Pages

Wednesday, November 25, 2020

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 10వ అధ్యాయం

అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే దశమోధ్యాయః

శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదవ అధ్యాయం

 

జనక ఉవాచ:-

కోసావజామిళఃపూర్వం దుష్కృతం కేనసంచితం

కథం తూష్ణీంగతాయామ్యాః కిమూచుస్స్వామి తంవద!!

 

తా: జనకుడు తిరిగి అడుగనారంభించెను. ఓ మునీశ్వరా! ఈ అజామీళుదూ పూర్వమెవ్వడు? యితడేమి పాపము మూటగట్టుకొనెన్, విష్ణుదూతలు చెప్పిన మాటలను విని, యమభటులు ఎందుకు యూరకున్నారు. యముని వద్దకు వెళ్ళి యేమని చెప్పిరి అంతా సవివరముగా తెల్పుము.

 

 

వసిష్ఠ ఉవాచ:-

ఏవంప్రచోదితాయామ్యా దృతంగ త్వాయమాంతికం

యమరాజాయతత్సర్వమాచచక్షురరిందమ!!

పాపిష్ఠంచదురాచారం నిందితం కర్మ చాశ్రితం

తంవిష్ణుదూతావైజగ్ముర్వైకుంఠం విష్ణుమందిరం!!

వయంతత్కార్యకరణాశ్శక్తిహీనాః పునః పునః

తచ్ఛృత్వాకోపతామ్రాక్షః జ్ఞానచక్షుర్దదర్శనః!!

మ్రియమాణస్యదుర్బుద్ధేర్విష్ణునామప్రభావతః

విష్ణుదూతాస్తమాదాయ యయుర్వైకుంఠమందిరం!!

హరినామామృతంచై వ మృతికాలేహ్యజామిళః

ససర్వపాపనిర్ముక్తో విష్ణులోకంగతోఽధునా!!

హరిర్హరతిపాపాని దుష్టచిత్తైరపిస్మృతః

అనిచ్ఛయాపిసంస్పృష్టో దహత్యేవహిపావకః!!

యస్స్మరేద్భక్తిభావేన నారాయణమనామయం

జీవన్ముక్తస్సవిజ్ఞేయః పశ్చాత్త్కైవల్యమశ్నుతె!!

ఇత్యాలోచ్యయతస్తూష్ణీ మాసీద్వైవస్వతోయమః

 

తా: వసిష్ఠుడు ఇలా చెప్పసాగెను " యమదూతలు, విష్ణుదూతల మాటలువిని వెంటనే యమిని వద్ధకు వెళ్ళి మొత్తం వృత్తాంతమును యమునితో , ’అయ్యా పాపాత్ముడు, దురాచారుడు నిందిత కర్మలు చేయువాడైన అజామిళుని మాతో తెచ్చుటకు వెళ్ళినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిపించుకొని పోయిరి, మేము వారిని ఎదిరంచడానికి అశక్తులమైనాము’ అని చెప్పగా. యముడు కోపించి ఏమిజరిగిందోనని తన జ్ఞాన దృష్టితో చూసి అజామిలుడు దుర్మార్గుడైనను అంతకాలమున హరినామస్మరణము వలన పాపములను నశింపజేసికొని వైకుంఠప్రియుడయ్యెను, అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములైనను మహిమ తెలుసుకొనక హరినామ స్మరణ చేసిన చాలు పాపములు నశించును, కాలవలెనని ఇచ్చలేకున్నా అగ్నిని తాకినప్పుడు అగ్ని కాల్చకమానదు కదా. భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముక్తుడై అంతమునందు మోక్షమును పొందును అని యముడు విచారణ చేసి మిన్నకుండెను.

 

అసావజామిళః పూర్వం విప్రస్సౌరాష్ట్రకేనృప!!

శివాగారార్చకోనిత్యం శివద్రవ్యాపహారకః

అస్త్రపాణిర్దురాచార స్స్నాన హీనో తథాఽశుచిః!!

నమంత్రోనవిధిశ్శంభు మర్చయత్యస్య మానసః

మృడస్యాభిముఖేపాదౌ ప్రసార్యాస్తసదుర్మదః!!

వయస్యైరన్వితో రాజన్ బహుభాషీదురాగ్రహః

రూప యౌవనసంపన్నో నానాలంకారభూషితః!!

తత్రకాచిద్ద్విజసతీ సురూపాప్రాప్తయైవనా

పతిస్తస్యాహిదుఃఖేన దారిద్ర్యేణాతిపీడితః!!

అన్యాన్నంచైవ మాకాంక్షన్ పర్యటన్ పట్టనాదిషు

ఘోషగ్రామాదిసర్వేషు యాచనావృత్తిమాశ్రితః!!

 

తా: ఈ అజామీళుడు పూర్వమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడై శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను వీడి అన్య మనస్కుడై శ్రద్ధలేకుండా శివుని పూజించెడివాడు. శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని ఉండెడివాడు, మంచియవ్వనంతో ఉండి ఆయుధాలు చేత్తో ధరించి స్నేహితులతో కూడి నానాలంకారములు చేసుకుని ఇష్టం వచ్చినట్లు తిరిగుతూ వాచాలత్వముతో తిరిగెడివాడు. ఆ వూరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతనికొకరూపవతి, యౌవనవతి ఐన భార్యకలదు, ఆబ్రాహ్మణుడు కఠిన దారిద్ర్యంచే బాధపడుతూ అన్నముకొరకు పట్టణములు గ్రామములు తిరుగుతూ యాచించుచుండెడివాడు.

 

కదాచిత్క్షుధయాత్రసోభారవాహోగృహంగతః

ఉవాచ భార్యాంశీఘ్రేణ కురుపాకంతుమంగళే!!

బాధతెమాంక్షుధాశుభ్రు తచ్ఛాంతింకురువారిణా

ఇతితస్యవచశ్శ్రుత్వా చుళీకృత్యాతిదుర్మదా!!

కించిన్నో వాచతం విప్రం గృహకర్మరతాశనైః

చిత్తంవిటజనేసమ్య గాధాయాతీవదుర్మదా!!

 

తా: ఒకానొకనాడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాదికమును తలమీద ఉంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ’ఓయీ, నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా వంటచేయుము, ముందు మంచినీళ్ళు ఇవ్వు అవి తాగి కొంచెము శాంతించెదను’ అని ఇట్లు భర్త ఎన్నిమాట్లుఅడిగినా ఆ దుర్మద ఐన భార్య అతని మాటలు లెక్కచేయక పనులు చేయుచు జారుని మనసులో ధ్యానించుచుండెను

 

తాంకర్కశాంతదాదృష్ట్వా యష్టిమాదాయతాడయన్

సాపునః మతిమావిశ్య దృఢంముష్ట్యాహనత్పునః!!

తేనస్వభవనంహిత్వాయయౌగ్రామాంతరంద్విజః

భిక్షాన్నభోజనంకృత్వా చింతయన్మనసానృప!!

సాసాయమశనంకృత్వా హ్యలంకృత్వాసువాససా

తతస్తాంబూలమాదాయ రజకాలయమాగమత్!!

రజకం రూపసంపన్నం రహస్యోవాచసానిశి

కిమత్రాగమనంమూఢే గృహేస్మిన్ కారణం వినా

బ్రాహ్మణీబ్రహ్మకులజా కర్మణానిందితావయం!!

ఏవంవివాదమానౌతు దృష్ట్వాతద్ధర్మచారిణం

కోపరక్తాంతనాసంచ సంరక్తాంబరలోచనం!!

గృహీత్వాముసలం శీఘ్రం తాడయామాసకౌశలాత్

స్నానమాసతయాతంచహిత్వా రాజవథంగతా!!

తత్రేమం దేవలం గుత్వా తస్యసాఫాణిమగ్రహీత్

పశ్చాదాగత్యవేదేన తేవసావ్యరమన్నిశి!!

రాత్రిశేషం తతోనీత్వా బ్రాహ్మణీవ్యభిచారిణీ

పశ్చాత్తావం గతారాజన్ ప్రభాతేపతిమాగమత్!!

పతింసంబోధయా మాస వాక్యైస్సాధుకృపాదయైః

తయాసవాగృహంభూయో గత్వావాత్సీద్యథాసుఖం!!

 

తా: అంత భర్తకోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను ముష్టితో గుద్దెను. తరవాత భర్త గృహమును విడిచి బైటకుబోయి భిక్షమెత్తుకుని జీవించుచుచు భార్యసంగతిని గూర్చి చింతిచుచుండెను. కానీ, ఈతని భార్య సుఖముగా నుండి రాత్రిభుజించి మంచి చీరె ధరించి తాంబూలము వేసుకొని ఒక రజకుని గురించి ఆలోచించి అతని యింటికి బోయెను.  సుందరుడైన సౌష్టవ పరుడైన ఆ రజకుని చూసి తనతో ఆరాత్రి సంభోగించమనెను, ధర్మాత్ముడైన ఆ రజకుడు ఆమాటలు విని ఓ తల్లీ! నీవు బ్రాహ్మణ స్త్రీవి,  ఇలా అర్థరాత్రివేళ మాయింటికి మీరురావచ్చా? బ్రాహ్మణ వర్ణమునందు పుట్టిన మీకు మాతో సంపర్కము కోరుట తగునా! అని ప్రశ్నించెను, ఆ విధముగా వారిద్దరూ వివాదపడుతుండగా ఆ రజకుడు ఆమెను రోకలితో కొట్టెను, ఆ స్త్రీగూడ అతనిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున వెడలెను, అప్పుడు ఇంతకు ముందు చెప్పిన తిరుగుబోతైన శివారాధకుని చూచెను, అంతలో ఆ స్త్రీ వాని పట్టుకుని రతికేళికి పిలిచి వానితో కూడి రాత్రియంతయు వానితో కామకేళి జరిపి తెల్లవారగనే జరిగినవంతయూ తలచి పశ్చాత్తాపమును బొంది భర్తవద్దకు చేరి బ్రతిమాలి వానికూడి సౌఖ్యముగానుండెను.

 

ఏవమంతరితెకాలే శివాగారార్చకోనృప

గతాసురభవద్రార్జనిరయేయాతనామయే!!

భుక్వాతత్రక్రమాత్పాపం రౌరవాదిషుభూపతే

నపునర్భువమభ్యేత్య సత్యనిష్ఠసుతోభవన్!!

కార్తికేకృత్తికాయోగే సకుర్యాత్స్వామిదర్శనం

సప్తజన్మగతంపాపం హంతిహ్యేతద్ధ్విజన్మనః

పశ్చాద్భూమింగతో రాజన్ భగవన్నామకీర్తనాత్!!

 

తా: ఆపిమ్మట, కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమసదనము చేరి క్రమముగా రౌరవాది నరకదుఃఖములననుభవించి తిరిగి భూమియంది సత్యనిష్ఠుని కొడుకైన అజామిళునిగా జన్మించెను. ఇతనికి కార్తీక పౌర్ణమినాడు శివదర్శనము లభించినది, అంతకాలమున హరినామస్మరణ కలిగినది, ఆ కారణముచేత సప్తజన్మార్జిత పాపజాలములు నశించి మోక్షమును బొందెను.

 

 

ఏషావిప్రసతీపాపా కాలధర్మాత్ క్షయం గతా

నరకేయాత నాంభుక్త్వా పునర్భూమిముపాగతా!!

చండాలయోనౌసంజాతా కన్యాకుబ్జేనరేశ్వర

చండాలః కాలశుద్ధ్యర్థం గత్వావిప్రమపృచ్చత!!

సజగాదాంత్యజం రాజన్ పితృగండం భవిష్యతి

శ్రుత్వేత్థంత్వరితో భాగ్యాచ్ఛిశుంనిష్కాస్యదూరతః!!

రాజన్ తత్రద్విజః కశ్చిత్పుత్రహీనోదదర్శతం

శిశుంబాల్యేత్యనాధత్వాద్రోదమానం సమగ్రహీత్!!

దత్వోపమాతృహస్తేచ శూద్ర్యాసమ్యక్ప్రపోషితః

వృద్ధింగతాయాస్త ద్దాస్యావిప్రోయమభవత్పతిః!!

 

తా: ఆ బ్రాహ్మణికూడా కొంతకాలమునకు మృతిచెంది నరకలోకములందు అనేక యాతనలను పొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమున ఛండాలునకు పుత్రికగా జన్మించెను. ఇది పుట్టిన కాలము మంచిదాయని ఆ ఛండాలుడొకబ్రాహ్మణునడుగగా తండ్రి గండమున పుట్టినదని తెలిసి, ఆ ఛండాలుడా పుత్రికను తీసుకొని పోయి అడవినందుంచెను. అటుగా పోవుచున్న బ్రాహ్మణుడంతలో రోదించుచున్న ఆశిశువును తీసుకొనిపోయి తన యింట్లో దాసీగా ఉన్న స్త్రీకి అప్పగించెను. ఆదాసి ఈమెను పెంచినది, తరవాత ఈమెను అజామీళుడు కూడెను, తరవాత కథ ఇతఃపూర్వం చెప్పినదే.

 

ఏతత్తేకథితం సర్వం రాజన్ జన్మాంతరార్జితం

యానిపాపాని రాజేంద్ర జన్మాంతరకృతానివై!!

ప్రాయశ్చిత్తాన్యశేషాణి విష్ణుధ్యానం వినానృప

జిహ్వానవక్తియది మాధవనామథేయం చేతశ్చ!!

నస్మరతిమాధవపాదపద్మం శ్రోత్రంకథాంనచశ్రుణోతి

హరేర్నరేంద్రపాపాని తస్యవిలయంతుకధంప్రయాంతి!!

అనన్యచేతాస్సతతం యేస్మరంతిజనార్దనం

లభంతే తేననిర్వాణం నాత్రకార్యావిచారణా!!

తస్మాద్గురుంవాలేశంవా నిహనిష్యతిపాతకం

కార్తికేమాసియత్ప్రోక్తం ధర్మం సూక్ష్మతయానఘ!!

పాపానాందహనెశక్తిరస్తిరాజన్నసంశయం

తస్మాత్కార్తికమాసేతు యోధర్మంనసమాచరేత్

సయాతి నరకం రాజన్ నాత్రకార్యావిచారణా!!

 

తా: రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము, అజామిళుని పూర్వ వృత్తాంతము, పాపములకు ప్రాయశ్చిత్తములు చెయుట హరినామ కీర్తనము వినా గావించిన ఇతర ప్రాయశ్చిత్తములతో ఫలితములుగావు, అనగా పాపప్రాయశ్చిత్తకర్మలు చేసినను హరికీర్తనముచేయుచూ భక్తితో చేయవలెనని అర్థము. ఎవరినాలుక హరినామ సంకీర్తనము చేయదో, మనస్సు హరిపాదపద్మములు స్మరించవో, చెవులు హరిచరిత్రములు వినవో, వాని పాపములు ఎట్లు నశించును? నశించవు! యితర చింతనము మాని హరిని స్మరించు వారు ముక్తినొందెదరు, ఇందుకు సందేహమేలేదు. కాబట్టి కార్తీకమాసమందు ఆచరించెడి ధర్మము సూక్ష్మమైననూ అది పెద్దదైననూ, చిన్నదైననూ పాతకములను నశింపజేయును

 

 

ఇదం యం పుణ్యమాఖ్యానం శ్రుణోత్యఘవినాశన
ససర్వపాపనిర్ముక్తో యాతివైకుంఠమందిరమ్!!

య ఇదం పుణ్యమాఖ్యానం శ్రావయేద్వాసమాహితః

తేన పాపానినశ్యంతి విష్ణునాసహమోదతే!!

 

తా: పాపములను నశింపజేసెడి ఈ కథను విన్నవారు సమస్త పాతక్ములను నశింపజేసి మోక్షమొందెదరు. ఈ కథను వినిపించువారు పాపముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో సుఖించును.

 

ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమాహాత్మ్యే దశమోధ్యాహస్సమాప్తః

ఇది స్కాందపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి పదవ అధ్యాయము సమాప్తము.

 

సంకలనం - కూర్పు

శంకరకింకర

(శ్రీఅయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ)

 

~~~~~~~~~~~~~~~~~~~~~~

ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు

जय जय शंकर हर हर शंकर

https://sri-kamakshi.blogspot.com/

No comments:

Post a Comment