Pages

Sunday, July 9, 2017

వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం

శ్రీ గురుభ్యోనమః

బ్రహ్మసూత్ర కృతే తస్మై వేదవ్యాసాయ వేధసే
జ్ఞాన శక్త్యవతారాయ నమో భగవతే హరేః!

"వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అను నానుడి సనాతన ధర్మ ప్రమాణ వాఙ్మయమెరుగువారెల్లరకునూ సుపరిచితమే. జగత్తందున్న సమస్తమూ వ్యాసభగవానునిచే చెప్పబడినదే తప్ప వ్యాసభగవానుడు చెప్పనిది ఏదీలేదను ప్రమాణమును వక్కాణించుటయే నానుడియొక్క అర్థము. ఉచ్చిష్టము అనగా ఎంగిలి చేయబడినది అని, అనిన జగత్తు ఒక తినెడు పదార్థమినియు, దానిని వ్యాసుడు యెంగిలిజేసెనను అపార్థమునుగొనరాదు. ఆత్మ యెంగిలిజేయబడదు అనిన అర్థము ఆత్మయెరుకను నోటితో చెప్పుట సాధ్యముగాదు అది అనుభవైకవేద్యమే అని చెప్పుట దాని పరమార్థము. అట్లే "వ్యాసుడు ఏది చెప్పేనో జగత్తంతయునూ అదే యున్నది" అని అనూచానంగా వచ్చుచున్న ప్రమాణ వాక్కు. అట్లనిన అది అతిశయోక్తియందురా!? జగత్తునందేమి గలదు? వ్యాసుడేమి చెప్పెను? వ్యాసుడు చెప్పినదే జగత్తునందుగలదనుటకు మూడుకాలములయందు జరిగినదంతయూ వ్యాసుడు చెప్పెనా లేక అతిశయోక్తియాసరి, దీనిని విచారించుటకు పూర్వము వ్యాసుడనయెవరు, వ్యాస పదవిచారణ యేమి యని తరచిచూచిన సత్యమవగతమవగలదు.

నిజమునకు వ్యాసుడు అని పిలువబడువారు వేర్వేరు కాలమున వేర్వేరు వ్యక్తులు గలరు. "వ్యాస" అనునది ఒక పదవి.ఆర్ష వాఙ్మయమును వ్యసనము చేయువారెవరో వారు వ్యాసులనబడుదురు. తేలిక పదములలో తెల్పిన విశేషముగ రచన కావించిన కావింపబడిన అపార విజ్ఞాన భాండాగారమును క్రమబద్ధముగ విభజనము చేసి వినియోగమునందు సందిగ్ధము లేకుండ తీర్చిదిద్దు ఋషి అధిష్టించు పదవి వ్యాస పదవి. ఇట్టి పదవినలంకరించిన విశిష్ఠవ్యక్తులెవరుందురో వారు ఆయాకాలములందు వ్యాసనామముతో తెలియనగుదురు. స్వయం భగవానుడైన విష్ణువే ఒక్కొక్క కాలమున వ్యాసపదవినధిరోహించి జనులకు వేద ప్రామాణిక జీవన సరళిని వాఙ్మయ రూపమున అందించుటకు కలావతారముగ అవతరించుచుండును. వ్యాసావతారము లోకరక్షణ, ధర్మ రక్షణకై విష్ణుభగవానుని అవతారమే అని ప్రసిద్ధి చెందిననూ, వేద ప్రచారమునూ, అద్దానినుగమించు పురాణేతిహాసస్తోత్రాది వాఙ్మయ సృష్టిచేయుటవలననూ చతుర్ముఖబ్రహ్మ అంశనూ, మానవ జన్మ పరమార్థమును సాధించెడి జ్ఞాన వైరాగ్యముల బోధించెడు గురుమూర్తి స్వరూపమును బొందుటవలన శంభుదేవుని యంశనూ కలిగియుండును. త్రిమూర్తుల సమాహార స్వరూపము అగుటవలన జ్ఞానము పంచుటకు వచ్చిన పరబ్రహ్మముయొక్క అవతారమే గురుమూర్తియగు వ్యాసభగవానుడని తెలియవలె.

వ్యాసభగవానుడు తానవతరించు ప్రతికాలమునందు, మనుష్యుల సామర్థ్యమునకు తగినవిధముగా వేదవిభజనయూ, తత్సంబంధ వాఙ్మయమునూ అందించి, ఐహిక ఆముష్మిక ప్రయోజనముల సిద్ధింపజేయు ధార్మిక జీవనమునకు వలసినటువంటి సాధనాసామగ్రినందజేయును. పరంపరావిధమున కలియుగారంభమునకు పూర్వము ద్వాపరాంత సమయమున బ్రహ్మవేత్తయగు పరాశరమహర్షినకూ, దివ్యజన్మమునొందిన మత్స్యగంధికీ కుమారునిగ జన్మమునెత్తిన బాలకుడే వ్యాసపదవినధిరోహించెను. కృష్ణవర్ణమున యమునా ద్వీపమున జన్మించినందులకు కృష్ణద్వైపాయనుడని పేరుకలిగెను. సద్యోగర్భమున జన్మించినదే తడవు యుక్తరూపమును పొంది కృష్ణాజినాంబరములను, కలశకమండలములను ధరించి తల్లి ఆజ్ఞనుగొని, తలచినంతనే మాతృసేవకు రాగలనని మాటయిచ్చి తపస్సుకు చనెను. బదరీవనమున వాసము చేయుటవలన బాదరాయణుడనియు పేర్గాంచెను.

ఈ కృష్ణద్వైపాయన వ్యాసమహర్షి జన్మమును విచారించినచో మనకు పారలౌకిక ఆధ్యాత్మిక విశేషములేగాక ఖగోళ, జ్యోతిష్య విశేషములుగూడ తెలియగలవు. జ్యోతిష్య గ్రంధమున కొన్ని ఒక్కొక్క రాశికి కొన్ని సూచనాత్మకమైన చిత్రములు చూపించబడును. విధమున కన్యారాశికి తెడ్డు చేతనుండి పడవ నడిపించుచున్నటువంటి స్త్రీ కన్యారాశికి గుర్తుగ చూపుట గలదు. మీనరాశికి గానూ రెండు మీనముల గుర్తును చూపించెడు చిహ్నము సైతము విదితమే. మీనమునందు దాశరాజునూ, మత్స్యగంధినీ జల రాశియైన మీన రాశియందు జన్మించినవారుగ సఞ్జాపూర్వకముగ చెప్పబడినదని గ్రంథముల పరిశీలనము వలన తెలియుచున్నది. అటులనే ద్వీపము వద్ద మంచుపొగ తెర సృష్టించుటచే ఏర్పడిన చీకట్లయందు ఉద్భవించిన జ్ఞాన సముద్రుడు కారుణ్యామృతవర్షుడూ ఐన వ్యాసభగవానుని జననము గ్రీష్మతాపముచే అల్లాడు మానవాళికి శుచిమాస పౌర్ణమాసినందు చంద్రదర్శనానంతరము జగత్తున తాపము తీర్చుటకై మేఘములు వర్షామృతములు కురిపించుటను సూచించును. విధమున లోకమున రాబోవు కలియుగమున జనుల తాపత్రయములు తీర్చి సంసారమునుదాటి తరించుటకై ఆషాడ శుద్ధపౌర్ణమి నాడు కృష్ణద్వైపయన వ్యాసుడావిర్భవించెను.

అటులనే వ్యాసోచ్చిష్టమన వ్యాసుడు చెప్పినదే జగత్తునందు గలదు తప్ప అన్యముగాదను వాచ్యార్థము సత్యమే యని యెరుగవలె. అటులైన ఇప్పటి సాంకేతికత, ఆధునిక శాస్త్ర సంపత్తి వ్యాస వాఙ్మయమందు కలదా అని సంశయము కలుగగలదు. నిగూఢముగ పరిశీలించిన ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతికతలేకాదు మరియెన్నింటికో ఆలవాలమౌ ముఖ్య మూల సిద్ధాంతములను వ్యాసుడు ప్రకటించెను. అది ప్రమాణ వాక్యమునకు నిగూఢమౌ ముఖ్యార్థమని తెలియవలె. ముఖ్య కారణమేమన, శారీరకమీమాంస లేదా ఉత్తరమీమాంస అని వేదాంత సిద్ధాంతమునకు పేరు అద్దాని సూత్రకర్త వేదవ్యాసుడే. శారీరకమీమాంస యనగా పరబ్రహ్మముయొక్క శరీరరూపమైన యీ జగత్తుయొక్క స్వరూపవిచారమునామూలాగ్రం చేయట వలన దీనికి శారీరకమీమాంసయను పేరుగలదు. ఒక విషయముయొక్క మూల సిద్ధాంతమును యెరిగి సంపూర్ణముగ ఆకళింపుజేసుకొనుట ద్వారా తత్సంబంధ సమస్త విషయ జ్ఞానము ఆకళింపుగాగలదు. బీజమునందున్న వ్యూహమును దెలియుట ద్వారా దాని విస్తారస్వరూపము అవగతముగాగలదు. వేద వేదాంత వేదాంగములందు గల జగత్సృష్టి రహస్యములను ఆకళింపుజేసుకొనుటయేగాక కాలాతీతుడై వాటిని దర్శించి, తాను దర్శించిన ఆరహస్యములను బ్రహ్మసూత్రములుగ ప్రకటించి జనులకందించెను. జగత్తుయొక్క సమస్త స్వరూప విచారమును సూత్రముల రూపమున దెల్పి వ్యాఖ్యానించినది వేదవ్యాసుడే. అనిన, వేదవ్యాసుని నోటినుండి ఈశ్వర శరీరరూపమౌ జగత్విచారణముగశారీరక మీమాంససమస్తమూ ప్రకటింపబడినది శరీరరూపమౌ జగత్తు వ్యాసుని యుచ్చిష్టమను మాట బహుధా యుక్తమనుటయందేవిధమైన సందియములేదని తెలియవలె.

అట్టి వేదవ్యాస భగవానునికి వేనోళ్ళ కీర్తించుచు ఉత్సవాదులు చేయుట ఆర్షభూమియందున్న ప్రతి ఒక్కరి కనీస కర్తవ్యము. ఆషాడ పున్నమనాడు కృష్ణపంచకమాదిగా వైదిక బ్రహ్మవిద్యా గురుపరంపరనావాహనజేసి పూజించి. వేదవిదులను, పౌరాణికులను వ్యాసరూపులుగయెరిగి పూజించుట, సత్కరించుట భగవాన్ శ్రీ వేద వ్యాసునికే సమర్పించు కైంకర్యములు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విన్దాయత పత్రనేత్ర,
యేన త్వయా భారత తైలపూర్ణ: ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీప:

జయ జయ శ్రీ సాత్యవతేయా జయ జయ
జయ జయ శ్రీ పారాశరాత్మజా జయ జయ
జయ జయ శ్రీ వేదవ్యాస భగవాన్ జయ జయ


సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

-శంకరకింకర

No comments:

Post a Comment