Pages

Tuesday, September 23, 2014

శ్రీ దేవీ శరన్నవరాత్రులు... ఒక అద్భుతం


శ్రీ గురుభ్యోనమః

నమస్తే

 

శరత్కాలంలో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు,

శరణన్నవారిని ఆపదలనుంచి గట్టెక్కించగలిగే నవరాత్రి పూజలు కాబట్టి శరన్నవరాత్రులు

శరద్ ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు

శారదానుగ్రహాన్ని వర్షించేవి కాబట్టి శరన్నవరాత్రులు... ఇలా ఎన్నో విధాల శరన్నవరాత్రులగురించి వాజ్ఞ్మయంలో ఎందరో పెద్దలు చెప్పారు..

 

సంప్రదాయంలో పగలు విష్ణు స్వరూపంగానూ రాత్రి శివ స్వరూపంగానూ ఎలా చూస్తామో అలానే పగలు (వెలుతురున్నప్పుడు సమయాన్ని) అమ్మవారిగానూ రాత్రిని అయ్యవారిగానూ చూసే పద్ధతీ ఉన్నది. అలాగే ఒక మాసంలో పెరుగుతున్న చంద్రకళలు సృష్టిక్రమంలో పెరుగుతున్న అమ్మవారి కళలై (శుక్ల పక్షం) పూర్ణిమ అమ్మవారి పూర్ణ కళగా అనుక్కుంటే కృష్ణ పక్షం అయ్యవారిలోకి లయమయ్యే విధానమన్నమాట. ఇలా అమ్మవారిని పూజించే సంప్రదాయంలో ప్రతి శుక్ల పక్షంలోని పదిహేనురోజులూ అమ్మవారిని ఉపాసించే విధానమున్నది. దానిని సూచిస్తూ లలితా సహస్రనామంలో కూడా ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా’ అని అమ్మవారిని నుతిస్తాము. ప్రతిపత్ అంటే పాడ్యమి, రాకాంత అంటే పూర్ణ చంద్ర తిథి వరకూ ఈ పదిహేనురోజుల మండల పర్యంతమూ పూజింపబడే దానా అని అర్థం ఐతే ఇందులో ఉన్న మరో పదం ’ముఖ్య’ అనేది ఈ శరత్కాలంలోని ఆశ్వయుజ మాస శుక్ల పక్షాన్ని సూచిస్తుంది.

మరింత విస్తారంగా పరిశీలిస్తే, నక్షత్ర పరంగా మాసాల్ని వరుసలో చూస్తే మొదటి నక్షత్రమైన అశ్వని చంద్రునితో కూడి ఉండే ఆశ్వయుజమాసము మొదటిదౌతుంది. అలానే నక్షత్రాలలో చివరిదానికి కొద్ది ముందు వచ్చేపూర్వాభాద్ర, ఉత్తరాభాద్రలతో చంద్రుడు కూడి ఉన్న భాద్రపదం చివరి దౌతుంది. ప్రతి అమావాస్య లయానికి ప్రతీకైతే సంవత్సరానికొకసారి వచ్చే భాద్రపద అమావాస్య మహా’లయ’ అమావాస్య. భాద్రపదమాసాంతం కురిసే వర్షాలు, నల్లని మబ్బులతో ఆకాశం నిండి ఉంటుంది, తిరిగి ఆశ్వయుజ మాస ప్రతిపత్తిథి నుండి పౌర్ణమి వెలుగులు ప్రస్ఫుటంగా ప్రపంచమంతా ప్రసరిస్తాయి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు రెండూ శరదృతువులో వస్తాయి. ఈ మాసాలలో వెన్నల వెలుగులు నిండుగా ఉంటాయి. శరత్కాల పూర్ణిమ, శరత్కాల వెన్నెలలగూర్చి ఎంతమంది కవులు ఎంతగా వర్ణించిందీ తెలియంది కదా!... ఈ వెన్నెలలనే జ్ఞానపు వెలుగులుగా అభివర్ణిస్తారు పెద్దలు సర్వశుక్లా సరస్వతీ అని సరస్వతీ అమ్మవారిని కొలవడం మామూలే, ఆమె తెల్లని చీరకట్టుకొని, తెల్లనైన హంసనెక్కి, తెల్లని పూదండలు ధరించి, అత్యంత తెలుపు కాంతులీనుతూ ఉంటుంది... అంటే జ్ఞాన ప్రసరణం చేస్తుంది అందుకే ఈ కాలాన్ని అమ్మవారి జ్ఞాన ప్రసరణ స్వరూపమైన శారదగా శరదృతువుగా చెప్పారు మన పూర్వ ఋషులు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమ చంద్రుణ్ణి తప్పకుండా చూడాలని పెద్దలు చెప్తారు. నల్లని మబ్బులుతో చీకటి నిండినఆకాశంలో శరత్కాల చంద్రుని కాంతి వెలుగులు నింపినట్లు మన హృదయంలో ఉండే దహరాకాశంలో ఉండే అజ్ఞాన చీకట్లను పారద్రోలే రాత్రులే ఈ నవరాత్రులు.

సరే, పైన చెప్పుకున్నట్లు ఈ పదిహేను రోజులూ శ్రీవిద్యాది దీక్షలున్నవారు, యోగ మార్గంలో ఉన్నవారూ ఉపాసన చేస్తారు, లేదా కనీసం రాక్షసమర్థన వృత్తాంతాన్ని పౌరాణికంగా తెలుసుకొని ఆ విజయాన్ని తొమ్మిది రోజులూ అమ్మవారు ఏ విధంగా ఒక్కోరోజూ ఒక్కో స్వరూపంలో రాక్షస మర్థనం చేస్తూ మనకి శుభాలను కలుగజేసిందో తెలుసుకుంటూ నవరాత్రులు పూజించి చివర రోజున విజయదశమిగా పండుగ జరుపుకోవడం పరిపాటి.

 

ఇక ముఖ్యంగా మన శాస్తాలు, పురాణాలు, అపార వాఙ్ఞ్మయం, ఋషులు తపో త్యాగం, భగవంతుణ్ణి సామాన్య ప్రజలకు కూడా ఎంత దగ్గర చేసాయంటే చెప్పనలవి కాదు. విజయదశమి ఉత్సవాలుగా మనం పూజించే సింహవాహిని ఐన దుర్గామాతను ఖగోళంలో ప్రత్యక్షంగా ఈ కాలంలో చూపించారు మన ఋషులు. ఆశ్వయుజ మాసం సూర్యుడు కన్యారాశిలో ఉండగా ప్రారంభమౌతుంది, సాయంత్రం పడమరకు వచ్చేసరికి ఈ కన్యారాశికన్నా ముందే సింహరాశి పడమర చేరుతుంది, సూర్యుడు ఆ సింహరాశిలోకి చేరతాడు. అంటే అప్పుడు కొద్దిగా ఖగోళ పరిజ్ఞానం ఉన్నవారు పడమర చూస్తే సింహరాశి క్రిందకి ఆ అపైన కన్యారాశి ఉంటాయి అప్పుడు ప్రతి రోజూ వికసనం చెందే చంద్రుని కళలే అమ్మవారి దరహాసం పౌర్ణమికి సంపూర్ణ దరహాసంతో అమ్మవారి ముఖంగా కొలవబడుతుంది. ఇదే సింహాని అధిష్టించిన స్థితి చూపిస్తుంది. ఈ రూపమే అమ్మవారి "శ్రీమత్సింహాసనేశ్వరీ" కి ఖగోళంలో దృశ్యరూప వ్యాఖ్యానం. అదే సింహవాహిని యైన మహిషాసుర మర్థిని, లేదా దుర్గ ఏదైనా... ఈ ఆశ్వయుజ మాసంలో శుక్ల పక్షంలో ప్రతిరోజూ ఇది కనపడుతుంది అందువలనా..! ఈ కాలంలోనే మహిషాసురుడు, శుంభనిశుంభులు ఇత్యాది దానవులు తెగటార్చబడ్డారు కాబట్టి నవరాత్రులు చేసుకోవడం విజయదశమి పండుగ చేసుకోవడం సంప్రదాయమైంది.

 

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

No comments:

Post a Comment