Pages

Saturday, July 8, 2017

తపస్సు అంటే

నమస్తే
తపస్సు అంటే తపించుట. మనం సాధారణంగా ఏదో ఒకదానిని పొందటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాం అది దొరికే/కలిగే వరకూ ఎంతో వేదన పొందుతాం ఆ ఈ ప్రయత్నంలోఇక దేన్నీ మనం లక్ష్యపెట్టం ఆ కోరికలో ఆ వస్తువుని పొందటంకోసం తపించి పోతాం అంటే కాలిపోతాం. ఒక వస్తువుని లేదా స్థితిని పొందే వరకు జరిగే పరిణామాన్నే తపస్సు అంటాం. ఐతే ఐహిక విషయాలకోసం ఐతే తపస్సు అని అనరు. కేవల ఆధ్యాత్మికమైనదైతేనే తపస్సు అంటారు.

పరమేశ్వరుడు మొట్టమొదట భోధించినది "తపః" అని. ఒక్కడుగా ఉన్న పరమాత్మ అనేకముగా విస్తరించాలనుకున్నప్పుడు, ఆ సృష్టి జరిపే క్రమంలో స్థితికర్తకు మొట్ట మొదట పరమాత్మ పరబ్రహ్మము పల్కిన వాక్కు లేదా మొట్ట మొదట పరమాత్మ నుండి వినబడిన వాక్కు "తపించు" అని (పురాణాల ఆధారంగా సృష్ఠి క్రమంలో జరిగినది). ఎవరైనా ఏ పని చేసినా చేయ సంకల్పించినా తపస్సుతో మొదలు పెట్టడం ఉత్తమం. అందుకే సనాతన ధర్మంలో నిద్ర లేస్తూనే బెడ్ కాఫీ, న్యూస్ పేపర్ కాకుండా సంధ్యా వందనాదులు, అర్చనలు బ్రాహ్మీ ముహూర్తం కేవలం భగవదారాధనకు తపస్సుకు మాత్రమే
ఇక తపస్సు చాలా రకాలు. తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనోలయం, ఈశ్వర సాన్నిధ్యం లేదా ఈశ్వర కృపకు పాత్రులవడం. ఈ తపస్సు చేసే విధాలు పలు రకాలు. ఉదాహరణకు ఒక గృహస్థు తన ధర్మాలను దైవ పూజ, అతిధి పూజ, తన ధర్మాలను చక్కగా నిష్ఠతో మనస్సులో ఎటువంటి వ్యతిరిక్త భావమూ లేకుండా ఆచరిస్తూ ఉన్నాడనుక్కోండి అదీ తపస్సే. అంటే ఆధ్యాత్మికంగా వైదికమైన ధర్మాచరణము, వేదయుక్తమైన ప్రమాణములని నిష్ఠగా నియమముగా ఆచరిస్తూ చేసే భగవదారాధనమే తపస్సు.

ఇంట్లో రోజూ అర్చన చేసేటప్పుడు మనస్సు, వాక్కు, క్రియలను ఏకం చేసి అర్చించడం కూడా తపస్సే. అనుక్కోకుండా ఆ పరాత్పరుని ఒక సుందర మూర్తి కనపడింది దానిని చూస్తూ దాంట్లో లీనమై ఆ పరమేశ్వరున్నే తలుస్తూ ఉండిపోవడం తపస్సే.

భగవంతుని ధ్యానం తపస్సు, భగవంతుని చూడడం తపస్సు, భగవంతుని లీలలు వినడం తపస్సు (అందుకే శ్రుణ్వం తపః అని అన్నారు), ఒక నియమం, ఒక వ్రతం, ఒక దీక్ష ఏవైనా మనస్సును పూర్తిగా లగ్నం చేయగలిగితే అది తపస్సే.
ఇంద్రియములను వెనక్కి తీసి మనస్సులో కలిపి ఆ మనస్సుని కూడా ఆత్మానుసంధానం చేసి పరమేశ్వరుని ( శివోవా కేశవోవా, పరమేశ్వరుడు అన్నానని శివుడొక్కడే కాదు, నాకు వారిద్దరి మధ్య బేధం లేదు, నాకే ఏమి ఇక్కడ అందరికీ అంతే అని నమ్ముతున్నాను) చూస్తూ ఆ పరమేశ్వరునిగా ఉండిపోయే ప్రక్రియ తపస్సు.

ఇప్పటికీ మన మధ్యలో తపోధనులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఇక ఇప్పటి యోగా, ధ్యాన తరగతులు ప్రస్తుతం LKG వంటివి ఒక క్రమంలో జీవనాన్ని సాగించుకోవడం అలవాటు చేసుకోడానికి. ఆధ్యాత్మిక జీవనంలో, తపస్సులో మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉండాలి.

శంకర భగవత్పాదులు యోగతారావళిలో అంటారు శ్రీశైలం కొండలపైన ఉన్న గుహలలో నన్ను నేను మరచి తపస్సు చేస్తుండగా లతలు నన్ను ఒక జడమనితలచి ఎప్పుడు చుట్టుకుంటాయో, పక్షులు ఎప్పుడు నా చెవులలో గూడుకట్టుకుంటాయో (గాత్రం యదా మమలతాః పరివేష్టయన్తి, కర్ణేయదా విరచయంతి ఖగాశ్చనీడాన్..) అని తపస్సు, మనోలయం యొక్క గొప్ప స్థాయిని సూచించారు.

మీ
-శంకరకింకర
03-May-2011

No comments:

Post a Comment