Pages

Thursday, June 2, 2016

ఆస్తిక్య బుద్ధి.... అనుకున్న పని జరిగితే ఒకలాగ లేకపోతే మరోలాగా..

శ్రీ గురుభ్యోనమః
శుభం

      పొద్దున్న చూసిన ఒకానొక పాత సినిమాలోని రామాయణ వక్రీకరణ చూసి ఖేదం పొంది శ్రీరామాయణం చదువుతుంటే.. శ్రీ సీతారామ కళ్యాణానంతరం, అయోధ్యకాండలో వారి సుఖజీవన వివరణానంతరం దశరథుడు తలపెట్టిన శ్రీరామ పట్టాభిషేకం, కైకేయీ మాత వరాలు సందర్భంలోని కొన్ని విషయాలు మరింత గట్టిగా రామ పాదాలు పట్టుకునేలా చేసాయి. ఘట్టాలు చదువుతూ మదిలో మెదిలిన భావాలతో ....

      మహర్షి రామాయణం చెప్తూ, దశరథుడు రాజ్యాభిషేకం చేసుకోవలసిన రాముణ్ణి పిలిచి అరణ్యవాసానికి వెళ్ళమని చెప్తే, ఆయన ముఖంలో మార్పు కనపడిందో చుట్టూ ఉన్నవాళ్లలో ఏమార్పు కనపడిందో చెప్తారు. లక్ష్మణుడుట వేడి ఊపిరులు వదిలి పెద్ద నిట్టూర్పులు వదులుతూ కళ్లనిండా నీళ్ళు పెట్టుకున్నాడట. కానీ, రాముడు గురించి చెప్తూ మహర్షి అంటారు...

వనం గన్తుకామస్య త్యజతశ్చ వసుంధరామ్,
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా!”
రాజ్యాన్ని విడిచి, అరణ్యానికి వెళ్ళనున్న రాముడిలో, లోకంలో ఉండే సుఖదుఃఖాలకు అతీతుడైన యోగిచిత్తం వలె, రాముని చిత్తంలో వికారమేమీ కనపడలేదట. అద్ది కదూ రాముడంటే! నాలక్షయత రామస్య కిమ్చిదాకారమాననే...” రాముని ముఖంలో కొంచెంకూడా ఎటువంటి మార్పూ చూడలేదట.. ఉచితం మహాబాహుర్నజహౌ హర్షమాత్మనః...” తనకు సహజముగా ఉండే చిరునవ్వుని కాంతిని చిత్తానందాన్ని విడువలేదట మృధువుగా మాట్లాడాడట. ఒక్క గుణం మనం అలవర్చుకుంటే ప్రపంచంలో ఎంత శాంతి!?..

      ఆ రాముని గురించి చెప్తూ స్వభావవినీతశ్చ గౌరవాచ్చతదా నతః...” అంటూ స్వభావముచేతనే వినయవంతుడైన రాముడు... అని చెప్పారు. స్వాభావికంగా రాముడు వినయవంతుడు. అంతటి రాముణ్ణి ప్రేమించని వాడెవ్వడు. ఆయన కష్టపడుతున్నాడని చూడలేకపోయాడు లక్ష్మణుడు.
మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవ,
కః సమర్థోఽధికం కర్తుం కృతాన్తస్యేవ తిష్ఠతః! అంటూ....
గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనమ్!
రామా! ధనుర్థారినై నేను పక్కన ఉండి నిన్ను రక్షిస్తుండగా యముని వల నిలిచి ఉన్న నీలో ఎక్కువ తక్కువలు చేసేవాడెవడు? ... గురువైనా మంచి చెడ్డలు తెలియక అపమార్గం అవలంబిస్తే అతనిని శిక్షించాలి అంటాడు.. అని కోపంలో తప్పులు చెప్తాడు... లక్ష్మణునికి నిజంగా కోపముండి కాదు రాముని మీద ప్రేమతో...

      అప్పుడు రాముడు లక్ష్మణుని మందలించి చెప్పిన మాటల సారాంశం ఏమంటే? "నిన్న రాత్రి పట్టాభిషేక సంబారాలు ఏర్పాటు చేసి నాకు యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నదీ దశరథడే, ఇవ్వాళ సంబారాలకి బదులు అరణ్యవాస సంబారాలేర్పాటు చేసి వనవాసం చేయమన్నదీ దశరథుడే. నిన్న ఆయన యందు ఎంత ప్రీతి ఉందో ఇప్పుడూ అంతే ప్రీతి ఉంది. రాజ్యమిస్తానన్నప్పుడూ ఆయన పూజ్యుడే, వద్దని వనవాసం చేయమన్నప్పుడూ పూజ్యుడే" అని ఎన్నో విషయాలు చెప్తూ...
నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే
పూర్వైరయమభిప్రేతో గతో మార్గోఽనుగమ్యతే!”
పూర్వాచార విరుద్ధమైన కొత్త ధర్మమును దేనినీ నీకొరకై చెప్పట్లేదు పూర్వులందరూ అంగీకరించి అనుసరించిన మార్గాన్నే  నేను అనుసరిస్తున్నాను అని. చెప్పి, లక్ష్మణుడైతే రాముని వనవాసానికి అడ్డుగా నిలిచాడో అతనితోటే ఒక పని చేయిస్తాడు
సౌమిత్రే! యోఽభిషేకార్థే మమ సంభారసంభ్రమః
అభిషేకనివృత్త్యర్థే సోఽస్తు సమ్భారసంభ్రమః
లక్ష్మణా! ఇంతవరకూ నా పట్టాభిషేక సంబారములను కూర్చడానికి ఎంత ఉత్సాహాన్ని చూపావో అంతే ఉత్సాహంతో సంబారములచేత నా అభిషేకజరగకుండుటకై చూసి వాటిని తొలగించడంలో అంతే ఉత్సాహం చూపుఅని చెప్తారు.
 
      అలాగే ధర్మాన్ని పాలించడంలో తన తండ్రిని సత్యంలో నిలబెట్టడంలో తనకడ్డురావద్దనీ కాళ్లలో కఱ్ర పెట్టవద్దనీ సున్నితంగా చెప్తారు...
కృతాన్తస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ర్పవాసనే
రాజ్యస్య వితీర్ణస్య పునరేవ నివర్తనే
లక్ష్మణా! ఇచ్చిన రాజ్యమును వెనక్కి తీసుకుని నన్ను అరణ్య వాసం పంపుటకు దైవమే కారణము అని తెలుసుకో. కైకేయీ మాతను కానీ, తండ్రిని కానీ, భరతునికానీ నిందింపవద్దు అని చెప్తారు.


      ఆహ్... ఆధృతి కదూ మనం అలవరచుకోవలసినది. నేటికీ మనందరకు, ఆధ్యాత్మిక సాధకులా లేక లౌకికంలో ఉన్నారా పక్కన పెడితే కార్యంలో ఉన్న సాధకులకైనా పైవాక్యాలు ఎంత స్ఫూర్తినిస్తాయి. అనుకున్న పని జరిగితే ఒకలాగ లేకపోతే మరోలాగా ప్రవర్తించక చక్కని వ్యవసాయాత్మక బుద్దిని పెంపొందించుకోవడానికి అంతా భగవన్నిర్ణయం అన్నది మాటలకు కాదు చేతలలో ప్రవర్తనలో ఎలా ఉండాలో నేర్పిస్తాయి ఘట్టాలు. తరవాత 14 ఏళ్ళ అనంతరం పట్టాభిషేకం సుఖాంతం అందరికీ విదితమే. ఆస్తిక్య బుద్ధి అంటే చదువుకోడానికో చెప్పుకోడానికో కాదు అన్నిటికీ కారణం దైవమే అని తెలుసుకుని రాముడు నమ్మినట్లుగా నిజంగా ఎప్పుడు నమ్ముతామో కదా...!!!
శం

శ్రీరామార్పణం

No comments:

Post a Comment