Pages

Thursday, March 14, 2013

కలసి మెలసి ఉందుముగాక!


శ్రీ గురుభ్యోనమః

ఉపనిషత్తులు వేదాంతములు, ఉపనిషత్తులను అరణ్యములతో పోల్చి అందున్న జ్ఞానముచే దానిని జ్ఞానారణ్యము అని అంటారు. అమ్మవార్ని వన సంచార కుశలా అని శ్రీ రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు. వనము అంటే అరణ్యము జ్ఞానారణ్యము ఉపనిషత్తులయందు తన పాదములతో తిరుగునది కాన వన సంచార కుశల. పరాదేవత, జగజ్జనని, అనుగ్రహం ఉన్నవానికే ఉపనిషత్జ్ఞానం బోధపడుతుంది, అందు వివేచన, పరిశీలనం చేయడానికైనా సరే. ఉపనిషత్ వాక్యములు, అందున్న కథలు అన్నీ కూడా గురు శిష్య సంవాదములాగానే ఉంటాయి. అవి పరమోత్కృష్టములు.

ఉపనిషత్తులలో తైత్తరీయమొకటి. అందున్న శాంతి వచనము ఎంతో ప్రాచుర్యం పొందింది, దాని అర్థం తెలిసినా తెలియకపోయినా, ఎవరు చదవాలో ఎవరు చదవరాదో తెలిసినా తెలియకపోయినా, చదవడానికి నియమ నిబంధనలు తెలియకపోయినా,  చాలా చోట్ల కొన్ని కొన్ని ఆధునిక విద్యాలయాల్లో సైతం తైత్తరీయోపనిషత్తులోని శాంతి వచనం చెప్పే అలవాటు ఉంది. అర్థం తెలియకపోయినా అది చదవడం ఎందుకు పెద్దలు ఒక నియమంగా పెట్టారో అని దానర్థం చూస్తే ఎంత పెద్దమనసురా మనవారిది, ఇది కేవలం సనాతన ధర్మంలోనే కదా సాధ్యం అని తేటతెల్లమవుతుంది.

ఓం సహనావవతు సహనైభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

స్థూలార్థం
మనము కలిసి మెలసి ఉండెదముగాక!
అన్నింటినీ కలిసే అనుభవములోనికి తెచ్చుకొనెదముగాక!
కలిసి కార్యములను నిర్వహించెదముగాక (కలిసి కర్మ నిర్వహించెదముగాక)
కలిసి తేజోవంతులమయ్యెదముగాక
మనకు వైషమ్యులు కలుగకుండ ఉండెదముగాకపరిపూర్ణమైన శాంతిని పొందెదముగాక అని ముమ్మార్లు శాంతి వచనంతో పలుకుతారు.

ఇందులో గురువు పెద్దవాడు చెప్తున్నాడు, శిష్యుడు చిన్నవాడు గురువుచే చెప్పబడువాడు లేదా శిక్షణపొందుతున్నవాడు అని తేడాలేదు. ఇరువురూ కలిసి చెప్పుకునే శాంతి మంత్రమిది. నేను చెప్పేవాడిని నువ్వు వినేవాడిని అన్న బేధము తలెత్తకుండా శాంతిమంత్రవచనమున్నది.

ఎంత ఔదార్యపూర్వకము కదా మన ఆర్షధర్మము, "గురుశిష్యులమైన మనము కలిసే ఉండెదము గాక, మనము కలిసి కర్మలను చేయుదముగాక, కలిసి తత్ఫలితములను అనుభవించెదముగాక, కలిసి తేజోమూర్తులమయ్యెదముగాక, మనలో మనకు విబేధములు పొడసూపకుండ ఉండెదముగాక, ఒకరినొకరు సుహృత్భావముతో చూచుచూ ఉండెడి భావనతో కలిసి ఉండెదముగాక, అట్లు జీవించి పరిపూర్ణమైన శాంతి అయిన పరబ్రహ్మమును (ఓం) పొంది శాంతి స్థితిలో నుండెదముగాక"

అంతేగానీ ఒకరెక్కువ ఒకరు తక్కువ అన్న భావన సనాతన ధర్మంలో లేనేలేదు, వరుసలో పైనున్నవాడికెప్పుడూ అధిక విహిత కర్తవ్యాన్ని శాస్త్రం నిర్దేశించి ఇతరులకి మినహాయింపులిచ్చింది సనాతన ధర్మ శాస్త్రం, తప్ప ఒకడికి పెద్దపీట ఒకడికి చింకిచాప వేయలేదు. ఆశ్రమ బేధమైనా, వర్ణబేధమైన, చివరికి అది గురుశిష్యులైనా, భార్యాభర్తలైనా సరే.

వాక్కు ఇప్పటి స్కూళ్ళు కాలేజీలలో కూడా చెప్పించి వివరించాలి, ఆర్ష వాక్కులే వ్యక్తిగత శాంతికీ, ప్రపంచ శాంతికీ శరణ్యం

ఓం సహనావవతు సహనైభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

No comments:

Post a Comment