Pages

Wednesday, December 12, 2012

మహానుభావులు పుట్టాలి... పక్కింట్లో..


శ్రీ గురుభ్యోనమః
నమస్తే!

నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ వస్తున్న విషయం ఇది. మరోసారి ఒక స్నేహితుని విషయంలో జరిగింది మొన్ననే చూసాను

భగత్ సింగ్ గురించి చిన్నప్పుడు చెబ్తూ లోకం పోకడ ఎలా ఉంటుందో చెప్తూ ఒక పెద్దాయన అన్నారూ భగత్ సింగ్ మళ్ళీ పుట్టాలి, కానీ మా యింట్లో కాదు పక్కింట్లోఅని అందులో వ్యంగ్యం కనపడచ్చు, లేక మాట చతురత కనపడచ్చు మరేదైనా కావచ్చు. లోకంలో గొప్ప పనులు చేసినవారు మళ్ళీ మళ్ళీ పుట్టి దేశాన్ని ఉద్ధరించాలి, లేదా సమాజాన్ని ఉన్నత మార్గాన నడపాలి అని కోరుకునే ప్రతివారు, తామెందుకు అలాకాలేం అనుక్కోరు, లేదా తమ తమ్ముణ్ణో, కొడుకునో, కూతుర్నో అలా ఎదగడం చూడాలనుక్కోరెందకనో. పొరపాట్న ఆవేపడుగేసిన కుటుంబ సభ్యుల్ని చొక్కాపట్టుకు వెనక్కి లాగడం తప్ప, ప్రజానీకం అంతా ఒప్పుకుని నీరాజనాలిచ్చే స్థితి వస్తే కానీ ఇంట్లో తమ ముందు మసలినవాడు గొప్పవాడయ్యాడని ఆమోదించలేరు.

కానీ ఈ పోకడ, ఆధ్యాత్మిక మార్గంవేపే ఎక్కువ, నేటి పరిస్థితులలో రాజకీయ నాయకులుగా, సామాజికం పేరు చెప్పి నాయకులుగా, చారిటీ పేరు చెప్పి గ్రూపులుగా తయారయ్యేవాళ్ళకు ఆ పరిస్థితి లేదు. మావాడు ఫలానా సంఘంలో ఫలానానోయ్ అని గొప్పగా చెప్పుకుంటారు. ఏ ఒక్కడూ మావాడు తిక్కన మహాభారతంలో పద్యాలు అరటిపళ్ళతొక్క విప్పి గుజ్జు చేసి తేనె చక్కెర వేసి తినిపించినంత తియ్యగా అర్థంతో సహా చెప్పగలడని ఒక్కడు చెప్పడు అసలలా తయారు చేయాలని ఏ ఒక్కరూ కోరుకోరు.

పొరపాట్నో గ్రహపాట్నో ఏమహానుభావుని సంస్పర్శ వల్లో ఆశీర్వాదం వల్లో, మహానుభావుల వచనం విని పిల్లాడు పొరపాట్న కృష్ణ కర్ణామృతం లోని శ్లోకాలో, పోతనగారి పద్యాలో, శాంకర కృతులో చదువుతుంటే, ఆ చాల్లే వాళ్ళకంటే నడిచింది ఇవి చదవటానికింకా టైముంది ఇవేం ఫుడ్డు పెట్టవు ముందు చదువు అని గదిమే వారెంతమందో.... చూసాను చాలా మందిని.

మొన్నొకాయన నా వయసుంటుందనుక్కుంటా, విదేశం నుంచి వచ్చారు. ప్రవచనాలు విని ఎన్నో విషయాలలో మారాడు. చూడడానికి ముచ్చటేసింది. అంతంత పెద్దపెద్ద ఉద్యోగాలలో ఉన్నవారు తీరికలేని వారు కూడా అలా మారుతుంటే మనం ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? ఎక్కడి గొంగళి అక్కడే అనిపించింది. సంభాషిస్తే ఆయనో నడిచే ఆధ్యాత్మిక పుస్తకంలా ఉన్నారు, బహుశా గురువుగారి మాటల్ని ఆసాంతం అనుష్టించేసుంటారు, ఆయనలో అదే జీర్ణమైపోయినట్టుంది. పక్కన వాళ్ల కుటుంబ సభ్యులున్నారు, చక్కగా పరివారం తో వచ్చిన శివుడిలా ఉన్నారనిపించేలా. సరే ఏదో పిచ్చాపాటీ కబుర్లు నడుస్తున్నాయి, ఇంతలో ఆయన భార్య అబ్బా మీ ఛాదస్తం ఆపండి అని ఏదో సరదాగా అనింది, అంటే వెంటనే ఆమె తండ్రి (అతని మావగారు) బాబోయ్ ఈనని చూస్తే భయమేస్తోంది ఛాదస్తం పెరిగిపోయింది ఈ వయసుకే, ఏం మాట్లాడితే ఏది తప్పో తెలీట్లేదు మాట్లాడాలంటేనే భయమేసేస్తోంది, ఈనో పండితుడైపోతాడేమో.. అని చిరాగ్గా మొహంపెట్టి వెనక గొణుక్కుంటున్నారు. అది విని ఆయన కొంచెం అన్యమనస్కులై మళ్ళీ ఆయన చిత్తంలో ఆయన ఉన్నారు. నాకే పెద్ద షాక్, అరె ఏమిటి వీళ్ళిలా అలాంటి మనిషిని చూసి నేనెందుకలాలేనని నేననుక్కుంటుంటే వీళ్ళేమిటి ఇలా అని. అసలేమిటి పెద్దవయసులో ఉండాల్సిన గుణంలేక, చిన్నవాడైన అల్లుడికున్న సాధన, అనుష్టానం, ధర్మసూత్ర జ్ఞానం పౌరాణిక జ్ఞానం చూసి ఛాదస్తం అని అనుక్కోవడం ఎంత మూర్ఖం.

మహానుభావులు పుట్టాలి, మహానుభావులు తయారవ్వాలి....... ఆ ఛాదస్తం మాయింట్లో కాదు పక్కింట్లో.... ఎందుకంటే అప్పుడు మేమాచరించక్కర్లేదు, వాళ్ళకి సర్టిఫికెట్లిచ్చెస్తాం భలే చెప్పారండీ అనో భలే పండితుడండీ అనో....


Sunday, November 11, 2012

రావణ్జెఠ్మలానీ

శ్రీ రాఘవం ధశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

హేరామా! ఇన్ని లక్షల సంవత్సరాలుగా ఎన్నో సార్లు ఎంత మంది భక్తులు నీ ధర్మ స్వరూపాన్ని ఉపాసన చేసి లోకానికి నీ కారుణ్యామృత వర్షాన్నందిస్తుంటే! ఇప్పటికీ అలనాటి వాచాలత్వ అర్భకులు ఇంకా హెచ్ఛరిల్లుతూనే ఉన్నారు. స్వామీ! అప్పుడూ వాళ్ళనేమీ అనలేదు నువ్వు కష్ట పడ్డావు, ఇప్పుడూ అంతేనా? వాళ్ళనేమీ అనవా?

నిన్నగాక మొన్న నీపేరు పెట్టబడిన జెఠ్మలానీ అనే వయసుడిగిన న్యాయకోవిదుడు "నువ్వు మా లక్ష్మణ స్వామి చెడ్డవారు" అని తీర్మానం చేసాడు పైగా అడిగినవారిపై దబాయింపు. గాడిదకి చదువబ్బితే చేసే పనులిలాగే ఉంటాయేమో కదా స్వామీ! పాపం ఆ ముసలి న్యాయవాది తల్లి తండ్రులైన జెఠ్మలానీలు ఎంత రామభక్తులో సదరు ముసలి న్యాయకోవిదుడికి "రాం"జెఠ్మలానీ అని పేరు పెట్టారు, ఆపేరు పెట్టుకుని కూడా వానిలో ఆసురీ గుణాలు ఛావలేదెందుకనో. బహుశా వాడు రావణాంశేమో "రావణ్జెఠ్మలానీ"

రామా! నీ భక్తులం, కింకరులమంతా కలిసి ఈతని పిచ్చి వాగుడిని ఖండించి బుద్ధిచెప్పాలని అంతర్జాలంలో అందరికీ తెలుపే ప్రయత్నం చేస్తున్నాం. ఆశీర్వదించు తండ్రీ!

Thursday, November 8, 2012

మోహ ముద్గరం

సత్సంగత్వే నిస్సంగత్వం! నిస్సంగత్వే నిర్మోహత్వం! నిర్మోహత్వే నిశ్చలతత్వం! నిశ్చలతత్వే జీవన్ముక్తిః
 అసలు జీవుడు దేనిని పట్టుకును దేని చుట్టూ తిరిగి తన జీవితంలో సాధింవలసినది సాధించలేకపోతున్నాడో దానిని జగద్గురువులు ఏనాడో చెప్పారు. గీతాచార్యుడు కూడా అదే చెప్పారు. మోహాన్ని వదిలించుకో అని. శంకరులు చెప్పిన ఈ పై వాక్యం కలిగిన స్తోత్రాన్ని "మోహ ముద్గరం" అని పిలిచారు పెద్దలు. మోహం మీద ఝుళిపించిన కొరడా అన్నమాట. ఆదిశంకరులే ఇతర విషయాల గురించి చెప్పినప్పుడు ఎప్పుడూ సౌమ్యంగా చెప్పీ.. ఈ మోహం గురించి ఎందుకు కొరడా ఝుళిపించాల్సివచ్చింది? అంటే మోహాన్ని అంత నిష్కర్షగా దూరం చేసుకోవాలన్నమాట. ప్రయత్న పూర్వకంగా.

నేటి కాలమాన స్థితుల దృష్ట్యా జీవితంలో ప్రతీక్షణం మోహావేశపూరితమైఉంటోంది. మోహాన్ని వదలగొట్టుకోవటం అంత సులభం కాదు, కానీ అంత కష్టతరమా... ఏమో... సాధన చేయాలి. సాధన సిద్ధించినవాళ్ళకే తెలుసు. చిన్నప్పట్నుంచి ఏదో ఒకదాని గూర్చి ఏడిచో, అరిచో, బ్రతిమాలో భయపెట్టో ఏదో ఒకటి చేసి తాననుక్కున్నది సాధించడం నేర్చుకున్న మనం ఇటువంటి విషయాలు ఎందుకు సాధించలేకున్నాం? అదో లక్ష వరహాల ప్రశ్న కాదేమో.. దాని సమాధానం కూడా మోహమే నేమో.

ప్రతి వ్యక్తి ఎప్పుడో చోట లౌల్యానికీ, మోహానికీ గురై ఎక్కిన మెట్లనుంచి జారుతూనే ఉన్నాడు. చిన్న పెద్ద తేడా ఏంలేదు. లౌకిక జీవనం గడుపుతూ కూడా ఆధ్యాత్మికతలో కాస్త సాధనలో పైస్థాయిలో చేరుకుంటున్నవారే ప్రతిదానికీ నాది-నేను-నాకు-నన్ను అంటూ మోహంలో పడడం చూస్తుంటాం. సాధారణ యాంత్రిక జీవనం సాగించే వారే కొద్దిగా నయమేమో, కనీసం వారికి వారి కుటుంబం, ఇల్లు, ఉద్యోగం తప్ప ఇతరాలపై ఇంత వ్యామోహం ఉండదు. (ఇది నా భావనే సుమా, తప్పై ఉండచ్చేమో తెలీదు...)

ఈ మోహం నన్నేం చేస్తోందంటే, సమస్త ప్రపంచాన్నీ నాతో ముడిపెడుతోంది, ప్రపంచ కర్తను దూరం చేస్తోంది. విశ్వంలో తిప్పుతూనే ఉంది, విశ్వనాథుణ్ణి తెలుసుకోవడానికి, పంచన చేరడానికి అడ్డుపడుతోంది. అసలు అటు ఆలోచనే లేకుండా నా ప్రపంచ వ్యాపారాలు నడిపిస్తోంది. వాడెవడో పిలవలేదని క్రోధానికి కారణమౌతోంది. పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి మావాడు మావాడు అని చంకలు గుద్దుకునేంత ఆప్యాయతను పెంచుతోంది. రెంటిలోనూ వాడెవడితోనే కట్టేస్తోంది. వాడెవడో తెగిడాడని పిసుక్కుపోతోంది వీడెవడో పొగిడాడని గీరెక్కుతోంది. ఓ పెద్దమనిషి నన్ను గుర్తిస్తే పెద్దమనిషంటోంది లేదంటే ఆఁ ఈ మధ్య వాడికి పొగరెక్కిందంటోంది. అసలు నాకెందుకివన్నీ నేను చేయాల్సింది చేసుకెళ్ళిపోతే పోలా అని ఏ కోశానా లేదు, అలా ఆలోచించట్లేదు... ఆలోచించనివ్వట్లేదు కర్తృత్వభావన ఏకోశానా కలగనీయట్లేదు, అంతా బాధ్యత, మోహం. ఏకాంతాన్నాశ్రయిస్తే వీడికి పొగరెక్కిందంటూ మారిపోయాడంటూ చుట్టూచేరినవారు, పరిచయస్తులు.

సదా మోహాటవ్యాం చరతి....ఈ మోహం ఒక అడవి అని శంకరులన్నట్లు, ఒక చోటనుండి ఇంకోచోటికి వెళ్ళినా అడవే... ఆ అడవిలోనే తిరుగుతోంది కాదు తిప్పుతోంది. దారి తెన్నూ కనపడనీదు, దిక్కులు తెలీవు, కాలం తెలీదు, గడవాల్సింది గడచిపోతోంది. ఎలా దీన్నుండి బయట పడడం...

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః!
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో!!

Friday, May 18, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 3



శ్రీ శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర జీవిత విశేషాలు

శ్రీ శ్యామ శాస్త్రి గారి "సంగీత కుసుమార్చన" ద్వారా అతి శీఘ్ర కాలంలోనే "మహా వాగ్గేయకారుడనీ, సంగీత కారుడనీ పేరు సంపాదించారు". "పెద్ద పెద్ద విమర్శకులు కూడా ఆయన సంగీతానికి, సాహిత్యానికి దాసోహం అయ్యారు". ఆయన స్వరజతులను వారు మనస్సు నిండా నింపుకుని ఆనందించేవారు. వారి కృతులలోని లాలిత్యం, అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉండే సాహిత్యం ఆకృతులు విన్నప్పుడు తన్మయత్వంతో కళ్ళు చెమర్చేవి. [ఇది నిజం. ఇప్పటికీ వారి కృతులు ఏ సంగీతం తెలియని నాబోటికే కళ్ళు చెమరిస్తే స్వయంగా శ్యామ శాస్త్రి గారు ఆలపించినప్పుడు ఎలా ఉంటుందో కదా....]. తన గురువుగారు నేర్పిన గహనమైన సంగీత శాస్త్రపు లోతుల్లోని ఎన్నో రాగాలతో వీరు హేలగా సంగీత కుసుమాలు తయారు చేసేవారు. కొన్ని కొన్ని గొప్పనైన అపూర్వ  రాగాలయందు ఆయనకున్న అధికారం వేరెవరికీ ఉండదన్నది అతిశయోక్తి కాదు. ఆయన తొలి కృతి సావేరి రాగంలో సంస్కృతంలో రచించినది.

పల్లవి
జనని నత జన పరిపాలిని
పాహి మాం భవాని త్రి-లోక (జనని)
అనుపల్లవి
దనుజ వైరి నుతే సకల జన
పరితాప పాప హారిణి జయ-శాలిని (జనని)

చరణం 1
సతత వినుత సుత గణ పతి
సేనాని రాజ రాజేశ్వరి
విశాలాక్ష తరుణి అఖిల జన
పావని (శ్రీ రాజ రాజేశ్వరి)
సతి శుభ చరితే సదా మధుర
భాషా విగళదమృత రస ధ్వని
సుర నుత పద యుగ దర్శిత ఇహ మమ
గాత్రమతి-మాత్రమజని సుజని (జనని)

చరణం 2
కువలయ లోచన యుగళే
కల్యాణి నీల వేణి వికచ
కోకనద రజచ్చరణే అతి
రమణి (ఘన నీల వేణి)
భువి దివి రక్షణి ధృతామర గణే
భాగ్యవతి శక్తి సంపూర్ణే
కవన నిపుణ మతిం అయి దిశ ఇహ తవ
కాంతిముపయాతుం గిరీశ రమణి (జనని)

చరణం 3
చరణ నిపతదమర సముదయే
కాళి సారస ముఖి
సు-శోభితోరు యుగళ వర
కదలి (నవ సారస ముఖి)
సురుచిర మురళీ మృదంగ స్వర
సంశోభిని రస-కృత మహీ తలే
సరసిజ కర యుగళే కటి కలిత మణి
కాంచీ భృతే కాంచీపుర వాసిని (జనని)

ఈ కృతి వల్ల ఆయన సంగీతంలో ఎన్ని శిఖరాలు దాటారో విదితమౌతుందని పండితులు చెప్తారు.

శ్రీ శ్యామ శాస్త్రి గారు వంశపారంపర్యంగా వచ్చిన కామాక్షి సేవను వదలకుండా, అమ్మవారి ఉపాసనలో నిమగ్నమై ఉండేవారు. వారు శ్రీవిద్యా సాంప్రదాయంలో మంచి నిష్ణాతులు. శ్యామ శాస్త్రి గారి  సర్వ వేళలా తల్లి కామాక్షినే ధ్యానిస్తూ ఉండేవారు. అది పూజ ఐనా సంగీతమైనా. [ పోతన గారు ప్రహ్లాదుని గురించి చెప్పినట్టు ఏ పని చేసినా అమ్మ గురించే ధ్యానం, అంతగా ధ్యానం చేయడం వల్లనే నేమో ఆయనకీ కామాక్షికీ అబేధ స్థితి ఏర్పడింది] ఒక్కోసారి "ఆయన కామాక్షితో మాట్లాడేవారు", మరోసారి "కామాక్షియే ఆయనతో మాట్లాడేది". రాను రాను అది నిత్యమయ్యిపోయింది. అదీ ఆయన అపార భక్తికి ఉపాసనకి తార్కాణం. "శ్రీ ముత్తు స్వామి దీక్షితుల వారికి శ్రీ విద్యా సాంప్రదాయంలోని రహస్యాలు శ్రీ శ్యామ శాస్త్రి వారు బోధించారని ఆ పరంపరలోని వారు చెప్తారు".

పుణ్య దినాలలోనూ,పర్వ దినాలలోను, శుక్రవారాదులలోనూ జరిగే విశేష పూజలలో వారు "త్వరగా అంతర్ముఖులయ్యే వారు". భక్తి పారవశ్యంతో కన్నుల ఆనంద భాష్పాలతో కీర్తనలు పాడేవారు. ఆ సమయాలలో లౌకిక విషయాలపైగానీ, పదార్థములపై గానీ స్మృతి ఉండని సమయంలో తీయటి గొంతుతో హృదయ భావాలు పొంగుతుండగా ఎన్నో గొప్ప కృతులు చేసారు. భావ మాధుర్యానికి, సంగీత మాధురిమకు, సాహిత్యంలోని లాలిత్యం అదే సమయంలో ప్రగాఢ గాంభీర్యం, భావ సాంద్రత. నేటికీ ఎందరో సాహితీ వేత్తలకు సంగీతకారులకు ఆదర్శం.

శ్రీ శ్యామ శాస్త్రి గారు స్ఫురద్రూపి, శుభ్రమైన తెల్లని పంచె చక్కని అంచు కలది కట్టు కుని, చేతిలో వెండి తొడుగున్న పొన్ను కర్ర పట్టుకుని, కాశ్మీర జిలుగుల శాలువా పైన ఆచ్చాదించుకుని నుదుట విభూతి, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో బంగారు రుద్రాక్షల మాల వేసుకుని ప్రత్యేకంగా కనపడేవారు. "పుంసాం మోహన రూపాయ" అన్నట్టు ఆయన అలా వీధిలో వెళ్తూంటే వీధిలో వారి చేతులు "అసంకల్పితంగా చేతులు రెండూ ముకుళించుకునేవి". ఆయన రూపం అద్భుత రమణీయకం అని ఆయన గురించి వ్రాసిన గ్రంథాలలో వ్రాసారు. ఒక్క సారి చూస్తే మరచిపోలేని అద్భుత రూపం, తేజస్సు వారి స్వంతం. ఆయన నడచి వెళ్తూంటే వీధులలోఅందరూ లేచి నిలబడి గౌరవ ప్రకటనం చేసేవారు. కూడళ్ళలో, రద్దీ ప్రాంతాల్లో కూడా వారిని చూడగానే పక్కకి తప్పుకుని నమస్కరిస్తూ దారి ఇచ్చే వారు. అప్పట్లో "వారిని చూడడమే మహా భాగ్యంగా భావించే వారు". "నడిచే కామాక్షిని చూస్తున్నాం" అనుక్కునేవారు. [ అలా అని వారి బయటికి వచ్చినప్పుడు శిష్య బృందాలు గుంపులు గుంపులుగా ఆయన వెనక ముందూ నడుస్తూ హడావుడి చేసారనుక్కునేరు. వారికి ఉన్న శిష్యులు అతి తక్కువ ముందే, ఆయనకి అటువంటి కోటరీలు, ఆభిజాత్యాలు పటాటోపాలేమీ లేవు]. ఆయన అందరినీ చక్కగా పలకరించేవారు. "అజాత శత్రువు" అని పేరు విమర్శకులు సైతం ఆయనను "సంగీత సామ్రాట్టు" అని పిలిచేవారు. అందరిచేత గౌరవం పొందిన సిద్ధ పురుషుడు.

శ్రీ శ్యామశాస్త్రి గారి సమకాలీకులైన శ్రీ త్యాగరాజు గారు, శ్రీ ముత్తు స్వామి దీక్షితుల వారికి చాలా మంది శిష్యులుండేవారు. కానీ శ్యామ శాస్త్రి వారికి అతి కొద్ది మందేశిష్యులు. ఉన్న వారికి కూడా శ్రద్ధగా ఆయన నేర్పలేదని అంటారు. జీవితాంతం తోడున్న ఆయన కొడుకులే ముఖ్య శిష్యులైనారు. ఒక వేళ శ్యామ శాస్త్రి వారు కూడా శిష్యులకు సంపూర్ణంగా సంగీత శిక్షణ ఇచ్చి ఉంటే ఆయన "వ్రాసిన 300 కృతులకు పైగా" ఇప్పుడు లభ్యమైయ్యేవి. ఆయన ఎప్పుడూ శిష్యులుండాలనీ, ప్రచారం కావాలనీ, కోరుకోలేదు. అలాగే జీతంకోసం సంగీతం చెప్పే స్థితి ఆయనకు కలగలేదు. కామాక్షి దయ వల్ల ఆయన ఆ వంశంలో "పుట్టడానికి ముందే సరిపడా ఆస్తి సమకూర్చబడింది". అందువల్లనే అనుక్కుంటా రాజుల వద్దకు, జమీందారీల వద్దకు వారెప్పుడూ వెళ్ళే వారు కాదు. వీలైతే వారికి దూరంగా ఉండడానికే ఎక్కువగా ప్రయత్నించేవారు. ఆయన నరులను స్తుతి చేసి ఎరుగడు. కేవలం అమ్మ వారి మీదనే వారి కృతులు.  శిష్యులకి ఆయన సంగీతం శ్రద్ధగా నేర్పకపోవడానికి కారణాలలో పైవి కూడా కారణమైనా, అసలు కారణం ఇంకోటుంది. అది వారి నిత్య తపస్సు. "సంగీతం మొదలెట్టగానే ఒక ట్రాన్స్ అంటాం కదా అలా అంతర్ముఖులై ఎన్నో గొప్ప గొప్ప రాగాలలో కీర్తనలు చేసేవారు". అది సంగీతం నేర్చుకోడానికి వచ్చిన శిష్యులకి అర్థం కాక అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం లా ఉండేది. పట్టు బట్టి వారి దగ్గర నేర్చుకున్నది వారి కుమారులు మరి కొంతమంది ఒకరో ఇద్దరో.

పండితులు విమర్శకులు వారి కృతులకు ప్రాచుర్యం రాకపోవడానికి కారణం రెండు విధాలుగా చెప్తారు. ఒకటి పైన చెప్పిన కారణం రెండవది.. శ్యామ శాస్త్రి గారి కృతులు సంగీత పరంగా గొప్ప విద్వత్తుతో కూడుకున్నవి. తాళ క్రమ విషయాలలో అత్యంత గహనమైనవి గంభీరమైనవి. వాటిని పాడడం అంత సులభం కాదు.సంగీత సాధనలో బాగా పండిన ఒక స్థాయి వారికి గానీ ఆ రాగ తాళ క్రమ విన్యాసం అర్థం కాదు. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కొన్ని పాడగలిగితే సంగీత విద్వాంసుడైనట్టే అని సంగీతజ్ఞుల అభిప్రాయం! అంగీకారం!. సాధారణ పామర జనులకు వారి సాహిత్యం చదివితే అర్థం అయ్యేలా ఉన్నా, సంగీత గాంభీర్యం వల్ల అర్థం కాదు. ఈయన కృతులు సంగీతంలో కృషి చేసిన వారికి చాలా ఆనందాన్నిస్తాయి. ఆయన అపార సంగీత జ్ఞానం వల్ల ఆయన కృతులలో మాంజి, కల్గడ, చింతామణి వంటి అపూర్వమైన రాగాలు ఉండడంవల్లా, ఆయన కృతులు చౌక కాలము, మధ్యమ కాలము లలో ఉండడం వలన, సంగీతం అనే అరణ్యంలో ఆయన కున్న సామర్థ్యం రీత్యా ఎన్నో సుందర వనాలను తీర్చి దిద్దగల సామర్థాన్ని సూచిస్తాయి.

ఒకసారి వారి మిత్రుడొకరు పుదుక్కోటకు ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడి బృహదంబా దేవాలయంలో దర్శనం చేసుకుంటున్న శ్యామ శాస్త్రి గారి వద్దకు ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి "మధురలో మీనాక్షి అమ్మ ఎదురు చూస్తోంది. నువ్వు వెళ్ళి అక్కడకి వెళ్ళి మీనాక్షీ సన్నిధానంలో ఆమెను స్తుతిస్తూ కొన్ని కీర్తనలు చేయి" అని కోరగా అది అమ్మవారి ఆజ్ఞగా భావించి అలాగే నిశ్చయించుకొన్నారు. తిరిగి తంజావూరు వచ్చి తిరిగి తన ఉపాసన ఇతర నిత్య కర్మాదులు, నిత్య విధులలో ఉండి మధురై సంగతి మరుగైంది. కొంత కాలానికి కలలో ఆ బ్రాహ్మణుడే తిరిగి కనపడి మధురై సంగతి జ్ఞాపకం చేసాడు. అదీ ఆయన సంగీతంలోని మాధుర్యం అమ్మతనం మీద అమ్మవారి మీద వారు వ్రాసిన కృతులు వినడానికి మీనాక్షమ్మే ఆయనను రప్పించుకునేందుకు ఎదురు చూసిందంటే శ్రీ శ్యామశాస్త్రి గారు భక్తి మాధుర్యం ఏమిటో ఆయన సాహిత్యమేమో అర్థం అవుతుంది. [ముఖ్యంగా సంగీత కారులు సాహిత్యాన్ని ఒక సారి వ్రాసుకుని దానికి సంగీత రచన వేరుగా చేస్తారు. అందువల్లనే చాలా కీర్తనలలో పదాలు సగంలో విరిగి పోయినట్టు అనిపిస్తుంది. ఉదా: కుందరదన అన్న చోట కొన్ని  కీర్తనలలో కుం... ............. దర.............. దన................ అన్నట్టు ఉంటుంది దీనికి కారణం సాహిత్యం దానికి సంగీతం వేరుగా రచించడం. కానీ శ్యామశాస్త్రి గారి సాహిత్యం తోపాటే సంగీతం కూడా రచించేవారు కాబట్టి పదాలు తేలికగా అర్థం అవుతాయి, పదాలని విరవడం ఈయన బాణీలో అత్యల్పం, శూన్యమనే చెప్పొచ్చు.]

సరే, మీనాక్షి తల్లి నుండి మళ్ళీ పిలుపు రావడంతో, మరచినందుకు చింతించి తన శిష్యుడైన అలసూరు కృష్ణయ్య గారిని వెంటబెట్టుకుని మధురై వెళ్ళారు. వారి గురించి అందరూ విన్నవారే కాని తంజావూరు వారికి తప్ప వారెవరో ఎవరికీ తెలియదు ఆర్భాటాలకూ పేరు ప్రతిష్ఠలకూ, ప్రత్యేక గురింపులకూ వారు విలువిచ్చేవారు కాదు. అంత గొప్ప పేరున్నా, పలు ప్రాంతాలలో వారి అభిమానులున్నా, రాజాదులు వారి సేవకు కాచుక్కూచున్నా ఎవ్వరినీ ప్రత్యేక దర్శనాలు, ప్రతేకతలు కోరకుండా ఉన్న కొద్దిశిష్యులను కూడా వెంటబెట్టుకెళ్ళకుండా, కేవలం ఒక్క శిష్యుణ్ణే వెంటబెట్టుకెళ్ళారు. శ్యామ శాస్త్రి గారు మీనాక్షి కోవెలలో అమ్మను చూస్తూ అమ్మకి ఎదురుగా నిలబడి కొన్ని కృతులు చేస్తుంటే, ఎవరో సంగీత కారుడు అని అర్చకులు కానీ, వచ్చివెళ్తున్న భక్తులు కానీ పట్టించుకోలేదు. అందరూ ఏ సంగీత విద్వాంసుణ్ణి చూడాలనుక్కుంటారో ఆ కామాక్షీ స్వరూపమైన శ్యామశాస్త్రి ఈయనే అని తెలుసుకోలేకపోయారు. నాలుగు కృతులు అయ్యింతరవాత ఐదవ కృతి అహిరి రాగంలో మొదలు పెట్టగానే ఆ గాన గాంధర్వా మాధుర్య ప్రవాహానికి భక్తులందరూ తన్మయావస్తలోకి వెళ్ళిపోయారు [అప్పుడే వారు అక్కడ మీనాక్షి అమ్మ మీద నవరత్న మాలికా కృతులు చేసారు.] ఆయన గాత్రానికి, సాహిత్యానికి, ఆనంద తన్మయత్వానికి మీనాక్షి తల్లే ఆనందించింది. వెంటనే అర్చక స్వాముల్లోని ఒక అర్చకుడు అందరి ముందూ " ఈయన ఎవరో గొప్ప సంగీత విద్వాంసుడు, అంతే కాదు అమ్మవారికి ఆంతరంగికుడైన భక్తుడు. ఈయనని దేవాలయ మర్యాదలతో సత్కరించాలి"  అని ఆవేశంతో ఊగిపోతూ పలికాడు. అప్పటి మొదలు నేటి వరకూ శ్యామశాస్త్రి గారి కుటుంబానికి మధురైలో ఆలయ మర్యాదలతో సత్కరించడం ఆ ఆలయ ఆచారమైంది. [ఏ ప్రత్యేకతలూ కోరుకోకుండా నిరాడంబరంగా ఉంటూ మన కున్న విభూతిని ఈశ్వర పరం చేయటం వల్ల, నిష్కామం గా ఉండడం వల్ల సంతసించిన పరమేశ్వరుడు సాధకునికి దక్కవలసినదాన్ని అయాచితంగా ఇస్తాడు]. శ్యామశాస్త్రి గారి పక్కనున్న శిష్యుని వలన ఆయనే వాగ్గేయకార సార్వభౌముడైన శ్రీ శ్యామశాస్త్రి గారు అని తెలుసుకుని ఆయన నిరాడంబరతను చూసి అవాక్కవ్వడం దేవాలయం వారి వంతయ్యింది. అక్కడున్న భక్తజనులు, దేవాలయం వారు, అర్చకులు ఆయనను చూసి ఆనంద పరవశులయ్యారు ఎన్నో సత్కారాలుచేశారు.

మీనాక్షి అమ్మ వారి మీద శ్యామ శాస్త్రి గారి నవరత్న మాలికా కృతులలో ఏడు మటుక్కు చాలా ప్రచారంలో ఉన్నాయి [మిగతా రెండూ నాకు తెలియలేదు, చాలామందికి తెలియవు, ఎవరికైనా తెలిస్తే తెలియజేయ మనవి]

సరోజ దళ నేత్రి - శంకరాభరణ రాగం - ఆది తాళము
దేవి మీన నేత్రి -  శంకరాభరణ రాగం - ఆది తాళము
మరి వేరే గతి - శంకరాభరణ రాగం - ఆది తాళము
నన్ను బ్రోవు లలితా - లలితా రాగం - మిశ్ర లఘు తాళము
మాయమ్మ - అహిరి రాగం - ఆది తాళము ( ఈ కృతికే అర్చక స్వామిని మీనాక్షమ్మ ఆవేశించి, పైన చెప్పిన ఘట్టం జరిగింది)
దేవి నీదు పద సారస - కాంభోజి రాగం - ఆది తాళము
మీన లోచన బ్రోవ - ధన్యాసి రాగం  - చాపు తాళము

కొందరి మతం ప్రకారం ఈ కృతి నవ కృతుల్లో ఒకటిగా అంటారు
రావే  పర్వతరాజ కుమారి - కళ్యాణి రాగం - ఆదితాళం
కానీ చాలామంది సంగీతజ్ఞుల ప్రకారం మీనాక్షి అమ్మవారిమీద  మిగిలిన రెండు కృతులు శ్రీ రాగంలోనూ, నాటకురంజిలోనూ చేశారు ప్రస్తుతం అవి అలభ్యం. ఈ రాగాలలో కామాక్షి అమ్మవారిని కీర్తించారు.

సశేషం....


Thursday, May 17, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 2





శ్రీ శ్యామ శాస్త్రి గారి చిన్నప్పుడు తిరువారూరులో వారికి విద్యాభ్యాసాలు నేర్పించారు. సంస్కృతం, తెలుగు చెప్పించారు. శ్రీ శ్యామ శాస్త్రిగారి మేనమామ గారు కూడా అక్కడే ఉండడంతో ఆయన కూడా కొన్ని విషయాలు నేర్పించేవారు. యుక్త వయస్సు వచ్చేసరికి సంస్కృతాంధ్రభాషలలో మంచి పాండిత్యం సంపాదించారు. మేనమామ సంగీతాభిమాని పైగా సంగీతం తెలిసినవారు కావటంతో ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. వారు సంగీతం నేర్చుకున్న సంగతి వారింటిలోవారు ఎక్కువగా గమనించలేదు కూడా. పైగా వారి కుటుంబంలో సంగీతాభిరుచి కలవారూ లేరు. అందువల్ల మేన మామ దగ్గర పూర్తి చేసిన ప్రాథమిక సంగీత విద్య గురించి ఎవరూ అంతగా గమనించలేదు. అప్పటికీ అతనిలోని సంగీత జ్ఙానిని ఎవ్వరూ గుర్తించలేదు. సంగీత ప్రపంచాన్ని ప్రభావం చేయగలడనీ తెలుసుకోలేదు. చక్కని ప్రతిభ కనబరచాడనీ, మధుర గాత్రమనీ సంగీతంలో ఇంకా శిక్షణ ఇప్పించాలనీ తల్లి తండ్రులు అనుక్కోలేదు. కారణ జన్ములు వారికి వారే తగిన శిక్షణనిచ్చుకొని మహాత్ములౌతారు అన్నది వీరి విషయంలో నిజమైంది. త్యాగరాజ స్వామికి నారదులవారు మారు వేషంలో సంగీత గ్రంథాన్నిచ్చినట్లు, ముత్తు స్వామి దీక్షితర్ గారికీ చిదంబరనాథుడు అనుగ్రహించినట్లు శ్యామశాస్త్రి గారి జీవితంలో అంతకన్నా గొప్ప విషయం జరిగింది.

శ్రీ శ్యామశాస్త్రి గారికి "సంగీత స్వామి" అన్న పేరుతో సర్వ విద్యలకూ, జ్ఙానమునకూ ఆలవాలమైన సదాశివుడే వారికి దగ్గరుండి శిక్షణ ఇప్పించారు. పూర్వాశ్రమంలో ఆంధ్రబ్రాహ్మణుడైన ఒక ఉపాసకుడు తురీయాశ్రమం ఐన సన్యాసం తీసుకుని కాశీలో విశ్వేశ్వర సన్నిధానంలో నర్తన చేస్తూ పాటలు పాడుతూ స్వయం విశ్వనాధ స్వరూపుడై (బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి) చాతుర్మాస్యానికి తంజావూరు వచ్చినప్పుడు దేవతార్చనకై శ్రీ విశ్వనాథ అయ్యరు వారింటికి ఆహ్వానింపబడ్డారు. సంతోషించిన సంగీత స్వామి వారింటికి వచ్చి దేవతార్చన భిక్షా స్వీకారం అయ్యింతరవాత శ్రీ విశ్వనాథ అయ్యరు వారి కోరిక మేరకు శ్రీ శ్యామ శాస్త్రిని ఆశీర్వదించబోయి చూడగా "శ్యామ శాస్త్రి ఎవరో అర్థం అయ్యింది". భవిష్యత్తూ తెలిసింది. ఆయన చేయవలసిన పనీ అవగతం అయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారుఅప్పటికే చేస్తున్న ఉపాసన గురించి అతని సంగీత సాధన గురించి చెప్పేసరికి అవాక్కవ్వడం వారి తల్లితండ్రుల వంతయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారిని అప్పుడే శిష్యునిగా స్వీకరించి సంగీతంలో రాగ, తాళ, స్వరముల యొక్క గహనమైన విషయాలను, ఎలా ప్రస్తారం చేయాలో ఆ క్రమాలనూ బోధించారు. చక్కని బుద్ధి తేజస్సు, మేధస్సు కల శ్యామ శాస్త్రి గారికి తన సూక్ష్మ గ్రాహ్మ బుద్ధితో అన్నీ ఎంతో తొందరగా నేర్చుకున్నారు. సంగీత స్వామి సకల సంగీత శాస్త్రమును, గాంధర్వ విద్యారహస్యములెన్నో కల తాళ పత్ర గ్రంథములను ఇచ్చి సంగీత సామ్రాట్టును చేసారు. [ఐతే ఇంత ఖాళీలేని శిక్షణలో కూడా శ్యామ శాస్త్రి గారు ఏనాడూ తన ఉపాసనని మరవలేదు. తన కుటుంబం ఎన్నో వంశాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా సేవచేస్తున్న కామాక్షీ పాదములను వదలలేదు. సంగీత స్వామి అంటే విశ్వనాధుడే దక్షిణామూర్తిగా శ్యామశాస్త్రి గార్కి సంగీతం నేర్పించడానికి వచ్చిన స్వామి.]

నాలుగు నెలల సమయం ఇట్టే అయ్యిపొయింది చాతుర్మాస్యం ముగిసింది "సంగీత స్వామి" వచ్చిన పనీ అయ్యిపోయింది. ఐతే ఆ స్వామి వెళ్ళేటప్పుడు ఇంకో విద్వాంసునీ అనుగ్రహిద్దామనుక్కున్నారేమో. వెళ్తూ వెళ్తూ శ్యామ శాస్త్రి గారిని పిలిచి " శ్యామా! నీకు సమస్త సంగీత శాస్త్రమూ తెలిసింది. ఇప్పుడు నువ్వు మంచి సంగీతం వినాలి. తంజావూరు రాజాస్థాన పండితుడైన పచ్చి మిరియం ఆది అప్పయ్య తో స్నేహం చెయ్యి. అతని ద్వారా మంచి సంగీతం విను, సంగీత చర్చ చెయ్యి కానీ అతని వద్ద నువ్వేమీ సంగీతం నేర్చుకోకుండా జాగ్రత్త పడు " అని చెప్పి తిరిగి తన కర్తవ్యం అయ్యింది అన్నట్లు నవ్వుతూ కాశీకి వెళ్ళిపోయారు.

ఆది అప్పయ్య మంచి సంగీత విద్వాంసుడు, కొందరికి సంగీతం బోధించే వారు. [ ఇందు వలననే చాలా మంది ఆది అప్పయ్య గారిని శ్రీ శ్యామ శాస్త్రి గారికి గురువని చెపుతూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదని వారి చరిత్ర] ఇప్పటికీ వారి కీర్తనలు కృతులు కొన్ని ప్రచారంలో ఉన్నాయని అంటారు. వర్ణాలలో నేర్పే విరిబోణి వారిదే. గుర్వాజ్ఞ ప్రకారం శ్రీ శ్యామ శాస్త్రి గారు ఆది అప్పయ్య తో స్నేహం చేసి ఇద్దరూ మంచి మిత్రులైయ్యారు. ఆది అప్పయ్యకు శ్యామ శాస్త్రి గారంటే ఎనలేని గౌరవం అభిమానం ఏర్పడ్డాయి.  అప్పటికే ఆది అప్పయ్య గారు మలి వయస్సు వారు, శ్యామశాస్త్రి గారు యువకులు. వారిద్దరి సమాగమం ఉన్నప్పుడు ఆది అప్పయ్యగారు ఎవరినీ అనుమతించేవారు కాదు. శ్యామ శాస్త్రి గారెవరో ఆయన పసిగట్టారు. ఆయన శ్యామశాస్త్రి గారిని "కామాక్షీ" అని సంబోధించే వారు. కామాక్షి అమ్మ "తాంబూల పూరిత ముఖి" కదా ఈయనా అంతే ఎప్పుడూ చక్కని తాంబూలం నములుతూ ఉండేవారు. [ ఆయన చిత్రాలలో ఇప్పటికీ వారి పక్కన తాంబూలం పెట్టెను చిత్రిస్తారు, అలాగే తమలపాకులు మడిచి చేతిలో పెట్టుకున్నట్టు చిత్రిస్తారు].

శ్రీ శ్యామ శాస్త్రి గారు ఒకనాడు ఆది అప్పయ్య గారితో చర్చ చేస్తుండగా నోట్లోని తాంబూలపు రసం ఆది అప్పయ్య గారి పంచె మీద పడింది. కానీ ఆది అప్పయ్య గారు ఏమాత్రం చలించలేదు కనీసం తుడుచుకోవటానికి కూడా కదలలేదు. అదే సమయంలో శ్యామశాస్త్రి గారు క్షమాపణ చెప్పి లేచి వెళ్ళి నీరు తెచ్చి కడుగ బోగా, ఆది అప్పయ్య గారు " శ్యామా! ఇది నాకు కామాక్షీ అనుగ్రహం. కామాక్షీ దీనికొరకే నేను వేచి ఉన్నాను. ఇకపై నాకు నిజమైన సంగీత లోకానికి ప్రవేశం లభించింది" అని శ్యామశాస్త్రి గారిని ఆ మరక కూడా స్పృశించనీయలేదు. ఆ తరవాత ఆది అప్పయ్య గారు చేసిన కృతులు, వర్ణాలు ఇప్పటికీ ఉన్నాయి.

శ్రీ శ్యామ శాస్త్రి గారు దారిద్ర్యమెప్పుడూ అనుభవించలేదు. తన తండ్రికి వచ్చిన అగ్రహారాలు, పొలాలతో, కానుకలతో ఎప్పుడూ సుభిక్షంగానే ఉండేది ఆయిల్లు. కామాక్షి కి దారిద్ర్యమా? శ్రీ విశ్వనాథ అయ్యరు వారి తరవాత బంగారు కామాక్షిని శ్రీ శ్యామశాస్త్రి గారే పూజించాల్సి వచ్చింది. అంతకు ముందు వరకూ వందల సంవత్సరాలుగా బంగారు కామాక్షికి పూజ చేసిన పుష్పాలు వేరు, ఇక శ్యామ శాస్త్రి గారు చేసిన మామూలు పుష్పాల పూజతో పాటు అద్భుత సంగీత కుసుమాలు చేర్చి చేసిన పూజ అమోఘం అనిర్వచనీయం.

శ్రీ శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర జీవిత విశేషాలు మున్ముందు

మీ....


శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 1




శ్రీ గురుభ్యోనమః
అందరికీ నమస్సులు

//ఇందులో వీరి సంపూర్ణ జీవిత చరిత్రను పొందు పరచడం లేదు, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రమే ప్రస్తుతించే ప్రయత్నం చేస్తున్నాను.//

సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు పుట్టి వారి విద్వత్తు చే వారి వారి స్థానాలను చిరస్థాయి చేసుకున్నవారెందరో మహానుభావులు ఉన్నారు. సంగీత ప్రపంచంలో అదీ ఘనమైన సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో ఒకే కాలంలో ముగ్గురు విద్వాంసులు తమ కృతులచే విలక్షణ గాన పటిమచే సంగీత సామ్రాజ్యాన్నే వీరికి పూర్వం, వీరి తరవాత అన్న కాల విభజనే జరిగింది. ఎందరో సంగీత కళాకారులున్నా వీరి ముగ్గురి విషయంలోనే ఇంతగా ఎందుకు జరిగింది అన్నది ఇ ముగ్గురి విషయంలో చూస్తే  ఉన్నది ఒక్కటే కేవల సంగీత పాండిత్యమే కాదు, సంగీతోపాసన / నాదోపాసన ద్వారా వారు ఎలా పరమేశ్వరుని కృపకు చేరువయ్యారు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉన్నది. వీరి జీవిత విషయాల ద్వారా కేవలం సంగీతం ద్వారా జీవితం పండించుకోవచ్చనేది కాక, మనకున్న వివిధ విభూతులద్వారా ఎలా భగవంతుని చేరుకోవాలో అన్వయం చేసుకోవడం ముఖ్యమని తలుస్తూ దీనిని ప్రారంభిస్తున్నాను. ఈ అన్వయం ఎవరికి వారు చేసుకోవడం శ్రేయం న్యాయం కూడా.


శ్రీ శ్యామ శాస్త్రి గారు ఈ సంగీత రత్న త్రయం గా పేర్గాంచిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులలో వయస్సు రీత్యా పెద్దవారు. వారి పూర్వీకులు ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా కంభం ప్రాంతం వారు. వారు ద్రవిడ దేశానికి వెళ్ళి స్థిర పడి తమిళ స్మార్త బ్రాహ్మణ శాఖ ఐన వడమ శాఖలో కలిసారు వీరినే ద్రవిడంలో వడదేశత్తు అని పిలుస్తారు. ఐతే ఈ కుటుంబానికి తెలుగు భాష పరిచయము కానీ, తెలుగు భాష యందు గౌరవము కానీ తరాలు మారినా తగ్గలేదు. చక్కని తేట తెలుగులో వీరి పాండిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు పైగా వన్నెకెక్కింది. కంభం ప్రాంత నుండి కాంచీ పురానికి వలస వెళ్ళిన కారణాన వీర్ని కంబట్టార్ అని తమిళులు పిలిచేవారు. వీరి వంశము శ్రీ శంకర భగవత్పాదుల కాలంలోనే కంచిలో స్థిరపడినట్టుగా వీరి వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. శంకర భగవత్పాదులు వీరి పూర్వీకులను కంచిలో కామాక్షి ఆలయ అర్చకులుగా నియమించారని చెప్తారు. అప్పటి నుండీ వీరు కంచి ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

దాదాపు ఇరవై శతాబ్దాల తరవాత (క్రీశ 1500-1600) కాలంలో దక్షిణ దేశంలో రేగిన అశాంతి, దండయాత్రల వల్ల ఎన్నో ఆలయాలు ధ్వంసమై ఆలయ సంపద కొల్లగొట్టుకు పోతుంటే. వీరి కుటుంబం కంచిలో ఉన్న బ్రహ్మగారిచే నిర్మితమైన బంగారు కామాక్షి మూర్తిని తీసుకుని తమ సమస్త సంపదనూ వదిలి, అడవులలో తిరుగుతూ దాక్కుని అమ్మవారికి నిత్య పూజలు సేవ చేస్తూ దాదాపు 28-30 సంవత్సరాలు అడవులలో గడిపారు. తరవాత తంజావూరు సంస్థానాధీశులు వారికీ బంగారు కామాక్షికీ వసతులు కల్పించగా అక్కడే 15 సంవత్సరాలు గడిపారు. అక్కడి నుండీ అణక్కుడి జమీందారీలో పదిహేను సంవత్సరాలు తరవాత విజయపురంలో పదిహేను సంవత్సరాలు ఉండి అక్కడనుండి ఇతర గ్రామాలైన నాగూరు, మాడపురం, సిక్కిల్ గ్రామాలలో దాదాపుగా మరో పదిహేను సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుండి తిరువారూరుకు వచ్చి అక్కడ 45 సంవత్సరాలున్నారు. తిరువారూరు త్యాగరాజ స్వామి (పరమేశ్వరాలయం)లో ఒక ప్రత్యేక మంటపంలో ఉంచి పూజించే
వారు. ఇక్కడే మన ఈ వంశంలో ఒక రత్నం జన్మించింది. వారే శ్రీ శ్యామ శాస్త్రి. వారి తండ్రిగారు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు అప్పటికి ఈ బంగారు కామాక్షి అమ్మకి సేవచేస్తూ అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవారు.

మైసూర్ పాలకుడు హైదర్ ఆలీ (టిప్పు సుల్తాన్ తండ్రి) తిరువారూరు మీద దండయాత్ర ప్రకటిస్తే ఏం చేయాలో తెలియక, అర్చకులు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు తంజావూరు రాజుగారిని సంప్రదించి కోటలోనే బంగారు కామాక్షిని ప్రతిష్ఠించి అక్కడే సేవ చేసేవారు. ఆ కాలంలోనే ఇతర దేవాలయాలలోని విగ్రహములు కూడా తంజావూరు చేరాయి. ఎన్నో వైష్ణవ దేవాలయ విగ్రహాలు తంజావూరులోని రాజగోపాలస్వామి ఆలయం చేరాయి. అనంతరం కొద్ది కాలానికి హైదర్ ఆలీ మరణించిన తరవాత అన్ని విగ్రహాలూ ఆయా దేవస్థానాలకి తరలిపోయాయి. తరవాత తంజావూరులోనే అమ్మవారికి ఒక కోవెల నిర్మించి అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠింప చేశారు. ఈ సమయంలో తంజావూరు రాజు గారు శ్రీ విశ్వనాథ అయ్యరు వారికి కొన్ని అగ్రహారాలను, కానుకలను ఇచ్చారు. అమ్మ వారి ఆలయానికి కొంత భూమిని కానుకలను ఇచ్చారు. ఇప్పుడు ఆదేవాలయము కట్టి 225 సం పైనే అయ్యింది. ఆ ఆలయమే ఇప్పటికీ శ్రీ కామాక్షీ అమ్మన్ కోవెల్ గా ప్రసిద్ధి చెందింది.

[ఈ మధ్యలో ఎన్ని తరాలు మారినా వారి కామాక్షీ సేవ మాత్రం ఏనాడూ మారలేదు, మానలేదు. ఎన్ని అడ్డంకులు అమ్మమీద అకుంఠిత దీక్షతో అమ్మనే నమ్ముకుని కొన్న శతాబ్దాలుగా వారు చేసిన బంగారు కామాక్షికి చేసిన సేవ అనన్య సామాన్యం. కన్న తండ్రి మాట కొడుకులు వినని ఈ నాటి ఈ పరిస్తితులకి వారి వంశాన్ని చూసి నేర్చుకోవలసినదెంతో ఉంది. దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా కాంచీపుర ఆలయ అర్చకులుగా సేవచేసి. అమ్మవారి సేవే తమ సమస్త ఐశ్వర్యం అని భావించి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తరులుతూ ఎన్ని తరాలు అమ్మ సేవలో అంకితమయ్యాయో.]

ఇక శ్రీ శ్యామ శాస్త్రి గారి జననం గురించి ఒక కథ ఉంది. తిరువారూరులో శ్రీ విశ్వనాథ అయ్యరు వారున్నప్పుడు అక్కడ ఉన్న ఒక భక్తుడు ప్రతి శనివారం వేంకటేశ్వర సమారాధన చేసేవాడు. ఆ సమారాధనకి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టు శ్రీశ్యామ శాస్త్రి తల్లిగారిని పిలిచి నీకు వచ్చే సంవత్సరం చైత్ర మాసంలో కృత్తికా నక్షత్రం ఉండగా కొడుకు పుడతాడు, నువ్వు నూరుగురికి సమారాధన చేయమని ఆజ్ఙాపించాడు. అప్పటికే వారి వంశం వారు అన్ని ఊళ్ళూ తిరుగుతున్న కారణాన ఎక్కడా ఏ కొంతా దాచుకుందిలేదు. వారి వద్దనున్నదంతా బంగారు కామాక్షిని కొలవడం తప్ప. అందువల్ల ఆమె తటపటాయిస్తుంటే పోన్లే నూరు మందికి కాకపోతే అందులో పావు వంతు మందికి అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆవిడ సంతోషించింది. తరవాత కొంతకాలానికి ఆవిడ గర్భిణి అయ్యింది. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా నే చక్కటి కొడుకు పుట్టాడు. వేంకటే శ్వరుని అనుగ్రహం అనీ, కృత్తికా నక్షత్రంరోజున పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అనీ కలిపి 'వేంకట సుబ్రహ్మణ్యం' అని పేరు పెట్టారు. కామాక్షీ / వేంకటేశ్వరుల అనుగ్రహం కదా వారు కాస్త రంగు తక్కువ పైగా స్ఫురద్రూపి కావటంతో 'శ్యామ కృష్ణ' అని ముద్దుగా పిలుచుకునేవారు ఆదంపతులు. కానీ అప్పటికి వారికి పుట్టినవాడు పుం రూపంలో ఉన్న కామాక్షీ అంశ  / కామాక్షి సోదరుడైన వేంకటనాథుని అంశ అనుగ్రహం కలిగినవాడు అని కానీ తెలియదు. విశ్వ విఖ్యాత సంగీత ఖ్యాతిని ఆర్జిస్తాడనీ తెలియదు.

ఇక వారి సంగీత ప్రస్థానం మున్ముందు....


మీ....


Sunday, April 8, 2012

నిన్ను నువ్వు తప్ప ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఎవ్వరూ పాడు చేయనూలేరు

శ్రీ గురుభ్యోనమః
సదాశివ సమారమ్భామ్ వ్యాస శంకర మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురుపరంపరామ్

’ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానమ్’
ఉద్ధరేదాత్మానా ఆత్మానం నాత్మాన మవసాదయేత్ !
అత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః !!
(ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్! ఆత్మానం న అవసాదయేత్! హి ఆత్మనః అత్మ ఏవ బన్ధుః! ఆత్మనః ఆత్మ ఏవ రిపుః!)
ఈరోజు తెల్లవారుఝామునే లేవగానే చూసిన సందేశం ఇది. కొన్ని కొన్ని విషయాలు చూసి కొంచెం చలిత మనస్సుతో ఉన్న నాకు నిద్ర లేవగానే ఈ సందేశం చూసే సరికి ఉలికి పాటు వచ్చింది. అలా అని ఈ సందేశం కొత్తదీ కాదు ఎప్పుడూ విననిదీ కాదు. ఎక్కడో ఏదో అయ్యిందని, ఎవరో ఏదో చేస్తారని ఏదో దొరకలేదని ఎవరో ఇవ్వలేదని అందువల్ల ఏదో కలగలేదని ఆలోచన చేయక నీ కర్తవ్యం నువ్వు నిర్వహించు అన్నట్లుగా ఒక పెద్దాయన ద్వారా ఈ సందేశం అందింది.


ఆహా జగద్గురుబోధ అంటే అదే కదా... ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారు సంస్కరించుకోవాలి. పరిశీలన చేయాలి, పరిష్కరించుకోవాలి. మిత్రుత్వం నెరపేవారు, బంధువులూ నిన్ను ఉద్ధరించలేరు, అలానే నీ శత్రువులూ నిన్ను అథోగతి పాలు చేయలేరు. లౌకింకంగా కొంత ప్రభావం చూపగలరేమో, నిన్ను నువ్వు తప్ప ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఎవ్వరూ పాడు చేయనూలేరు.
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏

-శంకరకింకర

Monday, March 5, 2012

బొట్టు

శ్రీ గురుభ్యోన్నమః
 
నమస్తే
బొట్టు పెట్టుకోవడం
బొట్టుపెట్టుకోవడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. బొట్టు పెట్టుకుని ఉన్న వ్యక్తియొక్క ముఖవర్చస్సు ముఖంలో కళ వేరు. అంతర్జాలంలో ఒక ఘన పండితుడు వ్రాసిన సందేశం చూసాను, ఆయన ఎవరో ఒకరిద్దరు కార్య కర్తలు బొట్టు పెట్టుకోమన్నందుకు తిరిగి వారికి తత్త్వోపదేశాలు వేదాంతం, షడంగాలు, మహర్షులు, సంస్కృతం పాండిత్యం వగైరాల గురించి లెక్చర్ ఇచ్చి పిచ్చుకలమీద బ్రహ్మాస్త్రంలాగా వేసి అదేదో ఘనకార్యంలా ఆ కథను చెప్పుకుంటూ హిందుత్వానికీ (సనాతన ధర్మానికి) బొట్టుపెట్టుకోవడానికీ సంబంధం లేదన్నంతగా తీర్మానం చేసేశారు.
అసలు బొట్టెందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకుంటేనే హిందువా? ఐతే ఏ బొట్టు అడ్డమా నిలువా వగైరా వితండ వాద ప్రశ్నలు కోకొల్లలు. పైగా దానికి తోడు శుశ్కమొకటి. మాకంతా తెల్సు మేం చాలా క్లెవర్, బొట్టు పెట్టుకోవడం పెద్దగొప్పా అని.
 
సనాతన ధర్మానికి ఆయువుపట్టైన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడన్నదానికి గుర్తుగా భ్రూమధ్యంలో బొట్టుపెట్టుకుంటారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం అంటే, కర్మ ఫలాన్ని, దాన్ని అనుభవించడాన్నీ, దానిని ఇచ్చేవాడొకడున్నాడన్న సత్యాన్ని,  ఇత్యాది విషయాలున్న సనాతన ధర్మాన్ని అవి ప్రతిపాదిస్తున్నవేదాలను నమ్ముతున్నామనీ, ఆ సనాతన ధర్మంలో చరిస్తున్నామనీ గుర్తే బొట్టు పెట్టుకోవడం. సనాతన ధర్మపు సార్వభౌమికం మనిషి పెట్టుకునే బొట్టులోనూ, దేవాలయ ధ్వజస్థంభంలోనూ, ఇత్యాది ఇతరములలోనూ ఉంది. ఒక దేశ సార్వభౌమత్వం ఆదేశ పతాకంలో ఆదేశపు చిహ్నంలో ఉన్నట్టే సనాతన ధర్మంలో చరిస్తున్న వారు వారి ధర్మం యొక్క సార్వభౌమ చిహ్నంగా బొట్టు ధరిస్తారు. బొట్టు పెట్టుకోవడమే అంత నామోషీ ఐతే అదే స్థానంలో వేడి కురుపో, లేక ఏ పురుగో కుట్టి పుండై మచ్చైతే ఏం చేస్తారో మరి?
 
ఇక ఏది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి? అది ప్రశ్నేకాదు, తప్పించుకోడానికి, వివాదం చేయడానికి, వారికి వారు తెలివిగలవారనిపించుకోడానికి తెలివిగా అడుగుతున్నామనుక్కుని మూర్ఖంగా అడిగే ప్రశ్న అది. బొట్టులావాడడానికి కుంకుమ, చందనం, విభూతి, కస్తూరి ఇత్యాది పదార్థాలను శాస్త్రం నిర్దేశించింది, వాటినే వాడాలి. నుదురు మీద ఏ నామాలైనా నీ మతమును (షాణ్మతములగురించే మాట్లాడుతున్నాను సుమా) అనుసరించి, అడ్డనామాలో, నిలువు నామాలో పెట్టుకో కానీ బొట్టు మాత్రం భ్రూమధ్యంలోనే పెట్టుకోవాలి. బొట్టు భ్రూమధ్యంలోనే ఆజ్ఙా చక్రం మీద పెట్టుకోవాలి అన్నప్పుడు ఏది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్న ప్రశ్న మూర్ఖపు ప్రశ్న (నిజంగా తెలియని వారు అడగడంలో తప్పు ఏమాత్రమూ లేదు) బొట్టు అన్ని రకాల నామాలు పెట్టుకునేవారూ పెట్టుకుంటారు, పెట్టుకోవాలి. దీనిని సాకుగా చూపి బొట్టుపెట్టుకోనివాడు సనాతన ధర్మంలో ఉన్నానని చెప్పి, ఎన్ని శాస్త్రాలు చదివినా వేదాలు నేర్చినా ఏం లాభం. ఆచరణ లేని విద్య ఎందుకు నాలిక గీసుకోడానికి కూడా పనికిరాదు, పైన చెప్పినట్టు ఏదో కొద్ది ఆసక్తితో సనాతన ధర్మంలో చరిస్తూ కనీసం బొట్టు పెట్టుకుని ఉండాలన్న ఇంగితముండి పెట్టుకోని వాణ్ణి బొట్టుపెట్టుకోమన్నవారే నయం. అన్ని తెలుసుకునీ తెలియని వారిమీద సెటైర్లు వేసి తెలివైనవాణ్ణనే ఫోజు కొట్టటం ఎందుకు? ఎవరిని ఉద్ధరించటానికి? క్రింది వారిని ఉద్దరించే ముందు అన్ని తెలుసుకునీ మనమేం ఉద్దరించామో తెలుసుకోవటం ఉత్తమ లక్షణం. లేకపోతే, అన్నీ చదివి, తెలిసుకుని ఆచరించని రావణుడు చేసిన పనుల్లానే ఉంటాయి.
 
బొట్టుపెట్టుకోమన్నందుకు అకృత్యం చేయమన్నవాళ్ళని కడిగేసినట్టు, ఉన్న పాండిత్యంతో హడావుడి చేసి వారిని బెదరగొట్టింది చాలక, ఇలా చేసానన్న ప్రచారం గొప్ప దేనికోసమో?
 
బొట్టు పెట్టుకోనివాడు సనాతన ధర్మంలో ఉన్నానని చెప్పటానికీ, అందులోని వేదా, వేదాంగ శాస్త్ర పరిజ్ఙానం సంపాదించుకోడానికీ అనర్హుడు. ఒక దేశంలో ఉండి ఆదేశ పతాకాన్ని గౌరవించనివాడితో లెక్క.
 
కాస్త ఆవేశం పాలు ఎక్కువైనట్టుంది కానీ, తెలిసినవాడే తప్పుచేస్తుంటే చెప్పవలసి వచ్చినప్పుడు నిష్కర్షగా ఖండిస్తూ చెప్పాలి. లేకపోతే మనం తెలుసుకుని ఏం లాభం. అదే తెలియని వారికైతే చక్కగా అందంగా బోధించాలి కదా!!! శాస్త్ర పరిజ్ఙానం తక్కువైనా సనాతన ధర్మంలో (రాజకీయ వర్గీకరణలో హిందూ మతం) చరించే వారు, ఇది చదివినవారు తప్పక బొట్టు పెట్టుకుంటారని ఆశిస్తూ, ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అని అడిగేవారికి కూడా చెప్తూ ఉంటారని ఆశిస్తూ..

Thursday, March 3, 2011

శివ శివ శివ

శ్రీ గురుభ్యోన్నమహ
శ్రీ గణేశాయనమః
జగద్గురు శంకరాచార్య పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ప్రసంగములనుంచి, మా గురువుగారి వివరణల నుంచి సంకలనం చేసినది
శివం అంటే మంగళం, "శ్వశ్రేయం శివం భద్రం కళ్యాణం, మంగళం శుభం" అని అమరకోశం వ్యాఖ్యానిస్తోంది.అట్టి పరమమంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయాలనుక్కునేవారు చేయవలసినదేమిటి? మొదట విభూతి ధారణ, విభూతి అనగా ఐశ్వర్యం. అది అగ్నిలో కాలి శుద్ధమైన చిట్టచివరి సత్య వస్తువుగా మిగులుతుంది ( ఏ వస్తువుని కాల్చినా మిగిలేది బూడిదే, బూడిదని కాల్చినా మిగిలేది బూడిదే అదే ఆ వస్తువు యొక్క సత్స స్వరూపం). ఆ విభూతిని శివుడు ఒంటినిండా అలదుకుంటాడు. అంటే సృష్టి వ్యూహ రహస్యాన్ని అంతా వీభూతి కణాలలో కూర్చి దానిని తన శరీరానికి అలదుకుని కాపాడతాడు. అంతా బూదిగా మారినా దాన్ని తనకలంకారంగా పూసుకుని తానుమాత్రం అలానే ఎకంగా తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు. విభూతి సూచించే ఇంకో విషయం ఏంటంటే కాలం లో వచ్చినది కాలంలో కలిసిపోయి కాలానికతీతుడైన ఆ పరబ్రహ్మను పట్టుకుని ఆయనలోచేరిపోతుంది. ఆయనే కాలాతీతుడు పరబ్రహ్మము అని తెలుస్తుంది
రెండవది రుద్రాక్ష ధారణ, రుద్రాక్ష అంటే శివుని కళ్ళ నుండి పుట్టినది. సాక్షాత్ ఆయన మూడవ కన్ను స్వరూపం. దేవతలలో మూడు కన్నులున్న దేవుడు ఈయనే. మూడవకన్ను అగ్నికి ప్రతీక అంటే జ్ఙానాగ్నికి ప్రతీక. సృష్ఠిలో రుద్రాక్ష వంటిది మరొక లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంక ఏ కాయకి, పండుకి, గింజకీ దేనికీ ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తినీ ప్రయోగించి రంధ్రము చేయనవసరంలేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడా మన సంసారంలో ఉన్నా జీవనాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్యమైనదానిగా గడపాలని సూచిస్తుంది
మూడవది పంచాక్షరీ మంత్ర జపం. పంచాక్షరీ జపం మంత్ర దీక్షలేని వారు శివ శివ అని జపం చేయాలి. విద్యానుశ్రుతిరుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇ త్యక్షరద్వయమ్!! వేదములలో ఉత్కృష్టమైనది మధ్యలోనున్న మేలుబంతి వంటిది యజుర్వేదం. ఆ యజుర్వేదంలో నాలుగవ కాండ ఇంకా ప్రశస్తం. ఆందులోని రుద్ర ప్రశ్నలో మధ్యలోని పంచాక్షరి ఇంకా గొప్పది. ఆ పంచాక్షరిలోని శివ అను అక్షరద్వయం జీవద్వయం. అని శ్రీ అప్పయ దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో చెప్పారు. నాలుగవది మారేడు దళములతో పూజ. లక్ష్మీదేవి ఐదు స్థానాలలో ఎక్కువగా ఉంటుంది. అవి మారేడు, ఆవు వెనక తట్టు, స్త్రీల పాపట, ఏనుగు కుంభస్థలము, పద్మము. అందుచేత మారేడుచే శివపూజ అత్యంత ముఖ్యం అంతేకాదు మారేడుతో పూజ ఐశ్వర్యాన్ని, జ్ఙానాన్నీ కూడా కలుగజేస్తుంది.ఐదవది ధ్యానం, హృదయంలో సదా శివ ధ్యానం చేస్తూ వెలుపలి పూజతోపాటు శివస్వరూపానుసంధానం ఎడతెగకుండా చేయాలి అదే అభిషేకం.
సాయంకాలం సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదీష సమయంలో శివ స్మర్ణ విధిగా చేయాలి కనీసం ఐదు నిమిషాలైనా చేస్తానని సంకల్పించి మానసికంగా స్మరణమూ వాచికంగా శివనామోచ్చారణా చేస్తే ఆత్మోన్నతి కలుగుతుంది.ఏ సందేశమైనా, లేదా సాక్ష్యమైనా మరణ సమయంలో ఇచ్చినది నిక్కచ్చి. భాగవతం అంతటికీ మేలు బంతి దక్ష యజ్ఙ ధ్వంసం. భాగవతం సందేశం. శివనింద చేయరాదన్నదే అని పెద్దల వాక్కు. సతీదేవి శరీర త్యాగం చేసి శివుని ద్వేషించిన, అటువంటి వారిని ప్రోత్సహించిన వారి గతిఏమో చూపించింది. శివుడొద్దన్నవానికి మంగళమెక్కడిది?
 పాపాన్ని ఒకే ఒక్క కోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉంది. దానికోసం అన్ని చోట్లా వెతకక్కరలేదు. వేదాలకు జీవరత్నము, దేహానికి ప్రాణమూ, దేవాలయమునకు మహా లింగము వలె వెలుగుతున్న శివ అనే రెండు అక్శరాలు పాపాలన్నీ పటాపంచలు చేసే పరమౌషధం. మానవునిగా పుట్టి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుక్కునేవారికి శివనామోచ్చారణమే శరణ్యము. ఆ పరమేశ్వరుడు మనకి నాలుక వాక్కు ఇచ్చినందుకు పంచాక్షరిని ఉపదేశం లేకపోతే శివ శివ అని జపం చేయడమే మన విధి.
 అపి వా య శ్చాండాలః శివ ఇతి వచం విసృజేత్
తేన సహ సంవసేత్

ఛండాలుడంటే ఏ విధీ లేక అన్ని సంస్కారాలనూ వదిలి చాతుర్వర్ణాలనూ వదిలి ఉన్నవాడు. శివుడు సర్వ జగత్తుకు తండ్రి. మంచి వారికీ తండ్రి అలాగే చెడ్డవారికీ. దేవతలకూ దానవులకూ కూడా వారు తల్లి తండ్రులు.. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ... అందుకే ఛండాలుడు ఉద్దరింపబడడానికి శివ నామ జపం విధిగా నియమింప బడింది. అంటే ప్రతి ఒక్కరూ శివ నామ జపం చేయాలి.

యాతే రుద్ర శివాతనూరా ఘోరపాపకాశినీ
తయా నస్తను వా శంతమయ గిరిశం తాభిచాకాశీహి
..........
యాతేరుద్ర శివ తనూః శివా విశ్వాహ భేషజీ
శివారుద్రస్య భేషజీ తయానో మృడ జీవసేః
ఆ పరమేశ్వరుడు భక్తులకు అతి మంగళ కరుడు, భక్తులపాలికి వచ్చినవారికి కంకాళాదులతో ఘోరరూపి. ఆయన అహం స్ఫురణ ప్రాణమే అంబిక. ఆయన మంగళ కరుడు ఆవిడ సర్వ మంగళ.

శాస్త్రం శారీర మీమాంసా దేవః శ్రీ చంద్ర శేఖరః
గురుః శ్రీ శంకరాచార్యః నంతుమే జన్మజన్మని!!
ఎన్ని జన్మలకూ నాకు చంద్ర శేఖరుడైన సాంబశివుడే స్వామి. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులే గురువులు. ఏజన్మ ఎత్తినా ఏ అవస్థలో ఉన్నా శివ నామస్మరణమే శాంతి కారకము.

Sunday, February 27, 2011

ఆద్యాత్మిక సాధన మార్గం లో ఉన్నతమైనది,సులువైనది, ఎ విదముగా పొందగలిగినది

నమస్తే,
చాలా గడ్డు ప్రశ్నే వేశారు! మొత్తం ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలను,
మార్గాలను గురించిన ప్రశ్నలను ఒక్క ప్రశ్నలొ ఇమడ్చారు.
గురువుగారి మరియు ఇతర పెద్దల సాంగత్యం వలన, వారు చెప్పిన ఎన్నో
విషయాలలోని నాకర్థమైన కొంతదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ
దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మానవ జన్మ మన పూర్వ
జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము కాదు. ఇది
ఎలా ఉంటుందంటే, మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు
వగైరాలు దాటి చిట్ట చివరి పరీక్షకు అర్హత సంపాదించినట్టు, అన్ని జన్మలూ
దాటి జీవుడు ఈ మానవ జన్మ పొందుతాడు. అసలు సమస్య అంతా ఇక్కడే! ఇక్కడిదాకా
వచ్చాకే! అఙ్ఞానం వల్ల అసలు ఈ జన్మలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయి ఇతర
విషయాలపై ఆసక్తి పెంచుకుంటాడు. అసలు పరీక్షగురించి (జన్మ ప్రయోజనాన్ని)
మర్చిపోతాడు. దీంట్లో ఉత్తీర్ణుడు కాకపోతే మళ్ళీ అదే తరగతి మళ్ళీ మౌఖిక,
పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు అన్నీ మొదలు.
ఉత్తీర్ణతపొందడమంటే.. పండిపోవడం.. అదే ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం.. అదే
పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కి చేరుకోవడం. ఇదే ఆధ్యాత్మిక
సాధనలో చిట్ట చివరి ప్రయోజనం. అది ఎలా అంటే, భక్తి చే ఙ్ఞానమును పొంది
వైరాగ్యముపెంపుచేసుకొని అసలువస్తువును తెలుసుకోవటమే పునరావృత్తిరహిత
శాశ్వత శివ సాయుజ్య స్థితి. అసలు వస్తువైన ఆత్మ యొక్క యెరుక తెలుసుకొని
ఆత్మానుభవమును పొంది అంతటా ఉన్నది ఆ ఆత్మయే అని ఆత్వ ద్వారా ఆ పరమాత్మలో
లీనమైపోవడమే ఈ జన్మ ప్రయోజనం అదే ఉన్నతమైనది. అదికాక ఇంకొక ప్రయోజనం
ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నది అని నేను అనుక్కోవట్లేదు ( గురువుగారు
కూడా ఎప్పుడు ఇదే చెపుతారు). అది సాధించే నేపధ్యంలో అనుషంగిక ప్రయోజనాలు
ఏవైనా చేకూరవచ్చుగాక (ఉదా: ధనం, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, కుటుంబ
వృద్ధి, పిల్లలు పెళ్ళిళ్ళు వంటివి, అంతకన్నా అష్టసిద్ధుల వంటివి
పొందవచ్చునేమో), కాని వాటితో తన్మయత్వం చెందక చిట్టచివరి ప్రయోజనమైన
ఆత్మానుభవమును పొందటమే ఉన్నతమైన లక్ష్యం.
ఇదిపొందటానికి సులువైన మార్గం వైదికధర్మావలంబనమే, నీ ధర్మంలో నువ్వు ఉంటూ
నీ కర్తవ్యాలని నెరవేర్చటమే సులువైనది. అందునా గృహస్థు సంసారంలో ఉంటూ తన
ధర్మాన్ని తాను ఆచరించి భగవత్కైంకర్యం చేస్తూ ఉండాలి. భక్తితో కూడిన
కర్మాచరణముచే ఙ్ఞానసముపార్జవైపు అడుగులిడి వైరాగ్యమును పెంపొందించుకుంటూ
తుట్టతుద జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి.
ఇంకా విపులంగా చెప్పాలంటే, ఏది చేసినా భక్తితో భగవంతునికి సమర్పణ భావంతో
మెలగటం. అలా చేయగా చేయగా ఒకనాడు ఆ భగవంతుడే చిట్ట చివరి లక్ష్యానికి
చేరుకోవడానికి కావల్సిన సంబారములను చేకూర్చడానికి తానే ఒక మహానుభావుని
రూపంలో కావలసిన ఉపదేశం చేస్తాడు ( ఉపదేశం అనేది, బోధ కావచ్చు, మరింకేదైనా
కావచ్చు అది ఇలాగే ఉండాలని, ఒక పద్ధతిలోనే ఉండాలని చెప్పటం కష్టమే).
గురువుగారు లలితా సహస్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఒక సుత్రాన్ని తెలిపారు.
నీవు ఏదైనా పని చేసేటప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో నీవు చేసే
పనిని నీ గురువు ఇంకా భగవంతుడు ఆమోదిస్తారా అని వివేచన చేస్కో.
దానిద్వారా నీ ప్రతి కర్మాచరణమును సంస్కరించుకో, అదే నిన్ను మెల్లి
మెల్లిగా నువ్వు చేరుకోవలసిన స్థితికి తీసుకెళ్తుంది.
అడ్డ దార్లను, ఇతర మైన  మార్గాలను పెద్దలు ఎవరూ ఇష్టపడరు, అవి మనకి
సమాజానికి అంత శ్రేయస్కరంకూడా కావు.
నేను విన్నవి చదివినవి నాకు అర్థం అయ్యినంతవరకూ ఇక్కడ వ్రాసాను, తప్పులు
ఉంటే పెద్దలు దిద్దగలరు.
మీ...
సూర్య నాగేంద్ర కుమార్ అయ్యగారి