జై రాధే కృష్ణ
బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం ఒక అద్భుతమైన, విశిష్టమైన క్షేత్రం. ఇక్కడ శంఖనాదం వినిపించదు, గంటలు మోగవు, భక్తుల గోల ఉండదు. బిహారీజీ దర్బార్ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. వినిపించేది కేవలం భక్తుల హృదయాల్లోంచి ఉప్పొంగే నామస్మరణ, జయజయధ్వానాలే.
ఈ ఆలయంలో దర్శనం కూడా అత్యంత విశేషం. స్వామివారి ముందు పరదా ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు తీస్తారు అన్నది ఎవరూ చెప్పలేరు. ఆలయం తెరుచుకునే సమయం, మూసే సమయం కూడా నిర్దిష్టంగా ఉండదు. అన్నీ స్వామివారి సంకల్పానుసారమే జరుగుతాయి. సేవలు, అర్చనలు, భోగాలు—అన్నీ బాంకే బిహారీ లాల్ చిత్తానుసారమే జరుగుతాయి.
ఒకసారి కలకత్తా నుండి ఒక ధనిక సేఠ్ గారు—శ్రీకృష్ణుని పరమభక్తుడు—బృందావనానికి విచ్చేశారు. ఆయన యమునా తీరంలోని భూములను కౌలుకు తీసుకొని, అక్కడ వివిధ రకాల పూల మొక్కలు నాటి, ఒక సుందరమైన పూలవనాన్ని నిర్మించారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపడి, “శ్రావణ మాసంలో యమునకు వరదలు వస్తాయి, ఈ వనం మొత్తం కొట్టుకుపోతుంది” అని హెచ్చరించారు.
అప్పుడు సేఠ్ గారు సాంత్వనంగా ఇలా చెప్పారు:
“యమునమ్మ తీసుకెళ్తే అది నష్టమా? నేను తీసుకెళ్ళిన పూలు కృష్ణుని చేరతాయో లేదో తెలీదు, ఆ యమునమ్మే తీస్కెళ్తే ఖచ్చితంగా శ్రీకృష్ణుణ్ణే చేరతాయి. ఆమె స్వయంగా కాళిందీ దేవి—శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ఒకరు. ఆమె ఈ పూలను స్వీకరిస్తే, అవి శ్రీకృష్ణునికి చేరితే, అది నాకు మహానందం. ”
శ్రావణం వచ్చింది. యమునా నది ఉప్పొంగి ప్రవహించింది. పూలవనం అంతా జలాల్లో కలిసిపోయింది. కానీ సేఠ్ గారి హృదయం ఆనందంతో నిండిపోయింది. ప్రతి సంవత్సరం ఇదే దృశ్యం, ఇదే ఆనందం—ఆయనకు అది దైవానుభూతిగా మారింది.
కాలం గడిచింది. వృద్ధాప్యం, అనారోగ్యం ఆయనను చేరుకున్నాయి. కలకతా, ఢిల్లీ, బొంబాయి ఇలా కుటుంబ సభ్యులు సేఠ్ ను వైద్యంకోసం పెద్ద పెద్ద వైద్యశాలలకు తీసుకెళ్లారు. వైద్యులు “ఇక ఎక్కువ కాలం లేదు, చివరి కోరిక తీర్చండి” అని కుటుంబ సభ్యులకు చెప్పారు. అప్పుడు సేఠ్ గారు ఒకే ఒక్క కోరిక చెప్పారు:
“బృందావనంలోని బాంకే బిహారీ లాల్ దర్శనం చేసి, ఆయన చరణామృతం స్వీకరించాలి.”
కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి ఎయిర్ ఆమ్బులెన్స్ వంటిది ఏర్పాటు చేసి ఆయనను బృందావనానికి తీసుకువచ్చారు. ఆ రోజు రాత్రి ఆలయంలో మహోత్సవాలు ముగిసి, ఆలయం మూసే సమయం వచ్చింది. సేఠ్ కుటుంబ సభ్యులంతా ఆలయం తెరిచే ఉంటుందా ? దర్శనం లభిస్తుందా? తమ తండ్రి చివరి కోరిక తీరుతుందా అని బెంగపడుతున్నారు.
అప్పుడే అదేసమయంలో ఒక అద్భుతం జరిగింది.
గర్భగృహంలోకి ఎక్కడినుంచి వచ్చిందో ఒక కుక్క ప్రవేశించి, స్వామివారి వెనుకనుంచి బయటకు పరుగెత్తింది. దీనితో ఆలయాన్ని పవిత్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అప్పుడు శుద్ధి చేయాలా మరునాడా అనే తర్జన భర్జన జరుగుతుంటే ప్రధానార్చకులు లేదు శుద్ధికార్యక్రమం, కన్నయ్యకు పంచామృత అభిషేకం, అలంకారం, భోగం అన్నీ ఇప్పుడే జరగాలని నిర్ణయించారు.
గోస్వాములు వెంటనే మంత్రాలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి పంచామృత అభిషేకం చేసి, అనేకానేక రంగుల పూలతో కొత్త అలంకరణ చేసి, ఛప్పన్ భోగ్ నైవేద్యాలు సమర్పించారు.
అదే సమయంలో సేఠ్ గారి కుటుంబం ఆయనను ఆలయానికి తీసుకొచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనకు ప్రధాన పూజారి గారు పంచామృత తీర్థం, ప్రసాదం అందించారు. తన జీవితాంతం యమునమ్మకు సమర్పించిన రంగురంగుల పూలన్నీ ఆ రోజు స్వామివారి అలంకరణలో చూశాడు ఆ సేఠ్ జీ. చరణ తీర్థం మాత్రమే కావాలనుకున్నాడు కానీ పంచామృత తీర్థం లభించింది. ఆ సేఠ్ తన చివరి క్షణాల్లో ఆ స్వామి దివ్య రూపాన్ని, తన బాంకే బిహారీని తాను పెంచిన పూలవనంలోని రంగురంగులతో సువాసనలతో అద్భుతంగా వికసించి గుభాళించే పూల మధ్యలో విహరిస్తున్న స్వామిలా ఆనందంతో తృప్తిగా దర్శించుకున్నాడు.
అవే ఆ జీవునికి ఈ భూమి మీద చివరి క్షణాలు!
జై బాంకే బిహారీ కృష్ణ కన్హయ్యా లాల్ కీ
రాధే రాధే రాధే రాధే రాధే రాధే
No comments:
Post a Comment