Pages

Monday, July 1, 2013

శివాదేవి కొప్పులోని పూలవాసన

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కాంతా కచ ప్రచయ పుష్ప సుగంధి గంధ
లుబ్ధ భ్రమద్భ్రమర కర్బుర కంధరాయ!
గంధర్వ యక్ష సుర సిద్ధ కిరీట కోటి
సంఘట్ట ఘృష్ట చరణాయ నమః శివాయ!!

శివ-శివా... అభేధరూపమైన శక్తి తో కూడిన అర్థనారీశ్వరుని స్తుతిస్తున్న స్తుతి మల్హణకవి కృతమైన శివస్తుతిలోని మంగళశ్లోకం.

శివునికి ఉండేది బ్రహ్మాండమైన జటాజూటము ఇక్కడ కవికాంత కచ’.. అని మొదలెడుతూ స్తుతించి మనకి ఉపాసనా మార్గంలో శక్తి యుతుడైన భగవన్మూర్తి అర్చన పరంపరను ప్రమాణాన్నీ మరోసారి నొక్కి చెప్తున్నారు.

శివాదేవికి లేదా అర్థనారీశ్వరునకు కుడివేపున ఉన్నది బ్రహ్మాండమైన జటాజూటము, ఎడమవైపున ఉండేది కొప్పు. కొప్పుకో దేవతాస్త్రీలే చెలికత్తెలుగా మారి స్వర్గాది లోకాలలో ఉండే పారిజాతాది పుష్పముల మాలలను తెచ్చి అలంకరించారు. పుష్పాల మనోహరము సువాసన ఇంతింతేమి మానవులమైన మనకు తెలియనిది ఐనా ఒక గొప్ప సువాసనను మనసా ఊహిద్దాం. మనసుని షట్పది అంటారు కదా అంటే తుమ్మెద అన్నమాట మనమూ ఒక తుమ్మెదలా మారి అంత గొప్ప సువాసనలు తెలిసిన స్వర్గలోకపు తుమ్మెదలతో కలిసి అక్కడ తిరుగుతున్నామనుక్కోండి  ఆపువ్వుల వాసన వదలలేక శివాదేవి కొప్పును మెడను వదలేల అక్కడే ఝుమ్ఝుమ్మని తిరుగుతూ గంగా జలమౌలతో తడిసిన శివాదేవి యొక్క ఘనమైన ఎఱ్ఱని జటాజూటమును దేవతా స్త్రీలచే అలంకరించబడిన నల్లనైన కొప్పును చూస్తూ లోభత్వమును పొందిన వారిలా శివాదేవి మెడ వద్ద కొప్పులవద్ద సువాసనలు ఆఘ్రాణిస్తూ తిరుగుతున్న తుమ్మెదలతో కలసి తుమ్మెదా తిరుగుతున్నది.

అలా శివాదేవి కొప్పులవద్ద మెడ చుట్టూ తిరుగుతూ ఉండగా... మూర్తి యొక్క మెడ/కంఠం దర్శనమైనది... దాని నిండా సుగంధ భరితములైన గంధములు అలది ఉన్నవి. శివుడు తనకి తానే పూసుకొన్నాడో మరి అమ్మవారో, పరిచారకులు పూసారో లేక భక్తుడు ఎక్కడ ఏమూర్తిగానెంచి పూస్తే తన మెడకు అలదుకున్నాడో తెలియదుకానీ, అయ్యది అసలే తెల్లని మెడ అమ్మవారిది ఎర్రని మెడ రెండూకలిసి బంగారు వర్ణమా అందామంటే కుంకుమ పువ్వు, కస్తూరి,  ఎన్నో రకకాల చందనం వంటి ఎన్నో రంగు రంగుల సుగంధ ద్రవ్యాలు అలది ఉన్నది. అసలే మెడ మీద కాలకూట విషం సేవించిన గుర్తుగా నల్లని మచ్చ ఒకటి ఉంది. ఇలా కర్బురమైన కంఠమును చూసి ఆనందించి మరింత లోభపడి విడివడలేక తిరిగిరాని రీతిగా తుమ్మెద అక్కడే తిరుగుతున్నది. (కర్బుర కంధరం =అనిర్వచనీయమైన రకరకాల వన్నెలతో కూడిన మెడ/కంఠము)

శివదేవుని సకల దేవతలూ దేవజాతులూ సేవించడానికి వస్తూంటారు. వీళ్ళు రెండు రకాలు అజానదేవులు అంటే సృష్టిలో దేవతల్లాగా పుట్టినవాళ్ళు. ఇంకొకరు కర్మదేవుళ్ళు అంటే మనలా మనుషుల్లా పుట్టి సుకర్మలు చేసుకొని పుణ్య ఫలముతో దైవత్వాన్ని పొందినవారు. ఇద్దర్లో ఇంకా కొన్ని తెగలు, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ ఇత్యాది. నానా తెగల దేవతలూ శివుని ప్రత్యక్షముగా చూసి కొలవాలని నిత్యమూ ఆయన సన్నిధికి వస్తూంటారు. వారు వారి వారి స్థాయీ బేధాములను, అధికారములను బట్టి బంగారు తాపడములతో వివిధ రకములైన మేలన కఠినమైన వజ్రాది వివిధ రత్నములతో తయారైన రక రకములైన కిరీటములను ఆభరణ ఆహార్యములనూ ధరిస్తారు.  వారు శివుని దర్శించగానే శివుని పాదాలవద్ద సాష్టాంగ పడి నమస్కరిస్తారు. అలాంటి కిరీటముల కొనల రాపిడిచే కందిపోయిన చిగురుటాకులవంటి పాదముల వేళ్లు కలవాడయ్యె ఐననూ చిద్విలాసుడై వచ్చిన ప్రతివారిని సంతుష్టుల గావించి పంపసాగెనని తెలిసి అక్కడే తిరుగుతున్న తుమ్మెదలలో ఉన్న మన మనసనే తుమ్మెద తిరిగి వచ్చి. ’అహో! శివామూర్తి ఎంత బాధపడుతున్నాడు . ఎడతెరిపిలేక ఎందరో దేవ సంఘములవారు ఆయనకు నమస్కరిస్తూ ఆయన వేళ్ళు కందిపోయేటట్లు చేస్తున్నా దేవతలనే భక్తులమీది కరుణచే బాధను ఓరుస్తున్నాడు. అంతటి దయామయుడు ఇతః పూర్వమెన్ని పాపములు చేసినా మన తప్పులు మన్నించి  అనుగ్రహించడా! అటువంటి మహానుభావుడైన శివునకు నమస్కారము

అని కవి మన మనస్సునే షట్పదివోలె చేసి శివుని, శివామూర్తిని ఆయన జటాజూటము, అమ్మవారి కబరీబంధము/కొప్పు అందులోని రకరకములైన పారి జాతపుష్పపు వాసనలు, ఆయన తెల్లని ఎఱ్ఱని మెడ అందులో నల్లని మచ్చ, చుట్టూ పూసిన రకరకములైన గంధములు, వాటి సువాసనలు, స్వామి వారి లేతని పాదములు వాటికున్న తెల్లని సుకుమారమైన వేళ్ళు, రక రకములైన ఎంతో వైభవోపేతమైన దేవతల కిరీటపు వెలుగులు కిరీటములు స్వామి కాలి వేళ్ళ చివర్లను తగలడం అందుచే తెల్లని వేళ్ళు ఎఱ్ఱగా కందినట్లు అవ్వడం అన్నీ చక్కగా మనకళ్ళకి కట్టినట్లుగా చిన్ని శ్లోకం లో ఇమడ్చారు. ధ్యానంలో నల్లని ఎఱ్ఱని రకరకరకమైన రంగుల గంధములు పుష్పములు, గొప్పనైన కిరీటములు మనకి అందిస్తూ, పుష్పపు, గంధపు సువాసనలని కూడా పొందేటట్టు చేసారు అంతేనా తుమ్మెదల ఝంకారం, కిరీటాల రాపిడులవంటి శబ్దాలు కూడా మనచెవికి అందించారు.  స్తోత్రం ప్రార్థనా శ్లోకంగా చాలా మంది పెద్దలు ఇప్పటికీ వాడుతూంటారు.

No comments:

Post a Comment