఊగుతూనే ఉంటాయి.
నిధివనం తన రహస్యాన్ని దాచుకుంటూనే ఉంటుంది.
బాంకే బిహారీ తన మధురమైన చిరునవ్వుతో భక్తులను కాస్తూనే ఉంటాడు.
మనం ఈ కథలను చదివింది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు.
మన హృదయంలో ఒక చిన్న బృందావనం నిర్మించుకోవడానికి.
అక్కడ...
కోపానికి చోటుండకూడదు.
అహంకారానికి చోటుండకూడదు.
ద్వేషానికి చోటుండకూడదు.
ఉండవలసింది ఒక్కటే—
రాధా...
కృష్ణా...
అనే రెండు నామాలు.
ఆ రెంటిమధ్య ఉండే ప్రేమ...
చివరగా...
మన జీవితంలో ఎన్నో జన్మలు గడిచినా,
ఎన్నో మార్గాలు తిరిగినా,
ఎన్నో సాధనలు చేసినా,
నిత్యం మన శ్వాసలో ఖచ్చితంగా
“రాధే... కృష్ణా...”
అనే నామం ఉండాలి.
అప్పుడు...
మన హృదయం కూడా బృందావనమే.
మన కన్నీరు కూడా యమునే.
మన నిశ్వాసం కూడా వేణునాదమే.
మన జీవితం కూడా...
రాధాశ్యాముల పాదపద్మాలకు ఒక చిన్న సేవే!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
పుట్టినప్పటినుండి పుణ్యములెరుగను
పాపపు పనులే చేసితిని అట్టే
నా కర్మము అణచగ జాలక
పట్టితి నీ పాద పద్మములు కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఎన్ని జన్మలనో ఎత్తి అలసితిని
ఇకనైనా నన్ను బ్రోవగదే
అన్యమెరుగని దాసుడనయ్యా
నన్ను నీ దరి చేర్చుకోరాదా కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఈకృతితో మంగళం చెప్పుకుంటూ
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
రాధే రాధే!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

 చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ 5వ సర్గలో, లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామికి ఆ రాత్రి చంద్రుడు అపూర్వమైన సహకారం అందిస్తాడు. తన శీతల కిరణాలను సర్వత్రా విరజిమ్మి, ప్రతి వీధిని, ప్రతి గృహాన్ని, ప్రతి దారిని స్పష్టంగా దర్శనమిచ్చేలా చేస్తాడు. సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి ఆ చంద్రప్రకాశమే మార్గదర్శిగా నిలుస్తుంది.
హంసో యథా రాజతపఞ్జరస్థః - సింహో యథా మన్దరకన్దరస్థః!
వీరో యథా గర్వితకుఞ్జరస్థః - చన్ద్రోఽపి బభ్రాజ తథామ్బరస్థః!!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
వెండి పంజరంలో ఉన్న హంసవలె, మందరపర్వత గుహలోని సింహంవలె, గర్విత గజంపై ఆసీనుడైన వీరునివలె, ఆకాశంలో చంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశించాడు.
తదనంతరం చంద్రుని శీతల కాంతి జగత్తును ఎలా ప్రకాశింపజేసిందో మహర్షి ఇలా వర్ణిస్తారు...
ప్రకాశచన్ద్రోదయ నష్టదోషః - ప్రవృత్త రక్షః పిశితాశ దోషః!
రామాభిరామేరిత చిత్తదోషః - స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః!!

(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
చంద్రోదయంతో రాత్రి చీకట్లు తొలగిపోయాయి. చంద్రుని నిర్మల కాంతి సమస్త దిక్కులను ప్రకాశింపజేసి, సీతాన్వేషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఈ చంద్రకాంతి కేవలం ప్రకృతిలోని వస్తువులను ప్రకాశింపజేయలేదు; హనుమంతుని కార్యసిద్ధికి సహాయకంగా మార్గదర్శకంగా నిలిచింది.
అదేవిధంగా, శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని రాసపంచాధ్యాయి (29-33 అధ్యాయాలు)లో, వేణునాదాన్ని ఆలకించి పరమప్రియుడైన శ్రీకృష్ణుని అన్వేషించేందుకు గోపికలు రాత్రివేళ బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో కూడా వ్యాసమహర్షి శరద్ పూర్ణిమ చంద్రుని నిర్మల కాంతిని ఎంతో రమణీయంగా వర్ణిస్తారు.
భగవానపి తా రాత్రిః శరదోత్ఫుల్లమల్లికాః |
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ||
(శ్రీమద్భాగవతం 10.29.1)
"శరదృతువులో వికసించిన మల్లెల పరిమళాలతో నిండిన ఆ పూర్ణిమ రాత్రిని దర్శించిన శ్రీకృష్ణుడు, యోగమాయను ఆశ్రయించి రాసలీలకు సంకల్పించాడు."
ఈ రెండు మహాగ్రంథాలలోనూ ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది.
ఇక్కడ వెతుకుతున్నవారు సాధకులు.
వెతకబడేది పరమాత్మ.
ఎటువైపు నడవాలో, ఏ మార్గంలో సాగాలో, ఏమి గ్రహించాలో స్పష్టంగా చూపించే వెలుగే గురువు.
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః !!
"అజ్ఞానాంధకారంలో మునిగిన శిష్యునికి జ్ఞానాంజనం అద్ది దృష్టిని ప్రసాదించేవాది గురువు."
సుందరకాండలో హనుమంతుడు లంకలోని గృహాలను పరిశీలిస్తూ, రత్నఖచిత కిటికీలను, వాటి అలంకారాలను ఎంతో నిశితంగా దర్శిస్తాడు.
భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నప్పుడు, ఆయన ముఖారవిందాన్ని, ముఖ్యంగా చెవులలో ఊగిసలాడుతున్న మకరకుండలాలను పరమాత్మ దగ్గరకు వచ్చేవారికి దారిచూపడానికి ఊగుతున్నాయా అన్నట్లు వ్యాసమహర్షి మనోహరంగా వర్ణిస్తారు.
మనిషి ముఖానికి ద్వారం నోరైతే, చెవులు జ్ఞానానికి కిటికీలు.
చెవుల ద్వారానే శ్రుతి, అంటే వేదం, మనలోకి ప్రవేశిస్తుంది.
రత్నాలతో అలంకరించిన కిటికీలు, మకరకుండలాలు - వేదాభరణాలు, వేదానికి ఆభరణం వేద విహిత ఆచరణకు సంకేతాలు.
వేదానికి ఆభరణం వేదవిహిత కర్మాచరణ, అదే జ్ఞానానికి పరమాత్మను పొణ్దడానికి మార్గం.
---
సుందరకాండలో హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఎన్నో రకాల సాధకులను దర్శిస్తాడు. ఎవరో అగ్నిహోత్రం నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. ఎవరో జపమాలను చేతబట్టి, దర్భకట్టలు మంత్రాలు చేస్తుంటారు. పూర్తిగా కర్మకాండలో లీనమై ఉంటారు.
ప్రతి ఒక్కరి మార్గం వేరు. ప్రతి ఒక్కరి సాధన వేరు. హనుమంతుడు మాత్రం వారందరినీ గమనిస్తూ, తన లక్ష్యమైన సీతామాత అన్వేషణను కొనసాగిస్తాడు.
అదేవిధంగా భాగవతంలో గోపికలందరూ బృందావనంలో శ్రీకృష్ణుని అన్వేషణలో పరుగులు తీస్తుంటారు. వారు ఒకరిని ఒకరు చూడరు; ఎవరి సాధనను వారు గమనించరు. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే భావమే వారికి లేదు.
ఎందుకంటే
పరమాత్మను చేరే మార్గంలో పోటీ ఉండదు.
పోలిక ఉండదు.
ప్రతి సాధకుని ప్రయాణం అతనిదే.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్యః !!
(కఠోపనిషత్ 1.2.23)
"ఆత్మతత్త్వం వాక్చాతుర్యంతో కాదు, మేధస్సుతో కాదు, వినికిడితో మాత్రమే కాదు; తనను ఆశ్రయించినవారికి మాత్రమే పరమాత్మ తనను తాను అనుగ్రహిస్తాడు."
అందుకే వ్యాస వాల్మీకులిద్దరూ ఈ రెండు ఘట్టాలూ ఒకే విధంగా చెప్పారు.
సాధన మార్గాలు అనేకం కావచ్చు.
సాధకులు ఎందరో కావచ్చు.
ఎలాగైతే ఎవరి ఆకలి వారిదే,
ఎవరి నిద్ర వారిదే,
ఎవరి అనుభవం వారిదే... అదేవిధంగా...
కానీ, సాధకుల అంతిమ గమ్యం ఒక్కటే "పరమాత్మను పొందడం"
ఆ గమ్యానికి దారి చూపి, ఆ మార్గంలో నడిపించే "చంద్రకాంతి - స్వగురుకృపయే", ఆ ప్రయాణాన్ని సార్థకం చేసేది నిరంతర సాధన.
"గురుకృపా హి కేవలం - శిష్య పరమ మంగళం."
- శంకరకింకరః

Sunday, August 9, 2026

బృందావన కథలు – 49 (బృందాదేవి నిస్స్వార్థ సేవ)

జయ శ్రీరాధే!

జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
వృందే నమస్తే చరణారవిందం
రాధాకృష్ణోః సేవయా ప్రసన్నే!
త్వయా వినా నైవ భవేత్ కదాచిత్
వృందావనే దివ్యవిలాసలీలా!!
“ఓ వృందాదేవీ! నీ పాదపద్మములకు నమస్కారం. నిరతమూ రాధాకృష్ణుల సేవలో ఆనందించే తల్లీ! నీ అనుగ్రహం లేకుండా వృందావనంలో శ్రీ యుగళి దివ్యలీలలను అనుభవించడం సాధ్యం కాదు. మమ్మనుగ్రహించి శ్రీ యుగళి దివ్యలీలలను మాకు సాకారం చేయి."
బృందావనం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది...
యమునా తీరం...
కదంబ వృక్షాలు...
గోవర్ధన గిరి...
గోపికల ప్రేమ...
రాధామాధవుల మధుర లీలలు...
కానీ...
ఈ లీలలన్నీ ఎవరి నిర్వహణలో జరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించామా?
వేదిక సిద్ధం చేసే దర్శకుడు కనబడడు...
కానీ నాటకం అతని వల్లే విజయవంతమవుతుంది.
అలాగే...
బృందావనంలోని ప్రతి పుష్పం వికసించడం వెనుక...
ప్రతి కోకిల గానం వెనుక...
ప్రతి మలయమారుతం వీచడం వెనుక...
ప్రతి కుఞ్జం అలంకరించబడడం వెనుక...
ఒక మహా సేవకురాలు ఉన్నారు.
ఆమెయే శ్రీ బృందాదేవి.
ఒకసారి...
శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునితో కుఞ్జవిహారం చేయాలని సంకల్పించారు.
ఆ సంకల్పం బృందాదేవికి చేరవేయబడింది...
ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
"ఈరోజు రాధామాధవుల లీల మరింత మధురంగా జరగాలి" అని భావించి...
"ఈ రోజు 'రాధే... రాధే...' అనే నామమే ఆలపించండి." వేలాది చిలుకలకు ఆజ్ఞ ఇచ్చింది.
నెమళ్లను పిలిచి " రాధాశ్యాములకు అల్లంత దూరంలో కనువిందు చేసేలా పురివిప్పి నృత్యం చేయండి" అని ఆజ్ఞ వేసింది
కోకిలలతో
"మీ గానం మృదువుగా ఉండాలి.
వారి సంభాషణకు అంతరాయం కలగకూడదు." అని నెమ్మదిగా చెప్పింది.
తుమ్మెదలను పిలిచి
"విరబూసిన పువ్వుల చుట్టూ మాత్రమే విహరించండి.
యుగళ సర్కారుల సమీపంలో ఎక్కువగా నాదం చేయవద్దు." అని ఆదేశించింది...
మలయమారుతాన్ని పిలిచి...
"చందన పరిమళాన్ని మెల్లగా తీసుకురా...
రాధాకృష్ణుల అలకలు (కురులు) చెదరకూడదు."
మేఘాలతో...
"ఎక్కువ ఎండ కాయకూడదు...
అలా అని పూర్తిgA చీకటి కాకూడదు...
సరిగ్గా వారి ఏకాంతానికనుకూలమైన వెలుగు ఉండాలి, అలా సూర్యకాంతిని కప్పండి." అని చెప్పింది.
కదంబ వృక్షాలతో...
"మీ కొమ్మలు కిందకు వంచండి.
స్వాభావికంగా ప్రేమయుగళం కూర్చోడానికి పుష్ప మండపం ఏర్పడాలి." అని శాసనం చేసింది
మల్లెలు, మాలతీలు, జాజిపూలతో...
"మీ సుగంధాన్ని కొంచెం పెంచండి.
ఈరోజు యుగళమిలనం అత్యంత విశేషంగా గుర్తుండిపోవాలి." అను ఆజ్ఞ ఇచ్చింది...
అలా...
బృందాదేవి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలిస్తూ...
బృందావనాన్ని ఒక దివ్య ప్రేమాలయంగా మార్చింది.
కొంతసేపటికి...
రాధారాణి, శ్రీకృష్ణుడు ఆ కుఞ్జంలోకి ప్రవేశించారు.
చిలుకలు "రాధే... రాధే..." అని పలుకుతున్నాయి.
కోకిలలు మృదుస్వరంతో ఆలపిస్తున్నాయి.
మలయమారుతం పుష్పసుగంధాన్ని మోసుకొస్తోంది.
యమునా అలలు కూడా నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి.
అన్నీ...
అన్నీ...
వారి ఆనందానికే సేవ చేస్తున్నట్లు అనిపించింది.
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో రాధారాణిని చూసి
"ప్రియే! ఈరోజు బృందావనం మరింత అందంగా ఉంది, ప్రకృతికూడా పరవశిస్తోంది." అన్నాడు.
రాధారాణి చిరునవ్వుతో...
"శ్యామా!
ఇది ప్రకృతి మనకోసం చేసిన ఏర్పాటు కాదు...
మన ప్రియసఖి బృందాదేవి చేసిన ప్రకృత్యలంకార సేవ." అని పలికి, కొంచెందూరంలో సేవకై వేచిఉన్న బృందాదేవిని చూసి...
"బృందా! దగ్గరకు రా." అని రాధారాణి పికిచారు.
బృందాదేవి వినయంతో వచ్చి నమస్కరించింది.
రాధారాణి ఆమెను ఆలింగనం చేసుకొని అన్నారు...
"సఖీ! నీ సేవలో స్వార్థం లేదు...
ప్రతిఫలం కోరే భావం లేదు...
పేర్లు, సత్కారాలు పొందాలన్న తాపత్రయం లేదు...
అందుకే నీ సేవ నన్ను అత్యంత సంతోషపరుస్తుంది."
శ్రీకృష్ణుడు కూడా చిరునవ్వుతో...
"బృందా! నీ సేవ లేకుంటే నా బృందావన లీలలు సంపూర్ణం కావు." అని మెచ్చుకిన్నారు..
ఆ మాటలు విన్న బృందాదేవి కన్నీళ్లు పెట్టుకుంది.
"ప్రభూ...
నాకు మీ పాదసేవే చాలు.
నా పేరు ఎవరికీ తెలియకపోయినా పరవాలేదు.
మీ ఆనందమే నా జీవితం."
అని వినమ్రంగా చెప్పింది.
---
సేవ అంటే...
ముందు దూసుకుపోయి ప్రశంసలు పొందడం కాదు.
వెనుక ఉండి...కార్యక్రమం నిర్వర్తించడం, భగవంతుని ప్రీతికలిగేటట్లు ప్రవర్తించడం.
తన పేరు వినిపించకపోయినా...
తన కీర్తి రాకపోయినా...
తన సేవ ద్వారా రాధాకృష్ణుల ఆనందం కలిగించగలిగితే...
అదే బృందాదేవి చేసిన నిజమైన "నిష్కామ సేవ."
బృందావనంలో రాధాకృష్ణుల కంటే ముందు భక్తుని సేవను గమనించేది బృందాదేవియే అంటారు బృందావన వాసులు.
ఆమె అనుగ్రహం లభిస్తే...
రాధారాణి కృప సులభంగా లభిస్తుంది.
"ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయః తద్ధామ వృందావనం!"
వ్రజధామంలోని ప్రతి గడ్డి పరక కూడా సేవలో నిమగ్నమై ఉంటుంది. ఆ సేవా సంప్రదాయానికి జీవంత స్వరూపమే 'శ్రీ బృందాదేవి.'
మన జీవితంలో కూడా...
మన కుటుంబంలో...
మన దేవాలయంలో...
మన గురుసేవలో...
మన సమాజంలో...
పేర్లు, పద్దులు, బిరుదులు, కీర్తి కాంక్ష వదిలి
బృందాదేవిలా నిశ్శబ్దంగా - నిష్కామంగా సేవ చేయగలిగితే...
ఆ సేవను పరమాత్మ స్వయంగా స్వీకరిస్తారు.
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ శ్రీ బృందాదేవి!
— శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

Friday, August 7, 2026

బృందావన కథలు – 48 (బ్రజరజస్సు మహిమ)

"దేవతలకైనా దుర్లభమైనది బృందావన ధూళి"

జయ శ్రీరాధేకృష్ణ!
బంగారానికి విలువ ఉంది...
ముత్యాలకు విలువ ఉంది...
వజ్రాలకు విలువ ఉంది...
అవి మనిషిని ధనవంతుణ్ని చేయగలవు.
కానీ...
కృష్ణ భక్తిలోకంలో వాటన్నింటికంటే అమూల్యమైన ఒక సంపద ఉంది.
అది బంగారం కాదు...
అది మాణిక్యం కాదు...
అది రాజ్యమూ కాదు...
అది బ్రజరజస్సు... బృందావన ధూళి!
అది సాధారణ మట్టిలా కనిపించవచ్చు.
కానీ...
ప్రేమతో చూసే కన్నులకు...
అది మట్టి కాదు...
శ్రీశ్రీ రాధా-కృష్ణుల పాదరేణువులు.
అందుకే బ్రజధామంలో అడుగుపెట్టిన మహానుభావులు ముందుగా చేసే పని...
ఆ ధూళిని తలపై చల్లుకోవడం...
కళ్లకు అద్దుకోవడం...
హృదయానికి హత్తుకోవడం.
తమ వంటికి పూసుకోవడం.
ఆ మట్టిపై నందనందనుడు తన చిన్నిపాదాలతో పరుగులు తీశాడు...
ఆ మట్టిపై శ్రీరాధారాణి చరణకమలాలు విహరించాయి..
ఆ మట్టిపై గోపికల ప్రేమతోకూడిన కన్నీళ్లు ముత్యాల్లా జారాయి...
ఆ మట్టిపై గోపకులతో కలిసి ఆడుకున్న కృష్ణుని ఆటలు దాగున్నాయి...
ఆ మట్టిపై కృష్ణుడి కాచిన గోవుల గిట్టల ముద్రలు పడ్డాయి...
ఆ మట్టిపై కృష్ణుడు చేసిన అనేకానేక లీలల గాథలు ఇంకా సజీవంగా ఉన్నాయి...
ఆ రేణువులపై గోపబాలుర నవ్వులు, వేణునాదాలు, గోపికల రాసలీలలు కలిసిపోయాయి...
అందుకే...
అది మట్టి కాదు...
కృష్ణ ప్రేమకు తెఱగు...
కృష్ణ భక్తుల ప్రాణం...
వారి ముక్తికి మార్గం...
ఒకరోజు...
మథుర నుండి శ్రీకృష్ణుడు తన ప్రియసఖుడు, పరమ జ్ఞానియైన ఉద్ధవుడిని బృందావనానికి తన కుశల సందేశం చెప్పడానికి పంపాడు.
ఉద్ధవుడు గొప్ప జ్ఞాని.
సాక్షాత్తూ బృహస్పతికి శిష్యుడు.
వేదశాస్త్రాలలో నిష్ణాతుడు.
అటువంటి మహాజ్ఞాని బృందావనంలో అడుగుపెట్టిన క్షణం నుండి...
అతను చూసింది తాను శాస్త్రాలద్వారా తెలుసుకోనిది...
ప్రతి చెట్టు - పుట్టా "కృష్ణా..." అని నిట్టూరుస్తోంది.
ప్రతి లత ఆయన కోసం ఎదురు చూస్తోంది.
ప్రతి గోవు ఆయన దారినే చూస్తూ అంబారావం చేస్తున్నది.
ప్రతి గాలి వేణుగానాన్ని మోస్తోంది.
అక్కడి గోపికలను చూసిన ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు.
వారు కృష్ణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ బాధతో ఏడవడం కాదు...
కృష్ణుడు చెప్పినవిధంగానే జీవిస్తున్నారు
కృష్ణుడు ఇష్టపడేవిధంగా జీవిస్తున్నారు
కాదు కాదు కృష్ణుడిగానే జీవిస్తున్నారు.
వారి శ్వాసలో కృష్ణుడు...
వారి చూపులో కృష్ణుడు...
వారి మాటల్లో కృష్ణుడు...
వారి కన్నీళ్లలో కృష్ణుడు...
వాళ్లను చూసినతరవాత, అంత జ్ఞానిఐన ఉద్ధవుడు మరింత వినయంతో కరిగిపోయాడు.
పరంపరగా వస్తున్న వేల సంవత్సరాల జ్ఞానాన్ని తాను తెలుసుకున్నా...
అది గోపగోపికలు, బృందావనం ఆ కృష్ణ పరమాత్మపై చూపే నిష్కల్మశమైన ప్రేమ ముందు తక్కువేనని తెలుసుకున్నాడు.
చివరకు ఆయన చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు—
ఆసామహో చరణరేణుజుషామహం స్యాం
వృన్దావనే కిమపి గుల్మలతౌషధీనామ్!
యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా
భేజుర్ముకున్దపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్!!
(శ్రీమద్భాగవతం 10.47.61)
"అయ్యో! ఈ గోపికల పాదరేణువును పొందే భాగ్యం నాకు కలిగితే ఎంత ధన్యుడనయ్యేదాన్ని! వారు నడిచే బృందావనంలో ఒక చిన్న గడ్డిమొక్కగా, ఒక లతగా, ఒక ఔషధిగా పుట్టినా చాలు. వారి పాదధూళి నాపై పడుతుంది."
జ్ఞానానికి ప్రతీక అయిన ఉద్ధవుడు...
స్వర్గాన్ని కోరుకోలేదు.
వైకుంఠాన్ని అడగలేదు.
ఒక్క చిటికెడు బ్రజరజస్సును మాత్రమే కోరుకున్నాడు.
---
మరో సందర్భంలో...
సకల కామనలనూ జయించిన పరమశివుడికీ బృందావనంలో జరిగే రాసలీలను చూడాలి... అనే కోరిక కలిగింది...
కానీ...
అది అందరికీ లభించే భాగ్యం కాదు. సమస్తాన్నీ నియంత్రించగల శివుడే ఐనా లోకాచారప్రియుడైన కారణాన
శ్రీరాధాదేవి అనుమతితో గోపికా రూపాన్ని ధరించి...
బృందావనంలో ప్రవేశించి రాసలీలలను స్వయంగా దర్శించాడు...
నేటికీగోపేశ్వర మహాదేవుడుగా అక్కడే నిలిచి ఉన్నాడు.
బ్రజధామ మహాత్మ్యాన్ని కాపాడడానికే కాదు...
బ్రజరజస్సును తన శిరస్సుపై ధరించడానికి కూడా.
సృష్టికర్త బ్రహ్మదేవుడే...
ఒకప్పుడు తన పదవిపై, త్నకున్న జ్ఞానంపై గర్వించాడు.
గోపబాలులను, గోవులను అపహరించి శ్రీకృష్ణుని పరీక్షించాలని చూశాడు.
కానీ...
కృష్ణుని అనంత వైభవాన్ని దర్శించిన తరువాత...
ఆయన అహంకారం కరిగిపోయింది.
బ్రజభూమిలోని ఒక్క రేణువు కూడా బ్రహ్మలోక వైభవానికంటే గొప్పదన్న సత్యం అవగతమైంది.
ఈ యుగంలోనూ ...
ఎందరో భక్తులు బృందావనంలో అడుగుపెట్టారు బ్రజధూళిని తమ నెత్తిన వేసుకున్నారు.
శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు
యమునాతీరంలో...
గోవర్ధన సమీపంలో...
బృందావన ధూళి కనిపించగానే...
ఆయన ఒక్కసారిగా నేలపై సాష్టాంగంగా పడ్డారు.
ఆ ధూళిని గుండెలకు పూసుకున్నారు.
కళ్లకు అద్దుకున్నారు.
భక్తులు ఆశ్చర్యంగా చూస్తుండగా
"ఇది ధూళి కాదు...
నా గోపాలుడి పాదరేణువు...
నా రాధారాణి చరణస్పర్శతో పవిత్రమైన బ్రజరజస్సనే అమృతం..." అనేవారు.
నేటికీ...
బృందావనానికి వెళ్లే భక్తులు...
అక్కడి నుండి బంగారం తీసుకురారు...
రత్నాలు తీసుకురారు...
పట్టు వస్త్రాలు తీసుకురారు...
బొమ్మలో, మరే కానుకలో తీసుకురారు...
ఒక్క పిడికెడు...
బ్రజరజస్సు తీసుకొస్తాడు.
అది ఇంట్లో అలంకరించడానికి కాదు...
హృదయంలో నిలుపుకోడానికి.
ఆ బ్రజరేణువులను నుదుటిపై ధరించినప్పుడు...
తన మనసు వినయాన్ని నేర్చుకుంటుంది.
ఆ బ్రజరేణువులను కళ్లకు అద్దుకున్నప్పుడు...
తన దృష్టి పవిత్రమవుతుంది.
ఆ బ్రజరేణువులను హృదయానికి పూసుకున్నప్పుడు...
రాధా-కృష్ణుల ప్రేమ తన హృదయంలో చిగురిస్తుంది.
బ్రజరజస్సు మామూలు మట్టి కాదు.
అది శ్రీశ్రీ రాధా-కృష్ణుల చరణస్పర్శతో పవిత్రమైనపరమతీర్థం.
ఆ ధూళిని గౌరవించే హృదయంలోవినయం పుడుతుంది.
వినయం ఉన్న చోటభక్తి వికసిస్తుంది.
భక్తి వికసించిన చోటప్రేమ పుష్పిస్తుంది.
ప్రేమ వికసించిన హృదయంలో...
శ్రీశ్రీ రాధా-కృష్ణులు శాశ్వతంగా నివసిస్తారు.
బ్రజరజస్సును శిరస్సుపై ధరించడం - దాని మహిమను హృదయంలో ధరించడం.
ఈ రెండూ బృందావన రాధాకృష్ణ భక్తుల నిత్య నియమం.
జయ జయ శ్రీరాధే!
జయ జయ శ్యామసుందర!
జయ జయ శ్రీ బృందావన్!
- శంకరకింకరః

Wednesday, August 5, 2026

బృందావన కథలు – 47 (శ్రీ రాధికా భక్త చరణ రేణువు - రజనీకాంత భక్తి)

జై రాధే కృష్ణ!

జై బృందావన్!
జై బర్సానా!
తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి।
వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే!!
"కాల్చి కరిగించిన బంగారంలా ప్రకాశించే వర్ణం కలిగిన వృందావనేశ్వరి! వృషభానుని కుమార్తె! శ్రీహరికి పరమ ప్రియమైన రాధాదేవీ! నీకు నా కోటి ప్రణామాలు."
"రాధే... రాధే..." అనే మధురనామం గాలిలో కలిసిపోయి ప్రతిధ్వనించే పవిత్ర బర్సానా ధామం...
వేకువజామున చల్లని పిల్లగాలులు రాధానామాన్ని మోసుకొస్తుంటాయి. గిరిరాజు ఒడిలోని ప్రతి ధూళికణం భక్తి పరిమళాన్ని వెదజల్లుతుంది. పక్షుల కలకూజితాలు మంగళగీతాలుగా వినిపిస్తాయి. ఆ దివ్యభూమిలో ఒక చిన్న గుడిసెలో రజనీకాంత అనే నిరుపేద భక్తురాలు నివసించేది .
ఆమె ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు...
ఆమెకు ఎవరూ లేరు...
ఆమెకు ఆస్తిపాస్తులు లేవు...
ఆడంబరమైన జీవనవిధానం లేదు...
ఆమెకు సాహిత్యం, స్తోత్రం, పూజ ఏమీ రావు...
ఆమెది అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన పల్లెపడుచు జీవితం...
కానీ ఆమె వద్ద భువనత్రయంలోకెల్లా దుర్లభమైన ఒకే ఒక సంపద ఉంది అది "శ్రీరాధారాణి చరణాలపై అవ్యాజమైన ప్రేమ, అనన్యమైన భక్తి"
రజనీకాంత ప్రతిరోజూ బ్రహ్మముహూర్తానికే లేచి, బావి నుండి నీటిని తోడి తెచ్చి, బానలకొద్దీ మోస్తూ కొండపైనున్న శ్రీరాధారాణి ఆలయానికి తీసుకెళ్ళేది. రాధారాణి గుడి మెట్ల ముందు నిలబడి రెండు చేతులూ జోడించి "అమ్మా... నువ్వు బర్సానాలో, బృందావనంలో సఖులతో, కాన్హాతో కలిసి విహరించడానికి ఈ మెట్లమీదనుంచే వెళతావు. అప్పుడు నీ పాదాలు ఈ మెట్లపై పడతాయి. నిన్ను చూడడానికొచ్చే నీ ప్రియభక్తుల పాదాలు ఈ మెట్లను తొక్కుకుంటూ నీ వద్దకు వస్తారు. ఈ మెట్లమీద నీ పాద ధూళి, నీ సఖుల పాదధూళి, నీ భక్తుల పాదధూళి పడుతుంది. ఆ పాద ధూళి రోజూ నా చేతులతో శుభ్రమైతే... ఈ నా జన్మ సార్థకమైనట్లే." అని ప్రార్థించేది.
అదే ఆమె చేసే స్తోత్రం
అదే ఆమె చేసే పూజ
అదే ఆమె చేసే వ్రతం
అది ఆమెకు నిత్య నోము...
రజనీకాంత ఇలా ప్రార్థించి ఆపై ఒక్కో మెట్టును తుడిచి, నీటితో కడిగి, తన చీరకొంగుతో ప్రేమగా తుడిచేది. చిట్టచివర మెట్టువరకూ తుడిచి కుప్పగా చేర్చిన పాదధూళిని తిలకంగా ధరించేది.
ఆమె శ్వాసలో రాధానామం...
ఆమె హృదయంలో రాధాభావం...
ఆమె పెదవులపై ఎప్పుడూ "రాధే... రాధే... జయ జయ శ్రీరాధే..."
ఆమె తన ఒంటరి తనానికీ, బీదరికానికీ, తన జీవన విధానానికీ ఏనాడూ బాధపడలేదు. రాధమ్మ ఉండగా ఏలోటూ లేదు, రాధమ్మ గుడిమెట్లే నాకు స్వర్గంలోని కల్పవృక్ష కామధేనువులు, ఆమె పాధ ధూళి, ఆమె భక్తుల పాదధూళియే నాకు అనంత ఐశ్వర్యం అని భావించేది.
ఆమె ఎంతో ప్రేమతో తన కన్నుల నిండా ఆనందాశ్రువులు కారుతుండగా అవి ఆ మెట్లకు నిజమైన అభిషేకమయ్యేవి.
ఆమె హృదయంలో ఎల్లప్పుడూ ఒకే కోరిక...
రాధికా చరణరేణుం యస్య మూర్ధ్ని విధారయేత్!
తస్య భాగ్యం న వర్ణేయం బ్రహ్మాద్యైరపి దుర్లభమ్!!
"రాధికాదేవి చరణధూళి ఎవరి తలపై పడుతుందో వారి భాగ్యం బ్రహ్మాదులకు కూడా దుర్లభం."
ప్రతి మెట్టును తుడుస్తూ ఆమె మనసులో "అమ్మా! నీ దర్శనానికి వచ్చే భక్తుల పాదరేణువు నా శరీరాన్ని తాకితే చాలు... ఇక మరొక జన్మ నాకు అవసరం లేదు." అని అనుకునేది.
ఆమె హృదయంలో నిరంతరం శ్రీమద్భాగవతంలోని గోపికల భావమే ప్రవహించేది
ఒక రోజు...
బర్సానాను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
చలి ఎముకలను కొరికేస్తోంది.
ఆ రోజు రజనీకాంతకు తీవ్రమైన జ్వరం వచ్చింది.
శరీరమంతా వణికిపోతోంది.
మంచం మీద నుంచి లేవడమే అసాధ్యమైంది.
అంతలో...
ఆలయంలో గంటలు మ్రోగాయి.
శంఖనాదం వినిపించింది.
మంగళహారతి ప్రారంభమైంది.
ఆ శబ్దం విన్న వెంటనే ఆమె హృదయం తల్లడిల్లిపోయింది.
ఆలయ శిఖరం వైపు చూస్తూ కన్నీరుమున్నీరై
"అమ్మా రాధే...! ఈ రోజు నీ గుడి మెట్లు నాకోసం ఎదురుచూస్తున్నాయేమో...! నీ భక్తుల పాదాలకు ధూళి ప్రసాదం ఇవాళ నాకు లభించదేమో...! ఈ పాపిష్టి శరీరం నీ సేవకు పనికిరాకుండా పోయిందమ్మా...!" విలపించింది. ఆమె జ్వరంతో ఏడుస్తూనే మెల్లగా స్పృహ కోల్పోయింది.
ఆమె అంతరంగం మాత్రం రాధమ్మ పాదధూళినే ఉపాసిస్తోంది...
ఆశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం
అదర్శనాన్మర్మహతాం కరోతు వా!
యథా తథా వా విదధాతు లంపటో
మత్ప్రాణనాథస్తు స ఏవ నాపరః!!
"రాధే! నీవు నన్ను ఆదరించినా, నిరాదరించినా, దగ్గరకు తీసుకున్నా, దూరం చేసినా, సుఖం ఇచ్చినా, దుఃఖం ఇచ్చినా, నా పట్ల నీ ప్రవర్తన ఏదైనా సరే, నా ప్రేమ మాత్రం మారదు. నీవే నా జీవితం, నీవే నా శరణ్యం, నీవే నా ప్రాణాధారం"
ఆనాటి అర్ధరాత్రి...
ఆ చిన్న గుడిసె అంతా దివ్యజ్యోతితో నిండిపోయింది.
ఆ కాంతి ముందు ఇంట్లోని దీపాలు వెలవెలపోయాయి.
యమునా తీరంలోని మడుగులలో వికసించిన కమలాల పరిమళం గది అంతా వ్యాపించింది.
దూరంగా మువ్వల సవ్వడి...
ఆ శబ్దం క్రమంగా దగ్గరపడింది.
తలుపు వద్ద దివ్యమైన కాంతితో ఒక యువతి నిలబడి ఉంది.
కొత్త నీలిరంగు వోణీ, పట్టుపరికిణి...
బంగారు ఆభరణాలు...
చంద్రబింబాన్ని మించిన ముఖకాంతి...
మూడు లోకాలను మైమరపించే చిరునవ్వు...
ఆ దివ్య దర్శనాన్ని వర్ణించేందుకు జయదేవ మహాకవి మాటలే సరిపోతాయి—
స్మర గరళ ఖండనం
మమ శిరసి మండనం।
దేహి పదపల్లవముదారం!!
ఆ దివ్య చరణాల యజమాని...
బర్సానా కిశోరీ... శ్రీరాధారాణి!
ఆమె మెల్లగా వచ్చి రజనీకాంత పక్కన కూర్చుంది.
తన సుకుమారమైన చేతులతో ఆమె నుదుటిని ప్రేమగా నిమిరింది.
ఆ స్పర్శతోనే రజనీకాంత కళ్లు తెరిచింది.
ఎదురుగా...
తన ప్రాణవల్లభ...
తన రాధే...
ఆమె ఒక్కసారిగా లేవబోయింది.
కానీ రాధారాణి ప్రేమగా ఆమెను ఆపుతూ ఎంతో వాత్సల్యంతో
"రజనీ...! ఈ రోజు నువ్వు నా దగ్గరకు రాలేకపోయావు... అందుకే నీ రాధే నీ దగ్గరకే వచ్చింది." అని పలికింది.
రజనీకాంత శరీరం కంపించిపోతోంది
తన రాధమ్మను చూసిన ఆనందంలో కన్నీళ్లు ఆగలేదు.
కన్నీళ్ళు అడ్డువచ్చి తన రాధమ్మ స్పష్టంగా కనపడటంలేదు.
చేతులతో కళ్ళను తుడుచుకుంటూనే తన రాధమ్మను ఆపాదమస్తకమూ తనివితీరా కళ్లతో గ్రోలుతోంది..
రాధారాణి తన చేతిలోని బంగారు పళ్ళెంపై బట్టతీసింది.
అందులో ఆలయంలో నివేదన చేసిన మహాప్రసాదం ఉంది.
ఒక చిన్న ముద్దను తీసి తన చేతులతోనే ఆమె నోటిలో పెట్టింది.
తన చేతితో చిన్న చిన్న ముద్దలుగా చేసి రజనీకాంత నోటిలో అన్ని ప్రసాదాలు పెడుతోంది.
"రోజూ నా మెట్లు కడిగి, నా పాదధూళి, నా భక్తుల పాదధూళి తలమీద దాల్చి, నన్ను సేవించే నా బిడ్డ అనారోగ్యంతో, ఆకలితో ఉండగా... నేను ప్రసాదం ఎలా స్వీకరిస్తాను రజనీ?" అని అన్నది...
రాధమ్మ చేతిలోని ఆ అమృతప్రసాదం రజనీకాంత తినగానే...
జ్వరం క్షణాల్లో మాయమైంది.
శరీరం తేలికైంది.
హృదయం ఆనందసముద్రంలో మునిగిపోయింది.
//ఆ దివ్య క్షణాన్ని చూసి గోపికలు శ్రీరాధాదేవి మహాభాగ్యాన్ని వర్ణించిన భాగవత వచనం గుర్తుకు వస్తోంది...
అనయారాధితో నూనం భగవాన్హరిరీశ్వరః
యన్నో విహాయ గోవిందః ప్రీతో యామనయద్రహః!!
(శ్రీమద్భాగవతం రాసపంచాధ్యాయీ 10.30.28)
"ఈ గోపిక చేసిన ఆరాధన ఎంత గొప్పదో! అందుకే భగవంతుడు మమ్మల్ని వదిలి ఈమెతో ఏకాంతంగా వెళ్లాడు."
అదే విధంగా రజనీకాంత చేసిన ఆరాధన ఎంత గొప్పదో, బర్సానా సర్కార్ స్వయంగా ఆలయం విడిచి తన భక్తురాలి కుటీరానికి విచ్చేసింది.//
శ్రీరాధారాణి ఆమె తలపై చేయి ఉంచి ప్రేమతో
"రజనీ...
నువ్వు కడిగింది నా ఆలయ మెట్లు కాదు... నీ హృదయం, అది ఎంతో నిర్మలమైంది. అది నా స్థానం.
నీ కన్నీటి బిందువులు నా భక్తుల పాదాలకు అభిషేకమయ్యాయి. నీ సేవ నన్ను కదిలించింది.
నాకు బంగారం, రత్నాలు, ఆస్తులు, భవంతులు అవసరం లేదు...
స్వార్థరహితమైన నిష్కల్మశమైన ప్రేమతో చేసిన చిన్న సేవే నాకు అత్యంత ప్రియమైన ఆరాధన." అంటూ ఆ దివ్యమూర్తి చిరునవ్వు నవ్వింది.
ఆ చిరునవ్వు వేల చందమామల వెలుగుగా మారింది...
ఆ క్షణంలోనే ఆ వెలుగులోనే రాధమ్మ మెల్లగా అంతర్ధానమైంది.
...తెల్లవారింది. ఆలయం అధికారులకు, గోస్వాములకూ రజనీకాంత ఇంటికి బర్సానా సర్కార్ రాధారాణి బంగారు పళ్ళెంలో పెట్టిన నైవేద్యాలతో వెళ్ళిందనీ, రజనీకాంతననుగ్రహించిందనీ తెలిసింది.
అందరూ పరుగు పరుగున వచ్చి రజనీకాంత అదృష్టాన్ని, నిష్కల్మశమైన భక్తిని పొగిడారు...
రజనీకాంత సంపూర్ణ ఆరోగ్యంతో గుడిసె బయటకు వచ్చింది.
గిరిరాజు శిఖరంపై ఉదయసూర్యకిరణాల్లో మెరిసిపోతున్న శ్రీరాధారాణి ఆలయాన్ని చూసింది.
కన్నీళ్లతో నేలపై సాష్టాంగ నమస్కారం చేసింది.
ఆమె పెదవులపై "రాధే... రాధే... జయ జయ శ్రీరాధే..." అనే ఒక్క నామమే
ఆ రోజు నుండి బర్సానా వాసులు "రజనీకాంత ఆలయ మెట్లను మాత్రమే కడగలేదు... తన నిష్కల్మషమైన ప్రేమతో శ్రీరాధారాణి హృదయాన్నే గెలుచుకుంది." అని చెప్పుకుంటారు.
రాధే జయ జయ మాధవ దయితే।
గోకుల తరుణీ మండల మహితే!!
జయ జయ శ్రీరాధే!
జయ జయ శ్రీకృష్ణా!
జయ జయహే రాధామాధవ!
-శంకరకింకరః