Pages

Wednesday, August 2, 2017

కాలం మారుతోందా.. ఖచ్చితంగా లేదు!

కాలం మారుతోందా.. ఖచ్చితంగా లేదు, కాలం మారడం అంటే GMT ప్రకారం గడియారంలో అంకెలు మార్చుకోవడం కాదు. కాలం ఎన్నటికీ మారదు. కాలం ఎవరికోసమూ మారదు, కాలం ఏ కారణానికీ ఆగదు. తన గమనంలో మనం చేసే సుకృతాలనీ వికృతాలనీ గమనిస్తూ నిశ్శబ్దంగా వెళ్ళిపోతుందంతే. కాలంతో పరిగెడదామని ప్రయత్నించి ప్రయత్నించీ మనిషి ఆగినచోట ఓ నవ్వేసుకుని తన పనిలో తానుంటుంది. కాలం మారదు, మనిషి మారుతున్నాడు. ప్రాకృతికమైన మార్పులని జయించాలని కృత్రిమతని జోడిస్తున్నాడు. మనిషి కదా! ఆశాజీవి, అందనిదేదో అందాలనే ఉబలాటం, అనుకున్నది అందినా అందకున్నా ఏం సాధించాడో ఇంకా ఏం సాధించాలో తెలుసుకోకుండానే పాల్గొనే జీవిత పరుగుపందెం. అంతే, మనకోసం కాలం మారదు, ఆగదు, వెనక్కెళ్ళదు నువ్వు ఆ కాలానికి ఇరుసువై ధృవతారలా నిలిస్తే తప్ప కాలం నీకు వశవర్తి కాబోదు.

 

మనిషి తన అలవాట్లనీ, జీవన విధానాన్నీ మార్చుకుంటున్నాడు. కాలంతో మారకపోతే మనం మనలేం అనుకుంటున్న మనకు మారుతున్న జీవన విధానాలే మనని యాంత్రికంగా మార్చేస్తున్నాయని తెలీదా.... తెలుసు తెలిసీ కాలంతోపాటు మనమూ అనే నిర్లిప్తతతో కూడిన నవ్వుతో తన ఆలోచనల్ని బలవంతంగా కొత్త ధోరణులకు కొత్త పోకడలకు అలవాటు పడేలా చేసుకుంటూ మారుతున్న ఆలోచనా సరళిని, కొత్త పోకడలనీ, ధోరణులనీ కాలానికి ఆపాదించి కాలం మారుతుందంటున్నాడు. కాలం మారదు నీకోసమో నాకోసమో ఎవరికోసమో మారదు. మారాల్సిన అవసరం దానికి లేదు, అది మనలా మనిషి కాదుకదా మారిపోడానికి. ఉత్తమమైన మనిషివిగా పుట్టావుగా! ఉత్తమమైన దాన్ని పొందు కాలాన్ని జయించి ఋషిలా నిలిచిపో కాలాన్ని దాటిపో నువ్వు మనిషినుండి ఋషిగా ఎదిగితే తప్ప ఆ కాలం నీకు సాహో అనదు.

ప్రకృతిలోని శక్తిని, ప్రకృతి ద్వారా లభించే వస్తువులనీ ఉపయోగించి ప్రకృతి విరుద్ధంగా సౌకర్యాలను పెంచుకున్న మనిషి ఒక విధంగా ప్రకృతితో యుద్ధమే చేస్తున్నాడు. కాలంలో ఎప్పుడో వచ్చే ఆపత్తికి ఇప్పుడే నివారణ అంటూ ఎన్నో కనుగొన్నాడు కాలాన్ని జయించాననుకున్నాడు. పూర్వులు అవసరార్థంగా కనుగొని వాడినవి ఇప్పుడు నిత్యావసరంగా మార్చుకున్నాడు, కాలంతో పరిగెట్టాననుకుంటూ పరిగెడుతున్నాననుకుంటూ కాలాన్ని ఓడిస్తున్నాననుకుంటూ కాలం ముందు ఓడిపోతూనే ఉన్నాడు తోడుగా మనిషిగా కూడా ఓడిపోయి రెంటికీ చెడ్డవాడౌతున్నాడు. సుఖం కోసం దేన్ని తయారు చేసుకున్నాడో అదే దుఃఖమై కాలంలో కాటేస్తున్నా ఎడారిలో ఒంటె బ్రహ్మజెముడు ముళ్ళని నమిలితే దాని పంటిచిగుర్లు దవడలు చీరుకుపోయి వచ్చే రక్తాన్ని నీళ్ళనుకుని మరిన్ని మరిన్ని బ్రహ్మజెముళ్ళను తిన్నట్లు, సుఖం కోసం సౌకర్యం కోసం ఇంకా ఇంకా ఎవరికో ఏదో ఇవ్వాలనీ, ఏదో చేయాలనీ ప్రాకులాడుతుంటాడు కాలాన్ని వెనక్కి తోసాననుకుంటాడు తీరా చూస్తే ఆ కాలం మనని ముందుకు తోసినట్లుగా కనపడినా ఆ కాలానికి వ్యతిరేక దిశలో మనం పరిగెట్టామని అవగతమవదు.

 

కాలం నీకోసం ఆగదు, అది ఆగకుండానే ఎన్నో పాఠాలు చెప్తుంది అందుకోవడమా వదులుకోవడమా నీ వంతు. కానీ కాలంతో నీతో మాట్లాడదు, నువ్వు చెప్పిందీ వినదు అది సాగుతూనే ఉంటుంది కాలాన్ని ఓడించడం మామూలు మనిషి తరం కాదు, కాలాన్ని ఓడించినవాడెవడూ మామూలు మనిషిగా మిగలరు కాలాతీతంగా మిగిలే ఋషులంటారు. కాలానికెంత నవ్వొస్తుందో మనిషిని చూసి, తన సౌకర్యాలు, తన అవసరాలు, తన వాళ్ళ సౌకర్యాలు, తన వాళ్ళ అవసరాలు, అహంకారాలు మమకారాలు వీటితో అంటకాగి తన ఆలోచనలను ధోరణిని జీవనవిధానాన్నీ మార్చుకుంటూ మారిపోతూ కాలం మారుతోంది కాలంతోపాటు మనమూ మారాలని అనుకుంటూ మారని ఇతరులనీ తనతో పాటు కలుపుకుంటూ వాళ్లూ మారాలని అన్యాపదేశంగా చెబుతూ తన వడి చెదరని కాలానికి మార్పునాపాదించి తృప్తి పొందుతున్నాడు. మనిషి కదా! మార్పు కోరుకుంటాడు కానీ కాలం ఆగబోదు. అన్నింటినీ చూస్తూ మనిషి పడినప్పుడల్లా నవ్వుతూ వెళుతూనే ఉంటుంది!

కాలః అస్మి అని ఆ పరబ్రహ్మముయొక్క వాక్కు... అదే మారని సత్యం...

-శంకరకింకర

 


No comments:

Post a Comment