Pages

Wednesday, May 20, 2015

పాంచజన్యం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఒకసన్నివేశాన్ని చిత్రించి అందులో మనని మగ్నమయ్యేలా చేసి ఆ ప్రక్రియను ధ్యానంలా మార్చి గొప్ప ఫలితాన్ని మనకి కట్టబెట్టడంలో శంకరులకు సాటి శంకరులే. ఈ పంథాని తరవాత కాళిదాసు గారు, మూక శంకరులు తరవాత వచ్చిన ఎందరో మహానుభావులు కొనసాగించారు.. వారిచ్చిన వాఙ్మయంమీద ఎంత దృష్టిపెడితే మనకంత అమృతం దొరుకుతూనే ఉంటుంది... విషయం చెప్పి ఎవరికి వారు ఆ విషయాన్ని మనోఫలకంలో అందంగా చూసుకుని ధ్యానంలో మునిగి మురిసిపోయేలా చేస్తారు శంకరులు...

ఒకానొక గొప్పనైన నల్లటి పర్వతం మీద ఎర్రనైన కలువపూలు వికసించి ఉన్నాయి. ఆ కలువల మధ్యలోంచి ఆకాశంలోకి చూస్తే పండువెన్నెల్లు కురిపిస్తూ తెల్లని నిండు చందమామ కనిపిస్తున్నాడు ఆ చందమామ ఉన్న ఆకాశంలో కలిగే ఉరుములవంటి శబ్దములు దితి పుత్రులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తున్నాయి.

ఆ గొప్పనైన నల్లటి పర్వతం మరేదో కాదు అన్ని బ్రహ్మాండాలు నిండిపోయిన విష్ణు స్వరూపం. ఆయన అరచేతి వేళ్ళు ఎర్రని కలువల్లా విచ్చుకుని ఉండగా తెల్లని చందమామలాంటి కాంతులు విరజిమ్మే అద్భుతమైన పాంచజన్య శంఖం దర్శనమిస్తున్నది. ఆ పాంచజన్య శంఖం చేసే నాదానికి అసురుల గుండెలు గుభిల్లుమని వారికి భయాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి పాంచజన్య శంఖరాజము మనని కాపాడుగాక అని ఈశ్లోకంలో వర్ణించారు...

లక్ష్మీభర్తుర్భుజాగ్రేకృతవసతిసితం
యస్యరూపం విశాలా
నీలాద్రేస్తుంగశృంగ స్థిత మివరజనీ
నాథబింబం విభాతి!
పాయాన్నః పాంచజన్య స్సదితికుల
త్రాసనైః పూరయన్ స్వైః
నిధ్వానై ర్నీరదౌఘ ధ్వనిపరిభవధై
రంబరం కంబురాజః!!

నారాయణార్పణం..

No comments:

Post a Comment