శ్రీ గురుభ్యోనమః
నమస్తే
భారత దేశ సంస్కృతిలో ముఖ్యంగా సనాతన ధర్మములోచరించే వారికి విచ్చలవిడితనం, విశృంఖలత్వం, ఇచ్చవచ్చినట్టు చేసుకోవడం ఎన్నడూ చెప్పబడలేదు, గత కొన్ని శతాబ్దాలపూర్వం ఈ దేశ సంపద సంస్కృతులకోర్వలేని దేశాలు జాతులు కొన్ని ఈ దేశం మీద పడి వారి భావజాలాన్ని మనలో జొప్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను, మనుషులకుండే నియమ నిబద్ధతలను చెరిపే ప్రయత్నం గట్టిగా చేసాయి.
నేనెవరిమాట వినను, నేనెవరికీ జవాబు కాదు, నా అంతవాణ్ణి నేను, నాకూ తెలివుంది వాళ్లు చెప్పేదేమిటి, నాజీవితం నాయిష్టం, అంతా మీరే చేసారు.. లాంటి ఆచరణ సాధ్యంకాని పొల్లు మాటలు, అవైదిక సంస్కృతి ఈ దేశంలో లేదు. సనాతన ధర్మంలో చరించి వేద ధర్మాన్ని ఆచరించేవారికి ఈ అలవాటూ లేదు, పొరపాట్న కాలమాన పరిస్థితుల వల్ల ఎవరికైనా అటువంటి భావన ఉన్నా ప్రయత్న పూర్వకంగా అలాంటివి వదులుకోవలసి ఉంది. అదే ఉన్నతికి నాంది.
భగవద్గీతలో గీతాచార్యునితో అర్జునుడదే చెప్తాడు ’కరిష్యే వచనం తవ’ అని నువ్వు చెప్పినట్లు చేస్తాను అన్నాడు కానీ నా ఇచ్చ వచ్చినట్లు చేస్తాను అని చెప్పలేదు. అసలు గీత వచ్చిందే అందుకు.. నేను చెయ్యలేను, నాకెందుకు ఈ యుద్ధం, రాజ్యం వగైరా అంటే అసలు తత్త్వం బోధించి నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అదే అర్జునునితో చెప్పించాడు కృష్ణుడు.
ఒక ఉత్తముణ్ణి గురువుగా/ఆచార్యునిగా ఎంచుకోవడం వారికి తనంత తానుగా కట్టుబడి ఉండడం జీవితోన్నతికి మార్గం, వేదశాస్త్రేతి పురాణవచనాలను అన్వయించుకుంటూ జీవించడం ఉత్తమ జీవనం. గురువనే కాదు, ప్రతి మనిషీ జీవితంలో ప్రతి ఘట్టంలో ఎవరో ఒకరికి కట్టుబడి ఉండడం జీవితోన్నతికి తోడ్పడుతుంది. అందరికీ చెప్పగలిగేవారైనా భగవంతునికి వారి పూర్వాచార్యులకీ కట్టుబడే ఉంటారు. అదీ సనాతన ధర్మంలో గురువుల గొప్పదనం. 'అంత గొప్పవారం లక్షల కోట్ల మంది మాకు మొక్కుతున్నారు మేమెవరికి జవాబుదారీ' అని ఉండదు. ప్రతి ఒక్కరూ భగవంతునికి, గురువులకూ, వేదాది శాస్త్రములకు జవాబుదారీ.
గురు వాక్యానికి కట్టుబడు, శాస్త్రవాక్యానికి కట్టుబడు, అంతేకానీ నీకు నచ్చిందికాబట్టి శాస్త్రం వద్దన్నా, గురువులు వద్దన్నా, ఆఖరికి ఇంట్లోవాళ్ళు, నీ కింద నేర్చుకునే శిష్యులో, పనివాళ్లో శాస్త్రం కాదు వద్దన్నా... నాకు నచ్చిందింతే ఇలాగే చేయాలి అని పట్టుబట్టావో అక్కడే మొదలౌతుంది పతనం. పక్కవాడి మెప్పుకోసం కాదు, శాస్త్రవాక్కు, గురువాక్కు పొల్లుపోకుండా చేయగలుగుతున్నానాఁ...? రేపొద్దున్న నేను చేసిన పని తెలుసుకొని నా గురువు/నాన్నగారు/ తాతగారో ఎవరో పెద్దలో ఎదుటపడి "ఏమిరా నాయనా నువ్వేదో మంచి పనులు చేస్తుంటావనుక్కుంటే ఇలా చేసావేమిరా... అందరూ నన్నడుగుతున్నారు మీ వాడట... శాస్త్రనిషిద్ధమైనపనులు సొంత తెలివితో సొంత వ్యాఖ్యానాలతో ఏదో చేసాడు అని. ధర్మరాజంతటివాడి తప్పులెంచి దుర్యోధనుణ్ణి పొగుడుతున్నావట!? రాముణ్ణి నమ్ముకున్న దేశంలో రావణుణ్ణి పట్టుకుంటావేరా? కృష్ణుడా? కంస జరాసంధులా? ఏమిరా నీ ప్రవర్తన మాటలూ? " అంటే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానా, "లేదండీ మీ కీర్తి ఇనుమడించేలా, శాస్త్రం చెప్పిందే చేశాను. పది మంది మెప్పుకోసమో, ఒకర్ని సముదాయించడానికో కాదు, నన్ను నమ్మండి ఫలానా ఫలానాలా శాస్త్రం ప్రకారం చేసాను" అని చెప్పగలనా? అన్నది చెక్ చేసుకుంటూ పరి పరి విధాల ఆలోచించి చేయవలసి ఉంటుంది.
ఇది ఆధ్యాత్మిక జీవనంలోనే కాదు లౌకిక సాంసారిక జీవితమైనా అంతే, ఒకప్పుడు తల్లి తండ్రులకి, అన్న తమ్ములకి కట్టుబడి ఉండాలి, పెళ్ళైంతరవాత భర్త భార్యకి, భార్య భర్తకి కట్టుబడి నియమ నిబద్ధతగల జీవనం కొనసాగించిననాడు ఆ వ్యక్తి ఎంతో మందికి మార్గదర్శికాగలడు.
చిన్నప్పుడు తల్లి మాటకు కట్టుబడకపోతే ఏ కత్తిపీట వల్లో కాలో చెయ్యో తెగుంటే? తండ్రికి కట్టుబడి తండ్రి చెప్పిన చక్కని మాటలు వింటూ చదువుకుని ఉత్తమ పౌరుడవ్వకుండా సినిమాల్లో చూపే నిజదూరమైన అన్ని వెర్రి వేషాలు హీరోయిజం పేర వేసి జైల్లో కూర్చుంటే? నేను భర్త మాటో/భార్య మాటో వినేదేంటి అని ఒకరియందొకరు నిబద్ధతకోల్పోతే కలిగే పర్యవసానాలకి ఎవరు బాధపడతారు?
పరాదేవత పేర్లలో ఒకపేరు ’యశస్విని’ వేదవిహితమైన, ధర్మబద్ధమైన నియమబద్ధమైన జీవన విధానాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకునేవారికి అమ్మ యశస్సుని (కీర్తి/గౌరవం) కలిగిస్తుంది. అది కూడా అంచెలంచెలుగా, ఒక్కో రాయి పేర్చి కట్టిన మేడలా ఉంటుంది. దాన్ని చూసుకుని చెయ్యి గుండెలమీద తట్టుకున్నామో, లేక ఏ జీవన విధానం వల్ల ఈ యశస్సు వచ్చిందో దాన్ని పక్కకి తోసేప్రయత్నం తెలిసో తెలియకో చేసినా..... ఓహో నీదే కదా ఈకీర్తి అలా అనే కదా ధర్మాన్ని, వేదాన్ని, నిబద్ధతనీ వదిలేశావ్ అనుష్ఠాన హీనుడివై సొంతంగా ఆలోచిస్తున్నావ్... నేను పక్కకి తప్పుకుంటాను ఇప్పుడు చూడు ఏమవుతుందో అని ఆ అమ్మ పక్కకి తప్పుకుందనుక్కోండి.. అంచెలంచెలుగా వచ్చిన యశస్సు కాస్తా భూకంపంలో నేలమట్టమైన భవంతిలా ఒక్కసారిగా కూలిపోతుంది. దాంతో కీర్తిపోయినవాడికి ఆక్రోశం , ఉక్రోషం పెరిగిపోతుంది. తెలిసో తెలీకో జరిగిందేదో జరిగింది ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుందాం అనుక్కుని తిరిగి పొందవలసినదాన్ని పొందడానికో, నిలబెట్టుకోడానికో తిరిగి శాస్త్రాన్ని పట్టుకుంటే పరవాలేదు, అన్యం పట్టుకుంటే ఊబిలోకి కూరుకుపోతూనే ఉంటాడు.
ఒక మంచి పని చేస్తే వచ్చిన కీర్తిని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పుష్పాన్ని పరమేశ్వరునికో, గురువుకో సమర్పించినట్లు అయ్యా ఇది మీది, నేను మీకు కట్టుబడి ఉండేవాణ్ణి తప్ప నేనంటూ చేసేది సొంతంగా లేదు ఈ కీర్తి నాది కాదు అని వదలగలగాలి. బయటవాళ్ళనుక్కుంటే అనుక్కోనీ ఫలానా కీర్తిమంతుడని, నువ్వు మాత్రం అలా అనుక్కోకు ఆకీర్తి మా స్వామిది అనుక్కో... అలా వదలలేకపోతే ఇక అది బురదలాగా, మురికిలాగా మనకి అంటుకుపోయి ఎంతకడుక్కున్నా అక్కడ ఇక్కడ ఎక్కడో అక్కడ మకిలి అంటిస్తుంది.. అంత తేలిక కాదు బయటపడడం.
ప్రతి ఒక్కరూ ధర్మానికి కట్టుబడి ఉండడం కోసం ప్రయత్నించాలి, ధర్మమే సనాతనమైనది దానికి ప్రత్యామ్నాయంలేదు. ధర్మానికి ప్రాతిపదిక వర్ణాశ్రమాలు. ఏసమయంలో ఎవరు ఎప్పుడు ఏ ధర్మాన్ని పాటించాలో ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని ఉండాలి, ఒకడి ధర్మంలోకి ఒకడు దూరకుండా స్వధర్మాచరణంతో పాటు పక్కవాడిని వాడి ధర్మంలో ఉండేటట్లు సహకరించాలి. ధర్మానికి మూలం వేదం, వేదం=శాస్త్రం, అంటే శాసించేది, అది చెప్పినట్లు చేయడమే తప్ప తర్కానికి, ప్రశ్నించడానికి ఆస్కారం లేదు. అబ్బేకాదంటే సనాతన ధర్మం/వేద మతం లోని వాడివి కాదు అని గుర్తెట్టుకో..
ఆఁ... వాళ్ళందరూ శాస్త్రాలూ, పురాణాలు అని చెప్పార్లే అన్నీ చేసేస్తామేంటి!.. అని అనుక్కుంటే.. మన డొల్లతనం, నిబద్ధత ఏమిటో తెలుస్తుంది. నాకు అవసరమైన మేర శాస్త్రం, పురాణం, పెద్దల వాక్కులు అన్వయించుకోవడం ...నచ్చకపోతే లేదా కుదరకపోతే అబ్బే వాళ్ళలా చెప్తార్లే... మనకన్నీ ఎక్కడ కుదురుతాయ్ఁ... ప్రతీదీ పట్టుకోకూడదు అని మెట్టవేదాంతం కూడదు.
మనలోనే చిత్రంగా కుర్చొని గుప్తంగా లెక్కలు వ్రాసేవాడోడున్నాడు.. బయటికి మనమెలా కనపడినా ఒకనాడు ఈ చిత్రగుప్త లెక్కలు చెప్తాయి మనమేంటో మన జీవితమేంటో...
ఇది చదువుతున్న పెద్దలందరికీ మనవి:- ఇవి నేను ఎవరికో చెప్తున్నవి కావు, పొరపాట్నకూడా ఎప్పుడైనా నియమం తప్పకుండా ఉండడానికి నాకు నేను చెప్పుకుంటున్న సావధాన వాక్యాలు, నాకు నేను చెప్పుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే. ఐతే ఇక్కడెందుకు చెప్పావు అంటారా.. పది మంది పెద్దలకి తెలుసన్న విషయంగానైనా నన్ను నేను జాగ్రత్తపరచుకుంటూ ఉండడానికి.
అద్బుతంగా వ్రాసారు. జీవితపర్యంతం ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని, మననం చేసుకుంటూ ఆచరించవలసిన ఆణిముత్యాలు..
ReplyDeleteచివరి లైను చాలా బాగుంది....అందుకోసం మనం టముకు వేసుకోవాలి...తప్పు చేస్తే పది మంది మనలన్ని నిలదీస్తారు, మా గురువులకు, వంశానికి చెడ్డ పేరు వస్తుంది...అనే భయం మనలో వుండాలి....అందుకు సావధాన ....బాగుంది..
ReplyDeleteమీవంటి పెద్దల ఆశీర్వాదం.... బ్లాగ్ కి వినమ్ర స్వాగతం.. ధన్యవాదాలండీ..
Deleteమీవంటి పెద్దల ఆశీర్వాదం.... బ్లాగ్ కి వినమ్ర స్వాగతం.. ధన్యవాదాలండీ..
Deleteచివరి లైను చాలా బాగుంది....అందుకోసం మనం టముకు వేసుకోవాలి...తప్పు చేస్తే పది మంది మనలన్ని నిలదీస్తారు, మా గురువులకు, వంశానికి చెడ్డ పేరు వస్తుంది...అనే భయం మనలో వుండాలి....అందుకు సావధాన ....బాగుంది..
ReplyDeleteఇలాంటి సావధాన వాక్యాలు, హెచ్చరికలు తరచుగా మనల్ని మనం సరైన త్రోవలో ఉన్నామో లేమో చూసుకుంటూ జాగ్రత్త పడటానికి చాలా అవసరం. నీ లాంటి కులదీపకుడు వంశానికి ఒక్కడున్నా చాలు. దీర్ఘాయుష్మాన్భవ.
ReplyDeleteబాబాయ్! మీవంటి పెద్దల ఆశీర్వాదం.... బ్లాగ్ కి వినమ్ర స్వాగతం..
Deleteబాబాయ్! మీవంటి పెద్దల ఆశీర్వాదం.... బ్లాగ్ కి వినమ్ర స్వాగతం..
Delete