శ్రీ గురుభ్యోనమః
నమస్తే
నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నుండి కొద్దిగా సంగ్రహించి, ఇతర పెద్దల వల్ల తెలుసుకొన్నది, విచారించి తెలుసుకొన్నదీ…
జగద్గురు ఆది శంకరులు అవైదికమైన బౌద్ధాది మతాల సిద్ధాంతాలను ఖండించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారని అందరికీ తెలిసినదే, ఐతే ముఖ్యంగా ఎంతో ఉన్నత ప్రమాణాలున్నాయని కొందరు భావించే బౌద్ధమతంలోని పరస్పర విరుద్ధ సిద్ధాంతాలవల్లనూ, ఆ మతంలో ఉన్న ఆయా సిద్ధాంతాల అనాచరణల వల్లనూ వేద భూమినుండి బయటకెళ్ళవలసి వచ్చిందన్నది సత్యం.
శ్రీ శంకరులు ఏ సిద్ధాంతాన్ని ఖండించినా అందులోని మంచిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకునేవారు గౌరవించేవారు అనాచారాన్ని అవైదికవిధానాన్ని ఖండించేవారు. ఉదాహరణనకి వైదిక సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నా సాంఖ్య, మీమాంసాలలో ఉన్న ఈశ్వరుని యొక్క ఉనికిని నిరాకరించే సిద్ధాంతాలని ఖండించారు. శంకరుల వాదన వారి ప్రతిపాదన ఏమంటే “అపౌరుషేయములైన వేద పదములకర్థం ప్రకారం, బ్రహ్మసూత్రానుసారం గల ఈశ్వర నిర్వచనాన్ని గానీ, ఈశ్వరుడు సృష్టి కర్త అని గానీ, ఫలదాత అని గానీ నిరాకరించటం సమంజసం కాదు. వేదములో చెప్పినదే సత్యం, ఈశ్వరుడు లేకుండా జగత్సృష్టి లేదు, అంతే కాదు కర్మాచరణమే వ్యక్తికి ఫలితాన్నిస్తుందని చెప్పటం కుదరదు. ఈశ్వరుడే ఫలదాత, ఫలనియంత, ఈశ్వరుని చైతన్యమే సంకల్పమే జగత్సృష్టికి కారణం. కార్యానుసారం ఫలితాలేర్పడడం, సుఖదుఃఖాలు కలగటం కూడా ఈశ్వరుపు కల్పించిన ’కర్మ’ వల్లనే”. శంకరులు ఏది ఖండించినా వేదములు, బ్రహ్మసూత్రాదులను దాటలేదు వాటిని, ఈశ్వర ఉనికిని ప్రశ్నించి అనుమానించిన భాగాలనెప్పుడూ ఖండించారు.
శంకరులకన్నా ముందే ఉదయనాచార్యుడనే నైయాయికుని (న్యాయ శాస్త్రంలో ప్రవీణుడు) వాదనల వల్లనూ కుమరిలభట్టు (మీమాంసకుడు) కర్మ ప్రచారం వల్లనూ బౌద్ధం వేద భూమి దాటిపోయింది.
బౌద్ధమతం చెప్పే ఈశ్వర రాహిత్యం లేదా ఈశ్వరుడు లేదా భగవంతుడు లేడని చేసిన ప్రచారాన్ని ఉదయనాచార్యులు ఖండించారు.
అలాగే మీమాంసకులు కర్మలు ఫల ప్రదాతలని నమ్మినా, వేదాన్ని వేద విహిత కర్మలను శ్రద్ధగా నమ్మి ఆచరించాలనీ కర్మలే ఫలదాతలనీ నమ్మిన కుమరిలభట్టు ఆ వేద విహిత కర్మలనాచరించవలసిన అవసరంలేదని ప్రచారం చేసిన బౌద్ధాన్ని ఖండించి వేద విహిత కర్మలను నిలబెట్టారు. వారి వారి సిద్ధాంతాలముందు బౌద్ధం నిలవలేకపోయింది.
బౌద్ధమతాన్ని, దాని నాస్తికత్వాన్ని (వేదాన్ని నమ్మని వారిని నాస్తికులంటారు, నమ్మే వారిని ఆస్తికులంటారు) ఉదయనాచార్యుడూ, వేద కర్మాచరణ విముఖతని కుమరిలభట్టూ ఖండించారు. వీరి తరవాత వచ్చిన శంకరులు బౌద్ధంతో పాటు పాఖండ మతాలలోని విపరీత ధోరణులను ఎత్తి చూపించ వలసిన కష్టం లేకుండానే మిగిలిన తప్పులను చూపి ఖండించడంతోటే ఆయన పని సుగమం అయ్యింది.
అసలుగా బౌద్ధం, వేదాంగాలలోని న్యాయ, మీమాంసలముందే నిలువలేకపోయింది అటువంటిది వేదం ముందు ఆ సిద్ధాంతాలేమి నిలుస్తాయి?
బుద్ధుడు ఈ దేశస్థుడే, ఆయనకి తగిన గౌరవం ఇవ్వబడింది. కానీ ఆయన సూత్రాలు ఆచరణ దూరాలు సత్య దూరాలవడం చేత, ఆయనని గౌరవించిన వారే ఆ మతాన్ని ఆయన సూత్రాలను పాటించలేదు. ఉదాహరణకు పాలీలో మాత్రమే వారి గ్రంథ రచన చేసేవారు కానీ తరవాత వచ్చిన వారు పాలీ వదిలి సంస్కృతంలో చేసారు పోనీ భాషదేముంది అంటారా.. అసలు ఈశ్వరుడే లేడని బల్ల గుద్ధిన బౌద్ధం గ్రంథాలన్నీ సరస్వతీ స్తోత్రం తో మొదలు... కాస్త అయోమయం కదూ... నీలాధార ( నీల సరస్వతి, లేదా రాజ శ్యామలా దేవి అని మనమారాధించే అమ్మవారు) స్తోత్రం తో మొదలు. అలానే ఇతర ఎన్నో దేవతల మూర్తులను అర్చిస్తారు. తంత్ర విద్యలూ చేస్తారు. అయోమయంగా ఉంది కదూ చెప్పే సూత్రాలకీ, చేసే ఆచరణలకీ సామ్యంలేకుండా. గౌతమ బుద్ధుని బోధలు విని బౌద్ధంలో ఉన్నా వారి జీవనంలో వైదిక ఆచారాలెన్నో పాటిస్తారు. కానీ వేదం తప్పంటారు ఈశ్వరుడు లేడంటారు. వివాహాది కార్యాలు కొన్ని సంస్కారాలు వైదికంగానే జరుగుతాయి. కర్మ కాండను బుద్ధుడు ఖండించినంత మాత్రాన అప్పటి ప్రజలు, బౌద్ధులు దాన్ని వదలలేదు. ఆయన చెప్పిన శాంతి, అహింసా మంత్రాలూ అనుష్టించలేదు, ఎక్కడిదాకానో ఎందుకు కుమరిల భట్టు వృత్తాంతమే చూడండి అంత అహింస బోధించే వారు కుమరిలభట్టును హతమార్చదలచారు. అసలు సంపూర్ణ అహింస అన్నది కుదరని పని. వేదాలూ అహింసని బోధించాయి. అపరిగ్రహము కానంతవరకూ హింసనంగీకరించాయి. గురువు శిష్యుణ్ణి సన్మార్గంలో పెట్టడం కోసం మందలించడం హింసకాదుగా...? అసలు మన పుట్టుకే హింసతో కూడుకున్నది, తల్లిని హింసించకుండా ఏజీవి పుట్టగలదు? హింసలేనిదే మానవజీవితంలేదు. మనిషి ఊపిరి తీస్తే ఎన్నో కోట్ల క్రిములు నశిస్తున్నాయి, ఎంత శాఖాహారమైనా తిండి కోసం ఎన్నో చెట్లు చేమలు నరకట్లేదా అది హింస కాదా... ఐతే అది ధర్మబద్ధమై తాను దానిని మీరలేని స్థితిలో ఉన్నాడా అని చూసుకోవాలి. ధర్మబద్ధమైన అటువంటివి ఎన్నడూ హింసగా పరిగణింపబడవు. ఊరికెనే ఉత్త హింస చేయడం వేదమూ అంగీకరించలేదు. అంతే కాని మతం పేర ఎదుట వారిని హింసించడాన్నివేదం ఒప్పుకోలేదు. ఆచరణంలోకి తీసుకురాలేని ఆచరణదూరమైన బోధలవల్లనే అది నిలబడలేదు అందునా అది కేవలం ఒక మనిషి మతినుండి పుట్టినది...అక్కడే అసలు తేడా! ఆచరణకి - బోధనకి తేడా ఉండబట్టే కనీసం వేదాంగాలముందు కూడా నిలవలేకపోయింది బౌద్ధం. అశోకుడే బౌద్ధం తీసుకున్నా సనాతన ధర్మ విలువలని వదలలేదు ఆ పద్ధతిలోనే పాలించాడు అతని శాసనాలే అందుకు ఋజువు.
ఈ దేశంలో బుద్ధ భగవానుడు తాను పొందిన సిద్ధిచేతనూ, తన గొప్పనైన జీవితం చేతనూ అమిత కీర్తిని గడించాడన్నది సత్యం. ఏ మహనీయుడుగా తలచిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు లేదా అనుచరులైనా ఆయా సంస్థలు లేదా వ్యవస్థలలో వైదిక ఆచారాలను కొద్దితేడాలు చేసి పాటిస్తుంటారు కానీ వారి ఇళ్ళల్లో అవి పాటించరు. గాంధీమతం అని గాంధీగారి సమయంలో వచ్చింది, గాంధీగారి బోధనలు లోకోద్ధరణ, మానవ సేవ, ఆయన గొప్ప గుణాలు చూసి ఆయనను అందరూ గౌరవించారు అంత మాత్రాన అందరూ వారి వారి ధర్మాలు వదిలి గాంధీ మతం తీసుకోలేదుగా, అంత మాత్రాన ఆయన మాటల్ని యథాతథంగా ఆచరించలేదుగా... బుద్ధుని విషయంలోనూ జరిగిందదే, బుద్ధుని జీవితం గొప్పగా ఉన్నా బోధలు ఆచరణదూరాలు కావడం సత్య దూరాలు (సత్యం అంటే ఈశ్వరుడు అని అన్వయం చేసుకోగలరు) కావడం వల్లనూ, కర్మ కాండను బుద్ధుడు ఖండించినా ప్రజలు వైదిక మతానురక్తులవ్వడం వల్లనూ, బౌద్ధంలో ఉన్న పరస్పర విరుద్ధమైన “కర్మ ఖండన మరియు తంత్ర విద్యాసాధన” , “నిరీశ్వర వాదన అదే సమయంలో దేవతార్చనగా మూర్తులను సేవించడం” అనే పద్ధతులవల్లనూ ఆ మత బోధలన్నీ నేతి బీరకాయ చందంగా ఉండడం వల్లనూ నిర్ద్వంద్వంగా బౌద్ధ సూత్రాలు ఖండించబడ్డాయి.
ఎప్పుడో ఖండించబడిన, పరస్పర విరుద్ధ భావాలను బోధించిన సిద్ధాంతాలను, సనాతన ధర్మ సిద్ధాంతములకన్నా ఉన్నతములను కీర్తించడం… అయ్యిపోయిన పెళ్ళికి బాజా భజంత్రీలవంటివేమో... లేక కిందపడ్డా పైచేయి మాదే అనే వాదనో…
ధర్మస్య జయోస్తు - అధర్మస్య నాశోస్తు
వేదమే ప్రమాణం - శంకరులే గురుమూర్తి
హర హర శంకర - జయ జయ శంకర
No comments:
Post a Comment