Pages

Wednesday, May 27, 2015

చిన్న గురువు పెద్ద శిష్యుడు


శ్రీ గురుభ్యోనమః

ఆచార్యుడు వయస్సులో చిన్నవాడైనా అతనిని పెద్దవానిగా చూడాలని ధర్మశాస్త్రముల నిర్దేశము. అందుచే అతడు గురువు. మనకంటే వయస్సులో చిన్నవారి వద్ద మనం శాస్త్ర పఠనం చేయడంలో నిషేధమేమీలేదు. జ్ఞానానికి ఆత్మోపలబ్ధికి వయస్సు అడ్డురాదు. ఇందుకు (దక్షిణామూర్తి విషయం కాకుండా మరొకటి) మనకు ఒక ఉదాహరణ శాస్త్రంలో ఇవ్వబడింది అని "నడిచేదేవుడు" కాంచీ శంకరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ పరమాచార్య స్వామి శ్రీ చరణుల మాట ఉపనిషత్తుల ఆధారంగా

అంగీరస మహర్షి పుత్రుడు తన చిన్నాయనలకు ఆచార్యుడుగా ఉండేవాడు. విద్యాభ్యాసకాలంలో ఆయన వారిని 'వత్సలారా’ అని సంబోధించాడట. అందుకు పినతండ్రులు కోపించి దేవతలతో ఫిర్యాదు చేసారు. దేవతలన్నారట ’ మీరు ఫిర్యాదు చేయటం సరికాదు. మీకు విద్య అంటే ఏమో తెలీదు . మీ అన్న కుమారుని వద్ద మీరు విద్యోపదేశం పొందుతున్నారంటే, మీరు చిన్నవారు. అతడు వృద్ధుడు అని అర్థం. వయస్సు ముదిరి వెంట్రుకలు తెల్లనైననందున ఒకడు వృద్ధుడు కాడు. వేద విజ్ఞానం కల వాడే వృద్ధుడు.’

చిక్కి శల్యావస్థలో ఉన్న వయోవృద్ధులు, యోగులు దక్షిణామూర్తి వద్ద ఆయన మౌన వ్యాఖ్య చేస్తుంటే తమ సంశయములను పోగొట్టుకుంటున్నారు... ఏం విచిత్రం!!
వటుతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః.. 
డబ్బున్న వానికి గౌరవం ఇస్తాం, చుట్టరికం రీత్యా పెద్ద వరుసలో ఉన్నవారికీ గౌరవం ఇస్తాం, మనకన్నా చిన్నవారైనా పెద్దవాళ్లకిచ్చే గౌరవం ఇస్తాం... వయోవృద్ధులనూ గౌరవిస్తాం. వయస్సుతో నిమిత్తం లేకుండా యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వారినీ పెద్దలని గౌరవిస్తాం. పెద్దవాడు కాకపోయినా విద్వాంసుడు, జ్ఞాన వృద్ధుడైనందున మనం గౌరవిస్తాం. 

ఈ చివర చెప్పిన జ్ఞాన వృద్ధుడైన గురువు యందు అత్యంత గొప్పనైన గౌరవం ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. అతనిని చుట్టరికంతోగానీ, బంధుత్వంతోగానీ, వయసుతోగానీ చిన్నవానిగా చూడరాదు.

-శంకర కింకర


No comments:

Post a Comment