మనసా! ఈ నాటకంలో....నానాటి బతుకు నాటకము కానక కన్నది
కైవల్యము...!!!
శ్రీ గురుభ్యోనమః
ఆత్మీయులు వాసుగారు పోయిన వారం హైదరాబాదు
వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని సంభాషిస్తుంటే విషయం సంగీతం వేపు మళ్ళి ఈ క్రింద
అన్నమయ్య కీర్తన వద్దకు చేరింది..
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము,
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము,
ఎట్టనెదుట గలదీ ప్రపంచము కట్టకడపటిది కైవల్యము,
కుడిచేదన్నము కొకచుట్టెడిది నడమంత్రపు పని నాటకము,
ఒడిగట్టు కొనిన ఉభయ కర్మములు గడిదాటినపుడే కైవల్యము,
తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము,
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము,
ఈ కీర్తనలో ఆర్ద్రత మేళవించిన వైరాగ్యంతో
పాటు వేదాంతం మిళితమై ఉంది. కొన్ని
కొన్ని సాహిత్యాలు,వేద దూరములై లేదా
ప్రామాణిక వాజ్ఞ్మయ దూరములై కేవలం దేశీ లేక జన బాహుళ్యంలో ప్రచారంలోఉన్న విషయాలతో
కూడుకొని ఉంటాయి. అన్నమయ్యగారి
కీర్తనల్లో వైదిక విహితమైన సాహిత్యం ఎక్కువ కనపడుతుంది అందుకే తెలుగునాట సంగీత
త్రయం రచించిన కీర్తనల తరవాత తెలుగులో అన్నమయ కీర్తనలకి ఎక్కువ ఆదరణ లభించడానికి
కారణం అయ్యుండచ్చు (అలా అని నేను అన్ని సాహిత్యాలు, అందరి సాహిత్యాలు చూసేసానని కాదు, ఇంతవరకు నేను చూసినవాటిని
పరిగణించి నాకున్న అల్పజ్ఞాన పరిధిలో చెప్తున్నది మాత్రమే)
ఇక సాహిత్యం అర్థంలోకెళ్తే.... జీవితంలో నేతి నేతిగా అన్నీ చూసి చివరకు పరమ
వైరాగ్య సంపన్నుడై జరిగిన కాలాన్నీ జీవితాన్ని ఒక సారి చూసి ఇన్ని రోజులూ చూడనిది/పొందనిది ఇప్పుడే తెలుసుకున్నది లేదా తెలుసుకోబోతున్న లేదా
పొందబోతున్న కైవల్యాన్ని ప్రతిపాదిస్తూ, ప్రతిష్టిస్తూ...
నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము,
నిత్యమూ/ప్రతిరోజూ బ్రతుకుతున్న ఈ బ్రతుకంతా ఒక నాటకం, ఇన్నిరోజులూ కానలేదు ఈనాటకం చివరకొచ్చేసరికి
కనపడుతోంది ఉన్నదొక్కటే కైవల్యం (కైవల్యం అనే పదం శుద్ధ అద్వైత సిద్ధాంతానికి చెందిన
అర్థాన్ని ప్రతిపాదించే పదంగా పెద్దలు చెప్తారు, పోతన గారి శ్రీకైవల్య పదం... పద్య వివరణం కూడా ’కైవల్యం’గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ) అంతా ఏదో ఉంది ఎక్కడో ఉంది
అంటూ ఇన్నినాళ్ళ బ్రతుకంతా ఒక నాటకంగా మిగిలింది అసలుది ఆ పునరావృత్తి రహితమైన
స్థితిని ఇచ్చే ఆమోక్షమే!
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము,
ఎట్టనెదుట గలదీ ప్రపంచము కట్టకడపటిది కైవల్యము,
అవును, పుట్టడం నిజంగానే జరిగింది, పోవడం నిజంగానే జరుగుతుంది, ద్యోతకమౌతున్న ఈ రెండు
నిజాలమధ్య ఉన్న కాలంలో చేసే పని అంతా ఒక పేద్ద నాటకము. ఈ ప్రపంచం ఎదురుగా
కనిపిస్తోంది అదో పేద్ద నాటకం అసలు చిట్ట చివరిది కేవలం మోక్షం.
జగత్తే ఒక నాటకం, అందులోకి వస్తున్నాం నాటకమాడుతున్నాం, మళ్ళీ పోతున్నాం, ఇదంతా గొప్ప నాటకం. కాని
అసలు నాటకం లేనిది/కానిది కేవల పునరావృత్తి రహిత మోక్షస్థితి, అదే జీవబ్రహ్మైక్య స్థితి
కుడిచేదన్నము కొకచుట్టెడిది నడమంత్రపు పని నాటకము,
తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము,.......
పుట్టింది మొదలు అన్నం తింటూనే ఉంది ఇది, కోకలు / బట్టలు
కడుతూనే ఉంది.... అదీ
ఈ పుట్టుక,పోవడం లాంటిదే. పెద్ద
నాటకం, ఒక
సారి తింటున్నాం దాంతో పోదు, మళ్ళీ ఆకలి మళ్ళీ తిండి, అలానే బట్టలు కట్టడం
మార్చడం, కట్టడం
మార్చడం అలా ఎన్ని మార్లో కట్టి మార్చినట్లు ఎంత నాటకమో... ఇలా
ఈ నడిమంత్రపు/ మధ్యలోని
వ్యాపారం అంతా నాటకం. చెడు
కర్మలు, మంచి
కర్మలు అని ఈ రెంటినీ ఉభయకర్మలు అంటాం, ఆ ఉభయ కర్మల ఫలితాలను ఈ పెద్ద నాటకంలో
ఒడిగట్టుకుంటోందిది. ఆ
ఫలితాలు దీని గడప దాటినప్పుడే మోక్షం( ఆ ఉభయ కర్మల ఫలితాలు ఈ జీవి నుంచి
విడినప్పుడే మోక్షం)
ఒడిగట్టు కొనిన ఉభయ కర్మములు గడిదాటినపుడే కైవల్యము,
ఈ నాటకంలో చెడు కర్మల వలన జన్మ
జన్మలుగా పేరుకుపోయిన పాపం సాంతం క్షయమవ్వదు, అలాగే మంచి కార్యములు చేయడం ద్వారా కూడిన
పుణ్యం కూడా వ్యయమవ్వదు, ఈ
ఫలితాలను అనుభవిస్తూ,కూడబెట్టుకుంటున్నప్పుడు
పడి పడి నవ్వుతున్న ఈ కాలం అదో పెద్ద నాటకం. (కాలంలో ఇలా ఎన్ని జన్మలలో ఎంత ఉభయ కర్మల ఫలితాన్ని
కూడగట్టుకున్నావో అలాగే ఇదీ మరో జన్మ అని నవ్వుతూ నవ్వుతూ ఉన్న కాలం నాటకం... )
మరి ఎలా.......... అదిగో…..
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము,
అదిగో ఆ ఎదురుగానే, ఆ కొండమీదే శ్రీ
వేంకటేశ్వరుడు మన ఏలికగా ప్రభువుగా ఉన్నాడు. ఏలిక అని నమ్మి వేంకటేశ్వరా అని పిలిచీ
పిలవగానే మొత్తం పాపం క్షయం చేసేవాడున్నాడుగా ఆ ఏడుకొండలమీద(వేంకట=పాపములను
తీసేసేవాడు), ఇక
పాపమా, ఆయన
ఏలిక, నా
ప్రభువు ఐనప్పుడు నాకున్నవన్నీ ఆయ భిక్షే నా ఆస్థులు ఆయనవే, నాపుణ్య ఫలం ఉంటే అదీ
ఆయనదే ఇక. నాకిక
పాపం లేదు పుణ్యం లేదు. అదిగో
ఆ ఆకాశం మీద కనపడుతున్న ’ఆనంద నిలయం’ ఉందే
అదే మోక్ష స్థానం, అదే
మోక్షం.
-x-
ఒక సారి ఆలోచిస్తే వేంకటేశ్వరుని కరుణను
అన్నమయ ఎంత చక్కగా విశదీకరించారు, పాప పుణ్య క్షయమైంది కాబట్టే ఆనందనిలయ
ప్రవేశం చేయగలగుతున్నావు, నీ
పాపాలన్నీ పోతున్నాయి, పుణ్యాలన్నీ
ఆయనవౌతున్నాయి, నీపుణ్యాలకి
ట్రష్టీగా వ్యవహరిస్తూ నీ జీవనానికి తగ్గవన్నీ ఆయన సమకూరుస్తున్నాడు,ఆయనని నమ్మితే చాలు మోక్షమే ఇచ్చేవాడు, అలాంటిది ఇంత పెద్ద
నాటకమైన ప్రపంచంలో ప్రాపంచిక విషయాలకోసం ఇంకా ఆకోరికా ఈ కోరికా అని మళ్ళీ నాటకంలో
పాత్రగా ఎందుకవ్వుతావు అని అంతర్లీనంగా సుద్ధులు చెప్తున్నట్టుగా నాకర్థమైంది ఈ
కీర్తన...
-శంకరకింకర
No comments:
Post a Comment