Pages

Wednesday, May 27, 2015

చిన్న గురువు పెద్ద శిష్యుడు


శ్రీ గురుభ్యోనమః

ఆచార్యుడు వయస్సులో చిన్నవాడైనా అతనిని పెద్దవానిగా చూడాలని ధర్మశాస్త్రముల నిర్దేశము. అందుచే అతడు గురువు. మనకంటే వయస్సులో చిన్నవారి వద్ద మనం శాస్త్ర పఠనం చేయడంలో నిషేధమేమీలేదు. జ్ఞానానికి ఆత్మోపలబ్ధికి వయస్సు అడ్డురాదు. ఇందుకు (దక్షిణామూర్తి విషయం కాకుండా మరొకటి) మనకు ఒక ఉదాహరణ శాస్త్రంలో ఇవ్వబడింది అని "నడిచేదేవుడు" కాంచీ శంకరులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ పరమాచార్య స్వామి శ్రీ చరణుల మాట ఉపనిషత్తుల ఆధారంగా

అంగీరస మహర్షి పుత్రుడు తన చిన్నాయనలకు ఆచార్యుడుగా ఉండేవాడు. విద్యాభ్యాసకాలంలో ఆయన వారిని 'వత్సలారా’ అని సంబోధించాడట. అందుకు పినతండ్రులు కోపించి దేవతలతో ఫిర్యాదు చేసారు. దేవతలన్నారట ’ మీరు ఫిర్యాదు చేయటం సరికాదు. మీకు విద్య అంటే ఏమో తెలీదు . మీ అన్న కుమారుని వద్ద మీరు విద్యోపదేశం పొందుతున్నారంటే, మీరు చిన్నవారు. అతడు వృద్ధుడు అని అర్థం. వయస్సు ముదిరి వెంట్రుకలు తెల్లనైననందున ఒకడు వృద్ధుడు కాడు. వేద విజ్ఞానం కల వాడే వృద్ధుడు.’

చిక్కి శల్యావస్థలో ఉన్న వయోవృద్ధులు, యోగులు దక్షిణామూర్తి వద్ద ఆయన మౌన వ్యాఖ్య చేస్తుంటే తమ సంశయములను పోగొట్టుకుంటున్నారు... ఏం విచిత్రం!!
వటుతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చ్ఛిన్నసంశయాః.. 
డబ్బున్న వానికి గౌరవం ఇస్తాం, చుట్టరికం రీత్యా పెద్ద వరుసలో ఉన్నవారికీ గౌరవం ఇస్తాం, మనకన్నా చిన్నవారైనా పెద్దవాళ్లకిచ్చే గౌరవం ఇస్తాం... వయోవృద్ధులనూ గౌరవిస్తాం. వయస్సుతో నిమిత్తం లేకుండా యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వారినీ పెద్దలని గౌరవిస్తాం. పెద్దవాడు కాకపోయినా విద్వాంసుడు, జ్ఞాన వృద్ధుడైనందున మనం గౌరవిస్తాం. 

ఈ చివర చెప్పిన జ్ఞాన వృద్ధుడైన గురువు యందు అత్యంత గొప్పనైన గౌరవం ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. అతనిని చుట్టరికంతోగానీ, బంధుత్వంతోగానీ, వయసుతోగానీ చిన్నవానిగా చూడరాదు.

-శంకర కింకర


Saturday, May 23, 2015

ఈశ్వరేచ్ఛ!

ఈశ్వరేచ్ఛ!
          ఎప్పుడూ కూడా ప్రతి మనుష్యుడికీ ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. నేను మనుష్యుణ్ణి, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళుఅనేటటువంటివి. లోపల ఆంతరంగిక స్థితి ఏదైనప్పటికీ కూడా అంతస్థనేది (ఇక్కడ అంతస్థు అంటే ధనం ఐశ్వర్య రూపంలోది కాదు అని గమనించగలరు) వ్యక్తికి లోకంలో ఉన్నప్పుడు, లౌకిక జీవనంలో ఒకటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞానే కావచ్చు, సాధారణంగా  కనపడే ఎవరైనా కూడా కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని మాత్రం అతిక్రమించరాదు.

          ఉద్యోగం చేస్తున్నాం, మనతో కలిసి పని చేసే వ్యక్తిని ఒక మామూలు వ్యక్తిని తక్కువగా చూడడం ధర్మమేనా ? అవతల వ్యక్తి సేవకావృత్తిలో ఉంటే మాత్రం అలా చేయవచ్చా? ఒకరు సేవ్యుడు ఒకరు సేవకుడు. అంతవరకే హద్దు మీరరాదు. అంతస్థులో ఉన్నతేడా లౌకిక జీవనానికి సంబంధించి వరకే. ఆంతరంలో ఉండే స్థితికి లౌకిక జీవన విధానంలో ఉండే స్థితికి ముడి పెట్టుకోకూడదు. అలా ఐతే తారుమారై దోషం కలిగి ధర్మగ్లాని కలుగుతుంది. అంతస్థులో, ఉద్యోగంలో, విధి నిర్వహణలో, పాత్రను మనుష్యుడు పోషిస్తున్నాడో, పాత్ర ఔచిత్యం పరిధి దాటకూడదు. దాన్ని దాటితే అది ధర్మగ్లాని అవుతుంది అంటే ధర్మాన్ని దాటిన, అతిక్రమించిన దోషం కలుగుతుంది. ఇలా మనకి తమ ఆంతర స్థితిని లౌకిక స్థితిని ముడిపెట్టని ఘట్టాలు వాఙ్మయంలోనూ ఉన్నవి.

          శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు మానవుడుగా జీవించాడు, యుద్దంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు విష్ణువువే, ఈశ్వరాంశవని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడుగానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు, మానవుడిగా తన పరిథి దాటలేదు, తన అంతస్థు పరిథి అతిక్రమించలేదు.

          అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో  తెలియవచ్చేలా చేసాడు . భీష్ముడు దైవీ శక్తులు కలవాడు, దైవాంశసంభూతుడు, వసువులలో ఒకడు అని జన్మ కారణంలోనే అవి మనకు చెప్పబడ్డవి. కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునునిమీదకూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడుభీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీశక్తులను ప్రకటిస్తున్నాడు కనుకనిన్ను చంపేస్తాఅని భీష్ముని మీదకు ఉరికాడు ఆయుధం పట్టనన్న కృష్ణుడు. అది గమనించిన భీష్ముడు, తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఇక తరవాత కృష్ణుడు శాంతించడం అర్జునుడు ప్రార్థించడంతో తిరిగి యుద్ధం జరగడం పాండవులు గెలవడం జరిగాయి.

          సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడెక్కడా పరిథిని మీరలేదుధర్మం పాటించు దాని ఫలితం శ్రేయస్సు అని చెప్పాడు తప్ప నేనున్నాను మిమ్మల్ని కాపాడతాను అని పాండవులకు కానీ అర్జునినికి కానీ చెప్పలేదు. అర్జునునికి గీత బోధించినా "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప, ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతానని చెప్పలేదు. అలా చెప్తే పాండవులకు అప్పటికున్న పెద్దవారసుడు నూనూగు కోర మీసాల అభిమన్యుడు చనిపోతే దాన్ని ఆపాడా? లేదు!, నువ్వు చేయవలసింది, నీ అంతస్థులో నీపరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించమన్నాడు" అంతే. "కాపాడే కర్తవ్యం తనమీద పెట్టుకోలేదు" అంటే పాండవులను గెలిపించే "బాధ్యత తీసుకోలేదు". కర్మకు ఫలితం అని నిర్దేశించాడు తప్ప ఫలితం నేనిస్తాను అని చెప్పలేదు. కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. "నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడు తప్ప నేను మీకిచ్చేస్తున్నాను అని చెప్పలేదు అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు. అలా చేయలేదు మానుష్య ఉపాధి అంతస్థు పరిథి మీరలేదు, మీరనివ్వలేదు.

          ఒడియాలు ఎండబెట్టుకునేవారొకరు, బట్టలారేసేవారొకరు, సంధ్యావందనం చేసి సూర్యోపాసన చేసేవారొకరు. ఎవరు ఏకర్మ చేస్తే వారికాఫలితం వస్తున్నది. ఆయన ప్రత్యేకంగా వడియాలు ఎండబెట్టుకునే ఆమెకోసం ఎండబెట్టలేదు. బట్టలని ఆరేలా చేయలేదు, ఉపాసకునికి సంధ్యావందన ఫలితం ఇవ్వలేదు. ఆయన ఎవరియందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. కర్మకిది ఫలితం వస్తుంది ని నిర్దేశించాడు అది వస్తున్నది...

          అంతా ఈశ్వరేచ్ఛ అని వ్యావహారంలో అంటాం అంటే మనం చేసే కర్మలకు ఫలితం మనకు వస్తుంది ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించినవాడు ఈశ్వరుడు "అది ఈశ్వరేచ్ఛ".

పరమాచార్య వాక్కులనుండి అల్లుకున్నవి

-శంకరకింకర