Pages

Saturday, May 23, 2015

ఈశ్వరేచ్ఛ!

ఈశ్వరేచ్ఛ!
          ఎప్పుడూ కూడా ప్రతి మనుష్యుడికీ ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. నేను మనుష్యుణ్ణి, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు’ అనేటటువంటివి. లోపల ఆంతరంగిక స్థితి ఏదైనప్పటికీ కూడా అంతస్థనేది (ఇక్కడ అంతస్థు అంటే ధనం ఐశ్వర్య రూపంలోది కాదు అని గమనించగలరు) వ్యక్తికి ఈ లోకంలో ఉన్నప్పుడు, లౌకిక జీవనంలో ఒకటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞానే కావచ్చు, సాధారణంగా  కనపడే ఎవరైనా కూడా కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని మాత్రం అతిక్రమించరాదు.

          ఉద్యోగం చేస్తున్నాం, మనతో కలిసి పని చేసే వ్యక్తిని ఒక మామూలు వ్యక్తిని తక్కువగా చూడడం ధర్మమేనా ? అవతల వ్యక్తి సేవకావృత్తిలో ఉంటే మాత్రం అలా చేయవచ్చా? ఒకరు సేవ్యుడు ఒకరు సేవకుడు. అంతవరకే ఆ హద్దు మీరరాదు. ఈ అంతస్థులో ఉన్నతేడా లౌకిక జీవనానికి సంబంధించి వరకే. ఆంతరంలో ఉండే స్థితికి లౌకిక జీవన విధానంలో ఉండే స్థితికి ముడి పెట్టుకోకూడదు. అలా ఐతే తారుమారై దోషం కలిగి ధర్మగ్లాని కలుగుతుంది. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో, ఏ పాత్రను ఆ మనుష్యుడు పోషిస్తున్నాడో, ఆ పాత్ర ఔచిత్యం పరిధి దాటకూడదు. దాన్ని దాటితే అది ధర్మగ్లాని అవుతుంది అంటే ధర్మాన్ని దాటిన, అతిక్రమించిన దోషం కలుగుతుంది. ఇలా మనకి తమ ఆంతర స్థితిని లౌకిక స్థితిని ముడిపెట్టని ఘట్టాలు వాఙ్మయంలోనూ ఉన్నవి.

          శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు మానవుడుగా జీవించాడు, యుద్దంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ ఈశ్వరాంశవని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడుగానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు, మానవుడిగా తన పరిథి దాటలేదు, తన అంతస్థు పరిథి అతిక్రమించలేదు.

          అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో  తెలియవచ్చేలా చేసాడు . భీష్ముడు దైవీ శక్తులు కలవాడు, దైవాంశసంభూతుడు, వసువులలో ఒకడు అని జన్మ కారణంలోనే అవి మనకు చెప్పబడ్డవి. కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునునిమీదకూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు.  భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీశక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ’నిన్ను చంపేస్తా’ అని భీష్ముని మీదకు ఉరికాడు ఆయుధం పట్టనన్న కృష్ణుడు. అది గమనించిన భీష్ముడు, తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఇక తరవాత కృష్ణుడు శాంతించడం అర్జునుడు ప్రార్థించడంతో తిరిగి యుద్ధం జరగడం పాండవులు గెలవడం జరిగాయి.

          సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడెక్కడా పరిథిని మీరలేదు.  ధర్మం పాటించు దాని ఫలితం శ్రేయస్సు అని చెప్పాడు తప్ప నేనున్నాను మిమ్మల్ని కాపాడతాను అని పాండవులకు కానీ అర్జునినికి కానీ చెప్పలేదు. అర్జునునికి గీత బోధించినా "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప, ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతానని చెప్పలేదు. అలా చెప్తే పాండవులకు అప్పటికున్న పెద్దవారసుడు నూనూగు కోర మీసాల అభిమన్యుడు చనిపోతే దాన్ని ఆపాడా? లేదు!, నువ్వు చేయవలసింది, నీ అంతస్థులో నీపరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించమన్నాడు" అంతే. "కాపాడే కర్తవ్యం తనమీద పెట్టుకోలేదు" అంటే పాండవులను గెలిపించే "బాధ్యత తీసుకోలేదు". ఈ కర్మకు ఈ ఫలితం అని నిర్దేశించాడు తప్ప ఆ ఫలితం నేనిస్తాను అని చెప్పలేదు. కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. "నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడు తప్ప నేను మీకిచ్చేస్తున్నాను అని చెప్పలేదు అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు. అలా చేయలేదు మానుష్య ఉపాధి అంతస్థు పరిథి మీరలేదు, మీరనివ్వలేదు.

          ఒడియాలు ఎండబెట్టుకునేవారొకరు, బట్టలారేసేవారొకరు, సంధ్యావందనం చేసి సూర్యోపాసన చేసేవారొకరు. ఎవరు ఏకర్మ చేస్తే వారికాఫలితం వస్తున్నది. ఆయన ప్రత్యేకంగా వడియాలు ఎండబెట్టుకునే ఆమెకోసం ఎండబెట్టలేదు. బట్టలని ఆరేలా చేయలేదు, ఉపాసకునికి సంధ్యావందన ఫలితం ఇవ్వలేదు. ఆయన ఎవరియందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. ఈ కర్మకిది ఫలితం వస్తుంది ని నిర్దేశించాడు అది వస్తున్నది...

          అంతా ఈశ్వరేచ్ఛ అని వ్యావహారంలో అంటాం అంటే మనం చేసే కర్మలకు ఫలితం మనకు వస్తుంది ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించినవాడు ఈశ్వరుడు "అది ఈశ్వరేచ్ఛ".

పరమాచార్య వాక్కులనుండి అల్లుకున్నవి

-శంకరకింకర


Wednesday, May 20, 2015

కామాక్షి కటాక్షం! కర్ణునిమీదకు యుద్ధం - భీముని సంతోషం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు శంకరుల వాఙ్మయం పంథాలో అమ్మవారిని స్తుతించిన గొప్ప వాఙ్మయాల్లో ప్రథమ శ్రేణిలో ఉండేది మూక పంచశతి. మూక శంకరులు కటాక్ష శతకంలో తపస్సు చేయిస్తారు మనని...

స్థూలంగా ఈ శ్లోకార్థం ఇలా ఉంటుంది.

అమ్మా కామాక్షీ, యుద్ధంలో అర్జునుడు బాణములు ఎక్కుపెట్టి మాటి మాటికీ కర్ణునిమీదకు వెళ్తున్నప్పుడుల్లా ఆయనకు తోడుగా వస్తున్న పాండవ సైన్యాన్ని చూసిన భీముడి చిత్తం సంతోషంతో నిండిపోయింది అని.

సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య
మందస్మితస్య పరితోషిత భీమ చేతాః
కామాక్షి! పాండవచమూ రివ తావకీన
కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః

అమ్మా కామాక్షీ! ఆహా! తెల్లనైన నీ చిరుమందహాసానికి తోడుగా నీ చెవులవరకూ చేరిన నీ కడగంటి చూపును చూసి భీముని చిత్తము బహు సంతోషముతో నిండినదు. అటువంటి కటాక్షలక్ష్మి మమ్ము కాపాడుగాక.

ఇక్కడ అర్జున, పాండవ అన్న పదాలు తెలుపును సూచించేవి, కర్ణ అన్నపదం చెవిని సూచించేదీ, భీమ అన్న శబ్దం మొదట అన్వయమయ్యేది శివునకే శివునకే భీమః అని పేరు.

అమ్మవారి చిరునవ్వు నవ్వినప్పుడు పెదాల కొసలు చెవులవైపుకి కొంత సాగదీయబడతాయి, బుక్కలు కొంచెం నొక్కబడి చెవులు పెదాల కొసల మధ్య దూరం తగ్గుతుంది. అమ్మవారి అర్జునమైన అంటే తెల్లనైన అంటే స్వచ్చమైన ఆ నవ్వు కర్ణముల మీదికి అంటే చెవుల మీదకి యుద్ధానికెళుతున్నట్టుగా ఉన్నదట. దీన్ని కర్ణునిమీదకు యుద్ధానికి వెళ్తున్న అర్జునుడితోపోల్చారు మూక శంకరులు. మనం అమ్మవారి ముఖబింబం ధ్యానంలో చూస్తూ అమ్మవారు ఎర్రని పెదాలు మృధువైన ఎర్రని చెక్కిళ్ళు వెనక ఒకటి రెండు ముంగురుల వేలాడుతుంటే కర్ణాభరణాలతో శోభిల్లే చెవులు చూస్తూ అమ్మవారు ఒక సారి నవ్వినట్లు ఊహించుకొని ఆ నవ్వుతో అమ్మవారి పెదాల చివర్లు వెన్నక్కి సాగినట్లు ఆ కొసలు బాణపు ములుకుల్లా ఉండి చెవులవైపు వెళ్తున్నట్లూ బుగ్గలు దగ్గరకు నొక్కుకోబడి ఉబ్బినట్లూ అందువల్ల ఇంకాస్త ఎరుపెక్కినట్లూ మనతో ధ్యానం చేయిస్తారు... ఐతే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. అలా నవ్వినప్పుడు అసలే విశాలాక్షియేమో మాయమ్మ.. ఆ పెద్ద కళ్ళు మామూలుగానే చెవులదాకా ఉంటాయి పైగా ఈ నవ్వినప్పుడు, చెక్కిళ్ళ పై భాగం కళ్ళను కూడా కింది వేపు నుంచి పైకి వత్తడం వల్ల కనుల కొనలు కూడా చెవుల వైపుకి కొంత సాగదీయబడినట్లుగా అయ్యి కడగంటికి చెవులకి మధ్య దూరం తగ్గుతుంది. అమ్మవారి కడగంటి పాండురమైన అదే తెల్లనైన చూపు కూడా చెవులమీదకు ఉరుకుతున్నట్లు ఉందిట.. అంటే అమ్మవారు నవ్వినప్పుడల్లా పెదాల చివర్లు (అర్జునుడు) చెవుల మీదికి వెళ్తే (కర్ణుడిమీదకు) తోడుగా తెల్లని కడగంటి చూపు (పాండవసైన్యం) కూడా చెవుల మీదికి వెళ్తున్నదట (అర్జునునికి తోడుగా పాండవ సైన్యం కర్ణునిమీదకు వెళ్తున్నదట). ఇది చూసిన భీముడు మనసు సంతోషించిందట, అంటే అమ్మవారి ముఖంలో చిరునవ్వు చూస్తూ ఎంత భీముడైనా మనసు సంతోషంతో నిండి శివుడైయ్యాడట.

సర్వం పరబ్రహ్మార్పణమస్తు..

పాంచజన్యం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఒకసన్నివేశాన్ని చిత్రించి అందులో మనని మగ్నమయ్యేలా చేసి ఆ ప్రక్రియను ధ్యానంలా మార్చి గొప్ప ఫలితాన్ని మనకి కట్టబెట్టడంలో శంకరులకు సాటి శంకరులే. ఈ పంథాని తరవాత కాళిదాసు గారు, మూక శంకరులు తరవాత వచ్చిన ఎందరో మహానుభావులు కొనసాగించారు.. వారిచ్చిన వాఙ్మయంమీద ఎంత దృష్టిపెడితే మనకంత అమృతం దొరుకుతూనే ఉంటుంది... విషయం చెప్పి ఎవరికి వారు ఆ విషయాన్ని మనోఫలకంలో అందంగా చూసుకుని ధ్యానంలో మునిగి మురిసిపోయేలా చేస్తారు శంకరులు...

ఒకానొక గొప్పనైన నల్లటి పర్వతం మీద ఎర్రనైన కలువపూలు వికసించి ఉన్నాయి. ఆ కలువల మధ్యలోంచి ఆకాశంలోకి చూస్తే పండువెన్నెల్లు కురిపిస్తూ తెల్లని నిండు చందమామ కనిపిస్తున్నాడు ఆ చందమామ ఉన్న ఆకాశంలో కలిగే ఉరుములవంటి శబ్దములు దితి పుత్రులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తున్నాయి.

ఆ గొప్పనైన నల్లటి పర్వతం మరేదో కాదు అన్ని బ్రహ్మాండాలు నిండిపోయిన విష్ణు స్వరూపం. ఆయన అరచేతి వేళ్ళు ఎర్రని కలువల్లా విచ్చుకుని ఉండగా తెల్లని చందమామలాంటి కాంతులు విరజిమ్మే అద్భుతమైన పాంచజన్య శంఖం దర్శనమిస్తున్నది. ఆ పాంచజన్య శంఖం చేసే నాదానికి అసురుల గుండెలు గుభిల్లుమని వారికి భయాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి పాంచజన్య శంఖరాజము మనని కాపాడుగాక అని ఈశ్లోకంలో వర్ణించారు...

లక్ష్మీభర్తుర్భుజాగ్రేకృతవసతిసితం
యస్యరూపం విశాలా
నీలాద్రేస్తుంగశృంగ స్థిత మివరజనీ
నాథబింబం విభాతి!
పాయాన్నః పాంచజన్య స్సదితికుల
త్రాసనైః పూరయన్ స్వైః
నిధ్వానై ర్నీరదౌఘ ధ్వనిపరిభవధై
రంబరం కంబురాజః!!

నారాయణార్పణం..

Sunday, April 26, 2015

కర్మ - జ్ఞానం - అధికారం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే


"అసంప్రదాయవిత్ సర్వ శాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయః" - సంప్రదాయ పరిజ్ఞానములేనివాడు ఎన్ని శాస్త్రములను చదివినా మూఢుని వలె ఉపేక్షణీయుడే. భగవద్గీతా భాష్యంలో ఆది శంకరులు. ఈ మాటలను బట్టి ఆచారము సంప్రదాయములను పాటించడం ఎంత ముఖ్యమైనదో ఆస్థికులైన వారికి ఇట్టే అవగతమౌతుంది. 

సాధారణంగా ఆధ్యాత్మిక జీవతంలో ఉండి సాధన చేస్తున్నవారు కొన్ని చోట్ల తికమక పడుతుంటారు. పెడుతుంటారు కూడా... రెండు విషయాల్లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు నటిస్తారు చాలామంది. లక్ష్మి విషయంలో ఎంత ఉన్నా లేదనీ, సరస్వతి విషయంలో ఎంత డొల్లైనా అంతా తెలుసనీ.... అంతా కాకపోయినా ఎంతో తెలుసనీ...

ఇక అక్కడ్నుంచి ఇదెవరు చెప్పారు అదెవరు చెప్పారు ఇవన్నీ ట్రాష్ ఆధ్యాత్మ సాధనలో ఇవేంటి అవేంటి, నియమాలు నిబంధనలు అధికారం, అర్హత నథింగ్ డూయింగ్ వాళ్ళకన్నా మేమే బెటర్ వంటి బోలెడు సూక్తులు సుభాషితాలు వల్లించి దేశోద్ధరణం చేస్తున్నామనుక్కునే "సౌజన్యారావు"లు (కన్యాశుల్కం నుండి ఈ పేరు స్వీకరించా)  కొందరు.

సరే, మనది వైదిక ధర్మం, వేదమే ప్రమాణంగా ఉన్న జీవన విధానం. ఈ వేదం రెండు విషయాలను ఇమడ్చుకుని ఉంటుంది. అవే కర్మకాండ జ్ఞాన కాండ. ప్రజాపత్యాదిగా జ్ఞానం వేపుకి వెళ్లడానికి వైదిక కర్మావలంబనం చేసి ఆ కర్మలు పండి జ్ఞాన ఫలాన్ని పొందడం సదాచారం సనాతన వైదిక సంప్రదాయమూనూ. ఐతే కొన్ని సార్లు జ్ఞానానికి ఎవరు అధికారులు అన్నప్పుడు బాల, స్త్రీ, వృద్ధాది వయోబేధాలు కానీ, లింగ బేధాలు కానీ,   వర్ణాశ్రమాది బేధాలు కానీ లేకుండా సర్వులూ జ్ఞానముపొందడానికి, జ్ఞాన సముపార్జనకి అధికారులే అర్హులే అని శాస్త్రాలు ప్రజాపత్యాదిగా సమస్త గురుమండలం చెప్పినదీ అదే.  "జ్ఞానమును సాధించడానికి పై బేధములేవీ అడ్డురావు, జ్ఞానమునుపొందడానికి అందరికీ అధికారమున్నది" (భగవత్పాద ఉవాచ).

ఐతే, ఈ విషయాన్ని తప్పుగా కర్మ కాండకన్వయింపజేయడం మొదలైంది. వేదంలో చెప్పిన కర్మలన్నింటికీ అర్హతాధికారాలున్నాయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సత్యం సత్యం పునస్సత్యం, ఐనా మన ఒప్పుకోలుతో వేదానికి పనిలేదు కదా. గాయత్రి చేయడానికి ఫలానా ఉపవీతధారణ అనే సంస్కారం చేసినతరవాత గాయత్రికి అధికారి అవుతాడు అన్నప్పుడు అది లేకున్నా చేస్తానాంటే? యజ్ఞానికీ, యజ్ఞశాలకీ ప్రత్యేకమైన పవిత్రత, లెక్కలు , కొలతలు ఉన్నాయి అందులో వాడే సమిధలు, మంత్రాలతో సహా కొన్ని పద్ధతులు అవి నిర్వహించే వారి అధికారం ఉన్నది. స్రుక్కు - స్రువం తయారికి కూడా ఫలాన చెక్కతో చేసిన ఫలాన సైజులో ఉన్న అన్న లెక్క కూడా ఉన్నది అని అంటే, అబ్బే అంతా తూచ్ గరిటలతో చేస్తామంటే? 

ఉపవీతి కానిదే యజ్ఞంలో హవిస్సివ్వకూడదు అని శతపథబ్రాహ్మణాదులలో వేదం నిరూపించింది అని చెప్పినా ఎవరు చెప్పారండీ ఆయనెవరో చేయించారు మేమెందుకు చేయకూడదు అని చేసేస్తే? ఉపనయనం అయ్యిందే అనుక్కోండి ఎంత వేదాధికారం కలిగి ఉన్నా గురువుదగ్గర నేర్చుకోకుండా, స్వరం లేకుండా వేదమంత్రాలు సూక్తాలు చదవరాదు అన్న నియమమున్నా, అవి పఠిస్తే?... ఎవ్వరూ ఆపరు. ఎందుకంటే? వద్దన్నా వినరు కాబట్టి! పైగా వితండం చేస్తారు కాబట్టి! కుతర్కం చేయవద్దని, అందులో పాల్గొనవద్దని శంకరుల ఆన కాబట్టి!

మనలో ప్రతి ఒక్కరూ ఈ రెంటి బేధం తెలుసుకోవాలి, కొన్ని కొన్ని కర్మల నిర్వహణకు కొందరు కొందరు మాత్రమే అర్హులు, ఎంత పండితులైనా కొన్ని కొన్ని విషయాలలో అర్హత అధికారం కలిగి ఉండరు, సోమయాజి కావాలంటే తగు అర్హత కావాలి, హవిర్యాజి అవ్వాలి అలా.. అవతల వారితో వాదు చేస్తున్నప్పుడు ఈ సునిశిత పరిశీలనం అవసరం. జ్ఞానం పొందడం విషయంలో ఎవరూ ఎవరినీ ఆపలేరు ఆపరు. దానికి అధికార బేధాలు లేవు. కర్మల విషయంలో ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి. ఆచారం ఉంటుంది, రెంటికీ తేడా తెలీకపోవడంతోటే, భగవంతుడి దగ్గర ఇన్ని నియమాలేంటండీ, మాదేవుడికి మాకు తోచిన రీతిలో చేస్కుంటే తప్పంటారు మీ సాంప్రదాయవాదులు అనేటటువంటి తెలిసీ తెలీని అపాండిత్యపు మాటలు బయటపడతాయి. 

కరెంటు పాస్ అయ్యే వైరును ముట్టుకోవాలంటే తగిన పరిజ్ఞానం తో పాటు, చెప్పులు వేసుకోవడం రబ్బరు గ్లౌజులు వేసుకోవడం, తడిలేకుండా జూసుకోవడం వంటి ఆచారం పాటించాలి. అప్పుడే కరెంటు పని సరిగ్గా చేసి మన నిత్యావసరాలకుపయోగించుకోగలం. కరెంటు లేని కర్రపుల్లనో, ప్లాస్టిక్ వైరునో, దండాన్నో ముట్టుకోవాలంటే ఏ నియమమూ అక్కరలేదు. ఇక్కడ కరెంట్ అంటే చైతన్యం చైతన్యవంతమైన దేవతా శక్తి ఉపాసనకి ఆచార సాంప్రదాయాలు బాహ్య శౌచము, ఆంతర శౌచము మొట్టమదటి మెట్లు. ఏ నియమాలు, ఆచారాలు అక్కర్లేదంటున్నారంటే అక్కడ చైతన్యం లేదని గుర్తెరగాలి.

ఏదేమైనప్పటికీ వేదం, శాస్త్రం చెప్పినట్లు చేస్తే వైదికుడివి ధిక్కరిస్తే అవైదికుడివి, సులభమైన మాటల్లో అంతే కదా..

(పై విషయం కాస్త కటువుగా ఘాటుగా అనిపించవచ్చు, కానీ విషయం ఇంతకన్నా గట్టిది, మాటలే నాతరహావి అసలు భావంలోని గూఢత సాంద్రత ఇంకా ఎన్నో రెట్లు చెప్పాలంటే కర్రు కాల్చి వాతపెట్టినట్లుంటుంది, నాకు నేను చెప్పుకున్నవిషయంగా తీసుకోగలరు, ఎవరికైనా పనికి వస్తే మరింత సంతోషం)