Pages

Wednesday, May 20, 2015

కామాక్షి కటాక్షం! కర్ణునిమీదకు యుద్ధం - భీముని సంతోషం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు శంకరుల వాఙ్మయం పంథాలో అమ్మవారిని స్తుతించిన గొప్ప వాఙ్మయాల్లో ప్రథమ శ్రేణిలో ఉండేది మూక పంచశతి. మూక శంకరులు కటాక్ష శతకంలో తపస్సు చేయిస్తారు మనని...

స్థూలంగా ఈ శ్లోకార్థం ఇలా ఉంటుంది.

అమ్మా కామాక్షీ, యుద్ధంలో అర్జునుడు బాణములు ఎక్కుపెట్టి మాటి మాటికీ కర్ణునిమీదకు వెళ్తున్నప్పుడుల్లా ఆయనకు తోడుగా వస్తున్న పాండవ సైన్యాన్ని చూసిన భీముడి చిత్తం సంతోషంతో నిండిపోయింది అని.

సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య
మందస్మితస్య పరితోషిత భీమ చేతాః
కామాక్షి! పాండవచమూ రివ తావకీన
కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః

అమ్మా కామాక్షీ! ఆహా! తెల్లనైన నీ చిరుమందహాసానికి తోడుగా నీ చెవులవరకూ చేరిన నీ కడగంటి చూపును చూసి భీముని చిత్తము బహు సంతోషముతో నిండినదు. అటువంటి కటాక్షలక్ష్మి మమ్ము కాపాడుగాక.

ఇక్కడ అర్జున, పాండవ అన్న పదాలు తెలుపును సూచించేవి, కర్ణ అన్నపదం చెవిని సూచించేదీ, భీమ అన్న శబ్దం మొదట అన్వయమయ్యేది శివునకే శివునకే భీమః అని పేరు.

అమ్మవారి చిరునవ్వు నవ్వినప్పుడు పెదాల కొసలు చెవులవైపుకి కొంత సాగదీయబడతాయి, బుక్కలు కొంచెం నొక్కబడి చెవులు పెదాల కొసల మధ్య దూరం తగ్గుతుంది. అమ్మవారి అర్జునమైన అంటే తెల్లనైన అంటే స్వచ్చమైన ఆ నవ్వు కర్ణముల మీదికి అంటే చెవుల మీదకి యుద్ధానికెళుతున్నట్టుగా ఉన్నదట. దీన్ని కర్ణునిమీదకు యుద్ధానికి వెళ్తున్న అర్జునుడితోపోల్చారు మూక శంకరులు. మనం అమ్మవారి ముఖబింబం ధ్యానంలో చూస్తూ అమ్మవారు ఎర్రని పెదాలు మృధువైన ఎర్రని చెక్కిళ్ళు వెనక ఒకటి రెండు ముంగురుల వేలాడుతుంటే కర్ణాభరణాలతో శోభిల్లే చెవులు చూస్తూ అమ్మవారు ఒక సారి నవ్వినట్లు ఊహించుకొని ఆ నవ్వుతో అమ్మవారి పెదాల చివర్లు వెన్నక్కి సాగినట్లు ఆ కొసలు బాణపు ములుకుల్లా ఉండి చెవులవైపు వెళ్తున్నట్లూ బుగ్గలు దగ్గరకు నొక్కుకోబడి ఉబ్బినట్లూ అందువల్ల ఇంకాస్త ఎరుపెక్కినట్లూ మనతో ధ్యానం చేయిస్తారు... ఐతే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. అలా నవ్వినప్పుడు అసలే విశాలాక్షియేమో మాయమ్మ.. ఆ పెద్ద కళ్ళు మామూలుగానే చెవులదాకా ఉంటాయి పైగా ఈ నవ్వినప్పుడు, చెక్కిళ్ళ పై భాగం కళ్ళను కూడా కింది వేపు నుంచి పైకి వత్తడం వల్ల కనుల కొనలు కూడా చెవుల వైపుకి కొంత సాగదీయబడినట్లుగా అయ్యి కడగంటికి చెవులకి మధ్య దూరం తగ్గుతుంది. అమ్మవారి కడగంటి పాండురమైన అదే తెల్లనైన చూపు కూడా చెవులమీదకు ఉరుకుతున్నట్లు ఉందిట.. అంటే అమ్మవారు నవ్వినప్పుడల్లా పెదాల చివర్లు (అర్జునుడు) చెవుల మీదికి వెళ్తే (కర్ణుడిమీదకు) తోడుగా తెల్లని కడగంటి చూపు (పాండవసైన్యం) కూడా చెవుల మీదికి వెళ్తున్నదట (అర్జునునికి తోడుగా పాండవ సైన్యం కర్ణునిమీదకు వెళ్తున్నదట). ఇది చూసిన భీముడు మనసు సంతోషించిందట, అంటే అమ్మవారి ముఖంలో చిరునవ్వు చూస్తూ ఎంత భీముడైనా మనసు సంతోషంతో నిండి శివుడైయ్యాడట.

సర్వం పరబ్రహ్మార్పణమస్తు..

No comments:

Post a Comment