Pages

Friday, November 27, 2020

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 12వ అధ్యాయం

 *అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ద్వాదశోధ్యాయః*

*శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం* 

*వసిష్ఠ ఉవాచ:*

కార్తిక్యామిందువారస్య మహాత్మ్యం శ్రుణు భూపతే

తస్మాచ్చతగుణంతస్మిన్ వ్రతం సౌరిత్రయోదశీ!!

సహస్రగుణితంతస్మా త్కార్తికేమాసి పౌర్ణిమా

తయా లక్షగుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినం!!

తస్మాత్కోటి గుణం రాజన్ అంతిమైకాదశీంవిదుః

తస్మాదనంతగుణితం కార్తికే ద్వాదశీదినమ్!!

*తా:* ఆ వసిష్ఠుడు తిరిగి ఇలా కొనసాగించెను " ఓ రాజా, కార్తీకమాస సోమవార మహాత్మ్యము వినుము, సోమవారముకంటె శనిత్రయోదశీ నూరు రెట్లు, శనిత్రయోదశికంటే కార్తిక పున్నమి వెయ్యిరెట్లు ఫలము, పూర్ణమి కంటె శుక్ల పాడ్యమి లక్ష గుణము అధికము, శుక్ల పాడ్యమి కన్నా బహుళ ఏకాదశి కోటిగుణకము, అంతిమ ఏకాదశి కన్ననూ ద్వాదశి అనంత గుణఫలోపేతము, [పౌర్ణిమాంత మాసముననుసరించు ఔత్తరాహికులు (ఉత్తరభారతీయులు) శుక్ల ఏకాదశినే అంతిమ ఏకాదశిగా గణింతురు, ఆ దినమునే అంబరీషుని చరిత్రను గ్రహింతురు]

 

అంతిమైకాదశీం మోహాదుపోష్యయదిమందిరె

గీతవాద్యపురాణైశ్చ కుర్యాజ్జాగరణం నరః

ససర్వపాపనిర్ముక్తో విష్ణులోకేవసేచ్చిరమ్!!

తథాపరదినెప్రాప్తె పారణం బ్రాహ్మణైస్సహ

యః కార్తికేమాసి రాజన్ స సాయుజ్యం లభేద్ధరేః!!

కార్తికేయశ్చద్వాదశ్యాం అన్నదానం మహాత్మనే

యః కుర్యాద్రాజశార్దూల సర్వసంపద్వివర్ధతె!!

గంగాతీరెరవిగ్రస్తే కోటి బ్రాహ్మణభోజనాత్

యత్ఫలం లభతేజంతుః తత్ఫలం ద్వాదశీం విదుః!!

ఉపరాగ సహస్రాణి వ్యతీపాతాయుతానిచ

అమాలక్షంతుద్వాదశ్యాః కళాం నార్హంతీషోడశీమ్!!

*తా:* మోహముతోనైనగానీ, ఈ అంతిమ ఏకాదశి ఉపవాసము చేసి, గీత వాద్య పురాణముల పఠనముల చేత జాగరణము చేయువారు సమస్త పాపములనుండి ముక్తులై విష్ణులోకమున చిరకాలముందురు. కార్తీక మాసమున యేకాదశినాడుపవాసముండి, ద్వాదశినాడు బ్రాహ్మణులతో కూడి పారాణము చేసెడివాడు సాయుజ్యముక్తినొందగలడు. కార్తీక మాసమందు ద్వాదశీ తిథినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధినొందును. సూర్యగ్రహణదినమునందు గంగా తీరమున కోటిబ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశీ తిథినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభిస్తుంది.  వేయి గ్రహణములు, పదివేల వ్యతీపాతయోగములు లక్ష అమావాస్యలు కలిసిన ఈ కార్తీక ద్వాదశిలో పదహారవ వంతుకూడా కాజాలవు.

 

అనేక తిథియస్సంతి సదాసత్పుణ్యదాయకా

తాసామనంతగుణితా ద్వాదశీ విష్ణువల్లభా!!

కార్తికే శుక్లపక్షేతు ద్వాదశీ హరిబోధినీ!

తన్యామేకస్య విప్రస్య అస్యదానం కరోతియః

ససర్వసౌఖ్యం లభతే పశ్చాద్విష్ణుపురేనృప!!

కార్తికే మాసిద్వాదశ్యాం దధ్యన్నం దానముత్తమం

యః కుర్యాత్సోపిధర్మేభ్యో హ్యధికం ఫలముచ్యతె!!

నారీ వా పురుషో వా పి కార్తిక్యాం ద్వాదశీదినే

స్వర్ణశృంగీం రౌప్యఖురాం సవత్సాంసుపయస్వినీం!!

గామభ్యర్చ్యవిధానేన దానంయః కురుతేనఘ

యావతీరోమసంఖ్యాస్యా త్తావత్స్వర్గాధిపోభవేత్!!

ద్వాదశ్యాం కార్తికేమాసి వస్త్రదానం కరోతియః

భక్త్యాప్రయత్నతోరాజన్ పాపైః పూర్వార్జితైరసి

విముచ్యవిష్ణుభవనం యాతివాస్త్యత్రసంశయః!!

*తా:*పుణ్యమునిచ్చే తిథులనేకము కానీ, ద్వాదశి హరి ప్రియము, కాబట్టి ఇతర తిథులన్నిటింకటె అధికఫలప్రదము. కార్తీక శుక్ల ద్వాదశినాడు , ఏకాదశి రాత్రి యామముండగనే పాలసముద్రములో శయనించిన శ్రీహరి నిద్రలేచును. కాబట్టి ఆ ద్వాదశి హరిబోధిని అని పిలువబడును. ఆ ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకైన అన్నదానమాచరించువారు ఈలోకంలో భోగాలనుభవిమ్చి అంతములో ఆహరిని పొందెదరు. కార్తీక మాసములో ద్వాదశినాడు పెరుగన్నము దానము చేసిన వారికి సమస్త ధర్మములను ఆచరించడం కంటే అధిక ఫలము లభిస్తుంది. స్త్రీపురుష బేధములేకుండా  కార్తీక శుద్ధ ద్వాదశినాడు పాలిచ్చెడి ఆవుకు బంగారపు కొమ్మును వెండి డెక్కలు చేయిమ్చిపెట్టి పూజించి దూడతో గూడ గోదానమిచ్చిన ఆగోవుకెన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల యేండ్లు స్వర్గవాసము చేయుదురు. కార్తీక మాసములో ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరిమ్చువారు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసుకుని వైకుంఠలోకమునకు పోవును, ఇందులో ఎటువంటి సందేహము లేదు.

 

ద్వాదశ్యాం కార్తికేమాసి పౌర్ణమ్యాంప్రతిపద్ధినే

యోదీపదానంకురుతె సకాంస్యంచఘృతాదికం

కోటిజన్మార్జితంపాపం తత్క్షణేవిశ్యతి!!

ఫలంయజ్ఞోపవీతంచ స తాంబూలం సదక్షిణం

ద్వాదశ్యాంయేప్రకుర్వంతి తత్ఫలం శ్రుణుభూమిప!!

భుంక్తే హవిపులాన్ భోగాన్ స్వర్గేప్యం తెతుదుర్లభాన్

పశ్చాద్విష్ణుపురంప్రాప్య మోదతేవిష్ణువచ్చిరమ్!!

సువర్ణతులసీదానం ద్వాదశ్యాం కార్తికే నృప

సాలగ్రామంసమభ్యర్చ్య శ్రోత్రియాయకుటింబినే

దానంయః కురుతే భక్త్యా తన్యపుణ్య ఫలంశ్రుణూ!!

చతుస్సాగరపర్యంతం భూదానాద్యత్ఫలంవిదుః

తత్ఫలంసమవాప్నోతి ద్వాదశ్యాంకార్తికస్య్చ!!

అత్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం

శ్రుణ్వతోసర్వపాపఘ్నమ్ తత్సమాసేనమెశ్రుణు!!

*తా:*కార్తీక మాసమందు ద్వాదశి యందు పూర్ణిమయందు పాడ్యమియందు గానీ పంచపాత్రలో ఆవునెయ్యినుంచి దీపము వెలిగించి దానమిచ్చువారికి కోటిజన్మలలో చేయబడీన పాతకములు నశించును. కార్తిక ద్వాదశినాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమునందు అనేక భోగములనుపొంది అంతమన వైకుంఠమందు విష్ణువుతోకూడి చిరకాలముండును. కార్తిక ద్వాదశినాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలము చెప్పెదను వినుము. కార్తిక ద్వాదశినాడు పూర్వోక్తదానము చేసినవాడు నాలుగుసముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలము పొందును. ఈ విషయందు ఒక కథ గలదు చెప్పెదను వినుము. ఈ కథ చదివిన విన్నవారికి సమస్త పాతకములు నశించును.

 

వైశ్యః కశ్చిద్దురాచారః గోదావర్యాస్తటేశుభే

స్వయంచాపి నభుంజీత దానంవానాణుమాత్రకమ్!!

నోపకారంకృతంతేన యస్యకస్యాపి దేహినః

పరనిందాపరోనిత్యం పరద్రవ్యేషులాలసః!!

కస్యచిద్ధ్విజముఖ్యస్య ఋణం దత్వాధికంధనం

తద్గృహీతంసమాయాతో విస్రంగ్రామాంతరేస్థితం

సమపృచ్ఛతదావైశ్యో ఋణం దేహీతిభూసురమ్!!

సవిప్రవర్యస్తచ్ఛ్రుత్వా విచార్యోవాచతంనృప

ద్రవ్యం దాస్యామిమాసాంతే యేనకేనాపికర్మణా

అతస్థ్సిత్వాఋణంసర్వం గృహీత్వాగంతుమర్హసి!!

యోజీవతిఋణీనిత్యం నిరయంకల్పమశ్నుతె

పశ్చాత్తస్యసుతోభూత్వా తత్సర్వంప్రతిదాస్యతి!!

*తా:*గోదావరీతీరమమ్దు దురాచారవంతుడైన ఒక వైశ్యుడు గలడు. అతడు కొంచెముకూడా దానము చేసెడివాడు కాడు, ధనమును తానూ అనుభవించెడివాడు కాడు. వాడు ఎవరికీ ఉపకారము చేసెడివాడుకాడు, ఎప్పుడూ పరనింద చేస్తూ, పరద్రవ్యంపై ఆసక్తి కలిగినవాడూ.  ఆ వ్యక్తి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పిచ్చి ఆ ఋణమును తిరిగి పొందడం కొరకు ఆతని ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ బ్రాహ్మణుని అప్పు తిరిగిమ్మని అడిగెను. ఆ బ్రాహ్మణుడామాట విని ఓ వైశ్యుడా ఈ నెల చివర నీసొమ్మంతయు ఏదోఒక విధముగ తిరిగిచ్చెదను కావున కొంచెము నిదానింపుమని కోరెను.  ఋణమును తీసుకొని తిరిగి ఆ సొమ్ము యివ్వనివాడు నరకమందు యాతనలనుబొంది తిరిగి ఆ ఋణదాతకు కొడుకై పుట్టి వాని సొమ్మును యివ్వవలసి యుండును.

 

ఏవముక్తెద్విజెవైశ్యః కోపాదారక్తలోచనః

మూఢాద్యదేహిమెద్రవ్యంనోచేత్ఖడ్గేనతాడయే!!

ఆకృష్యకేశానాదాయ దుష్టాత్మాపావధీరయం

తేనాశుపతితంభూమౌవిప్రంపాదావతాడయత్!!

కోపావేశేనపాపాత్మా విప్రం వేదాంతపారగం

ఖడ్గేనైవాహనత్తూర్ణం హరిస్తుహరిణంయథా

మమారతేనమాతేన బ్రాహ్మణోబంధువత్సలః!!

సతుద్రావతోవేగాత్ భయాద్రాజ్ఞోమహీపతే

పునర్గృహంప్రవిశ్యాఽసౌ బ్రహ్మఘ్నోనిరపత్రవః

ఆయురంతరితేకాలే మరణం సముపాగతః!!

*తా:*బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని ఆ వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢ బ్రాహ్మణుడా నాధనము నాకిప్పుడే యిమ్ము లేకున్న ఈకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గబుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి క్రింద పడవేసి పాపబుద్దికలవాడైన ఆ వైశ్యుడు తనకాలితో తన్ని కత్తితో కొట్టెను. ఆ బ్రాహ్మణుడు సింహముచేత దెబ్బతిన్న జింకవలె గిలగిలలాడి మృతినొందెను. ఆ తరవాత ఆ వైశ్యుడు రాజదండనమునకు భయపడి అక్కడనుండి పారిపోయి బ్రాహ్మణుని చంపితినన్న సిగ్గులేక సుఖ్గముగా ఇంటనుండి కొంతకాలమునకు మృతినొందెను.

 

ఆయయుర్యమదూతాశ్చ పాశహస్తాభయంకరాః

కరాళవదనా రాజన్ కృష్ణరాత్రిసమప్రభాః!!

పాశైరాబధ్యతం వైశ్యం యయుర్యమనికేతనం

తస్మింస్తే రైరవేఘోరే విససర్జుర్యమాజ్ఞయా!!

తస్యసూనుర్మహీపాల ధర్మవీరేతివిశ్రుతః

పిత్రార్జితధనం భూరి సదాధర్మపరాయణః!!

కూపోద్యానతటాకాది సేతు బంధనకారకః

వివాహోపనయౌకర్తా యజ్ఞ కేష్వతిలాలసః!!

అన్నదానపరోనిత్యమాతురాణాంద్విజనమనాం

సర్వేషామపివర్ణానాం క్షుధార్తానాంమహీపతే!!

*తా:*భయంకరముఖములుకలిగి అమావాస్య రాత్రి సమానమైన కాంతి కలవారు భయంకరులగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాశములచే బంధిమ్చి యమలోకమునకొ తీసుకొనిపోయి అక్కడ భయంకరమైన రౌరవమనే నరకమమ్దు యమాజ్ఞ మీదట బాధించుచుండిరి. రౌరవమనగా రురుమృగపు కొమ్ములచే బాధించెడి నరక నగరము.  ఆ వైశ్యును పుత్రుడు ధర్మపరాయణుడు తండ్రిపోయిన పిమ్మట తండ్రి సంపాదించిన ధనమంతయూ నూతులు, చెరువులు తవ్వించి, ఏరులకు, నదీపాయలకు వంతెనల నిర్మాణము చేసి ఉపనయనములు, వివాహములకు యజ్ఞయాగాదులకు నిత్యమూ బ్రాహ్మణులకు ఆకొన్నవారికి అన్నదానము చేయుచు అన్నిజాతులవారికి ఆకలిగలిగిన వారికి అన్నమ్ పెట్టుచు నిత్యము ధర్మము చేయుచుండెడివాడు.

 

తస్యచాంతరితేకాలే గృహేతత్పుణ్యయోగతః

నారదఃపర్యటన్ సగాయన్ విష్ణుకీర్తనం

వణిగ్విష్ణ్వర్చనేకాలే ప్రనృత్యన్ పులకాంకితః

*గోవిందనారాయణ కృష్ణవిష్ణో అనంత వైకుంఠ నివాసమూర్తే*

*శ్రీవత్సవిశ్వంభర దేవ దేవ సమస్త దేవేశనమోనమస్తే!!*

నృత్యంతమేవంగృహమాగతం వణిక్సమస్త సంతోషపయోధిమగ్నః

సనామ పాదైమునయె మహాత్మనెహ్యానంద బాష్పోన్నయనస్సదండవత్!!

*తా:*ఇంట్లుండగా, ఒకనాడు ఆ ధర్మవీరుడు హరిని గూర్చి పూజచేయుచుండగా ఆ సమయంలో మహాత్ముడైన నారదమహాముని సమస్తలోకములందు తిరిగుచు ఆనాడు యమలోకమునుంచి బయలుదేరి తనవీణాతంత్రులను మీటుతీ రోమాంచితుడై

*గోవిందా - నారాయణా*

*కృష్ణ - విష్ణో - అనంతా*

*వైకుంఠ - శ్రీ - నివాసా*

*శ్రీవత్సభూషా - విశ్వంభరా - దేవేశా*

నమస్తే, నమస్తే నమోనమః, అంటూ గానము చేస్తూ వచ్చెను, ఇలా హరికీర్తనము చేయుచూ వచ్చిన నారదుని చూసి ఆ వైశ్యకుమారుడు ఆనంద సాగరంలో డోలలాడుతూ కన్నులవెంట నీరుకారగా మునిపాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను.

 

తంపాదపద్మానమిత దయాళుర్మునిస్తదాతంపరిరభ్యహర్షితః

సప్రాహవైశ్యః పురతః కృతాంజలిః తం విష్ణుమర్ఘ్యాదిభిరర్చ్య తం నృప

భవదాగమనంమహ్యం మునెహ్యత్యంతదుర్లభం

యతార్జితం మయాపూర్వంధర్మమార్గముపాగతం

యన్మయాచరితంత్వద్య ఫలితం తవ దర్శనాత్

సేవాం విధాస్యేవిప్రేంద్ర ప్రాపయెప్రణయేనచ

*తా:*ఆ నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్య పుత్రుని ప్రీతితో లేవనెత్తి కౌగిలించుకొనెను. ఆ తరవాత వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిఘటించినవాడై అర్ఘ్యాదులచేత పూజించి. హే నారదమహర్షీ! మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వపుణ్యమేదియో చేసియుందునేమో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నాపూర్వపుణ్యమిప్పుడు ఫలించినది. మీకు దాసుడనైన నేనేమి చేయవలెనో తెల్పుము చేసెదను అని అనెగా..

 

ఇతితస్యవచశ్శ్రుత్వా మందస్మేరముఖాంబుజః

ఉవాచధర్మవీరమ్తమ్ నారదోభగవాన్మునిః

*నారదః:*

ధర్మవీరాద్య మేవాక్యం సావధానమనాశ్శ్రుణు

కార్తికస్యతుమాసస్య ద్వాదశీ హరివల్లభా

స్నానదానాదికతస్య సదానంతఫలంవిదుః

 

ఆఢ్యకోవాదరిద్రోవా యతిర్వానస్థఏవవా

బ్రాహ్మణక్షత్రియోవాపి వైశ్యశూద్రోపివాసతీ

సాలగ్రామశిలాదానం యేకుర్వంతిప్రయత్నతః

తులాసంస్థెదినకరెద్వాదశ్యామర్కికేదినే

తేనపాపానినశ్యంతి జన్మాంతరకృతానిచ!!

ధర్మరాజాలయేవైశ్యం పితాతవమృతంగతః

రైరవాఖ్యేమహాఘోరే పచ్యతెనరకాగ్నినా

తస్యపాపవిషుద్ధ్యర్థం ద్వాదశ్యాంకార్తికస్యచ

సాలగ్రామశిలాదానం కురుత్వంమావిలంబితమ్!!

*తా:*వైశ్యుడిలా అన్నమాటలనువిని ఆ నారదముని చిరునవ్వుతోకూడిన ప్రశాంతముఖముతో యిట్లనెను ’ఓ ధర్మవీరా నామాట జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశినాడు విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆరోజున చేసిన స్నానదానాదికములంనంత ఫలప్రదములు. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశితిథినాడు ధనికుడు, పేదవాడు, సన్యాసి-వానప్రస్థుడు-గృహస్థు, బ్రాహ్మణుడు-క్షత్రియుడు-వైశ్యుడు-శూద్రుడు, స్త్రీ-పురుషులు అని బేధములేక సాలగ్రామ దానము ఆచరించి జన్మాంతర కృతపాపములను నశింపజేసుకుందురు. ఓ ధర్మవీరా! విను, నీతండ్రి చనిపోయి యమలోకమమ్దు రౌరవాది బాధలనొందుచున్నాడు. అతని పాపశుద్ధికొరకు కార్తిక ద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము.

 

మునెస్తస్యవచశ్రుత్వా వైశ్యః ప్రాహమునింనృప

గోభూతిలహిరణ్యాది దానానాంయత్ఫలంమునే

నాసీత్తత్ఫలతోముక్తి శ్శిలాదానేనకింభవేత్

శిలాదానం వృధామన్యే నభోజ్యం స చ భక్షణం

నాతః కార్యమ్ మయావిప్ర శిలాదానం చనీచవత్

బహుధాబోధ్యంతం వైశ్యం మునిరంతరధీయత

నకుర్యాద్యధిమూఢాత్మా బోధితోబ్రహ్మసూనునా

సోపి కాలాంతరేతీతె గతాసురభవన్నృప

మహద్వచనమజ్ఞేన హ్యతిక్రమణదోషతః

సాలగ్రామశిలాదాన మనాదృత్య మహీపతే

తేనదోషేణసంజాతో వ్యాఘ్రయోనై త్రిజన్మమ

త్రివారంమర్కటత్వమ్చ పంచవారం వృషస్యచ

దశవారం పునస్త్రీత్వం గతభర్తృత్వమంజసా!!

*తా:*నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలు విని ఆ వైశ్యుడిట్లనెను, మునీంద్రా గోదానము, భూదానము, తిలాదానము సువర్ణ దానము మొదలైన మహాదానములచేత దొరకని ముక్తి శిలాదానమువలన ఎలా కలుగుతుంది. శిలాదానము వృధాగా చేయడమెమ్దుకు అది భోజ్యమూకాదు, భక్షణమూకాదు కనుక ఈ రాతిని దానము చేయను. అనెను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడంతర్థానమయ్యెను. ఆ తరవాత కొంతకాలమునకు ఆ ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోష్ము వలన నరకబాధలనుభవించి, తరవాత మూడు జన్మలు పులిగానూ, మూడు జన్మలు కోతిగా, అనంతరము ఐదు జన్మలు ఎద్దుగా, ఆ తరవాత పది సార్లు స్త్రీజన్మయెత్తి వైధవ్యమును పొందెను.

 

జన్మనైకాదశెరాజన్ యాచకస్యసుతాభవత్

తాందృష్ట్వావిప్రశార్దూల స్సురూపాంప్రాప్తయౌవనాం

సమానకులగోత్రాయవివాహమకరోత్పితా

మృతంజామాతరందృష్ట్వా నవోఢాంతనయాంపితా

ఆయయుర్బాందవాస్సర్వే దుఃఖాదాకులితేంద్రియాః

యాచకోపి విచార్యేదం దివ్యదృష్ట్యాతయాకృతం

పూర్వజన్మనిరాజేంద్ర సుకృతందుష్కృతం ద్విజః

విజ్ఞాయాహాధసర్వేభ్యః బంధుభ్యోరాజసత్తమ

*తా:*ఇట్లు పదిజన్మలు గడిచిన పిమ్మట పదకొండవ జన్మమున యాచకునకు కుమార్తెగా జన్మించెను . ఆ తరువాత కొంతకాలమునకు యౌవనము రాగానే తండ్రితగిన వరునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు అల్లుడు మృతిచెందగా ఆ అల్లుని బంధువులందరు వచ్చి చూచి అట్టిబాల్యవైధవ్యమునకు చాల దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో చూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యపాపమును తెలిపెను.

 

తస్యాఃపాపవిశుద్ధ్యర్థం పితాతంముక్తికారణం

జన్మాంతరార్జితాఘౌఘ నాశహేతుంసుఖప్రదం

సాలగ్రామశిలాదానం కార్తిక్యామిమ్దువాసరే

విప్రంవేదాంతనిరతం సమభ్యర్చ్యవిధానతః

పుణ్యంపాపవిశుధ్యర్థం దాపయామాసభూసురః

పతిరుజ్జీవితస్తేన సుఖేనభువిదంపతీ

స్థిత్వాకాలేసమాయాతి దివంగత్వానుభూయచ

నపుర్భవమభ్యేత్య స్థిత్వాసుతపసోభవత్

పూర్వార్జితేపుణ్యేన తస్యజ్ఞానోదయోభవత్

వర్షె వర్షెచసుకృతం కార్తిక్యామిందువాసరే

సాలగ్రామశిలాదానం తేనముక్తిమవాపసః

*తా:*ఇట్లు చెప్పి తన కూతురుయొక్క  పూర్వ పాపములనాశనము కొరకు సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక మాసమున సోమవారమునందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము జేసెను. ఆసాలగ్రామ శిలాదానము చేత కూతురు భర్త తిరిగి జీవించెను, ఆ తరవాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలముండి స్వర్గమునకుబోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేటా జ్ఞానమును పొందెను. ప్రతి సంవత్సరమూ కార్తీక సోమవారమునందు సాలగ్రామ శిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను.

 

రౌరవేదుఃఖితస్యాపి ముక్తిరాసీచ్చతత్పితుః

తస్మాద్రాజేంద్రయత్నేన కార్తికేకమలాపతే

సాలగ్రామశిలాదానం తుష్ట్యర్థంనాత్ససంశయః

కోటిజన్మనుయత్పాపం సంచితం పాపిభిస్సదా

తత్పాపనాశహేతుర్వై కార్తికేహరిబోధినీ

సర్వపాపప్రశమనం ప్రాయశ్చిత్తంజగత్త్రయే

సాలగ్రామశిలాదానా త్పరంనాస్తినసంశయః

*తా:*రౌరవ నరకమందున్నవాని తండ్రియగు వైశ్యుడు ఆ సాలగ్రామ దాన మహిమచేతముక్తుడాయెను, కాబట్టి జనకరాజా కార్తీకమందు సాలగ్రామదానముచేత హరిసంతోషించును ఇందులో అనుమానమక్కరలేదు. పాపకర్ములు కోటిజన్మలలో చేసిన పాతకములు కార్తీక శుక్ల ఏకాదశ్యుపవాస ద్వాదశీదానాదులచేత నశించును. కార్తీకమాసమునందు సాలగ్రామ దానమువలన సమస్త పాతకములు నశిమ్చును ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటె వేరు ప్రాయశ్చిత్తములేదు యిందులో అనుమానము లేదు.

 

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే ద్వాదశోధ్యాస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పన్నెండవ అధ్యాయము సమాప్తము.

సంకలనం - కూర్పు

శంకరకింకర

(శ్రీఅయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ)

~~~~~~~~~~~~~~~~~~~~~~

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

https://sri-kamakshi.blogspot.com/

 

No comments:

Post a Comment