Pages

Thursday, May 17, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 1




శ్రీ గురుభ్యోనమః
అందరికీ నమస్సులు

//ఇందులో వీరి సంపూర్ణ జీవిత చరిత్రను పొందు పరచడం లేదు, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రమే ప్రస్తుతించే ప్రయత్నం చేస్తున్నాను.//

సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు పుట్టి వారి విద్వత్తు చే వారి వారి స్థానాలను చిరస్థాయి చేసుకున్నవారెందరో మహానుభావులు ఉన్నారు. సంగీత ప్రపంచంలో అదీ ఘనమైన సాంప్రదాయ కర్ణాటక సంగీతంలో ఒకే కాలంలో ముగ్గురు విద్వాంసులు తమ కృతులచే విలక్షణ గాన పటిమచే సంగీత సామ్రాజ్యాన్నే వీరికి పూర్వం, వీరి తరవాత అన్న కాల విభజనే జరిగింది. ఎందరో సంగీత కళాకారులున్నా వీరి ముగ్గురి విషయంలోనే ఇంతగా ఎందుకు జరిగింది అన్నది ఇ ముగ్గురి విషయంలో చూస్తే  ఉన్నది ఒక్కటే కేవల సంగీత పాండిత్యమే కాదు, సంగీతోపాసన / నాదోపాసన ద్వారా వారు ఎలా పరమేశ్వరుని కృపకు చేరువయ్యారు అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉన్నది. వీరి జీవిత విషయాల ద్వారా కేవలం సంగీతం ద్వారా జీవితం పండించుకోవచ్చనేది కాక, మనకున్న వివిధ విభూతులద్వారా ఎలా భగవంతుని చేరుకోవాలో అన్వయం చేసుకోవడం ముఖ్యమని తలుస్తూ దీనిని ప్రారంభిస్తున్నాను. ఈ అన్వయం ఎవరికి వారు చేసుకోవడం శ్రేయం న్యాయం కూడా.


శ్రీ శ్యామ శాస్త్రి గారు ఈ సంగీత రత్న త్రయం గా పేర్గాంచిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితులలో వయస్సు రీత్యా పెద్దవారు. వారి పూర్వీకులు ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా కంభం ప్రాంతం వారు. వారు ద్రవిడ దేశానికి వెళ్ళి స్థిర పడి తమిళ స్మార్త బ్రాహ్మణ శాఖ ఐన వడమ శాఖలో కలిసారు వీరినే ద్రవిడంలో వడదేశత్తు అని పిలుస్తారు. ఐతే ఈ కుటుంబానికి తెలుగు భాష పరిచయము కానీ, తెలుగు భాష యందు గౌరవము కానీ తరాలు మారినా తగ్గలేదు. చక్కని తేట తెలుగులో వీరి పాండిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు పైగా వన్నెకెక్కింది. కంభం ప్రాంత నుండి కాంచీ పురానికి వలస వెళ్ళిన కారణాన వీర్ని కంబట్టార్ అని తమిళులు పిలిచేవారు. వీరి వంశము శ్రీ శంకర భగవత్పాదుల కాలంలోనే కంచిలో స్థిరపడినట్టుగా వీరి వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. శంకర భగవత్పాదులు వీరి పూర్వీకులను కంచిలో కామాక్షి ఆలయ అర్చకులుగా నియమించారని చెప్తారు. అప్పటి నుండీ వీరు కంచి ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు.

దాదాపు ఇరవై శతాబ్దాల తరవాత (క్రీశ 1500-1600) కాలంలో దక్షిణ దేశంలో రేగిన అశాంతి, దండయాత్రల వల్ల ఎన్నో ఆలయాలు ధ్వంసమై ఆలయ సంపద కొల్లగొట్టుకు పోతుంటే. వీరి కుటుంబం కంచిలో ఉన్న బ్రహ్మగారిచే నిర్మితమైన బంగారు కామాక్షి మూర్తిని తీసుకుని తమ సమస్త సంపదనూ వదిలి, అడవులలో తిరుగుతూ దాక్కుని అమ్మవారికి నిత్య పూజలు సేవ చేస్తూ దాదాపు 28-30 సంవత్సరాలు అడవులలో గడిపారు. తరవాత తంజావూరు సంస్థానాధీశులు వారికీ బంగారు కామాక్షికీ వసతులు కల్పించగా అక్కడే 15 సంవత్సరాలు గడిపారు. అక్కడి నుండీ అణక్కుడి జమీందారీలో పదిహేను సంవత్సరాలు తరవాత విజయపురంలో పదిహేను సంవత్సరాలు ఉండి అక్కడనుండి ఇతర గ్రామాలైన నాగూరు, మాడపురం, సిక్కిల్ గ్రామాలలో దాదాపుగా మరో పదిహేను సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుండి తిరువారూరుకు వచ్చి అక్కడ 45 సంవత్సరాలున్నారు. తిరువారూరు త్యాగరాజ స్వామి (పరమేశ్వరాలయం)లో ఒక ప్రత్యేక మంటపంలో ఉంచి పూజించే
వారు. ఇక్కడే మన ఈ వంశంలో ఒక రత్నం జన్మించింది. వారే శ్రీ శ్యామ శాస్త్రి. వారి తండ్రిగారు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు అప్పటికి ఈ బంగారు కామాక్షి అమ్మకి సేవచేస్తూ అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవారు.

మైసూర్ పాలకుడు హైదర్ ఆలీ (టిప్పు సుల్తాన్ తండ్రి) తిరువారూరు మీద దండయాత్ర ప్రకటిస్తే ఏం చేయాలో తెలియక, అర్చకులు శ్రీ విశ్వనాధ అయ్యరు గారు తంజావూరు రాజుగారిని సంప్రదించి కోటలోనే బంగారు కామాక్షిని ప్రతిష్ఠించి అక్కడే సేవ చేసేవారు. ఆ కాలంలోనే ఇతర దేవాలయాలలోని విగ్రహములు కూడా తంజావూరు చేరాయి. ఎన్నో వైష్ణవ దేవాలయ విగ్రహాలు తంజావూరులోని రాజగోపాలస్వామి ఆలయం చేరాయి. అనంతరం కొద్ది కాలానికి హైదర్ ఆలీ మరణించిన తరవాత అన్ని విగ్రహాలూ ఆయా దేవస్థానాలకి తరలిపోయాయి. తరవాత తంజావూరులోనే అమ్మవారికి ఒక కోవెల నిర్మించి అక్కడే అమ్మవారిని ప్రతిష్ఠింప చేశారు. ఈ సమయంలో తంజావూరు రాజు గారు శ్రీ విశ్వనాథ అయ్యరు వారికి కొన్ని అగ్రహారాలను, కానుకలను ఇచ్చారు. అమ్మ వారి ఆలయానికి కొంత భూమిని కానుకలను ఇచ్చారు. ఇప్పుడు ఆదేవాలయము కట్టి 225 సం పైనే అయ్యింది. ఆ ఆలయమే ఇప్పటికీ శ్రీ కామాక్షీ అమ్మన్ కోవెల్ గా ప్రసిద్ధి చెందింది.

[ఈ మధ్యలో ఎన్ని తరాలు మారినా వారి కామాక్షీ సేవ మాత్రం ఏనాడూ మారలేదు, మానలేదు. ఎన్ని అడ్డంకులు అమ్మమీద అకుంఠిత దీక్షతో అమ్మనే నమ్ముకుని కొన్న శతాబ్దాలుగా వారు చేసిన బంగారు కామాక్షికి చేసిన సేవ అనన్య సామాన్యం. కన్న తండ్రి మాట కొడుకులు వినని ఈ నాటి ఈ పరిస్తితులకి వారి వంశాన్ని చూసి నేర్చుకోవలసినదెంతో ఉంది. దాదాపు రెండు వేల సంవత్సరాలకు పైగా కాంచీపుర ఆలయ అర్చకులుగా సేవచేసి. అమ్మవారి సేవే తమ సమస్త ఐశ్వర్యం అని భావించి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తరులుతూ ఎన్ని తరాలు అమ్మ సేవలో అంకితమయ్యాయో.]

ఇక శ్రీ శ్యామ శాస్త్రి గారి జననం గురించి ఒక కథ ఉంది. తిరువారూరులో శ్రీ విశ్వనాథ అయ్యరు వారున్నప్పుడు అక్కడ ఉన్న ఒక భక్తుడు ప్రతి శనివారం వేంకటేశ్వర సమారాధన చేసేవాడు. ఆ సమారాధనకి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఉన్నట్టుండి పూనకం వచ్చినట్టు శ్రీశ్యామ శాస్త్రి తల్లిగారిని పిలిచి నీకు వచ్చే సంవత్సరం చైత్ర మాసంలో కృత్తికా నక్షత్రం ఉండగా కొడుకు పుడతాడు, నువ్వు నూరుగురికి సమారాధన చేయమని ఆజ్ఙాపించాడు. అప్పటికే వారి వంశం వారు అన్ని ఊళ్ళూ తిరుగుతున్న కారణాన ఎక్కడా ఏ కొంతా దాచుకుందిలేదు. వారి వద్దనున్నదంతా బంగారు కామాక్షిని కొలవడం తప్ప. అందువల్ల ఆమె తటపటాయిస్తుంటే పోన్లే నూరు మందికి కాకపోతే అందులో పావు వంతు మందికి అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆవిడ సంతోషించింది. తరవాత కొంతకాలానికి ఆవిడ గర్భిణి అయ్యింది. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా నే చక్కటి కొడుకు పుట్టాడు. వేంకటే శ్వరుని అనుగ్రహం అనీ, కృత్తికా నక్షత్రంరోజున పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అనీ కలిపి 'వేంకట సుబ్రహ్మణ్యం' అని పేరు పెట్టారు. కామాక్షీ / వేంకటేశ్వరుల అనుగ్రహం కదా వారు కాస్త రంగు తక్కువ పైగా స్ఫురద్రూపి కావటంతో 'శ్యామ కృష్ణ' అని ముద్దుగా పిలుచుకునేవారు ఆదంపతులు. కానీ అప్పటికి వారికి పుట్టినవాడు పుం రూపంలో ఉన్న కామాక్షీ అంశ  / కామాక్షి సోదరుడైన వేంకటనాథుని అంశ అనుగ్రహం కలిగినవాడు అని కానీ తెలియదు. విశ్వ విఖ్యాత సంగీత ఖ్యాతిని ఆర్జిస్తాడనీ తెలియదు.

ఇక వారి సంగీత ప్రస్థానం మున్ముందు....


మీ....


No comments:

Post a Comment