Pages

Wednesday, December 3, 2014

బుర్రకేది తోస్తే అదే చర్చా విషయం...

        పూర్వం కొందరు రాక్షసులు బాగా మదమెక్కి ప్రతివాడిదగ్గరకెళ్ళి అరవ కేకలు పెట్ట యుద్ధానికి రమ్మని పిలువ రాకపోతే సాధుసన్యాసులను ఏడిపించను ఇదే పని. బలిష్టుడైతే కొడతారు బలహీనులైన తాపసులు ఇత్యాదులైతే మీ దేవుడు లేడు గీవుడులేడు అన్నీ నేనే అని వాళ్ళ మానాన వాళ్ళని ఉండనివ్వకుండా సాధు సన్యాసులని మానసికంగా నానా విధాల బాధపెట్టేటైపన్నమాట. మొత్తానికి ఎదుటివాడిని మానసికంగానో శారీరకంగానో గాయపరచడం వాళ్ళు బాధపడుతుంటే సంతోషించడం వంటి శాడిస్టు రాక్షసులన్నమాట. బ్రహ్మగారో వచ్చిఏంట్రా పనులంటే నా ఉపాధే అది కదా రాక్షసోపాధి ఏం చేయమంటావ్ అని అడగడం. ఏదో మళ్ళీ పెద్దలచేద మందలింపచేసుకొని కొత్త వరాలుపొంది బలిసి మళ్ళీ యుద్ధాలకెళ్ళడం అది పరిపాటి వీలైతే వారిని మార్చడానికి లేకపోతే సంహరించడానికి మళ్లీ భగవంతుడు అవతార స్వీకారం చేయడం మామూలే...

        పూర్వం త్రేతాయుగంలో వాలి, రావణుడు కుంభకర్ణుడు వరుసలో దుందుభి అనే ఒక రాక్షసుడుండేవాడుటవాడు పొద్దున్నే ఒక లిస్ట్ చూసుకునేవాడుట నాతో ఓడిపోని బలవంతుడెవడూ అని... ఎవరి పేరు లిస్టులో స్ట్రైక్ అవ్వకపోతే వాడి దగ్గరకెళ్ళి యుద్ధానికి రమ్మని పిలవ వాణ్ని చితకబాదుడు మధ్యాహ్నం ఇంటికొచ్చి తిని తొంగోడం. ఇదే పని పాట అనవసర గొడవలంటే ఇవే దీనివల్ల వాడంటే అందరికీ హడల్ అన్నమాట. ఉత్తినే గొడవెట్టుకుంటాడెవడ్రాబాబూ వీడని తలట్టుకునేవారు. ఎందుకు వీడికి ఇలా అంటే ఏం కారణం ఉండదు కేవలం ఎవరేం చేస్తారు నన్ను అని కండకావరంతో బలిసి చేసే పనులన్నమాట. వాడికి పోయేకాలం దాపురించి ఒకసారి లిస్టులో వాలి పేరు కనపడింది కాలాంతరంలో వాలిచేతిలో ఒక్క గుద్దుకి చచ్చాడు.

ఇలాంటి వాళ్ళు మనకీ బోలెడు పొద్దున్నే కాఫీ తాగి పేపరు తీసి తిన్నదరక్క సనాతన ధర్మం మీద వివాదాస్పద వ్యాఖ్య చేస్తే ఎంత పబ్లిసిటీ వస్తుంది ఎన్ని లైకులు షేరులు వస్తాయి ఎన్ని కామెంట్లొస్తాయి అని వెతుక్కుని అలా వ్యాఖ్యలు చేయడం, చేసిన పని గొప్పదనిన్నీ, అంతకన్నా జీవితంలో చేయాల్సిన గొప్పపని లేదన్నట్టున్నూ, పైగా నాలెడ్జి షేరింగ్ అంటూ కలరింగిచ్చీ ఏదో విషయాన్ని వివాదం చేసి, చేయించి, ఏ రాక్షసుణ్ణి పొగిడి, దేవుణ్ణి చిన్నతనం చేస్తే (అవేవో కొన్ని ఎడం చేతివాటం పాత తెలుగు సినిమా పైత్యాలలాగా) ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది? అలా రాయొచ్చా లేదా, ఋషులేం చెప్పారు లెక్కేలేదు. ధుర్యోధనుడూ హీరోయే, రావణుడూ హీరోయే.. కొన్ని రోజులు పోతే ఈ అల్‍ఖైదా, ఐసిస్ తీవ్రవాదులూ హీరోలౌతారు. చూసారా ఆ ఒక్కటి తప్ప వాళ్ళలో ఎంత పట్టుదల ఉందీ అదీ మంచి గుణమని కావ్యాలు వ్రాసినా ఆశ్చర్యంలేదు.  రామ భక్తుడో, సాధు పురుషుడో మంచి చెప్పబోతే, మీరు చెప్పే వ్యాస వాల్మీకి రామాయణాది పురాణాలే ప్రమాణం కాదు అవి తప్పుల తడకలని రిటర్న్ కలరింగిచ్చి... అలా చేయడం  దాని మీద మా జన్మ హక్కు మాకు రాజ్యాంగమిచ్చిన హక్కు వగైరా కవుర్లు చెప్పి వితండవాదం చేసే బేచన్నమాట..... వీళ్ళెందుకు చేస్తారంటే ఏమీలేదు గొడవెట్టుకుంటే అదేదో సినిమాలో కిక్కేవేరప్పాటైపు.... నాలుగు తిట్లు తిట్టించుకుని, ఎవడో కడుపు మండినవాడు నాలుగు శాపనార్థాలు పెడితే (లోపలికో బయటికో) తప్ప తిన్నదరగని బేచ్ ఇది.... మన సినిమాల్లోను చాలా గొప్ప పేరున్న టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ట్విట్టర్ సెలెబ్రిటీ & శిష్య బృందం టైపు.... పుర్రెకెంతొస్తే ఏం తోస్తే అది వాగేటైపు...  ... మనసు రంజింపజేయరాదు అన్న సామెతలా..

        ఎప్పుడో అప్పుడు రావాణుడిలాంటి ఈ బ్యాచ్ కి వాలి లాంటోడు వాలి లాంటోడికి రామ సుగ్రీవులు తగుల్తారు, అప్పుడు వదుల్తుంది ......

Monday, September 29, 2014

ఈ కల్పిత శాస్త్రాలు వదిలి మీ ఇష్టం వచ్చినట్లు హాయిగా జీవించచ్చుగా....


శ్రీ గురుభ్యోనమః

నమస్తే

 

ఒకానొకప్పుడు ఒక శంకరాచార్యులని ఒక నాస్తికుడైన వ్యక్తి ఇలా ప్రశ్నించారట "మీరు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, దాని ఫలితం, స్వర్గం, నరకం, మోక్షం, దేవుడు, ఆత్మ అని ఏవేవో చెపుతారు. మాకవన్నిటిమీదా నమ్మకంలేదు అవన్నీ ఎవరో కల్పించినవి అని ఇప్పటి విజ్ఞానం ద్వారా మాకు తెలుస్తోంది. మీరు చెప్పేవి బోధించేవి ఇవన్నీ అసలు లేవు అని మా నమ్మకం. కాబట్టి మీ జీవితాన్ని సరి యైన విధంగా మలచుకొని, ఈ కల్పిత శాస్త్రాలు వాటి నిబంధలలో కట్టుబడడం వగైరా ఈ ఇబ్బందులన్నీ వదిలి మీ ఇష్టం వచ్చినట్లు హాయిగా జీవించచ్చు, మీ కళ్ళముందు కనబడుతున్నదాని గురించి మీ మేథాశక్తిని మనుష్యజాతికి ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. మీ జీవితమూ వ్యర్థం కాదు అని చెప్పారట"

 

దానికి ఆ శంకరులు చిరునవ్వి నవ్వి " అవును మీరు చెప్పింది బాగుంది. మీరు చెప్పిందాంట్లో విషయాలు నాకు మంచి చెప్పాలని ప్రయత్నించి చెప్తున్నారు భగవంతుడు మీకు మేలు చేస్తాడు.

 

1) ఒక వేళ మీరన్నట్లు పునర్జన్మ, కర్మ సిద్ధాంతం ఊర్థ్వాధోలోకాలు, పాప పుణ్యాలు, మోక్షం లేవు అనుక్కుని, వేదాది శాస్త్రాలు నిబంధనలు అన్నీ కల్పితాలు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు జీవించమన్నారు. ఇప్పుడు నేను చేసేది నా ఇష్టం వచ్చినట్లు జీవించడమే, నాకు వేదం అన్నా శాస్త్రమన్నా సనాతన ధర్మమన్నా ఇష్టం అందుకు అనుగుణంగా జీవిస్తున్నాను కాబట్టి నేను సంపూర్ణ అంగీకారంతో సంపూర్ణసంతోషంతోటే ఈ జీవితాన్ని సాగిస్తున్నాను. వేరేవిధంగా జీవించడం నాకు ఇష్టముండదు. కాబట్టి మేమూ, మా పూర్వాచార్యులు చెప్పినట్లు నిజంగా పైన చెప్పినవి లేకున్నా మా జీవితం మాకు నచ్చిన విధంగా సాగుతున్నది కాబట్టి ఇలా జీవించడంలో మాకే ఇబ్బందీ లేదు.

 

2) ఒక వేళ అలా మీరన్నట్లు కాక మేము , మా పూర్వాచార్యులు నమ్మిన మా వేద శాస్త్రాదులే వేదాంతర్గతమైన సిద్ధాంతములు సత్యమని, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, జీవుడు, ఆత్మ ఇత్యాదుల ఎరుక మీకు దేహాంతంలో తెలిసిందనుక్కోండి అప్పుడు మీరేమి చేయగలరు, ఏదైనా చేయడానికి అప్పుడు మీకు దేహమే ఉండదు కదా! మేము మా పూర్వాచార్యులు, వేద శాస్థ్రాదులు, ధర్మం చెప్పినట్లు జీవించాం మాకు ఇబ్బందిలేదు మరి మీరో? ఇన్ని రోజులూ మీరబద్ధం అనుకున్నది సత్యం అను ఎరుక వచ్చాక సమయం మించిపోతుందే? మరి మీలోని జీవుడు ఎలా ఉద్ధరణ పొందుతాడు?

 

మీరు చెప్పిన విషయాన్ని తీసుకుంటే రెండు పార్శ్వాల్లోనూ ఇబ్బంది లేని వాళ్ళం మేము. మీరు నమ్మింది మీకు తప్పని తేలిననాడు ఇబ్బందుల్లో ఉండేది మీరు...! మాకు రెండు విధాల్లోనూ ఉండేది ఆనందమే...! మా ధర్మాన్ని నమ్మి చరించే వారికి ఏ స్థితిలో నైనా ఉండేది ఆనందమే.

 

కాబట్టి సనాతన ధర్మ చరితులమైన మా జీవితం గురించి మీకు బెంగవద్దు, మీ జీవితాన్ని మీరు గట్టెక్కించుకోండి. ఈ జీవితాన్ని మీ ఉద్ధరణకి పది మంది ఉద్ధరణకి పనికి వచ్చేలా తీర్చిదిద్దుకోండి... భగవంతుడు మీకు మేలు చేస్తాడు, మీకు శుభం కలుగుతుంది....!!!

 

(ఎప్పుడో పెద్దలు చెప్పిన చద్దిమూట, చెవులతో ఒడిసి పట్టుకున్నది)

 

Tuesday, September 23, 2014

శ్రీ దేవీ శరన్నవరాత్రులు... ఒక అద్భుతం


శ్రీ గురుభ్యోనమః

నమస్తే


శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు,

శరణన్నవారిని ఆపదలనుంచి గట్టెక్కించగలిగే నవరాత్రి పూజలు కాబట్టి శరన్నవరాత్రులు

శరద్ ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు

శారదానుగ్రహాన్ని వర్షించేవి కాబట్టి శరన్నవరాత్రులు... ఇలా ఎన్నో విధాల శరన్నవరాత్రులగురించి వాజ్ఞ్మయంలో ఎందరో పెద్దలు చెప్పారు..


సంప్రదాయంలో పగలు విష్ణు స్వరూపంగానూ రాత్రి శివ స్వరూపంగానూ ఎలా చూస్తామో అలానే రాత్రిని అమ్మవారిగానూ పగలు (వెలుతురున్నప్పుడు సమయాన్ని) అయ్యవారిగానూ చూసే పద్ధతీ ఉన్నది. రుద్రో దివా ఉమా రాత్రిః తస్మై తస్యై నమోనమః అలాగే ఒక మాసంలో పెరుగుతున్న చంద్రకళలు సృష్టిక్రమంలో పెరుగుతున్న అమ్మవారి కళలై (శుక్ల పక్షం) పూర్ణిమ అమ్మవారి పూర్ణ కళగా అనుక్కుంటే కృష్ణ పక్షం అయ్యవారిలోకి లయమయ్యే విధానమన్నమాట. ఇలా అమ్మవారిని పూజించే సంప్రదాయంలో ప్రతి శుక్ల పక్షంలోని పదిహేనురోజులూ అమ్మవారిని ఉపాసించే విధానమున్నది. దానిని సూచిస్తూ లలితా సహస్రనామంలో కూడా ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా’ అని అమ్మవారిని నుతిస్తాము. ప్రతిపత్ అంటే పాడ్యమి, రాకాంత అంటే పూర్ణ చంద్ర తిథి వరకూ ఈ పదిహేనురోజుల మండల పర్యంతమూ పూజింపబడే దానా అని అర్థం ఐతే ఇందులో ఉన్న మరో పదం ’ముఖ్య’ అనేది ఈ శరత్కాలంలోని ఆశ్వయుజ మాస శుక్ల పక్షాన్ని సూచిస్తుంది.

మరింత విస్తారంగా పరిశీలిస్తే, నక్షత్ర పరంగా మాసాల్ని వరుసలో చూస్తే మొదటి నక్షత్రమైన అశ్వని చంద్రునితో కూడి ఉండే ఆశ్వయుజమాసము మొదటిదౌతుంది. అలానే నక్షత్రాలలో చివరిదానికి కొద్ది ముందు వచ్చేపూర్వాభాద్ర, ఉత్తరాభాద్రలతో చంద్రుడు కూడి ఉన్న భాద్రపదం చివరి దౌతుంది. ప్రతి అమావాస్య లయానికి ప్రతీకైతే సంవత్సరానికొకసారి వచ్చే భాద్రపద అమావాస్య మహా’లయ’ అమావాస్య. భాద్రపదమాసాంతం కురిసే వర్షాలు, నల్లని మబ్బులతో ఆకాశం నిండి ఉంటుంది, తిరిగి ఆశ్వయుజ మాస ప్రతిపత్తిథి నుండి పౌర్ణమి వెలుగులు ప్రస్ఫుటంగా ప్రపంచమంతా ప్రసరిస్తాయి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు రెండూ శరదృతువులో వస్తాయి. ఈ మాసాలలో వెన్నల వెలుగులు నిండుగా ఉంటాయి. శరత్కాల పూర్ణిమ, శరత్కాల వెన్నెలలగూర్చి ఎంతమంది కవులు ఎంతగా వర్ణించిందీ తెలియంది కదా!... ఈ వెన్నెలలనే జ్ఞానపు వెలుగులుగా అభివర్ణిస్తారు పెద్దలు సర్వశుక్లా సరస్వతీ అని సరస్వతీ అమ్మవారిని కొలవడం మామూలే, ఆమె తెల్లని చీరకట్టుకొని, తెల్లనైన హంసనెక్కి, తెల్లని పూదండలు ధరించి, అత్యంత తెలుపు కాంతులీనుతూ ఉంటుంది... అంటే జ్ఞాన ప్రసరణం చేస్తుంది అందుకే ఈ కాలాన్ని అమ్మవారి జ్ఞాన ప్రసరణ స్వరూపమైన శారదగా శరదృతువుగా చెప్పారు మన పూర్వ ఋషులు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమ చంద్రుణ్ణి తప్పకుండా చూడాలని పెద్దలు చెప్తారు. నల్లని మబ్బులుతో చీకటి నిండినఆకాశంలో శరత్కాల చంద్రుని కాంతి వెలుగులు నింపినట్లు మన హృదయంలో ఉండే దహరాకాశంలో ఉండే అజ్ఞాన చీకట్లను పారద్రోలే రాత్రులే ఈ నవరాత్రులు.

సరే, పైన చెప్పుకున్నట్లు ఈ పదిహేను రోజులూ శ్రీవిద్యాది దీక్షలున్నవారు, యోగ మార్గంలో ఉన్నవారూ ఉపాసన చేస్తారు, లేదా కనీసం రాక్షసమర్థన వృత్తాంతాన్ని పౌరాణికంగా తెలుసుకొని ఆ విజయాన్ని తొమ్మిది రోజులూ అమ్మవారు ఏ విధంగా ఒక్కోరోజూ ఒక్కో స్వరూపంలో రాక్షస మర్థనం చేస్తూ మనకి శుభాలను కలుగజేసిందో తెలుసుకుంటూ నవరాత్రులు పూజించి చివర రోజున విజయదశమిగా పండుగ జరుపుకోవడం పరిపాటి.


ఇక ముఖ్యంగా మన శాస్తాలు, పురాణాలు, అపార వాఙ్ఞ్మయం, ఋషులు తపో త్యాగం, భగవంతుణ్ణి సామాన్య ప్రజలకు కూడా ఎంత దగ్గర చేసాయంటే చెప్పనలవి కాదు. విజయదశమి ఉత్సవాలుగా మనం పూజించే సింహవాహిని ఐన దుర్గామాతను ఖగోళంలో ప్రత్యక్షంగా ఈ కాలంలో చూపించారు మన ఋషులు. ఆశ్వయుజ మాసం సూర్యుడు కన్యారాశిలో ఉండగా ప్రారంభమౌతుంది, సాయంత్రం పడమరకు వచ్చేసరికి ఈ కన్యారాశికన్నా ముందే సింహరాశి పడమర చేరుతుంది, సూర్యుడు ఆ సింహరాశిలోకి చేరతాడు. అంటే అప్పుడు కొద్దిగా ఖగోళ పరిజ్ఞానం ఉన్నవారు పడమర చూస్తే సింహరాశి క్రిందకి ఆ అపైన కన్యారాశి ఉంటాయి అప్పుడు ప్రతి రోజూ వికసనం చెందే చంద్రుని కళలే అమ్మవారి దరహాసం పౌర్ణమికి సంపూర్ణ దరహాసంతో అమ్మవారి ముఖంగా కొలవబడుతుంది. ఇదే సింహాని అధిష్టించిన స్థితి చూపిస్తుంది. ఈ రూపమే అమ్మవారి "శ్రీమత్సింహాసనేశ్వరీ" కి ఖగోళంలో దృశ్యరూప వ్యాఖ్యానం. అదే సింహవాహిని యైన మహిషాసుర మర్థిని, లేదా దుర్గ ఏదైనా... ఈ ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో ప్రతిరోజూ ఇది కనపడుతుంది అందువలనా..! ఈ కాలంలోనే మహిషాసురుడు, శుంభనిశుంభులు ఇత్యాది దానవులు తెగటార్చబడ్డారు కాబట్టి నవరాత్రులు చేసుకోవడం విజయదశమి పండుగ చేసుకోవడం సంప్రదాయమైంది.


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

Tuesday, July 15, 2014

Dear Hacker Just want to say "అన్నయ్యా థాంక్స్"

Sri GurubhyonamaH
Namaste
 
Last night some one from USA tried to break password o my Google account, the hacker tried to his very best but could not hack it. With the help of Google I could locate the place , and the company and the mobile instrument used for hacking my account. I can further try and get the mobile number, and person details nail the hacker but, I am not interested in it. All I would like to mention is just "Thanks Bro!" to the hacker, by trying this he proved that my security credentials are strong enough to protect my accounts and what I learned in Security and Risk assessments (ISO/BSI Audits) is of use in my personal life as well.

Monday, July 14, 2014

మనసా! ఈ నాటకంలో....నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము...!!!

మనసా! ఈ నాటకంలో....నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము...!!!

శ్రీ గురుభ్యోనమః



ఆత్మీయులు వాసుగారు పోయిన వారం హైదరాబాదు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని సంభాషిస్తుంటే విషయం సంగీతం వేపు మళ్ళి ఈ క్రింద అన్నమయ్య కీర్తన వద్దకు చేరింది..

నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము,

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము,
ఎట్టనెదుట గలదీ ప్రపంచము కట్టకడపటిది కైవల్యము,

కుడిచేదన్నము కొకచుట్టెడిది నడమంత్రపు పని నాటకము,
ఒడిగట్టు కొనిన ఉభయ కర్మములు గడిదాటినపుడే కైవల్యము,

తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము,
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము,



ఈ కీర్తనలో ఆర్ద్రత మేళవించిన వైరాగ్యంతో పాటు వేదాంతం మిళితమై ఉంది. కొన్ని కొన్ని సాహిత్యాలు,వేద దూరములై లేదా ప్రామాణిక వాజ్ఞ్మయ దూరములై కేవలం దేశీ లేక జన బాహుళ్యంలో ప్రచారంలోఉన్న విషయాలతో కూడుకొని ఉంటాయి. అన్నమయ్యగారి కీర్తనల్లో వైదిక విహితమైన సాహిత్యం ఎక్కువ కనపడుతుంది అందుకే తెలుగునాట సంగీత త్రయం రచించిన కీర్తనల తరవాత తెలుగులో అన్నమయ కీర్తనలకి ఎక్కువ ఆదరణ లభించడానికి కారణం అయ్యుండచ్చు (అలా అని నేను అన్ని సాహిత్యాలు, అందరి సాహిత్యాలు చూసేసానని కాదు, ఇంతవరకు నేను చూసినవాటిని పరిగణించి నాకున్న అల్పజ్ఞాన పరిధిలో చెప్తున్నది మాత్రమే)



ఇక సాహిత్యం అర్థంలోకెళ్తే.... జీవితంలో నేతి నేతిగా అన్నీ చూసి చివరకు పరమ వైరాగ్య సంపన్నుడై జరిగిన కాలాన్నీ జీవితాన్ని ఒక సారి చూసి ఇన్ని రోజులూ చూడనిది/పొందనిది ఇప్పుడే తెలుసుకున్నది లేదా తెలుసుకోబోతున్న లేదా పొందబోతున్న కైవల్యాన్ని ప్రతిపాదిస్తూ, ప్రతిష్టిస్తూ...
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము,

నిత్యమూ/ప్రతిరోజూ బ్రతుకుతున్న ఈ బ్రతుకంతా ఒక నాటకం, ఇన్నిరోజులూ కానలేదు ఈనాటకం చివరకొచ్చేసరికి కనపడుతోంది ఉన్నదొక్కటే కైవల్యం (కైవల్యం అనే పదం శుద్ధ అద్వైత సిద్ధాంతానికి చెందిన అర్థాన్ని ప్రతిపాదించే పదంగా పెద్దలు చెప్తారు, పోతన గారి శ్రీకైవల్య పదం... పద్య వివరణం కూడా కైవల్యంగురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ) అంతా ఏదో ఉంది ఎక్కడో ఉంది అంటూ ఇన్నినాళ్ళ బ్రతుకంతా ఒక నాటకంగా మిగిలింది అసలుది ఆ పునరావృత్తి రహితమైన స్థితిని ఇచ్చే ఆమోక్షమే!

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము,
ఎట్టనెదుట గలదీ ప్రపంచము కట్టకడపటిది కైవల్యము,

అవును, పుట్టడం నిజంగానే జరిగింది, పోవడం నిజంగానే జరుగుతుంది, ద్యోతకమౌతున్న ఈ రెండు నిజాలమధ్య ఉన్న కాలంలో చేసే పని అంతా ఒక పేద్ద నాటకము. ఈ ప్రపంచం ఎదురుగా కనిపిస్తోంది అదో పేద్ద నాటకం అసలు చిట్ట చివరిది కేవలం మోక్షం.



        జగత్తే ఒక నాటకం, అందులోకి వస్తున్నాం నాటకమాడుతున్నాం, మళ్ళీ పోతున్నాం, ఇదంతా గొప్ప నాటకం. కాని అసలు నాటకం లేనిది/కానిది కేవల పునరావృత్తి రహిత మోక్షస్థితి, అదే జీవబ్రహ్మైక్య స్థితి

కుడిచేదన్నము కొకచుట్టెడిది నడమంత్రపు పని నాటకము,
తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము,.......

పుట్టింది మొదలు అన్నం తింటూనే ఉంది ఇది, కోకలు / బట్టలు కడుతూనే ఉంది.... అదీ ఈ పుట్టుక,పోవడం లాంటిదే. పెద్ద నాటకం, ఒక సారి తింటున్నాం దాంతో పోదు, మళ్ళీ ఆకలి మళ్ళీ తిండి, అలానే బట్టలు కట్టడం మార్చడం, కట్టడం మార్చడం అలా ఎన్ని మార్లో కట్టి మార్చినట్లు ఎంత నాటకమో... ఇలా ఈ నడిమంత్రపు/ మధ్యలోని వ్యాపారం అంతా నాటకం. చెడు కర్మలు, మంచి కర్మలు అని ఈ రెంటినీ ఉభయకర్మలు అంటాం, ఆ ఉభయ కర్మల ఫలితాలను ఈ పెద్ద నాటకంలో ఒడిగట్టుకుంటోందిది. ఆ ఫలితాలు దీని గడప దాటినప్పుడే మోక్షం( ఆ ఉభయ కర్మల ఫలితాలు ఈ జీవి నుంచి విడినప్పుడే మోక్షం)



ఒడిగట్టు కొనిన ఉభయ కర్మములు గడిదాటినపుడే కైవల్యము,

ఈ నాటకంలో చెడు కర్మల వలన జన్మ జన్మలుగా పేరుకుపోయిన పాపం సాంతం క్షయమవ్వదు, అలాగే మంచి కార్యములు చేయడం ద్వారా కూడిన పుణ్యం కూడా వ్యయమవ్వదు, ఈ ఫలితాలను అనుభవిస్తూ,కూడబెట్టుకుంటున్నప్పుడు పడి పడి నవ్వుతున్న ఈ కాలం అదో పెద్ద నాటకం. (కాలంలో ఇలా ఎన్ని జన్మలలో ఎంత ఉభయ కర్మల ఫలితాన్ని కూడగట్టుకున్నావో అలాగే ఇదీ మరో జన్మ అని నవ్వుతూ నవ్వుతూ ఉన్న కాలం నాటకం... )

మరి ఎలా.......... అదిగో.. 

ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము,

అదిగో ఆ ఎదురుగానే, ఆ కొండమీదే శ్రీ వేంకటేశ్వరుడు మన ఏలికగా ప్రభువుగా ఉన్నాడు. ఏలిక అని నమ్మి వేంకటేశ్వరా అని పిలిచీ పిలవగానే మొత్తం పాపం క్షయం చేసేవాడున్నాడుగా ఆ ఏడుకొండలమీద(వేంకట=పాపములను తీసేసేవాడు), ఇక పాపమా, ఆయన ఏలిక, నా ప్రభువు ఐనప్పుడు నాకున్నవన్నీ ఆయ భిక్షే నా ఆస్థులు ఆయనవే, నాపుణ్య ఫలం ఉంటే అదీ ఆయనదే ఇక. నాకిక పాపం లేదు పుణ్యం లేదు. అదిగో ఆ ఆకాశం మీద కనపడుతున్న ఆనంద నిలయం ఉందే అదే మోక్ష స్థానం, అదే మోక్షం.

-x-

ఒక సారి ఆలోచిస్తే వేంకటేశ్వరుని కరుణను అన్నమయ ఎంత చక్కగా  విశదీకరించారు, పాప పుణ్య క్షయమైంది కాబట్టే ఆనందనిలయ ప్రవేశం చేయగలగుతున్నావు, నీ పాపాలన్నీ పోతున్నాయి, పుణ్యాలన్నీ ఆయనవౌతున్నాయి, నీపుణ్యాలకి ట్రష్టీగా వ్యవహరిస్తూ నీ జీవనానికి తగ్గవన్నీ ఆయన సమకూరుస్తున్నాడు,ఆయనని నమ్మితే చాలు మోక్షమే ఇచ్చేవాడు, అలాంటిది ఇంత పెద్ద నాటకమైన ప్రపంచంలో ప్రాపంచిక విషయాలకోసం ఇంకా ఆకోరికా ఈ కోరికా అని మళ్ళీ నాటకంలో పాత్రగా ఎందుకవ్వుతావు అని అంతర్లీనంగా సుద్ధులు చెప్తున్నట్టుగా నాకర్థమైంది ఈ కీర్తన...


-శంకరకింకర

http://www.youtube.com/watch?v=k3thpH48yAU (kirtana in MS Subbu Lakshmi gari voice)


Tuesday, June 24, 2014

రుద్రాక్షలు స్త్రీలు ఖచ్చితంగా ధరించవచ్చు ఎటువంటి అనుమానం వద్దు! పురాణ ప్రమాణంతో సహా...


నమస్కారం!

జ్యొతిష్య శాస్త్రంలో శాస్త్రకారులకు, శాస్త్రజ్ఞ్యులకున్న అపార పాండిత్యం, దానిని ద్వార ఫలితాలను లెక్కించి చెప్పే సూచనలు ఎంతో శిరోధార్యం. ఐతే రుద్రాక్షల గురించి ఉన్న పురాణ ప్రమాణాలను తోసి పుచ్చే విధంగా పెద్దలైన వారు చెప్పడం ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇవి సాధారణంగా వీటిపై అవగాహన లేమి ఉన్న సాధారణ ప్రజానీకానికి అనుమానాలు పెంచేదిగా ఉంది.

 

ఘంటా పథంగా పురాణ ప్రమాణంతో చెప్పేదేమంటే రుద్రాక్షలు "అన్ని ఆశ్రమాల వారూ, స్త్రీలూ, అన్ని వర్ణాలవారూ నిత్యమూ ధరించాలి అని శివుని ఆజ్ఞ"

 

దానికి ప్రాతి పదిక శివ మహా పురాణంలోనే ప్రస్ఫుటంగా ఉన్నది. అందులోని ఆయాశ్లోకాలను "పురాణ ప్రమాణాలుగా" ఉటంకిస్తున్నాను పరిశీలించగలరు:-

{శివ పురాణం, విద్యేశ్వర సంహిత,  సాధ్య సాధన ఖండము, రుద్రాక్ష మహాత్మ్య వర్ణనం అనే ఇరవైఐదో అధ్యాయములోని 45 నుండి 47 శ్లోకములు}

శివ ఉవాచ:-

….......

వర్ణీ వనీ గృహీ యతీ నియమేన దధ్యాత్ ఏతద్రహస్యపరమో న హి జాతు తిష్ఠేత్

రుద్రాక్ష ధారణమిదం సుకృతైశ్చ లభ్యం త్యక్త్వేదమే తదఖలాన్నరకాన్ ప్రయాంతి!!

ఆదా వామలకాస్తతో లఘు తరారుగ్ణాస్తతః కంటకైస్సందష్టాః క్రిమిభిస్తనూపకరణచ్ఛిద్రేణ హీనాస్తథా!

ధార్యానైవ శుభేప్సుభిశ్చణకవద్రుద్రాక్ష మప్యంతతో రుద్రాక్షా మమ లింగ మంగలముమే సూక్ష్మం ప్రశస్త్రం సదా!!

"సర్వాశ్రమాణాం వర్ణాణమ్ స్త్రీ శూద్రాణాం శివాజ్ఞయా!

ధార్యాస్సదైవ రుద్రాక్షా యతీనాం ప్రణవేన హి!!

 

శివుడు పార్వతితో ఇలా చెప్పెను...

............ బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్యాసి అందరూ నియమంగా రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షలు లేకుండా ఒక క్షణమైనా ఉండరాదు. పూర్వ పుణ్యముచేతనే రుద్రాక్షధారణ అదృష్టం లభిస్తుంది. .... పురుగు పట్టినవి, పాడైనవి ధరించకూడదు, శుభముకోరువారందరూ ధరించాలి.. .. ఓ ఉమాదేవీ!  రుద్రాక్ష నాయొక్క మంగళకరమైన చిహ్నము. అన్ని వర్ణాలవారు, ఆశ్రమములవారు, స్త్రీలు, శూద్రులు అందరూ సర్వదా రుద్రాక్షలను ధరించవలెను అని ఈ శివుని ఆజ్ఞ!......

 

ఒక పరి రుద్రాక్ష జాబాల్యోపనిషత్, శివ మహాపురాణం, దేవీభాగవతం, స్కంద పురాణాలలోని రుద్రాక్ష మహిమ, వానికి సంబంధించిన ఆఖ్యానాలు చదవగలరు. బహుశః మీరు చెప్పినట్టు రుద్రాక్షలు పూర్వసుహాసినులు మాత్రమే ధరించాలన్నది కేవల శైవ మత సిద్ధాంతం కావచ్చు. కానీ అది పూర్వపక్షం.

 

మీ పరిశీలనకుగానూ శివ మహాపురాణంలోని రుద్రాక్ష మహాత్మ్యం అనే అధ్యాయంలోని 45 నుండి 48 శ్లోకాలు చూడగలరు. నాలుగు వర్ణాలవారూ, అన్ని ఆశ్రమాలవారు స్త్రీలతో సహా  ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించాలని శివును ఆజ్ఞగా పార్వతీ అమ్మవారికి చెప్పబడింది. అలాగే మహాత్మ్యం గురించి ఇతర పురాణాలలో స్త్రీలు ధరించిన ఆఖ్యానాలున్నాయి (ఒక ఆఖ్యానంలో పెంపుడు జంతువులైన పిల్లికి కోతికి కూడా ఆ స్త్రీ రుద్రాక్షలు ధరింపజేసిన ఘట్టం ఉంది,) అంతెందుకు మాయమ్మ పార్వతీ దేవి తపస్సు వర్ణిస్తూనే ఆమె రుద్రాక్షలు, విభూతి ధరించినదని వర్ణించడం జరిగింది... లలితా సహస్రంలో దక్షిణామూర్తి స్వరూపిణీ అన్నపేరూ ఉంది... ఇవన్నీ పరిశీలించి కేవల శివాద్వైతమో లేదాశైవ సాంప్రదాయపరంగా మాత్రమే కాక పురాణ ప్రమాణంతో వివరించి అందరికీ ఇవి అందుబాటులోకి తేవడం ఉత్తమం అని మనవి.

To be conted....
 

ధన్యవాదములతో..

Wednesday, June 11, 2014

నీ పాదముల ప్రభావ గరిమ

శ్రీ గురుభ్యోనమః

యయౌః సాన్థ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే
యయోశ్చాన్ద్రీ కాన్తిః పరితపతి దృష్ట్యా నఖరుచిమ్!
యయోః పాకోద్రేకమ్ పిపఠిషతి భక్త్యా కిసలయం
మ్రతిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే!!

ఏ పాదముల ఎఱుపును సంధ్యాకాలము కోరుచున్నదో , ఏ పాదాల కాంతిని చూసి చంద్రుని వెన్నెలలు చూసి పరితపిస్తున్నాయీ, ఏ పాదముల మృదుత్వమును చిగురుటాకులు పొందగోరుతున్నాయో ఆ కామాక్షీ దేవి పాదములను మనసారా స్తుతిస్తున్నాను..

జగన్నేదం నేదమ్ పరమితి పరిత్యజ్య యతిభిః
కుశాగ్రీయస్వాన్యైః కుశలధిషణైః శాస్త్రసరణౌ!
గవేష్యం కామాక్షి! ధ్రువమకృతకానాం గిరిసుతే
గిరామైదంపర్యం తవ చరణమాహాత్మ్యగరిమా!!

అమ్మా కామాక్షీ! నీ పాదముల ప్రభావ గరిమ ’వేదముల తాత్పర్యము’. ఇది పరము కాదు ఇది పరము కాదు అని నయితి భావమున ఈ జగాన్నంతా విడిచి, కుశాగ్ర బుద్ధితో కుశలబుద్ధులైన సన్యాసులు / ముముక్షువుల చేత శాస్త్రమార్గమున వెతకతగిన శాశ్వత వస్తువు...

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..