Pages

Sunday, April 26, 2015

కర్మ - జ్ఞానం - అధికారం

శ్రీ గురుభ్యోనమః
నమస్తే


"అసంప్రదాయవిత్ సర్వ శాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయః" - సంప్రదాయ పరిజ్ఞానములేనివాడు ఎన్ని శాస్త్రములను చదివినా మూఢుని వలె ఉపేక్షణీయుడే. భగవద్గీతా భాష్యంలో ఆది శంకరులు. ఈ మాటలను బట్టి ఆచారము సంప్రదాయములను పాటించడం ఎంత ముఖ్యమైనదో ఆస్థికులైన వారికి ఇట్టే అవగతమౌతుంది. 

సాధారణంగా ఆధ్యాత్మిక జీవతంలో ఉండి సాధన చేస్తున్నవారు కొన్ని చోట్ల తికమక పడుతుంటారు. పెడుతుంటారు కూడా... రెండు విషయాల్లో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు నటిస్తారు చాలామంది. లక్ష్మి విషయంలో ఎంత ఉన్నా లేదనీ, సరస్వతి విషయంలో ఎంత డొల్లైనా అంతా తెలుసనీ.... అంతా కాకపోయినా ఎంతో తెలుసనీ...

ఇక అక్కడ్నుంచి ఇదెవరు చెప్పారు అదెవరు చెప్పారు ఇవన్నీ ట్రాష్ ఆధ్యాత్మ సాధనలో ఇవేంటి అవేంటి, నియమాలు నిబంధనలు అధికారం, అర్హత నథింగ్ డూయింగ్ వాళ్ళకన్నా మేమే బెటర్ వంటి బోలెడు సూక్తులు సుభాషితాలు వల్లించి దేశోద్ధరణం చేస్తున్నామనుక్కునే "సౌజన్యారావు"లు (కన్యాశుల్కం నుండి ఈ పేరు స్వీకరించా)  కొందరు.

సరే, మనది వైదిక ధర్మం, వేదమే ప్రమాణంగా ఉన్న జీవన విధానం. ఈ వేదం రెండు విషయాలను ఇమడ్చుకుని ఉంటుంది. అవే కర్మకాండ జ్ఞాన కాండ. ప్రజాపత్యాదిగా జ్ఞానం వేపుకి వెళ్లడానికి వైదిక కర్మావలంబనం చేసి ఆ కర్మలు పండి జ్ఞాన ఫలాన్ని పొందడం సదాచారం సనాతన వైదిక సంప్రదాయమూనూ. ఐతే కొన్ని సార్లు జ్ఞానానికి ఎవరు అధికారులు అన్నప్పుడు బాల, స్త్రీ, వృద్ధాది వయోబేధాలు కానీ, లింగ బేధాలు కానీ,   వర్ణాశ్రమాది బేధాలు కానీ లేకుండా సర్వులూ జ్ఞానముపొందడానికి, జ్ఞాన సముపార్జనకి అధికారులే అర్హులే అని శాస్త్రాలు ప్రజాపత్యాదిగా సమస్త గురుమండలం చెప్పినదీ అదే.  "జ్ఞానమును సాధించడానికి పై బేధములేవీ అడ్డురావు, జ్ఞానమునుపొందడానికి అందరికీ అధికారమున్నది" (భగవత్పాద ఉవాచ).

ఐతే, ఈ విషయాన్ని తప్పుగా కర్మ కాండకన్వయింపజేయడం మొదలైంది. వేదంలో చెప్పిన కర్మలన్నింటికీ అర్హతాధికారాలున్నాయి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సత్యం సత్యం పునస్సత్యం, ఐనా మన ఒప్పుకోలుతో వేదానికి పనిలేదు కదా. గాయత్రి చేయడానికి ఫలానా ఉపవీతధారణ అనే సంస్కారం చేసినతరవాత గాయత్రికి అధికారి అవుతాడు అన్నప్పుడు అది లేకున్నా చేస్తానాంటే? యజ్ఞానికీ, యజ్ఞశాలకీ ప్రత్యేకమైన పవిత్రత, లెక్కలు , కొలతలు ఉన్నాయి అందులో వాడే సమిధలు, మంత్రాలతో సహా కొన్ని పద్ధతులు అవి నిర్వహించే వారి అధికారం ఉన్నది. స్రుక్కు - స్రువం తయారికి కూడా ఫలాన చెక్కతో చేసిన ఫలాన సైజులో ఉన్న అన్న లెక్క కూడా ఉన్నది అని అంటే, అబ్బే అంతా తూచ్ గరిటలతో చేస్తామంటే? 

ఉపవీతి కానిదే యజ్ఞంలో హవిస్సివ్వకూడదు అని శతపథబ్రాహ్మణాదులలో వేదం నిరూపించింది అని చెప్పినా ఎవరు చెప్పారండీ ఆయనెవరో చేయించారు మేమెందుకు చేయకూడదు అని చేసేస్తే? ఉపనయనం అయ్యిందే అనుక్కోండి ఎంత వేదాధికారం కలిగి ఉన్నా గురువుదగ్గర నేర్చుకోకుండా, స్వరం లేకుండా వేదమంత్రాలు సూక్తాలు చదవరాదు అన్న నియమమున్నా, అవి పఠిస్తే?... ఎవ్వరూ ఆపరు. ఎందుకంటే? వద్దన్నా వినరు కాబట్టి! పైగా వితండం చేస్తారు కాబట్టి! కుతర్కం చేయవద్దని, అందులో పాల్గొనవద్దని శంకరుల ఆన కాబట్టి!

మనలో ప్రతి ఒక్కరూ ఈ రెంటి బేధం తెలుసుకోవాలి, కొన్ని కొన్ని కర్మల నిర్వహణకు కొందరు కొందరు మాత్రమే అర్హులు, ఎంత పండితులైనా కొన్ని కొన్ని విషయాలలో అర్హత అధికారం కలిగి ఉండరు, సోమయాజి కావాలంటే తగు అర్హత కావాలి, హవిర్యాజి అవ్వాలి అలా.. అవతల వారితో వాదు చేస్తున్నప్పుడు ఈ సునిశిత పరిశీలనం అవసరం. జ్ఞానం పొందడం విషయంలో ఎవరూ ఎవరినీ ఆపలేరు ఆపరు. దానికి అధికార బేధాలు లేవు. కర్మల విషయంలో ఖచ్చితమైన నియమ నిబంధనలుంటాయి. ఆచారం ఉంటుంది, రెంటికీ తేడా తెలీకపోవడంతోటే, భగవంతుడి దగ్గర ఇన్ని నియమాలేంటండీ, మాదేవుడికి మాకు తోచిన రీతిలో చేస్కుంటే తప్పంటారు మీ సాంప్రదాయవాదులు అనేటటువంటి తెలిసీ తెలీని అపాండిత్యపు మాటలు బయటపడతాయి. 

కరెంటు పాస్ అయ్యే వైరును ముట్టుకోవాలంటే తగిన పరిజ్ఞానం తో పాటు, చెప్పులు వేసుకోవడం రబ్బరు గ్లౌజులు వేసుకోవడం, తడిలేకుండా జూసుకోవడం వంటి ఆచారం పాటించాలి. అప్పుడే కరెంటు పని సరిగ్గా చేసి మన నిత్యావసరాలకుపయోగించుకోగలం. కరెంటు లేని కర్రపుల్లనో, ప్లాస్టిక్ వైరునో, దండాన్నో ముట్టుకోవాలంటే ఏ నియమమూ అక్కరలేదు. ఇక్కడ కరెంట్ అంటే చైతన్యం చైతన్యవంతమైన దేవతా శక్తి ఉపాసనకి ఆచార సాంప్రదాయాలు బాహ్య శౌచము, ఆంతర శౌచము మొట్టమదటి మెట్లు. ఏ నియమాలు, ఆచారాలు అక్కర్లేదంటున్నారంటే అక్కడ చైతన్యం లేదని గుర్తెరగాలి.

ఏదేమైనప్పటికీ వేదం, శాస్త్రం చెప్పినట్లు చేస్తే వైదికుడివి ధిక్కరిస్తే అవైదికుడివి, సులభమైన మాటల్లో అంతే కదా..

(పై విషయం కాస్త కటువుగా ఘాటుగా అనిపించవచ్చు, కానీ విషయం ఇంతకన్నా గట్టిది, మాటలే నాతరహావి అసలు భావంలోని గూఢత సాంద్రత ఇంకా ఎన్నో రెట్లు చెప్పాలంటే కర్రు కాల్చి వాతపెట్టినట్లుంటుంది, నాకు నేను చెప్పుకున్నవిషయంగా తీసుకోగలరు, ఎవరికైనా పనికి వస్తే మరింత సంతోషం)

3 comments:

  1. కుతర్కం చేయవద్దని, అందులో పాల్గొనవద్దని శంకరుల ఆన కాబట్టి అని మీరే మీ టపాలో వ్రాసి పై ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇచ్చారో బోధపడలేదు. అదృష్టవశాత్తు ఇది మరొక బ్లాగురగడకు దారితీయలేదు. సంతోషం.

    ReplyDelete
    Replies
    1. అవునండీ, ఏవిటో వ్ గెట్ కారీడ్ అవే సమ్ టైమ్స్... will remove all these comments on this post.. ధన్యవాదాలతో..

      Delete
  2. Good post sir!
    www.sakshyammagazine.com

    ReplyDelete