Pages

Thursday, May 17, 2012

శ్రీ శ్యామ శాస్త్రి (శ్రీ కామాక్షీ చరణదాసుడు) - 2





శ్రీ శ్యామ శాస్త్రి గారి చిన్నప్పుడు తిరువారూరులో వారికి విద్యాభ్యాసాలు నేర్పించారు. సంస్కృతం, తెలుగు చెప్పించారు. శ్రీ శ్యామ శాస్త్రిగారి మేనమామ గారు కూడా అక్కడే ఉండడంతో ఆయన కూడా కొన్ని విషయాలు నేర్పించేవారు. యుక్త వయస్సు వచ్చేసరికి సంస్కృతాంధ్రభాషలలో మంచి పాండిత్యం సంపాదించారు. మేనమామ సంగీతాభిమాని పైగా సంగీతం తెలిసినవారు కావటంతో ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. వారు సంగీతం నేర్చుకున్న సంగతి వారింటిలోవారు ఎక్కువగా గమనించలేదు కూడా. పైగా వారి కుటుంబంలో సంగీతాభిరుచి కలవారూ లేరు. అందువల్ల మేన మామ దగ్గర పూర్తి చేసిన ప్రాథమిక సంగీత విద్య గురించి ఎవరూ అంతగా గమనించలేదు. అప్పటికీ అతనిలోని సంగీత జ్ఙానిని ఎవ్వరూ గుర్తించలేదు. సంగీత ప్రపంచాన్ని ప్రభావం చేయగలడనీ తెలుసుకోలేదు. చక్కని ప్రతిభ కనబరచాడనీ, మధుర గాత్రమనీ సంగీతంలో ఇంకా శిక్షణ ఇప్పించాలనీ తల్లి తండ్రులు అనుక్కోలేదు. కారణ జన్ములు వారికి వారే తగిన శిక్షణనిచ్చుకొని మహాత్ములౌతారు అన్నది వీరి విషయంలో నిజమైంది. త్యాగరాజ స్వామికి నారదులవారు మారు వేషంలో సంగీత గ్రంథాన్నిచ్చినట్లు, ముత్తు స్వామి దీక్షితర్ గారికీ చిదంబరనాథుడు అనుగ్రహించినట్లు శ్యామశాస్త్రి గారి జీవితంలో అంతకన్నా గొప్ప విషయం జరిగింది.

శ్రీ శ్యామశాస్త్రి గారికి "సంగీత స్వామి" అన్న పేరుతో సర్వ విద్యలకూ, జ్ఙానమునకూ ఆలవాలమైన సదాశివుడే వారికి దగ్గరుండి శిక్షణ ఇప్పించారు. పూర్వాశ్రమంలో ఆంధ్రబ్రాహ్మణుడైన ఒక ఉపాసకుడు తురీయాశ్రమం ఐన సన్యాసం తీసుకుని కాశీలో విశ్వేశ్వర సన్నిధానంలో నర్తన చేస్తూ పాటలు పాడుతూ స్వయం విశ్వనాధ స్వరూపుడై (బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి) చాతుర్మాస్యానికి తంజావూరు వచ్చినప్పుడు దేవతార్చనకై శ్రీ విశ్వనాథ అయ్యరు వారింటికి ఆహ్వానింపబడ్డారు. సంతోషించిన సంగీత స్వామి వారింటికి వచ్చి దేవతార్చన భిక్షా స్వీకారం అయ్యింతరవాత శ్రీ విశ్వనాథ అయ్యరు వారి కోరిక మేరకు శ్రీ శ్యామ శాస్త్రిని ఆశీర్వదించబోయి చూడగా "శ్యామ శాస్త్రి ఎవరో అర్థం అయ్యింది". భవిష్యత్తూ తెలిసింది. ఆయన చేయవలసిన పనీ అవగతం అయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారుఅప్పటికే చేస్తున్న ఉపాసన గురించి అతని సంగీత సాధన గురించి చెప్పేసరికి అవాక్కవ్వడం వారి తల్లితండ్రుల వంతయ్యింది. శ్రీ శ్యామ శాస్త్రి గారిని అప్పుడే శిష్యునిగా స్వీకరించి సంగీతంలో రాగ, తాళ, స్వరముల యొక్క గహనమైన విషయాలను, ఎలా ప్రస్తారం చేయాలో ఆ క్రమాలనూ బోధించారు. చక్కని బుద్ధి తేజస్సు, మేధస్సు కల శ్యామ శాస్త్రి గారికి తన సూక్ష్మ గ్రాహ్మ బుద్ధితో అన్నీ ఎంతో తొందరగా నేర్చుకున్నారు. సంగీత స్వామి సకల సంగీత శాస్త్రమును, గాంధర్వ విద్యారహస్యములెన్నో కల తాళ పత్ర గ్రంథములను ఇచ్చి సంగీత సామ్రాట్టును చేసారు. [ఐతే ఇంత ఖాళీలేని శిక్షణలో కూడా శ్యామ శాస్త్రి గారు ఏనాడూ తన ఉపాసనని మరవలేదు. తన కుటుంబం ఎన్నో వంశాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా సేవచేస్తున్న కామాక్షీ పాదములను వదలలేదు. సంగీత స్వామి అంటే విశ్వనాధుడే దక్షిణామూర్తిగా శ్యామశాస్త్రి గార్కి సంగీతం నేర్పించడానికి వచ్చిన స్వామి.]

నాలుగు నెలల సమయం ఇట్టే అయ్యిపొయింది చాతుర్మాస్యం ముగిసింది "సంగీత స్వామి" వచ్చిన పనీ అయ్యిపోయింది. ఐతే ఆ స్వామి వెళ్ళేటప్పుడు ఇంకో విద్వాంసునీ అనుగ్రహిద్దామనుక్కున్నారేమో. వెళ్తూ వెళ్తూ శ్యామ శాస్త్రి గారిని పిలిచి " శ్యామా! నీకు సమస్త సంగీత శాస్త్రమూ తెలిసింది. ఇప్పుడు నువ్వు మంచి సంగీతం వినాలి. తంజావూరు రాజాస్థాన పండితుడైన పచ్చి మిరియం ఆది అప్పయ్య తో స్నేహం చెయ్యి. అతని ద్వారా మంచి సంగీతం విను, సంగీత చర్చ చెయ్యి కానీ అతని వద్ద నువ్వేమీ సంగీతం నేర్చుకోకుండా జాగ్రత్త పడు " అని చెప్పి తిరిగి తన కర్తవ్యం అయ్యింది అన్నట్లు నవ్వుతూ కాశీకి వెళ్ళిపోయారు.

ఆది అప్పయ్య మంచి సంగీత విద్వాంసుడు, కొందరికి సంగీతం బోధించే వారు. [ ఇందు వలననే చాలా మంది ఆది అప్పయ్య గారిని శ్రీ శ్యామ శాస్త్రి గారికి గురువని చెపుతూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదని వారి చరిత్ర] ఇప్పటికీ వారి కీర్తనలు కృతులు కొన్ని ప్రచారంలో ఉన్నాయని అంటారు. వర్ణాలలో నేర్పే విరిబోణి వారిదే. గుర్వాజ్ఞ ప్రకారం శ్రీ శ్యామ శాస్త్రి గారు ఆది అప్పయ్య తో స్నేహం చేసి ఇద్దరూ మంచి మిత్రులైయ్యారు. ఆది అప్పయ్యకు శ్యామ శాస్త్రి గారంటే ఎనలేని గౌరవం అభిమానం ఏర్పడ్డాయి.  అప్పటికే ఆది అప్పయ్య గారు మలి వయస్సు వారు, శ్యామశాస్త్రి గారు యువకులు. వారిద్దరి సమాగమం ఉన్నప్పుడు ఆది అప్పయ్యగారు ఎవరినీ అనుమతించేవారు కాదు. శ్యామ శాస్త్రి గారెవరో ఆయన పసిగట్టారు. ఆయన శ్యామశాస్త్రి గారిని "కామాక్షీ" అని సంబోధించే వారు. కామాక్షి అమ్మ "తాంబూల పూరిత ముఖి" కదా ఈయనా అంతే ఎప్పుడూ చక్కని తాంబూలం నములుతూ ఉండేవారు. [ ఆయన చిత్రాలలో ఇప్పటికీ వారి పక్కన తాంబూలం పెట్టెను చిత్రిస్తారు, అలాగే తమలపాకులు మడిచి చేతిలో పెట్టుకున్నట్టు చిత్రిస్తారు].

శ్రీ శ్యామ శాస్త్రి గారు ఒకనాడు ఆది అప్పయ్య గారితో చర్చ చేస్తుండగా నోట్లోని తాంబూలపు రసం ఆది అప్పయ్య గారి పంచె మీద పడింది. కానీ ఆది అప్పయ్య గారు ఏమాత్రం చలించలేదు కనీసం తుడుచుకోవటానికి కూడా కదలలేదు. అదే సమయంలో శ్యామశాస్త్రి గారు క్షమాపణ చెప్పి లేచి వెళ్ళి నీరు తెచ్చి కడుగ బోగా, ఆది అప్పయ్య గారు " శ్యామా! ఇది నాకు కామాక్షీ అనుగ్రహం. కామాక్షీ దీనికొరకే నేను వేచి ఉన్నాను. ఇకపై నాకు నిజమైన సంగీత లోకానికి ప్రవేశం లభించింది" అని శ్యామశాస్త్రి గారిని ఆ మరక కూడా స్పృశించనీయలేదు. ఆ తరవాత ఆది అప్పయ్య గారు చేసిన కృతులు, వర్ణాలు ఇప్పటికీ ఉన్నాయి.

శ్రీ శ్యామ శాస్త్రి గారు దారిద్ర్యమెప్పుడూ అనుభవించలేదు. తన తండ్రికి వచ్చిన అగ్రహారాలు, పొలాలతో, కానుకలతో ఎప్పుడూ సుభిక్షంగానే ఉండేది ఆయిల్లు. కామాక్షి కి దారిద్ర్యమా? శ్రీ విశ్వనాథ అయ్యరు వారి తరవాత బంగారు కామాక్షిని శ్రీ శ్యామశాస్త్రి గారే పూజించాల్సి వచ్చింది. అంతకు ముందు వరకూ వందల సంవత్సరాలుగా బంగారు కామాక్షికి పూజ చేసిన పుష్పాలు వేరు, ఇక శ్యామ శాస్త్రి గారు చేసిన మామూలు పుష్పాల పూజతో పాటు అద్భుత సంగీత కుసుమాలు చేర్చి చేసిన పూజ అమోఘం అనిర్వచనీయం.

శ్రీ శ్యామ శాస్త్రి గారి ఉపాసనా, నాదోపాసన ఇతర జీవిత విశేషాలు మున్ముందు

మీ....


No comments:

Post a Comment