Pages

Friday, July 19, 2013

ఏకాదశీ వ్రతం-1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఒకానొక నాడు దశరథ మహారాజు చెప్పినట్లు తెల్లగొడుగు కింద ఎన్ని ఏళ్ళు రాజ్య పాలనం చేసానో తెలియలేదు తీరా చూసుకుంటే ముడతలు పడ్డ శరీరం, నెరసిన జుట్టు, బడలిన ఇంద్రియాలు ఉన్నాయి అని.

 కాలంతో పోటీగా పరిగెడుతూ కాలంలో అన్నీ అనుభవిస్తూ సుఖిస్తూ దుఃఖీస్తూ సాగుతున్న లౌకిక + అలౌకిక జీవన పయనంలో మరో మారు కాలం రూపాంతరం చెంది శ్రీ విజయ నామ సంవత్సర దక్షిణాయనంగా ప్రారంభమై మనముందుకు వచ్చింది. బలవత్తరమైన కాలంలో గొప్పనైన ఉపాసనకు అతిశక్తివంతమైన ఎంతో ఉపయుక్తమైన కాలం దక్షిణాయణ పుణ్యకాలం. అందులో ముఖ్యంగా ఎన్నో నైమిత్తిక తిథులు అన్నీ తొలి ఏకాదశితో ప్రారంభం తరవాత వ్యాస పౌర్ణమి  నుండి మకర సంక్రాంతి వరకు ఎన్నో ఎన్నో నైమిత్తిక తిథులు ఎన్నో ఉపాసనా పద్ధతులు. ఇంతటి ఉపాసనాకాలమూ పద్ధతులూ అన్నీ పర+అపర జ్ఞానాన్ని పంచేవే పెంపొందించేవే.

ఇక మనకి రేపు తొలి ఏకాదశి దీన్నే శయనైకాదశి అని అంటారు, రేపటినుండి భగవానుడు యోగ నిద్ర పొందుతాడు అని పురాణ వాక్కు. ఏకాదశీ తిథి నాడు విష్ణు అర్చనం శివ దర్శనం పరమపావనమని ఊర్థ్వలోకవాసానికీ, ఉత్తమ గతులకూ అలాగే ఐహికమూ,పారమార్థికమూ ఐన కామ్యములు తీరడానికీ కూడా విశిష్టమైన తిథి. ఏకాదశీ తిథినాటి వ్రతం గూర్చి ఇలా చెప్పబడింది.


రుక్మాంగద చరిత్రమను ఏకాదశీమహాత్మ్యం తెలుగు గ్రంథంలోని ఏకాదశిని గూర్చిన పద్యం సులభ గ్రాహ్యమే కనుక అర్థం ఇవ్వలేదు.

ధరామండలిన్ గల్గు ధర్మవ్రతంబుల్
పురాణంబులన్ శాస్త్రపుంజంబులందున్
గరంబింపు సొంపారఁగాఁ గాంచి మౌనుల్
పొరిం బల్కిరిట్లంచు భూపాలుతోడన్

అమితపాపౌఘవంశాటవీఘనదాహ
          శిఖికీల యేకాదశీవ్రతంబు
దర్పితాహితదైత్యదళనోగ్రవిష్ణుకౌ
          క్షేయకం బేకాదశీవ్రతంబు
కఠినపాతకసముత్కరభేకలోకభు
          గ్జిహ్మగం బేకాదశీవ్రతంబు
సంసారసంతాపసంతస్తమానసో
          జ్జీవనం బేకాదశీ వ్రతంబు
సువ్రతాకల్ప మేకాదశీవ్రతంబు
వరశుభాకారమేకాదశీవ్రతంబు
చిన్మయానందమేకాదశీవ్రతంబు
శ్రీసమంచిత మేకాదశీవ్రతంబు

పుణ్యభూవులలోనఁబురుషోత్తమమువోలె
          గ్రహములలో దివాకరుఁడువోలె
నంభోనిధులలోన నమృతార్ణవమువోలె
          నగములలో మేరునగమువోలె
నాశ్రమంబులలో గృహస్థాశ్రమమువోలెఁ
          దరువులలోఁ గల్పతరువువోలె
నధికదానములలో నన్నదానమువోలె
          మణులలోఁ గౌస్తుభమణియుఁబోలె
స్వర్గమున భూమియందు రసాతలమున
బ్రతి యొనర్పఁగ రానిసువ్రతము సకల
మంగళాస్పద మఖిలసంపత్కరంబు
క్షితితలేశ్వర! యేకాదశీవ్రతంబు


అలానే
దాని విధి విధానమెట్టిది నియమములెట్టివో చూద్దాం

స్నానమొనర్చి ధౌతపరిధానములన్ ధరియించి యంటఁగాఁ
గానిమనుష్యులం గనక కల్లలు వల్కక ఉగ్రకృత్యముల్
మాని వినిద్రుఁడై నియతమానసుఁడై తమలంబుఁ దక్కి శ్రీ
జానిపురాణముల్ వినుట సంగతి శ్రీహరివాసరంబునన్

దశమినాఁడేకభుక్తము సేసి మఱునాఁడ
          హోరాత్రముల భక్తి నుపవసించి
హరిమందిరమున జాగర మొప్పఁ గావించి
          వేగిన ద్వాదశివేళయందు
విప్రోత్తములకు షడ్విధరసోపేతంబు
          గా భుజింపఁగఁ బెట్టి కనక నిష్క
తతులు దక్షిణ లిచ్చి తదనంతరము సుహృ
          జ్జనులతో నామిషక్షౌద్రశాక
విరహితంబుగఁ బారణ వేడ్కఁ జేసి
నిద్ర దివ మెల్ల వర్జించి నియమపరత
మాపు భుక్త్యంగనాసంగమంబు లుడిగి
యుచితగతి నుండి మది యుత్తమోత్తమంబు

కరణి జరుపనోపక
యేకాదశిదివస మైన నిరుప్రొద్దు నిరు
త్సేకమున నుపవసించిన
శ్రీకాంతుండుత్తమముగఁ జేకొను నధిపా!
అప్రహతి నినరించెనే నదియుఁ గొఱఁత
గాదు నక్తంబు నేక భుక్తమున ననుచి
తంబు కావించుటయును దూష్యంబు గాదు
కాదు స్వేచ్ఛావిహారమేకాదశులను

మహిమ మీఱంగ నాషాడమాసముఖ్య
భాద్రపదమాసకార్తికభవ్యమాస
రమ్యసితపక్షహరి వాసరములయందు
వలయు శుష్కోపవాసంబు సలుప నరులు

విధములలో నొక్కటి
గావించినఁ బుణ్యమట్లు గాక యథేచ్చన్
గావరమున భుజియించిన
వైవస్వతలోకమును నవశ్యతఁ బొందున్

No comments:

Post a Comment